You Are Here: Home » చిన్నారి » కవితలు » పిల్లంగోవి!

పిల్లంగోవి!

మూరెడు కన్నా తక్కువే
ఈ పిల్లంగోవి!
అతను ఊదుతున్నాడు
ఈ పురాతన దేవళంలో-
కళ్ళు లేవు- పాటే అతని చూపు-
పాడుతూ రాగ సౌందర్యాల్ని
దర్శిస్తాడు కాబోలు
!
మూడు మూరల
వెదురు కర్ర ఆసరాతో
రోజూ ఈ దేవళానికొచ్చి
నిల్చుని పిల్లంగోవి యెదలోంచి
మెత్తని గాన పుష్పాల్ని సృజించి
సమర్పిస్తాడు సువాసనల్తో-
ఇక్కడికొచ్చినవాళ్ళు
పరిమళాల స్పర్శలో
ప్రశాంత చిత్తులై శుభ్రపడతారు

పాటలో లీనమై పరవశులై
ఎవరు కరుగుతున్నారో
అతను చూళ్ళేడు
ఎవరో దరికొచ్చి నాల్గు నాణాల్ని
తన చేతికిచ్చినపుడు
వినమ్రుడై స్వీకరిస్తాడు
కృతజ్ఞతను పాటలో
మిళితం చేస్తాడేమో!

ఏ అడవిలో జన్మెత్తిందో గానీ
వెదురుముక్క పిల్లంగోవై
ఇతని ఆత్మను శ్రావ్యంగా విన్పిస్తున్నది
ఇక్కడి పసుపూ కుంకుమ లాగే
ఈ పాటల పిల్లంగోవీ పవిత్రమే!

పాట ముగించి అతను వెళ్తూంటే
అడవి వెదురు పొదొకటి
వెళ్తున్నట్టుగా ఉంది! రాగ కాంతితో!!

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top