You Are Here: Home » చిన్నారి » కవితలు » నెత్తావి మేఘం

నెత్తావి మేఘం

ఊహల సింగారాన్ని ఆపినప్పుడల్లా
ఊపిరాడనట్టుంటుంది
జన్మజన్మాలుగా రక్తంలో పారుతూ వస్తున్న
పురావైభవాల సౌరభాల గనిని
తవ్వి ఎటో తరలించినట్టూ
యోజనాల దూరం విసిరేసినట్టూ
ఖాళీ తనాన్ని కప్పుకుని

మనసు మొత్తం దివాలా తీసినట్టూ
కలతగా కష్టంగా వుంటుంది
అలంకృత ఊహల పల్లకిని
కోల్పోయిన జీవన ప్రాంగణం
బోసితనంతో బొక్కబోర్లా పడ్డట్టూ ఉంటుంది
ఊరవతలి చవుడు దిబ్బలా
హృదయంలో దిగాలుతనం మేట వేసినప్పుడు
ఊహా ప్రవాహాల మత్తడితోనే
ఊపిరాడని తనానికి సమాధి

నెచ్చెలిలా నెనరును కురిసే నెత్తావి మేఘమా
పచ్చని పైరుల మీంచి హాయిని మోసుకొచ్చే
పైరగాలి రాగమా
నిన్ను వొదిల్తే నాలో
నిలువెల్లా డొల్లతనమే
నువ్వు సమకూర్చే భావుకతా ధనమే
నిత్యజీవన సార్థక్యానికి పరాకాష్ఠ

సింగిడుల కోసం
సీతాకోక చిలుకల కోసం
నిత్యం తహతహలాడే నాకు
అనివార్య సామగ్రివి నువ్వు
అత్యవసర సరుకువు నువ్వు

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top