You Are Here: Home » చిన్నారి » కవితలు » పాత గాయమే !

పాత గాయమే !

ఎన్నో గాయాలు మోశాను
నొప్పి నిజ స్వరూపాన్ని మట్టానికే చవి జూచాను
గాయాలు నన్ను ఆత్మీయంగా చూచాయి తప్ప
నన్నొక ప్రత్యర్థిగా ఏ నాడూ కక్షగట్టలేదు
అందుకే అవి నా దృష్టిలో గాయాలనిపించుకోలేదు నిజం!

అయితే నా జీవితం
గాయాల స్నేహంతోనే కొనసాగింది, నిత్యం
అయినా, నాకు చింతన లేదు
గరళం కూడా కొద్దిగా కొద్ది కొద్దిగా
అలవాటుగా శరీరం స్వీకరించాక
గరళం, తన శక్తిని శరీరంపై ప్రయోగించ జాలదు
ప్రయోగించినా ఫలితముండదు.
అందుకే గాయాలు నన్ను ఎంతమాత్రం శిక్షంచక
ఏమాత్రం చలించలేక పోయాయి, అయినా నేనలా అనుకోను
నాలో కృతజ్ఞతా భావం, ఇంకా బతికే ఉంది, ఉంటుంది
నే బతికినన్నాళ్ళు, భద్రంగానే !
కాలం, నన్ను జీవితం అంచుకు చేర్చాక
ఇక, ఏ గాయం నన్నేం చేయగలదు? అని సరిపెట్టుకున్నా
నేడు ఓ పదునైన ముల్లు
నా గుండెల్లో గుచ్చుకున్నట్లనిపిస్తూ ఉంది
అది పువ్వేమోనని భ్రమపడి
ముల్లు కాటుకు బలయిన సందర్భం
నాకు గుర్తుంది
అదే,
నేడు బాధయి తొలుస్తూ ఉంది,
పాత గాయమే!

– మొహమ్మద్‌ ఖాన్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top