You Are Here: Home » చిన్నారి » నుదుటిన మంచి రాత ఉంటుంది!

నుదుటిన మంచి రాత ఉంటుంది!

ఎచ్చమ్మ నుదుటిన దేవుడు రాత సరిగ్గా రాయలేదని అందరూ అనుకున్నారు. ఆ పిల్ల పుట్టడమే పాడు నక్షత్రంలో పుట్టింది. పుట్టాక తల్లిని కబళించింది. తండ్రి
కాశిరెడ్డికి అందుకనే కూతురంటే భయం. రోత. అసహ్యం. కాని తన కడుపునే కదా పుట్టింది. అందుకే బావిలో పడేయలేక పాలమూరులో తెలిసినవాళ్లకు పెంచుకోవడానికి ఇచ్చాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు.
బిజినపల్లెలో పెత్తనం చలాయిస్తూ ఉన్నాడు.

కాశిరెడ్డి- దొర. ఊరు అతడి మాట జవదాటడానికి లేదు. మాలీ, పోలీసు, వతన్లు… కుక్కినపేన్లల్లే ఉండాలి తప్ప ఎదురు చెప్పడానికి లేదు. అలాంటి దొరతో, అన్నతో సంబంధం కలుపుకోవాలని చెల్లెలు ముత్యాలమ్మకు ఆశ. ప్రతి సంకురాత్రికీ కొడుకు
రఘునాథరెడ్డిని తీసుకొని నెలరోజుల పాటు అన్న ఇంట్లోనే ఉండి పోతుంది. వచ్చిన ప్రతిసారీ ఒకటే పాట. అన్నా- మనది రక్తసంబంధము. ఈ సంబంధం కొనసాగాలె. నీ బిడ్డల్లో ఒకదాన్ని నా కొడుక్కు యివ్వు.
తల్లిగారింటితో సంబంధం కలుపుకోవాలని ఆడపిల్లకు ఉంటుంది. అత్తగారింట నామాట కూడా చెల్లుబాటవుతుంది- అని.

కాశిరెడ్డి కాదనేదేముంటుంది? రెండోభార్యకు పుట్టిన నీలినిచ్చి చేస్తానులే అని మాట ఇచ్చాడు.
కాని- ఎచ్చమ్మకు తొమ్మిదేళ్లు నిండేసరికి అచ్చు తండ్రి నోట్లో నుంచి ఊడిపడినట్టు తయారైంది.
పెద్ద పెద్ద కళ్లు… విశాలమైన నుదురు… రంగు… కళ…. కాశిరెడ్డి పేషీకనో మొకద్దమాకనో పాలమూరు పోయినప్పుడల్లా- మనసులాగి- ఎచ్చమ్మను చూసుకొని వస్తుంటాడు. ఈసారి అతడు వచ్చినప్పుడు
ఏమనుకుందో ఏమో పిల్ల తండ్రి దగ్గరకు వెళ్లి భుజాలను పట్టుకొని ఊపుతూ నాయనా…. అని ప్రేమగా
పిలిచింది. అంతే. తండ్రి మనసు నీరయ్యింది. ఇంక నిన్ను వదిలి ఉండనమ్మా ఎచ్చాలూ అని వెంటనే ఇంటికి తెచ్చుకున్నాడు. చెల్లెలి కొడుక్కి ఎచ్చమ్మను ఇస్తే బాగుంటుందని అనుకున్నాడు. తొమ్మిదేళ్ల
ఎచ్చమ్మ- పన్నెండేళ్ల రఘునాధరెడ్డి… వాళ్ల జంట బాగుంటుంది.

చెల్లెలు ఈ నిర్ణయానికి మొదట కలవరపడింది. పాడు నక్షత్రంలో పుట్టిన పిల్లను నా కొడుక్కి ఇచ్చి చేస్తాడంటున్నాడేంది కాశిరెడ్డన్న అనుకుంది మనసులో. కాని, అన్న అధికారంతో డబ్బు హోదాలతో తనకు పని. పిల్లతో ఏం పని అని సర్ది చెప్పుకుంది.
సంకురాత్రి వచ్చింది. అందరూ కాశిరెడ్డి ఇంటికి చేరారు. పిల్లలతో బంధువులతో ఇల్లు కళకళలాడిపోతోంది. ఆడవాళ్లు సకినాలు అరిసెలు చేస్తూ అడావిడిగా ఉంటే పిల్లలు ఆటల్లో పడ్డారు. వాళ్లందరిలోకెల్లా ఎచ్చమ్మే హుషారు. పాలమూరులో ఇంగ్లీషు బడిలో చదివిందా పిల్ల. అందుకే నెలల పేర్లు ఇంగ్లీషులో రఫ్ఫరఫ్ఫా చెబుతుంది. రఘునాథరెడ్డి పంజుమ్ జమాత్ చదువుతున్నాడు. ఉర్దూ తప్ప ఇంగ్లీషు రాదు. అందువల్ల వాడికి ఎచ్చమ్మ చదువు మీద మోజు పుట్టింది.

ఎచ్చా… నాకు అంగ్రేజీ నేర్పవే… అని అడిగితే ఎచ్చమ్మ కిలకిలా నవ్వి నేర్పుతానుగాని నాకు రేగుపండ్లు కోసివ్వు బావా అని గారం చేసింది. లంకంత ఆ బంగ్లాకి పాడుబడ్డ దొడ్డి ఒకటి ఉంది. ఆ వైపున యాప, చింత, తుమ్మ… ఎన్ని చెట్లున్నా పిల్లల నోరూరించేలా నిండా కాయలు ఉండే ఒక రేగి చెట్టు కూడా ఉంది. ప్రస్తుతం దాని ఒంటి నిండా రేగుపండ్లు కాసి ఉన్నాయి. అయితే ఆ వైపున ఉన్న పెద్దబావిలో ఎవరో పడి చచ్చారు గనుక పిల్లల్ని అటు పోనివ్వడం లేదు పెద్దవాళ్లు.

కాని ఇవాళ ఆ నిషిద్ధమార్గానికి ఎచ్చమ్మ సిద్ధమైంది. రఘునాథరెడ్డీ సరేనన్నాడు. రేగు పండ్లు కోయడానికి ముందే మొండి గోడ మీద కూచుని ఎచ్చి అంగ్రేజీ నెలల పేర్లు చెబుతుంటే రఘునాథరెడ్డి పెద్ద పెద్దగా ఆ నెలల పేర్లని వల్లె వేస్తున్నాడు. ముత్యాలమ్మకు ఈ సంగతి తెలిసింది. కొడుకు ఇంగ్లీషు చదువుతున్నాడని సంబరపడినా- అంతలోనే అనుమానం వచ్చి-
వేలెడంత లేదు పోరి, ఇప్పుటి నుంచే కాబోయే మొగుణ్ణి అదుపాజ్ఞల్లో పెడుతోందే అని కలవరపడిపోయింది.
అది అన్నాల సమయం. ఎచ్చమ్మ, రఘునాథరెడ్డి రేగుచెట్టు ఎక్కి చాలినన్ని కాయలు తిని, మరిన్ని కాయలు కోసుకొని తిరిగి చెట్టు దిగే పనిలో ఉన్నారు. ముందు రఘునాథరెడ్డి దూకాడు. ఎచ్చమ్మకు దూకడానికి రావడం లేదు. దూకితే పరికిణి చిరిగిపోతుందేమోనని భయం.

రఘునాథరెడ్డికి ఆలోచన వచ్చింది. వాడు గబుక్కున చెట్టు మొదలులో వొంగి, ఎచ్చా… మరేం భయం లేదు… ఒక కాలు నా వీపు మీద పెట్టి దిగు అంటున్నాడు.
అప్పుడే ఆ సాయంత్రానికి వేటకూర సిద్ధం చేసేందుకు కటికోడు వచ్చి అది చూశాడు. కొడుకును అన్నానికి పిలిచేందుకు వచ్చిన ముత్యాలమ్మ కూడా అది చూసింది. అంతే. ఆమెకు తల కొట్టేసినట్టయ్యింది. హవ్వ… ఇదేమి చోద్యం… ఇదేమి బద్నాం… ఈ పోరి ఇప్పుడే పోరణ్ణి కర్రికుక్కను చేసి తిప్పుతోంది. ఈ సంగతి ఇప్పటికే కటికోడు చూశాడు. ఇక నలుగురికీ తెలిస్తే ఎంత అప్రదిష్ట2 ఎంత నామర్దా? అమ్మో… అమ్మో… ఇప్పుడే ఇలా ఉంటే ఈ పోరి రేపు కోడలై ఇల్లు చేరిందంటే…

ముత్యాలమ్మ గుండెలు దబదబా బాదుకుని కొడుకు చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్లి దివాను పీట మీద భోజనానికి కూచుంటున్న కాశిరెడ్డితో – అన్నా. నీకూ నీ సంబంధానికి దండం. తల్లిగారింటికి వెయ్యి దండాలు. పిల్లల పెళ్లి మాట మర్సిపో… అని అప్పటికప్పుడు సవారీ కట్టించుకొని ఊరు బయలు దేరింది.
కాశిరెడ్డికి మనసు విరిగిపోయింది. అన్నం తినకుండా చేయి కడుక్కుని, పెళ్లాన్ని కేకేసి, ఈ పెళ్లి సంబంధం వద్దు ఎచ్చాల్ని మళ్లీ పాలమూరు పంపించెయ్యి అనేసి బయటకు వెళ్లిపోయాడు.
అలాగని నిర్ణయం అయిపోయింది.
అయితే- ఆ ఒక్క నిర్ణయంతో ఆ పిల్ల భవిష్యత్తులో శుభోదయం సంభవించింది.
కథ ముగిసింది.

నిజానికి ఈ కథంతా ఒకెత్తు. ముగింపు వాక్యం ఒక్కటీ ఒకెత్తు. మనం సంబంధం తప్పిపోవడం చూసిఅసలే రాత బాగలేని పిల్లకు ఇట్లా ఆయెనే అనుకుంటాం. కాని, ఆ సంబంధం తప్పిపోవడమే ఆ పిల్లకు మేలు అని రచయిత్రి మనకు కొత్త దృష్టిని ప్రసాదిస్తుంది. నిజమే. అసలే ఎచ్చి మేనత్తకు ఇష్టంలేని పిల్ల. పాడు నక్షత్రంలో పుట్టిన పిల్ల. మేనత్త రాజీపడి కొడుకుకు ఇచ్చి చేసినా వెళ్లిన రోజు నుంచీ నరకమే కదా. పిల్లలు సరదాగా ఆడుకుంటేనే సహించలేకపోయిందే రేపు కూర్చున్నా నిలుచున్నా దగ్గినా తుమ్మినా రాచి రంపాన పెట్టదా? దేవుడు ఇదంతా ఆలోచించి పోనీలే పాపం అని రేగుచెట్టును వంకగా పెట్టి ఆ సంబంధం తప్పించాడు. ఆ తర్వాత ఆ పిల్ల వేరెవరినో చేసుకుని సుఖపడి ఉంటుంది.
పి.యశోదారెడ్డి 1973లో రాసిన మంచి కథ ఇది. మంచి నక్షత్రంలో పుట్టిన కథ కూడా.

– సాక్షి ఫ్యామిలీ

పి.యశోదారెడ్డి: తెలంగాణ భాషను, మాటను స్వాభావికంగా చేసుకొని రచనలు చేసిన ప్రసిద్ధ రచయిత్రి. 1950ల కంటే ముందే కథలు రాశారు. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వీరి ప్రసిద్ధ గ్రంథాలు. స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా. ఉస్మానియా తెలుగు ప్రొఫెసర్‌గా పని చేశారు. కీర్తిశేషులు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top