You Are Here: Home » చిన్నారి » పాము పీడ విరగడ!

పాము పీడ విరగడ!

ఒక దట్టమైన అడవిలో ఎన్నో పక్షులు, జంతువులు ఉండేవి. రకరకాల చెట్లు చేమలతో నదులు, సరస్సులుతో ఆ అడవి చూడ ముచ్చటగా ఉండేది. ఒక పక్షుల గుంపు విశాలమైన చెట్లు ఉన్న చోట నివాసం ఏర్పరుచుకుని ఉండసాగాయి.

ఒక పాము పక్షుల గూళ్ళలో గుడ్లున్న విషయం పసికట్టింది. పక్షులు ఆహారం కోసం బయటి వెళ్ళినప్పుడు తీరిగ్గా వచ్చి రోజుకో గుడ్డును తినడం మొదలుపెట్టింది.

సాయంత్రానికి గూళ్ళకు తిరిగి వచ్చిన పక్షులు గుడ్లు లేకపోవడం చూసి కంగారు పడి ఆ చుట్టుప్రక్కల వెతికాయి. చెట్టు క్రింద పగిలిన గుడ్ల పెంకులు, పాము వచ్చిన జాడలు కనిపించాయి. ప్రతిరోజూ ఇలాగే జరుగుతూ ఉండడంతో వాటికి ఏడుపు వచ్చింది. పాము బారిన పడకుండా గుడ్లును ఎలా కాపాడుకోవాలో తెలియక బాధ పడసాగాయి.

వాటిలోనే ఒక తెలివైన పిచ్చుక ఉంది. అది పాము కోసం వెతికింది. ఒక నీటి కాలువ దగ్గరున్న పాము నివాసాన్ని కనిపెట్టింది. బాగా ఆలోచించి ఒక పథకం తయారుచేసింది.
తరువాత పిచ్చుక పాము పుట్ట దగ్గరకు వెళ్ళి ‘‘ఒరే పాము వెధవా! బయటికి రారా’’ అంటూ గట్టిగా కేకేసింది.

పాము పుట్టలోంచి బయటకు వచ్చి ఎదురుగా కనిపిస్తున్న పిచ్చుకను చూసి ఆశ్చర్యపోయింది.
‘‘కదల్లేని గుడ్ల మీదా నీ ప్రతాపం? నీకు దమ్ముంటే నన్ను పట్టుకోరా చూద్దాం’’ అంటూ పిచ్చుక సవాలు విసిరింది.

పాము కోపంతో బుస్సుమని పిచ్చుకను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. పిచ్చుక దానికి దొరక్కుండా బుర్రున పైకి ఎగిరింది.

‘‘రారా చూసుకుందాం’’ అని పిచ్చుక పామును రెచ్చగొట్టింది. పాము పట్టుకోబోతే అందకుండా కొంచెం ముందుకు ఎగిరి కూర్చుని, తిరిగి పామును తనను పట్టుకొమ్మని పిలవసాగింది. ఈ విధంగా పిచ్చుక పామును కాలువ గట్టు దాకా తీసుకెళ్ళింది.

ఇప్పుడు పిచ్చుక, పాము గట్టు మీదున్నాయి. ‘‘ఏంట్రా నన్ను పట్టుకోలేక పోతున్నావా? చేతకాని వెధవ!’’ అని తిట్టింది పిచ్చుక. దాంతో పాముకు చాలా కోపం వచ్చింది. పడగెత్తి బుసకొడ్తూ పిచ్చుక మీదకు దూకింది. వెంటనే పిచ్చుక నీటి కాలువ మీదకు ఎగిరింది. దాంతో పిచ్చుకను పట్టుకోవాలనుకున్న పాము కాలువలో పడిపోయి, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
ఆ విధంగా పాము పీడ విరగడైనందుకు పక్షులు సంతోషించాయి.
ఆ తెలివైన పిచ్చుకను ఎంతో పొగిడాయి.
నీతి: ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top