You Are Here: Home » చిన్నారి » పరివర్తన

పరివర్తన

అనగనగా ఒక ఊరిలో శేషు అనే దొంగ ఉండేవాడు. అతను ఒక రోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్లాడు. కాపలాగా ఉన్న సైనికుల కళ్లు కప్పి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజు, రాణి నిద్రపోకుండా మాట్లాడుకుంటున్నారు. శేషుకి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనే కుతూహలం కలిగింది. ‘‘మహారాజా! మన కుమార్తె వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి’’ అని మహారాణి అడిగింది. ‘‘మహారాణీ! నదికి అవతల ఉండే ఊరిలో కొంతమంది పుణ్యపురుషులు ఉన్నారనే సంగతి మీకు తెలుసు కదా! వారు రేపు మన ఆస్థానానికి వస్తున్నారు. వారిలో ఒకరికి మన అమ్మాయినిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది కదా’’ అన్నాడు రాజు. అప్పుడు రాణి, ‘‘చాలా దివ్యంగా ఉంటుంది మహారాజా’’ అంది.

ఇదంతా చాటునుంచి వింటున్న శేషు, ‘‘నేను కూడా వారితో కలిసిపోయి రేపు వస్తే చాలా బాగుంటుంది’’ అనుకున్నాడు. అనుకున్నట్లే మరుసటిరోజు పుణ్యపురుషులతో కలిసి ఆస్థానానికి వచ్చాడు. ముం దుగా మంత్రి వచ్చి ‘‘యువరాణిని పెళ్లిచేసుకోవటం సమ్మతమేనా?’’ అని అక్కడ ఉన్న ఒక్కొక్కరినీ విడివిడిగా అడిగాడు. అందరూ తమ ఆశయాలకి వివాహం వల్ల ఆటంకం కలుగుతుంది, కాబట్టి వివాహం చేసుకోలేమని చెప్పారు. శేషు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు మంత్రి రాజు దగ్గరకు వెళ్లి ‘‘మహారాజా! వారిలో ఒక్కరిని మాత్రమే మనం వివాహానికి ఒప్పించగలం’’ అని చెప్పాడు.

అప్పుడు మహారాజే స్వయంగా శేషు దగ్గరకు వచ్చి ‘‘మహానుభావా! మీలాంటి వారితోనే మా కుమార్తె వివాహం జరిపించాలని మా కోరిక. దయచేసి ఈ వివాహానికి అంగీకరించండి’’ అని కోరాడు. మహారాజు చూపిస్తున్న మర్యాద శేషుకి ఆనందాన్ని కలిగించింది. ‘మంచివాడిగా నటిస్తేనే ఇంత ఆనందంగా ఉంది. నిజంగా మంచివాడిగా మారితే ఎంత బాగుంటుందో’ అనుకున్నాడు. ఆ క్షణం నుంచే శేషులో పరివర్తన ప్రారంభమయింది. ‘మోసం చేసి యువరాణిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు’ అని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరవాత దొంగతనాలు మానేసి ప్రజలందరికీ ఉపయోగపడే మంచిపనులు చేయటం ప్రారంభించాడు. అనతికాలంలోనే ఆ ప్రాంతంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top