You Are Here: Home » చిన్నారి » కవితలు » పాకీ పనోడ్ని

పాకీ పనోడ్ని

పట్టణాన్నంతా పరిశుభ్రం చేసి
ప్రతిరోజూ సూర్యోదయానికి
స్వాగతం పలికే ప్రజారోగ్య పనోడ్ని!

ఊరి సందుల్లో గొందుల్లో
చెత్తా చెదారాన్ని తొలగించి
పరిశుభ్రతకు పట్టంగట్టే పాకీవోడ్ని!

మురికివాడలలో మురుగు కాలవల్లో
మురిగిపోయిన మురుగుని
కనుమరుగు చేసే నవ మాంత్రికుడ్ని!

ఊరందరి సకల మాలిన్యాల్ని
ఏ కల్మషం లేకుండా నిత్యం కడిగే
అసలైన పర్యావరణ ప్రేమికుడ్ని!

ఎండైనా వానైనా చలైనా లెక్కసేయక
ఊరి కుళ్ళుని ఒంటికి పూసుకుని
ఊడ్చే ఊడిగం చేసే అపర రుద్రుడ్ని!

స్వంత ఆరోగ్యాన్ని లెక్క సేయక
ప్రజారోగ్యమే ప్రాణప్రదంగా భావించి
నిత్యం శ్రమించే సిసలైన సమాజ సేవకుడ్ని!

పట్నంలో పరిశుభ్ర పరిమళాలు వెదజల్లినా
ఎప్పుడూ పాకీవాడనే తిరస్కారమే తప్ప
ఏ పురస్కారం పొందని పాకీ పనోడ్ని!

Other News From

Clip to Evernote

Leave a Comment