You Are Here: Home » ఆరోగ్యం » పలు వ్యాధుల చికిత్సలో పసుపు

పలు వ్యాధుల చికిత్సలో పసుపు

పలు వ్యాధుల చికిత్సలో పసుపునిత్యజీవితంలో పసుపు అన్ని పవిత్ర కార్యాలకూ వాడుతుంటాం. అలాగే ఆహార పదార్థాలలో కలపడానికి, స్త్రీలు ముఖానికి, కాళ్లకు రాసుకోవడానికి – ఇలా అనేక విధాలుగా పసుపు ఉపయోపడుతుంటుంది. ఆయుర్వేదంలో కూడా పసుపును విస్తృతంగా వర్ణించారు.
పసుపును సంస్కృతంలో హరిద్రా అంటారు. హరి అంటే పసుపు. ఇది పసుపు వర్ణాన్ని కలిగిస్తుంది. కనుక హరిద్రా అంటారు. వరపర్ణిని, యోషిత్ప్రియ, హట్టవిలాసిని, నిశా మొదలైన పేర్లతో కూడా పసుపును వ్యవహరిస్తారు.
శ్రేష్టమైన వర్ణాన్ని ఇచ్చేది కనుక వరపర్ణిని అని, స్త్రీలు ఇష్టపడేది కనుక యోషిత్ప్రియ అని, పచ్చదనంతో మార్కెట్‌ వీధులకు అందాన్నిచ్చేది కనుక హట్ట విలాసిని అని పిలుస్తారు. రాత్రికి ఉన్న పర్యాయపదాలు నిశా, రజనీ మొదలైనవి కూడా దీనికి ఉన్నాయి.
కుష్టు రోగ చికిత్సలో, కామెర్ల వ్యాధి చికిత్సలో పసుపు గురించిన ప్రస్తావన అధర్వణ వేదంలో కనిపిస్తుంది.
ఆయుర్వేద శాస్త్రానికి మూల గ్రంథాలు మూడు. అవి – చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం. వీటిని బృహత్త్రయీ అంటారు. చరక సంహితలో పసుపు చర్మ రోగాలను తగ్గించేది, దురదను తగ్గించేది, విషాన్ని హరించేది, శరీరంలో పేరుకునే క్రొవ్వును తగ్గించేదిగా వర్ణించారు.
ప్రమేహ వ్యాధి అంటే మూత్ర ప్రవృత్తి అధికమయ్యే వ్యాధి. దీనిలో ఒక రకమే చక్కెర వ్యాధిగా పేర్కొంటున్న మధుమేహ వ్యాధి. ప్రమేహ వ్యాధి చికిత్సలో ఉసిరిక రసంతో పసుపు చూర్ణం కలిపి తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. దీనిఇన నిశామలకి అంటారు. ప్రమేహ చికిత్సలో నిశామలకి ఉత్తమ ఔషధమని సుశ్రుత సంహితలోనూ, అష్టాంగ హృదయంలోనూ చెప్పారు.
కామెర్ల వ్యాధి చికిత్సలో పసుపు ప్రస్తావన ఉంది. గుంటకలగరాకు రసంలో 5 గ్రాముల పసుపు కలిపి వారం రోజులు తీసుకోవాలి. అరగ్రాము పసుపు, అరగ్రాము కాసీస భస్మం తేనెతో తీసుకోవాలి.
జలుబులో పసుపు కలిపిన వేడినీటితో ఆవిరిపట్టాలి. దీని పొగ పీల్చిన కొద్దిసేపటి వరకు చల్లని నీళ్లు తాగకూడదు. పసుపు కలి పిన వేడిపాలలో బెల్లం కలిపి తాగాలి. దగ్గు, ఆయాసంలో పసుపును తేనెతో కలిపి తీసుకోవాలి.
చర్మవ్యాధులలో ముఖ్యంగా దురద, మచ్చలు, ఎలర్జీ వలన వచ్చిన చర్మవ్యాధులలో పసుపు పని చేస్తుంది. పసుపుతో తయారైన హరిద్రాఖండం అనే మందును దీనికోసం వాడాలి.
పసుపు కండ్ల కలక వ్యాధిలో కూడా పని చేస్తుంది. ఒక భాగం పసుపు, 20 భాగాల నీటిలో మరిగించి వడబోసి చల్లారాకా ఈ చుక్కలు కంటిలో వేయాలి. దీని వలన కంటిపోటు, వాపు తగ్గుతుంది. కళ్లు తుడుచుకోవడానికి ఈ నీటిలో ముంచిన బట్టను వాడాలి.
దెబ్బలను, పుళ్లను మాన్పే ద్రవ్యాలలో పసుపు గురించి సుశ్రుతుడు పేర్కొన్నాడు. దీనితో తయారైన వ్రణశోధన తైలం పైపూతగా వాడుతారు. మొలలకు పసుపు, జెముడుపాలు కలిపి రాయాలి. దీనిని పరిశుద్ధమైన దారానికి పూసి శస్త్రవైద్యులు మొలలు, భగందర చికిత్సలో వాడుతారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top