You Are Here: Home » చిన్నారి » కథలు » పుట్టింటికి

పుట్టింటికి

SUNDAY-STORY1వెంకటాపురం చేరాలంటే ఇంకా గంట న్నర పైనే పడుతుంది. టైము చూసు కున్నాడు. ఏడున్నరయింది. అసలే చలికాలం బయట అంతటా చీకటి కమ్మేసి ఉంది. ఏమీ కానరావడం లేదు. బస్సు బయలుదేరి పావు గంటయినా కాలేదు. చాలా అసహనంగా ఉంది వెంకట్రాదికి. అసలే పల్లె వెలుగు బస్సు. గతుకుల రోడ్డు ప్రయాణం. ఎవరైనా చేయి ఎత్తడం తరువాయి. అంగుళం కూడా ముందకు కదలడం లేదు. ఠక్కున ఆపి పడేస్తున్నాడు డ్రైవరు. డెభె్భై ఏళ్లు పైబడ్డ వయసులోని రుగ్మతలు వెంకటాద్రిని చుట్టు ముట్టేస్తున్నాయి. బస్సు లో ఇసుక వేస్తే క్రిందకు రాలే పరిస్థితి లేదు. ఒకటే జనం. ఆ రూటులో అదే ఆఖరి బస్సు కావడంతో ఎక్కక తప్పలేదు. నుంచోవడం చాలా కష్టంగా ఉంది. ఒంటికాలి ప్రయాణం. సీట్లన్నింటినీ పరికించి చూశాడు. బస్సులో సీటు సంపాదించిన ప్రతి ఒక్కడూ ఓ విజేత లా ఫీలయిపోతున్నాడు. ముఖంలోకి చూస్తే ఎక్కుడ కూర్చోవడానికి జాగా అడుగుతారో నని శూన్యంలోకి చూస్తున్నారు.

వెంటాద్రికి దిగి పోవాలనుంది. గంటన్నర సేపు అలా నుంచొని ప్రయాణం చేయడం తనవల్ల కానేకాదు. కొంచెం సర్ధుకోమని ఒకరిద్దరిని అడుగుదామని నోరు తెరవ బోయాడు. ఆయన ఉద్ధేశాన్ని ముందే పసికట్టినవాళ్ళు కళ్ళుమూసుకొని నిద్ర నటిస్టున్నారు. అదే నిద్రలో ఓగుతున్నారు.
‘‘అమ్మాయి ఎక్కడ దాకా నువ్వు!’’ ఏదో పుస్తకం చదువుతున్న ఆమె చివాలున తలపైకెత్తింది.
‘‘నిన్నేనమ్మాయ్‌! ఎక్కడిదాకా నీ ప్రయాణం!!’’
‘‘వెంకటాపురం!’’ చెప్పి చదవడంలో నిమగ్న మైపోయింది. పాపం ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నాడు వెంకటాద్రి.

‘‘మీరెక్కడి దాకా అంకుల్‌!’’ ఏమనుకుందో ఏమిటో పుస్తకాన్ని ప్రక్కన పెడుతూ అంది. ప్రాణం లేచివచ్చింది. ఆమె పిలుపు చాలా ఆత్మీయంగా తోస్తోంది.
‘‘నేను అక్కడికే అమ్మాయ్‌! ఈ రోజు బస్సు చాలా రద్దీగా ఉంది. ఎప్పుడూ ఇంతమంది ఎక్కిన గుర్తు లేదు నాకు!!’’ ఆయన మాటల్లో కొండంత వేడుకోలు ఉంది.
‘‘వెంకటాపురం వెళ్ళేటప్పటికి ఎంతవుతుందంకుల్‌!’’
‘‘తొమ్మిది!’’ వాచీ చూసుకుంటూ అన్నాడు.
‘‘కాసేపు ఇలా కూర్చోండి! సీటు షేర్‌ చేసుకుందాం!’’ మారు మాట్లాడలేదు. లేచి నిలబడ్డ ఆ అమ్మాయి సీట్లో చటుక్కన కూలబడ్డాడు.

సీటు ఇచ్చి తాను నుంచున్న ఆమె వైపు అభిమానంగా చూశాడు. అవేమీ పట్టించు కోవడం లేదు ఆమె. నుంచొని అలాగే పుస్తకం చదవడంలో నిమగ్నమై పోయింది.
ఉన్నట్టుండి దగ్గర రైలు గేటు వేసి ఉంది. బస్సు ఆపేశాడు… ‘‘ట్రైనురావడానికి పది నిమిషాలు పట్టొచ్చు’’ క్రిందకు దిగి గాలి పీల్చుకోండి అన్నట్టుగా ఉన్నాయి కండక్టరు మాటలు.
‘‘ఈ లెక్కన వెంకటాపురం, వెళ్ళేసరికి తొమ్మిదిన్నర కావొచ్చు!’’ తనలో తాను అనుకున్నాడు.
‘‘దాన్ని బస్టాండ్‌కి రమ్మన్నాను. ఏం చేస్తుందో!’’ వెంకటాద్రి ముఖంలోకి చూస్తూ అంది. అమెను పరిశీలనగా చూశాడు. ముపె్ఫై ఏళ్ళు దాటి ఉంటాయి. కట్టు బొట్టు పెళ్ళి అయినట్లుగా చెబుతున్నాయి.
‘‘చాలా సంతోషమమ్మా! నా కోసం చాలా సేపు నుంచొని ఉన్నావ్‌. నీ సీటు నీకివ్వడం న్యాయం’’ రైలు వెళ్ళిపోయిన తర్వాత బస్సు ను స్టార్ట్‌ చేస్తూన్న డ్రైవర్‌ను చూస్తూ అన్నాడు.
చిన్నగా నవ్వింది.

‘‘ఫరవాలేదు. పెద్దవారు మీరు. అయినా నుంచోవడం నాకు అలవాటే!’’
వెంకట్రాది, నెమ్మదిగా స్థిమితపడుతున్నాడు. వెంకటాపురంలో ఈ అమ్మాయిని చూసిన గుర్తులేదు. బహుశా ఊరికి కొత్త అయి ఉండొచ్చు. అడగాలనుకున్నాడు. నోటిదాక వచ్చిన మాట పెదవి దాటి బయటకు రాలేదు. చూస్తుంటే చాలా బుద్ధివంతురాలిగి అన్పిస్తోంది. వెంకటాపురం వచ్చేసింది. అప్పటికే పావు తక్కువ పది అయిపోయింది. బ్యాగ్‌ తీసుకొని గభాలున దిగి ముందుకు కదిలిపోయిందా అమ్మాయి. ఆమె ఎక్కిన ఆటో క్షణాలలో ముందుకు దిలిపోయింది. ఇంత పొద్దు పోయిం తర్వాత ఎవరింటికి వెళుతోందో! అసలు ఏం పని మీద వచ్చిందో! కనీసం ఆమె పేరుకూడా తెల్సుకోలేదు తాను. ఆమె చెప్పనూలేదు. అడుగులు నెమ్మదిగా పడుతున్నాయ్‌. వెంకటాపురంలో దిగి లోగిలి ప్రాంతానికి వెళ్ళాలంటే పది నిమిషాల నడక. భుజం మీద కండువాతో ముఖం తుడుచుకున్నాడు. బ్యాగ్‌లోని మంచినీరు సీసాను బయటకు తీసి గటగటా త్రాగేశాడు. ఇప్పుడు లేని సత్తువను తెచ్చుకున్నాడు. అడుగులు కాసింత వేగాన్ని సంతరించు కుంటున్నాయి.

ఐదు నిమిషాల నడక సాగిందోలేగో ఆశ్చర్యం ఆ అమ్మాయి ఎదురుపడింది.
‘‘కైకలూరుకి ఆఖరి బస్సు ఎప్పుడంకుల్‌!’’ ఆమె మాటల్లో కొంత కంగారు, అసహనం తొణకిసలాడసాగాయి.
‘‘అదేమిటమ్మా! ఇప్పుడేకదూ నువ్వు వెళ్ళింది. నేను ఇంకా ఇంటికి చేరనైనా లేదు. అప్పుడే…’’
‘‘అదే అంకుల్‌ మా ఫ్రెండ్‌ ప్రమీల కోసం వచ్చాను. ఈ రోజు మధ్యాహ్నమే బెంగుళూరుకు వెళ్ళిపోయిందట. ఆమె పేరెంట్స్‌ కూడా సెండాఫ్‌ ఈయడానికి విజయవాడ వరకు వెళ్ళారట!’’
‘‘అరే! ప్రసాదమూర్తిగారమ్మాయి ప్రమీలకోసమా నువ్వొచ్చింది. కైకలూరుకి రేపు ఉదయం ఎనిమిది గంటల దాకా బస్సు లేదమ్మాయ్‌!’’
ఆమెకు చాలా అయోమయంగా ఉంది. ప్రసాదమూర్తి గారికి ఫోన్‌ చేద్దామంటే నంబరు తెలీదు తనకు. ప్రమీల ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది.

ఏమీ తొచడం లేదు.
‘‘బస్టాండ్‌కి వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో ప్రయతిస్తా నంకుల్‌!’’
‘‘భలే దానివమ్మా ఇంతరాత్రి వేళ ఊరుకాని ఈ పల్లెటూరులో ఒంటిరిగా!! పైగా ఆడపిల్లవి. నీకభ్యంతరం లేకపోతే మా ఇల్లు ఈ ప్రక్క వీధీలోనే. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండొచ్చు!’’
‘‘లేదంకుల్‌! ఇదీ సంగతి అని ప్రమీల ఫోన్‌ చేసి ఉంటే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు’’
‘‘మరిప్పుడెలా!’’
‘‘బస్టాండ్‌లో కాలక్షేపం చేస్తా! ఉదయాన్నే ఏ పేపరు వ్యాన్‌ అయినా దొరక్క పోదు’’
‘‘నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అయినా ఈ చిన్న ఊరులో బస్టాండ్‌… పేపర్‌ వ్యాను. నువ్వున్నది ఏ విజయవాడో, విశాఖపట్నమో అనుకుంటున్నావా. మనం బస్సుదిగిన చోట మఱ్ఱి చెట్టే మా ఊరు బస్టాండ్‌. అందులో ఈ చలికాలంలో ఒంటరిగా! కాదంటే నేను కూడా వచ్చి నీకు తోడుగా అక్కడే కూర్చుంటాను’’.

‘‘…………………..’’
‘‘నా కూతురు లాంటి దానివి. మా ఇంట్లో ఈ రాత్రికి నిద్ర చేసి రేపు ఫస్ట్‌బస్‌కి వెళ్దువుగాని!’’
ఇక గత్యంతరం ఏమీ కన్పించలేదు ఆ అమ్మాయికి. ఆమె చేతిలోని చిన్న బ్యాగును అందుకొని ముందుకు కదిలాడు వెంకటాద్రి.
***
చిర పురాతన నేపథ్యం అంతటా కదలాడుతోంది అక్కడ. పాతకాలపు ఇల్లు. వెంకటాద్రి భార్య కౌసల్య కూడా బాగానే ఆదరించింది. అన్నం కొసరి కొసరి వడ్డించేసరికి ఆ అమ్మాయి కను కొలనులో నీళ్ళు చిప్పిల్లాయి. అలాగే నుడం వాల్చింది.
‘‘అచ్చం మన గాయిత్రిలా లేదూ!’’
‘‘నేనూ అందామనుకున్నాను. మీరే అనేశారు’’
‘‘చూస్తుంటే అమ్మాయి మహలక్ష్మిలా ఉంది…’’
ఇందాకటి బస్సులోని వివరాలన్నీ చెప్పసాగాడు.
‘‘ఆయింట్‌మెంట్‌ అయిపోయినట్లుంది! ఈ రోజుకి సరిపోతుందిలే! రేపు తీసుకోస్తాను’’ భార్య కాళ్ళకు మర్ధనా చేస్తూ అంటున్నాడు.

‘‘ఏ కన్న తల్లి కూతురో చూస్తుంటే ముచ్చటగా ఉంది’’ కౌసల్య మాటలు మగత నిద్రలోని ఆ అమ్మాయి చెవిన పడి చెలింపజేస్తున్నాయి. అంతా యాదృచ్ఛికంగా అన్పిస్తోంది. లేకపోతే ఏమిటి తన పేరు కూడా గాయత్రే!.
ఆ రాత్రి వేళ ఆ ముసలి దంపతుల దాంపత్య జీవితం. ఒకరినొకరు ఓదార్చుకోవడం అంతా ఆమెను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. చటుక్కున లేచి కూర్చొంది గాయత్రి.
‘‘…………………..’’
‘‘గాయిత్రి!’’ పకపకా నవ్వుతున్నాడు వెంకటాద్రి. ఉన్నట్టుండి ఆయనగారి చేతిలోని లోషను తీసుకొని కౌసల్య కాళ్ళకు ముఖ్యంగా కీళ్ళకు బాగా దట్టించసాగింది. ఆ ప్రక్కనే టేబుల్‌ మీదున్న అయింట్‌మెంట్‌ సుతరామూరాస్తుంటే ఆవిడకు ఎంతో హాయిగా ఉంది.

‘‘పది సంవత్సరాల నుండి ఈ కీళ్ళ నొప్పులు నన్ను నిలవనీయడం లేదు. పాపం మా గాయత్రి కూడా తల్లికి ఇలానే సేవచేసేది!’’ అలా అంటున్న ఆవిడ మాటలు చాలా గంభీరంగా ఉన్నాయి.
‘‘అవునమ్మాయ్‌! ఇప్పుడనుకొని ఏం లాభం. అంతా అయి పోయింది’’
‘‘…………………..’’
‘‘ఒక్కగా నొక్క కూతురు అల్లారుముద్దుగా పెంచుకున్నాం. అల్లుడు అరవింద్‌ కూడా మంచివాడే. పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. అమెరికాలో పదేళ్ళు ఉండి బాగా సంపాదించుకొస్తాను మావయ్యా అన్నాడు. కాదన లేకపోయాను. పెళ్ళయిన మూడు నెలలకే భార్యతో కలిసి విమాన మెక్కేసాడు.

కూతురూ అల్లుడూ ఆమెరికా ఉద్యోగం. జీవితంలో ఇంత కన్నా ఏంకావాలనిపించేది. నిజం చెప్పాలంటే మా గాయిత్రి అమెరికాలో ఉందని గర్వంగా చెప్పుకొనేవాళ్ళం. సంఘంలోనూ, బంధువర్గంలోనూ వాళ్ళు మా పరపతిని బాగా పెంచిపడేశారు. కానీ ఆనందం ఎంతో కాలం నిలువలేదు.
అమెరికాలో మన భారతీయుల మీద ముఖ్యంగా తెలుగువారి మీద విచక్షణారహితమైన దాడుల్ని పేపర్లలో చూస్తూనే ఉన్నాం. నిర్భయంగా చంపిపడేయటాన్ని టీవీల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. అది మా దాకా వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
అరవింద్‌ చాలా తెలివైనవాడు. అతగాడి ఎదుగుదలని వాళ్ళు సహించలేకపోయారు. దాంతో కుట్ర జరిగిపోయింది. ఆ భయంకరమైన జాత్యహంకారానికి నా కూతురు అల్లుడు బలయిపోయినారు. ఎంతో సంతోషంగా వస్తారని కలలు కన్నాము. వాళ్ళు మాకు కన్నీళ్ళు మిగిల్చి కానరాని లోకాలకి వెళ్ళిపోయారు’’

వెంటాద్రి ఉద్వేగంగా చెప్పుకుపోతుంటే గాయిత్రి అంతరంగం మూగబోయింది.
‘‘వస్తాను పిన్నీ! మంచి భోజనం పెట్టారు. రోజంతా అమ్మలా నన్ను ఆదరించారు. హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి రెండువందలు తీసి కౌసల్య చేతిలో పెట్టబోయింది.
ఆవిడ చేతులు సన్నగా వణికాయి. ఉన్నట్టుండి రెండు వెచ్చటికన్నీటి బొట్లు గాయిత్రి చేతిమీదకు జారిపడ్డాయి.
ఆ అమ్మాయికి ఆనందమే ఆనందం. నోట మాట రావడం లేదు.కాళ్ళకు పసుపురాసింది. జడలో చేమంతి పువ్వుల చెండును తురిమింది. మెడకు గంధాన్ని పులిమింది. నుదుట తిలకాన్నిదిద్దింది.
‘‘ఇవన్నీ ఎందుకు పిన్నీ!’’

పళ్ళెంలో పసుపు కుంకుమ… పూలు… పళ్ళు… చీర జాకెట్‌…
‘‘చూస్తూంటే నువ్వు పిచ్చిదానిలా ఉన్నావ్‌!’’
‘‘అవును అంతా పిచ్చే మరి. మా గాయిత్రి ఇంటికి వచ్చినపుడు పిచ్చిగాక మరేంటి!’’
‘‘తీస్కో అమ్మా! ఏదో పిచ్చి అభిమానం దానికి’’ వెంకటాద్రి మాటలతో రాత్రి చీకట్లో సరిగా చూడనేలేదు. గాయిత్రి దంపతుల ఫోటో గోడకు తగిలింపబడి ఉంది. తనకు ఆమెకు చాలా దగ్గర పోలికలు అగుపిస్తున్నాయి.

‘‘లోకంలో మరీ ఇంతమంచి మనుషులుంటారని నాకిప్పుడే అన్పిస్తోంది. మనవి ఒకే రకమైన పోలికలున్న జీవితాలు. మా అమ్మానాన్న నా చిన్నప్పుడే కాలం చేశారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు నాకు అటువంటిది మీరు..!’’ చటుక్కున వారి కాళ్ళకు నమస్కారం చేస్తూ అంది గాయిత్రి.
అంతా మలయమారుతంలా ఉంది.
‘‘వస్తాను పిన్నీ! ఈసారి ఇక్కడకొచ్చేది ప్రమీల కోసం కాదు. మా పుట్టింటికి… మా అమ్మానాన్నల కోసం…’’

– వడలి రాధాకృష్ణ
సెల్‌: 9985336444

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top