You Are Here: Home » చిన్నారి » పనికిరాని చెట్టు

పనికిరాని చెట్టు

ఒక ఊరిలో రాజు, ప్రకాశ్ అనే ఇద్దరు స్నేహితులున్నారు. వాళ్లిద్దరూ ఒక రోజున వ్యాపార నిమిత్తమై పక్క ఊరికి ప్రయాణమయ్యారు. ఆ ఊరు తమ ఊరికి దగ్గరే కావడంతో వాళ్లు నడుచుకుంటూనే వెళ్లాలనుకున్నారు.

వాళ్లిద్దరూ మార్గమధ్యంలో ఉండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఆ స్నేహితులిద్దరూ పరుగెత్తి ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్లి నిలుచున్నారు. ఆ చెట్టు కొమ్మలు విశాలంగా, గుబురుగా చాలా దూరానికి విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు కింద నిలబడితే ఒక్క వాన చినుకు కూడా నేల మీదకు పడడం లేదు. వర్షం తగ్గేవరకు అక్కడే నిలుచుని, వర్షం తగ్గగానే వెళ్దామనుకున్నారు.

కాస్సేపటికి వర్షం తగ్గింది. అప్పటికి మధ్యాహ్న భోజన సమయం కావడంతో తమ వెంట తెచ్చుకున్న భోజనం మూటలను విప్పి అక్కడే భోజనం చేసారు. కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరుదామని ఆ చెట్టు కిందే నడుం వాల్చారు. రాజు పైకి చూస్తూ ‘‘ఈ చెట్టు ఏమి చెట్టు?’’ అని అడిగాడు.
‘‘ఏం చెట్టో ఏమో! కానీ ఈ చెట్టుకి పూలూ, పళ్లూ ఏమీ ఉన్నట్టు లేవే’’ అన్నాడు పరీక్షగా చూస్తూ ప్రకాశ్.
‘‘అవునవును, ఈ చెట్టుకి పూలూ, పళ్లూ లేవు. ఇది ఉత్త పనికిమాలిన చెట్టులా ఉంది. దీనివల్ల ఏమాత్రం లాభం లేదు’’ అన్నాడు రాజు.

ఈ మాటలు విన్న చెట్టుకి చాలా కోపం వచ్చింది. ఇంత వరకు తన దగ్గర ఆశ్రయం పొందిన వాళ్లు తమ అవసరం తీరిన తరవాత తననలా తూలనాడటం దానికి నచ్చలేదు. ‘‘నన్ను పనికిమాలిన చెట్టు అంటున్నారే. మిమ్మల్ని వర్షంలో గొడుగులాగా కాపాడింది, ఎండలో నీడనిచ్చేది, ఇప్పుడు మీకు చల్లని గాలిని ఇస్తోంది ఎవరు?’’ అని కోపంగా అడిగింది.

చెట్టు అలా ప్రశ్నించడంతో మిత్రులిద్దరూ ఆశ్చర్యపోయారు. తమ తప్పు తెలుసుకున్నారు. సిగ్గుతో తలవంచుకున్నారు.

నీతి: దేవుని సృష్టిలో అనవసరమైనది ఏదీ లేదు. అయితే ఒక్కొక్క దాని అవసరం ఒక్కొక్కసారి వస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top