You Are Here: Home » చిన్నారి » పండిత శంకరం

పండిత శంకరం

అనగనగా ఒక రాజ్యంలో శంకరం అనే యువకుడు ఉండేవాడు. అతడి పూర్వీకులంతా పండితులు. ఎప్పటికైనా తను కూడా అందరిలా పెద్ద పండితుడిని కావాలనే కోరిక ఉండేది. అందుకోసం సకల విద్యలు అభ్యసించాలనుకున్నాడు. కానీ దేనిమీదా శ్రద్ధ లేదు.

దాంతో ఏది చదివినా సరిగా ఒంటబట్టలేదు. పండిత వంశంలో పుట్టిన తమ కుమారుడు పండితుడు కాలేకపోయినందుకు శంకరం తల్లిదండ్రులు బాధ పడ్డారు. విద్య నేర్చుకోవటానికి శంకరాన్ని శంకరాన్ని పెద్దపెద్ద పండితుల దగ్గరకు పంపించినప్పటికీ చదువు మీద ఏకాగ్రత లేకపోవటంతో ఏమీ నేర్చుకోలేకపోయాడు. పండితుడిని కాలేకపోయాననే బాధ అతనిని నిరంతరం వేధించేది. ఓరోజు తన దిగులునంతా స్నేహితుడైన ఆనందం దగ్గర వెళ్లబోసుకున్నాడు.

ఆనందం శంకరంతో ‘‘పండితుడినని పిలిపించుకోవాలనే నీ కోర్కెను ఎలాగైనా తీరుస్తాను’’ అన్నాడు. ‘‘ఎలా వీలవుతుంది?’’ ఆశ్చర్యంగా అడిగాడు శంకరం. ‘‘నాతో రా’’ అంటూ పక్క గ్రామానికి తీసుకెళ్లాడు ఆనందం. అక్కడ ఒక మిఠాయి కొట్టులో బుట్టెడు లడ్డూలు కొని శంకరం చేతిలో పెట్టాడు. తను మాత్రం నాలుగు లడ్డూలు తీసుకుని, ‘‘నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను వెనక వస్తాను’’ అన్నాడు. స్నేహితుడు చెప్పినట్టే ముందు నడవడం మొదలుపెట్టాడు శంకరం.

అప్పుడు ఆనందం అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరికీ లడ్డూలు పంచుతానని పిలిచాడు. చాలామంది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ‘‘నా దగ్గర ఎక్కువ లడ్డూలు లేవు. కాని ముందు వెళ్తున్న నా స్నేహితుడి దగ్గర బోలెడు ఉన్నాయి. అతని పేరు పండితుడు.

మీరు అతన్ని పిలుస్తూ వెనకాలే వెళ్లండి. ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తాడు’’ అని చెప్పాడు. పిల్లలందరూ ‘‘పండితుడుగారూ… పండితుడుగారూ…’’ అంటూ శంకరం వెనక పడ్డారు. వారంతా అలా పిలవడంతో శంకరానికి చాలా సంతోషం కలిగింది. అన్ని లడ్డూలనూ పిల్లలకు పంచేశాడు. అది చూసిన ఆనందం ‘‘పిల్లలు కాసేపు ‘పండితుడు’ అన్నందుకే నీకు ఇంత సంతోషం కలిగింది. నువ్వు శ్రద్ధగా విద్య నేర్చుకొని పండితుడివైతే నువ్వే కాక నీ వాళ్లు కూడా ఎంత సంతోషంగా ఉండవచ్చో ఆలోచించు’’అని హితబోధ చేశాడు. స్నేహితుని మాటల్లోని నిజాన్ని గ్రహించిన శంకరం పట్టుదలతో, ఏకాగ్రతతో తిరిగి చదువు ప్రారంభించాడు. ఆ తర్వాత కొంతకాలానికి నిజంగానే పండితుడయ్యాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top