You Are Here: Home » చిన్నారి » కథలు » పునాది

పునాది

SUNDAYటెన్త్‌, టైప్‌ హయ్యర్‌ పాసయిన నాకు హైద రాబాదులో క్లర్క్‌-కమ్‌-టైపిస్ట్‌ ఉద్యోగం వచ్చింది. నన్నిక ఆడిట్‌ పార్టీలో వేశారు. తెలంగాణ తొమ్మిది జిల్లాలోని గవర్నమెంట్‌ ఆఫీసులు ఆడిట్‌ చేయాలి. మా పార్టీకి అధిపతి పాల్‌గారు. పార్టీలో మరిద్దరు ఆడిటర్లు కూడా వున్నారు. ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు. కాలుక్యులేటర్లు కూడా తక్కువలే. గుణకార, భాగహారాలు, కూడికలు, తీసివేతల అన్ని మనమే చేసుకోవాలి. వందల పేజీలు టైపు చేయవలసి వచ్చేది. మెదక్‌ జిల్లా మిర్జాపూర్‌లో మా ఆడిట్‌ మొదలయ్యింది. పాల్‌ గార్కి అప్పటికే 50 సంవత్సరాలు దాటాయి. పాల్‌ మంచివా రు, రాత్రింబవళ్లు పనిచేసే వారు. తన కింద పనిచేసే వాళ్లంతా అలాగే కష్టపడి పనిచేయాలని అనుకునేవారు.ఆ రోజుల్లో తెలంగాణా ప్రాతం చాలా వెనుకబడి వుండేది. పొద్దుటే అల్పాహారానికి ఇండ్లి, ఉప్మా, సిగరెట్‌ వగైరా బాగుండుననిపించేదినాకు. కాని అవేమీ దొరకనందున చాయ్‌లో ముంచుకుని బన్‌ తినేవాణ్ణి.ఒక రోజున పాల్‌గారు నన్నుద్దేశించి ‘‘ఈ ప్రాంతంలో మీ రుచికనుగుణంగా ఏమీ దొరకవు. నీవు శాఖాహారివైనా పని ఒత్తిడి తట్టుకోవాలి కాబట్టి బ్రెడ్‌ ఆమ్లెట్‌ తినడం తప్పనిసరి’’ అని చెప్పి తనతోపాటు నాకు కూడా ఆ విధమైన అల్పాహారం పురమాయించేవారు.

పెద్దాయనకు నేను పి.ఎ.గా వుండేవాణ్ణి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాల్‌గారు చెప్పినట్లు నడుచుకుని అల్పాహారం తర్వాత బోర్నవీటా త్రాగేవాణ్ణి.ఆ రోజుల్లో ఆఫీసులు ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు వరకు వుండేవి. కాని పాల్‌గారు నన్ను ఉదయం ఎనిమిది గంటలకే తయారయ్యేటట్లు చేసి ఆయనతో ఆఫీసుకు తీసుకువెళ్ళేవారు. తతిమా ఇద్దరు ఆడిటర్లు 45-50 సంలు వయస్సు గలవారు. చాలా బద్ధకంగా వుండేవారు. వారితో సంబంధం లేకుండా మేమిద్దరం ఎనిమిది గంటలకే ఆడిట్‌ మొదలెట్టేవారం! ప్రతిరోజు ఆయన నోటెమ్మట ‘‘మూర్తి ఒక కాగితంలో నేను చెప్పేవన్ని నోట్‌ చేసుకో’’ అనగానే… వందలు, వేలు, లక్షలలో అంకెలు పది పదిహేను కూడటం, క్షణంలో అయ్యింది అనడం దాంట్లోంచి మరి పది, పదిహేను అంకెల మొ త్తం తీసెయ్యడం మిగిలిన దాన్ని 12 పెట్టి గు ణించడం అలా వచ్చినదాన్ని 36 పెట్టి భాగిం చడం ఇలా ప్రతిరోజు వివిధములైన కూడికలు, తీసివేతలు, గుణకాలు భాగహారాలు!నేను టెన్త్‌క్లాస్‌ చదివేంతవరకు ప్రతి క్లాసులోను ముఖ్యమైన లెక్కల చాలా చేసేవాణ్ణి.

ఎక్కాలు పై నుండి క్రిందికి క్రింది నుండి పైకి అప్పచెప్పేవాణ్ణి. ఏమైనా పొరబాటు జరిగితే రూళ్ళ కర్రతో కొట్టేవారు మా టీచర్లు. నేనెప్పుడూ క్లాసులో ఫస్టే. అంచేత ఏ మాస్టారు చేత దెబ్బలు తినలేదు. ఇలాంటి కట్టుదిట్టమైన బోధనలోంచి బయట పడ్డాను కాబట్టి పాల్‌సాబ్‌ ఇచ్చేపని నిమిషాలలో చేసేవాణ్ణి. రోజుకలాంటి లెక్కలలో 20, 30 కాగితాలు నిండిపోయేవి! పాల్‌సాబ్‌ నన్ను బాగా మెచ్చుకొనేవారు. తతిమా ఇద్దరు ఆడిటర్లకు ఇలాంటి లెక్కలు ఇచ్చేవారుకాదు. వాళ్ళమీద నమ్మకం లేక.రోజుకు దగ్గర దగ్గరగా 50-100 పేజీలు టైపు పని వుండేది నిమిషానికి 100 పదాలు స్పీడ్‌లో టైపు చేసి ఏ రోజు పని ఆ రోజున పూర్తి చేసేవాణ్ణి. ఒక రోజున ‘‘ఆఫీస్‌ ఫైళ్ళలోంచి ఇన్నిన్ని పేజీలు టైపు చేయించడం అవసరమా’’ అని అడిగాను. పాల్‌గారు ‘‘నీ చేత ఇంతపని చేయించడం నాకేమీ సరదా కాదు మనమేమి వ్రాసినా ఆ విషయాలకు ఆధారమేమిటో మన హెడాఫీసు వారికి చూపించాలి. అందుకోసం చాలా ష్టపడాలి, ఫలితం తప్పక వస్తుంది!’’ అని కర్తవ్యబోధన చేసేవారు.

ఆడిట్‌ అంటే ఏమీ తెలియని నాకు ఎన్నో సం దేహాలు వచ్చేవి. వాటికి సమాధానాలు పాల్‌గార్ని అడిగి తెలుసుకునేవాణ్ణి. ఆయన కోప్పడకుండా నాకు బోధించేవారు. మరొక సందర్భంలో ‘‘పాల్‌ మనం ఒక ఏడాది ఆడిట్‌ చేస్తున్నపుడు మీకు ఒకటి, రెండు సంవత్సరాల వెనుక రికార్డులు, ఒక సంవత్సరం తర్వాత రికార్డులు కూడా చూస్తూ చాలా కష్టపడుచున్నారెందుకు’’ అని అడిగాను. అందుకాయన ‘‘ఆడిట్‌లో సఫలీకృతమవ్వాలంటే ముందు, వెనకల రికార్డులు కూడా చూడాలి. అప్పుడే మనకు మంచి పాయింట్లు వస్తాయి. మన హెడాఫీసు వారు కూడా మెచ్చుకుంటారని’’ చెప్పారు, నాకు విషయం అర్థమయ్యింది పాల్‌గారు ఎక్కవ పని చేసే పార్టీ నాక్కూడ పనెక్కువయ్యేది! ఐనా నేను విసుక్కొకుండా ఆయనకు సహకరించి పని గురించి బాగా తెలుసుకునేవాణ్ణి.ఆఫీసులో వాళ్ళంతా మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్‌కు వెళ్ళి రెండు, రెండున్నరకు తిరిగి వచ్చేవారు. కాని పాల్‌గారి పార్టీ దీనికి భిన్నం, ఆయన దేహారోగ్యం ఎంత బాగుండేదంటే మధ్యాహ్నం భోజనం సంగతి మరిచిపోయి పనిచేసేవారో! తతిమా ఇద్దరు ఆడిటర్లనొరిక మేరకు మా ప్యూన్‌ షేక్‌ఆలీ ఒంటిగంట తర్వాత ప్రతి ఐదు, పది నిమిషాలకొకసారి వచ్చి ‘‘పాల్‌ సాబ్‌ ఖానేకు జాయెంగే’’ అని అడిగేవాడు వాడడిగినప్పుడల్లా పాల్‌సాబ్‌ ‘ఠైరో…ఠైరో’ అని మాత్రం అనేవారు. సీట్లోంచిలేచే వారుకాదు

చివరకు నా ప్రార్థన ఆలకించి మధ్నాహ్నం ఒంటి గెంటన్నరకు భోజనానికి లేచేవారు! పదిహేను నిమిషాలలో భోజనం కానిచ్చి, నన్ను హడావుడి పెట్టెసి ఆఫీసుకు తీసుకెళ్ళిపోయేవారు. ఆడిటర్లిద్దరూ ఒక గంట తర్వాత వచ్చేవారు. పాల్‌సాబ్‌ వాళ్ళను మందలించే వారు. సమయపాలనంటే పాల్‌సాబ్‌ వద్దే నేర్చుకోవాలి!ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆఫీసువాళ్ళంతా చాలా మంది వెళ్ళిపోయేవారు. కాని పాల్‌సాబ్‌ అంటే వారందరికి సింహస్వప్నం అందుచేత పదిమంది అతి ముఖ్యమైన ఉద్యోగస్తులు ఆయన ఆనతికి కట్టుబడి ఆయన సీట్లోంచి లేచేవరకు ఆఫీసులో వుండేవారు! పాల్‌సాబ్‌ కంట్రోల్‌ నేనెప్పుడు సాయంత్రం ఎనిమిది గంటలకు ముందుగా ఆఫీసు వదల్లేదు!ఒక రోజున సాయంత్రం ఏడు గంటలకు కరెంటు పోయింది. మా ఆడిటర్లిద్దరికి మా ఫ్యూన్‌కు ఆఫీసు వర్కర్లందర్కి చాలా ఆనందం అనిపించింది. అంతా ఆఫీసు వదలి వెళ్ళిపోవచ్చుననుకున్నారు.

కాని అందిరి ఆశలు నిరాశ చేస్తూ పాల్‌ సాబ్‌ ఆఫీసు స్టోర్స్‌ అసిస్టెంట్‌ను పిలిచి ‘‘మీ స్టోరులో జెనరేటర్‌ సెట్లు నాలుగుండాలికదా, ఒకటి తీసి కరెంటు వచ్చేటట్లు చేయండీ’’ అని ఆర్డర్‌ పాస్‌ చేశారు. దానికి స్టోర్స్‌ అసిస్టెంట్‌గారు ‘‘సార్‌ నాలుగు వుండవలసిన మాట నిజమే. కాని అవి ఏమీ పని చేయట్లేద’’ని చెప్పారు. పాల్‌సాబ్‌కు చాలా కోపంవచ్చింది. నన్ను తీసుకుని స్టోర్స్‌కు వెళ్ళి చూశారు. ఒక జెనరేటర్‌ పనిచేస్తోంది! వెంటనే దాన్ని నడిపించి కరెంటు వచ్చేట్లు గని చేశారు. యధాప్రకారం పాల్‌సాబ్‌ను మనస్సులో తిట్టుకుంటూ, మాతో పాటు ఆఫీసులో రాత్రి 9 గంటల వరకు వుండిపోయారు! అస్సలు బాగుపడని తతిమా మూడు జనరేటర్లకు ఆ రోజుల్లో చీ 5000/- ఎందుకు ఖర్చు పెట్టారని ఒక ఆడిట్‌ పేరా వ్రాశారు మా పాల్‌! అందరూ లబోదిబోమన్నారు!! అసాధారణ పరిస్థితులలో కూడా ఎలాగు పనిచేయాలి అన్న దాన్ని పాల్‌సాబే నిదర్శనం!పాల్‌సాబ్‌ను ఎలాగోలాగ పనిచేయకుండా చేయాలని సంలకల్పించిన ఆ ఆఫీసు వారు పాల్‌సాబ్‌ గారి షెకారీ నైపుణ్యాన్ని ఎరగా వాడుకోవాలని నిశ్చయించారు! వెంటనే పాల్‌సాబ్‌గారు టూ బోర్‌ గన్‌ను హైదరాబాదు నుండి తెప్పించారు.

పాల్‌సాబ్‌కు వేటంటే ఇష్టం. అందుచేత ఆయనను వేటలో దించితే రెండు మూడు రోజుల విశ్రాంతి దొరుకుతుందని తలచిన ఆ ఆఫీసు వాళ్ళు చేతులు కలిపారు మా ఆడిటర్లిద్దరు. వారంతా కలిసి పాల్‌సాబ్‌ను ఒప్పించే బాధ్యత నా కప్పగించారు! అతి కష్టం మీద పాల్‌సాబ్‌ను వేటకు వెళ్లేట్లు చేయగలిగాను నేను.శుక్రవారం రాత్రి పదిగంటలకు మూడు, నాలుగు జీపులలో మొత్తం ఇరవైమంది ఎటూరు నాగారం అడవులకు వేటకు బయలు దేరాము. అడవిలో మూడు, నాలుగు గంటలు ‘వేటే’ ధ్యేయంగా జీపులలో అంతా తిరిగాము. ఎట్టకేలకు రాత్రి ఒంటి గంటకు ‘సాంబార్‌’ జంతువేట జరిగింది’ ఆ జంతువును జీపులో వేసుకుని తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ఒ కుగ్రామానికి చేరాము. ఐదారుగంటలు అంతా నిద్రపోయారు. ఆ గ్రామస్థులు మాకందర్కి నాస్తా ఏర్పాటు చేశారు. ఉడకేసిన గింజలు మషాలా వేసినవి మాకు పెట్టారు. తర్వాత చాయ్‌ ఇచ్చారు. ఆదివారం సాయంత్రానికి మేమంతా తిరిగా ఆఫీసుకు చేరుకున్నాము. అప్పుడు రాత్రి 12 అయ్యింది!
రెండు రోజులు పాల్‌సాబ్‌ను ఆఫీసు పనికి దూరంగా వుంచగలిగామని ఆఫీసు వాళ్ళంతా సంతోషపడిపోయారు.

ఆదివారం రాత్రి చాలా పొద్దెక్కాక కాని తిరిగిరాలేదు కాబట్టి సోమవారం పాల్‌సాబ్‌ ఆఫీసుకు రారనుకున్నారు.పాల్‌సాబ్‌కు మాత్రం ఏ మాత్రం దిగులు ఆలసట కలుగలేదు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నన్ను తీసుకుని ఆఫీసుకొచ్చారు! వెంటనే మా ఫ్యూన్‌ను పంపి ఆఫీసులోని పదిమంది ప్రముఖ ఉద్యోగస్తులను ఆఫీసుకు రప్పించారు. వాళ్ళ అంచనాలకు అతీతంగా జరుగుచున్న విషయాలకు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు!శనివారం ఒక్కరోజున తన పనికి ఆటంకం వచ్చిదని చెప్పి పాల్‌సాబ్‌ మరుసటి వారంతో నాలుగైదు రోజులు ప్రతి రాత్రి తొమ్మదిగంటల వరకు పనిచేయాలని ఆర్డర్‌ పాస్‌చేశారు! అంతా లబోదిబోమన్నారు.పాల్‌సాబ్‌ సోమవారం సాయంత్రం తొమ్మిది గంటలకు రెస్ట్‌హౌస్‌కు వచ్చాక నన్నుపలిచి ‘‘ఆడిటర్సును ఏదో విధంగా పనిచేయ
కుండా చేయాలన్నదే వాళ్ళ ధ్యేయం ఎట్టి పరిస్థితులలోను మనం వాళ్ళ బుట్టలో
పడకూడదు… దాని పర్యవసానమే ప్రతి రోజునాలుగు గంటలు అదనపుపని!’’
అని చెప్పి ఆడిటర్స్‌ పాత్ర గురించి చెప్పారు నాకవన్నీ గుణపాఠాలే!

ఇరవై రోజుల ఆడిట్‌లో పదిహేను రోజులు గడిచిపోయాయి. గతంలో తమ ఆఫీసు కొచ్చిన ఆడిటర్‌ పార్టీలెళ్ళెవ్వరూ ఇంత ఇదిగా పని చేయలేదని నాకు చెప్పుకుని లబోదిబోమన్నారు ఆ ఆఫీసు వాళ్ళంతా! మిగిలిన ఐదు రోజులలో కూడా ఎన్నో పథకాలకేసి పాల్‌సాబ్‌ను పని నుండి దూరం చేయాలనుకున్నారా ఆఫీసువారు.ఆడిట్‌పార్టీ వాళ్ళను శ్రీశైలం యాత్రకు తీసుకెళ్ళారు. మూడు, నాలుగు జీపులలో పది, పదిహేను మంది వెంటరాగా ఏడెనిమిది గంటలు ప్రయాణం చేసి శ్రీశైలం వచ్చారు. రోడ్డుకొక వైపుగా 133 కె.వి లైను ఒకటి 220 కె.వి. లైను మరొకటి విద్యుత్‌శాఖకు సంబంధించినవి ఒక దాని వెంబడి మరొకటి సమాంతరంగా నిర్మించబడ్డాయి! ఒకే రూట్‌లో రెండు లైన్లు ఎందుకున్నాయని పాల్‌గారు ఆఫీసు సిబ్బందిని అడిగారు. తక్కువ లోడీవైన మొదటి నిర్మించారని వెంటనే అది పనికి రాలేదని తెలుసుకుని 220 కె.వి లైను వేశారని వారిలో ఒకరు చెప్పారు. పాల్‌గారు నా వైపు తిరిగి పాయింట్‌ నోట్‌ చేసుకోమన్నట్టుదా సైగ చేశారు.
‚
రెండు రోజుల యాత్ర అయ్యాక మేమంతా ఆఫీసుకు తిరిగి వచ్చాము. వచ్చిన మరుక్షణం పాల్‌గారు విద్యుత్‌ లైన్లకు సంబంధించిన ఫైళ్ళను తెప్పించి, క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఆడిట్‌ పాయింట్‌ తీశారు. ప్రభుత్వానికి దూరదృష్టిలోపించినందువల్ల వచ్చిన కొన్ని కోట్ల నష్టాన్ని దానిలో విశదీకరించారు. మా హెడాఫీసు వారు మమ్ములను మెచ్చుకున్నారు. లోకల్‌ ఆఫీసు వాళ్ళు ఖిన్నులయ్యారు! ఆ పాయింట్‌ను ఒక దారికి తెచ్చుటకు నేను పాల్‌ గార్కి చాలా తోడ్పడ్డాను. ఆ రోజు సాయంత్రం పాల్‌గారు నాతో ‘అడిటర్స్‌ బర్డ్‌ వ్యూ అంటే ఈ వేళ్టి మన పాయింటే నిదర్శనం ఎంతో లిజవెంట్‌గా వుండి అన్ని కోణాలలో పరిశీలించాలని తెల్పారు. ఆయన ఆధ్వర్యంలో అడిట్‌ సూక్ష్మాలనేనెన్నో నేర్చుకున్నాను.దేనికీ లొంగకుండా నా సహాయంతో తన పనితాను చేసుకుపోయారు పాల్‌సాబ్‌. ఫలితంగా వంద పేజీల అడిట్‌ రిపోర్టు తయ్యారయ్యింది! అంతకు ముందొచ్చిన అడిట్‌ పార్టీలతో పదిపేజీలు దాటి రిపోర్టు ఎప్పుడూ ఇవ్వలేదట.

ఈ ఆడిట్‌ ఇరవైరోజులలో నాకు చాలా అనుభవం వచ్చింది. మరో అడిట్‌ మరో ఆడిట్‌ ఇలా నేను పాల్‌సాబ్‌ కంట్రోల్‌లో ఒక ఏడాదిలో ఏడెనిమిది ఆడిట్లు చేశాను. చేసేది క్లర్క్‌-కమ్‌-టైపిస్టు ఉద్యోగమయినా పాల్‌సాబ్‌ ఆధ్వర్యంలో నేనెంతో నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిదివరకు పనిచేసిన నన్ను పాల్‌సాబ్‌ దీపావళి నాడు కూడా వదల లేదు! దీపావళికి ఒక రోజే శెలవు దినం వచ్చిందని, అం దుచేత ఆడిట్‌ చేసే వూరు వదలి స్వగ్రామం పోతే తిరిగి మరుసటిరోజు డ్యూటీకి సకాలం లో చేరలేరని ఆయన అనుమానం. అందుచేత ఎవ్వర్ని పండుగకు ఇంటికి పంపలేదు! నేను ఆశతో కొనుక్కన్నా వందరూపాయల బా ణాసంచా గెస్టు హౌస్‌కు ఎదురుగానే కాల్చుకున్నాను! వెళ్ళిన ప్రతి ఆఫీసులోనూ మొదటి రెండు రోజులు ప్రతి సెక్షన్‌లోను తిరగాలని,

స్టోర్స్‌ సెక్షన్‌, వర్క్‌షాప్‌ సెక్షన్‌, పర్చేజెస్‌ సెక్షన్‌, ఇలా ప్రతి విభాగానికి వెళ్ళి ఏమేమి లోటు పా ట్లున్నాయో స్వయంగా చూడాలని తెలిపేవారు పాల్‌సాబ్‌. ఆడిట్‌ పార్టీ మెంబర్లకు కనీసం కాలక్యులేటర్లు కూడా ఇవ్వకుండా ప్రయత్నిం చే ఆఫీసులు వుంటాయని, అట్టి పరిస్థితులనుండి బైట పడుటకు మన బుర్ర ఉపయోగించాలిన చెప్పేవారు పాల్‌సాబ్‌. కొన్ని ఆఫీసుల్లో అతివృష్టి చేసి ఆడిటర్లను ముంచెత్తుతారని, ఆ ప్రలోభాలకు లొంగిపోకూడదని బో ధించారు. కొన్ని ఆఫీసులలో సహాయనిరాకరణ అధిక పాళ్ళలో వుంటుందని, అలాంటి పరిస్థితులలో కూడా ఒక ఫైలునుండి పదిఫైళ్ళ సమాచారం ఎలా లాగాలో నేర్పారు!

నా జీవితంలో ఆడిట్‌ పునాది వేసిం ది పాల్‌గారే! ఒక్క ఏడాదిలో చాలా కష్టపడి నేను నేర్చుకున్న పద్ధతులు నాకు భావి జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి! నేను ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరి ఏడెనిమిది పదోన్నతులు తీసుకు గొప్పపదవిలో రిటైరయ్యాను! పాల్‌సాబ్‌ను నేను జన్మ జన్మలకు మరచిపోలేను.ఉద్యోగంలో మొదటిపారి చేరిన ప్రతి వ్యక్తికి పాల్‌సాబ్‌ లాంటి వ్యక్తులు తర్ఫీదు ఇస్తే భావితరాల వారికి చాలా మేలు జరుగుతుందనడం సందేహం లేదు!

– సత్యం ఆదూరి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top