You Are Here: Home » చిన్నారి » కథలు » నీలిపావురం

నీలిపావురం

kathaనీలం రంగు పావురం గుర్‌… గుర్‌… మంటూ శబ్ధం చేసింది.
భోజనం చేసి చేయి కడుక్కంటూ చూసాడు కిషన్‌. ‘ఆకలి మీదున్నట్టుంది’ అనుకొని కొన్ని గింజలు చల్లాడు. పావురం తినసాగింది.
ఎక్కువ తిన్నట్టున్నాడు. ఆయాసపడుతూ ముందు గదిలోకి వచ్చి టి.వీ. చూడసాగాడు.
మధ్నాహ్నం ఆఫీసుకు లంచ్‌ బాక్స్‌ పట్టుకెళతాడు. భార్యకు పూజలు, వ్రతాలు ఎక్కువ. తనకు ఇద్దరూ అమ్మాయిలే. పెద్దమ్మాయి ఇంజనీరింగ్‌ చదివి పెళ్ళికి సిద్దంగా వుంది.
చిన్నమ్మాయి ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరంలో వుంది. పెద్ద అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి. ఎన్ని సంబంధాలు చూ సిన కుదరడం లేదు. అందుకోసం భార్య పెద్దమ్మతల్లికి మొక్కి రెండు కిలోల కోడిని కోసిం ది. అందుకే సెలవు పెట్టి ఇంట్లోనే వున్నాడు.

నిద్రవస్తున్నట్టు వుండడంతో కూర్చీలోనే… అలా… అలా… చిన్న కునుకు తీయాబోయాడు… ఇంతలో…
‘పోస్ట్‌’… అని అరిచినట్టు వినపడింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. వెళ్ళి చూస్తే పోస్ట్‌మన్‌ నీలం రంగు ఇన్‌లాండ్‌ లెటర్‌ను ఇస్తూ… ‘‘అబ్బా..! ఎన్ని రోజులయింది సార్‌..! ఇన్‌లాం డ్‌ లెటర్‌ను ఇచ్చి’’ అన్నాడు. పోస్ట్‌మన్‌ కళ్ళలో మెరుపు… తడి… ఆనందం…
కిషన్‌ మెహంలో కుతూహలం… ఏమీ అర్థం కాకుండా వుంది. ఉత్తరం ఏంటి… తనకు రావడం ఏంటి…
ఉత్తరాలు అందుకొని… చదివి… ఏళ్ళు దా టింది. ఇప్పుడు ఉత్తరాలు రాస్తున్నదెవరు..? సెల్‌ఫోన్‌లు… ఈ మెయిల్‌ వచ్చి కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఎలక్ట్రానిక్‌ అయి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ కేవలం చిట్‌ఫండ్‌ రిసీట్‌లు, షేర్‌ మార్కెట్‌ సర్టిఫికెట్లు, ఫోన్‌ బిల్లులు బట్వాడా చేసే సంస్థగా మారిపోయి ఉనికి కోసం పోరా టం చేస్తుంటే, తనకు ఉత్తరం వ్రాసిందెవరబ్బా..! అని ఆశ్చర్యంగా చూశాడు. చించి చదవడం మొదలుపెట్టాడు.

ప్రియమైన… చిన్ననాటి స్నేహితుడు కిషన్‌కు… నేనురా… ఎవరనుకున్నావు… పురుషోత్తం గాడినిగా గుర్తుపట్టావా…
గుర్తుపట్టాడు… జ్ఞాపకం వచ్చింది. నలభై అయిదు సంవత్సరాల క్రితం బడిలో చేరిన మొదటిరోజు భయపడుతూ… ఏడుస్తుంటే పురుషోత్తం గాడు వచ్చి తన భుజం మీద చెయ్యివేసి చొరవగా తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పి… తనతో స్నేహం చేసి ఇద్దరూ ఒకటిగా… ఒకటి నుండి పది వరకూ కలిసి చదువుకున్నారు.

గడిచిపోయిన ఆ రోజులు గుర్తు చేసుకున్నా డు. మనసు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఉద్వేగానికి లోనైనాడు. చిన్న పిల్లోడయిపోయి కళ్ళ ముందు బాల్యాన్ని చూడసాగాడు. ఆనందాన్ని, భావోద్వేగాన్ని ఆపుకోలేక… దుఃఖాన్ని గొంతులోనే బందించివేసాడు. ఎపుడో ముప్పయి సంవత్సరాల క్రితం ఒకసారి కలిసినపుడు అడ్రస్‌లు ఇచ్చుకున్నారు. చా లా రోజులు ఉత్తరాలు ఇద్ద రి మధ్య నడిచాయి. మెల్లగా ఆగిపోయాయి.
పురుషోత్తం ఉత్తరం లో తన అడ్రస్‌ ఫోన్‌నెంబర్‌ రాసాడు. ఆగలేక ఫోన్‌ చేద్దామని ప్ర యత్నించాడు… ఎందుకో… ఒక్కసారి ఆగిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాడు న న్ను గుర్తు చేస్తూ ఉత్తరం వ్రాసి విస్మయానికి గురిచేసాడు. ఇప్పుడు వాడు ఎలా వుండి వుం టాడు… ఉహించని షాక్‌ ఇవ్వాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
‘‘చిన్నప్పటి ఫ్రెండ్‌తో గోలీకాయలాడి వస్తారా ఏంటి?’’ భార్య పరిహాసం చేసింది. కిషన్‌ పట్టించుకోలేదు. ‘‘ఏంటి…! నాన్న ఈ చాదస్తం’’ కూతురు అడిగింది. వినలేదు.

పురుషోత్తం కుటుంబం కోసం నేతి మిఠాయిలు, చేకోడీలు, బాదాం హల్వ కొని పురుషోత్తం వుంటున్న ఊరిలో దిగాడు.
అది చిన్న టౌన్‌ అనుకున్నాడు. నగరంగా వేగంగా రూపుదిద్దుకుంటుంది.
ఈ నగరంలో పురుషోత్తం ఇల్లు ఎలా పట్టా బ్బా..! అనుకొని తిరిగాడు. ఫోన్‌ చేస్తే వచ్చి తీసుకెళతాడు. అదికాదుగా తన వుద్దేశ్యం.
ఇంతలో సంకలో సంచి వేసుకుని వెళుతున్న ఒక వ్యక్తికి అడ్రస్‌ చూపించి పురుషోత్తం గురించి ఎంక్వరీ చేశాడు. అతను కిషన్‌ను ఎగాదిగా, పరిశీలనగా చూసి, కిషన్‌ వివరాలు తెలుసుకుని దగ్గరలోని బేకరీ షాపుకు తీసుకెళ్ళి కూల్‌డ్రింక్‌ ఇప్పించి ఎంతో కావలసినవాడుగా మాట్లాడ సాగాడు.
‘‘అతను పురుషోత్తం బంధువు కావచ్చు’’ అనుకొని ఓపికగా మాట్లాడాడు కిషన్‌.

సంకలోని బ్యాగ్‌ తెరిచి అందులోంచి కొన్ని రంగుల రంగు ల బ్రోచర్లు తీసి కిషన్‌ చేతిలో పెట్టాడు. అవి రియల్‌ ఎస్టేట్‌ బ్రోచర్లు… అత ను రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌. వీరావేశంతో ఆ వెంచర్‌ గురించి, అందులో పెట్టుబడి పెడితే కలిగే లా భం గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పసాగాడు.
కిషన్‌ రెండు చేతులు జోడించి, బ్రతిమాలి, కూల్‌డ్రింక్‌ డబ్బులు తానే ఇచ్చి బతుకు జీవుడా అని బయటపడ్డాడు. ఇక లాభం లేదనుకొని తిరిగి, తిరిగి ఇల్లు పట్టుకున్నాడు.
మధ్యతరగతి ఇల్లు, అందంగా, పొందికగా, ర కరకాల పూల మొక్కల మధ్య, వేపచేట్టు నీడ లో ఆశ్రమంగా వుంది. ఎర్రగులాబి గాలికి వూగుతూ స్వాగతం చెప్పింది. జామచేట్టు మీ ద రామచిలక జాంపండు చిలక్కొట్టుడు కొట్టుకుంటూ లోనికి రమ్మనట్టు రెక్కలు ఆడించింది.
ఇలాంటి వాతావరణం చూసి ఎన్ని ఏళ్ళు అయిం దనుకొని మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.
ముందు గదిలో ఒక ప్రక్కన అమ్మాయి కంప్యూటర్‌ ముందు కూర్చుని ఏదో పని చేసుకుంటుంది. అలికిడికి చూసింది.

‘‘పురుషోత్తం’’ అని అనుమానంగా మెల్లగా గొణికాడు.
ఇదే ఇల్లు అన్నట్టు తల ఆడించింది.
నీ పని కానివ్వు అన్నట్టు సైగతో చెప్పి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి దూరాడు.
అమ్మాయి ‘‘ఏంటి! ఇతని వాలకం’’ అన్నట్టు అనుమానంగా లేచింది.
పురుషోత్తం నేలమీద కూర్చోని చేతిలో వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్నాడు. అతని భార్య పచ్చి కొబ్బరి తరుగుతోంది.
‘‘చిన్నపుడు మీ నాన్న కూడా ఇలాగే ఇంటి పనులు చేసేవాడు’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు కిషన్‌.
ఒక్కసారిగా ఎవడురా అన్నట్టు అయోమయంగా, ఆశ్చర్యంగా, ఆసక్తిగా, పరిశీలనాగా చూసాడు పురుషోత్తం.

గుర్తుపట్టాడు. సర్‌ఫ్రైజ్‌, షాక్‌… కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు.
‘‘కిషన్‌ని రా…’’
‘‘కిషన్‌… నువ్వా…’’ అని ఒక్కసారి గబ్బుక్కున లేచి కౌగిలించుకున్నాడు.
ఇద్దరూ ఆనందంగా చిన్న పిల్లలుగా కేరింతలు కొట్టసాగారు.
పురుషోత్తం భార్య, కూతురు వీరి వాలకం చూసి ‘‘ఏమిటి విడ్డూరం’’ అని ఆశ్చర్య పడసాగారు.
భార్య, కూతురికి కిషన్‌ను పరిచయం చేసి కిషన్‌ గురించి చెప్పి, తన చిన్ననాటి ముచ్చ ట్లు అన్ని గుర్తుచేసుకున్నాడు.
కిషన్‌ తాను తెచ్చిన మిఠాయి, చేగోడీలు వారికి ఇచ్చి నమస్కారం పెట్టాడు.
వేన్నీళ్ళతో స్నానం చేశాడు కిషన్‌.

ఇద్దరూ జామచెట్టు క్రింద చాపపరుచుకుని చల్లగా కూర్చున్నారు. చెట్టు మీద రామచిలక కొట్టిన జాంపండు క్రిందపడింది. సగం, సగం చేసుకుని తింటూ ఇష్టాగోష్టిగా చిన్నతనంలోని జ్ఞాపకాలు గుర్తుచేసుకోసాగారు.
ఇద్దరూ ఎలావుండేవారో ఒకరికొకరు గుర్తుచేసుకున్నారు. తమ గురించి తాము తెలుసుకొని ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇలా మాట్లాడుకొని ఎన్నో సంవత్సరాలైనట్టుందనుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మనసులో బందిగా వున్న భావాలు, బాధలు స్వేచ్ఛగా బయటకు తెచ్చారు. ఇద్దరూ స్థిమితపడ్డారు.
తన పిల్లల గురించి మాట్లాడుకొనసాగారు. కిషన్‌ తన అమ్మాయిల గురించి చెప్పి, వారి పెళ్ళి చేస్తే తన బరువు భాద్యత తీరుతుందని ఆందోళనగా చెప్పాడు.
పురుషోత్తం తన కొడుకు హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌అని, మంచి జీతం వస్తుంద ని, కూతురు డిగ్రీ చదువుతుందని చెప్పాడు.

ఇద్దరూ జీవిత విశేషాలు మాట్లాడుకుంటుం డగా, సడన్‌గా కిషన్‌కు ఒక ఆలోచన వచ్చిం ది. తన కూతురును పురుషోత్తం కొడుక్కు ఇచ్చి పెళ్ళి చేస్తే… రామచిలక రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయింది. వెంటనే కిషన్‌ తన మనసులోని మాటను ఆశగా ఆడిగాడు.
ఆశ్చర్యపడిన పురుషోత్తం చూద్దాం లేరా అన్నాడు తెలికగా. ‘‘నీకేమయినా అభ్యంతరం అయితే చెప్పరా…’’
‘‘అభ్యంతరం ఎందుకుంటుందిరా.’’
‘‘మరి ఎందుకా అనుమానం’’
‘‘అనుమానం కాదురా పెళ్ళంటే నూరేళ్ళ పంట సడన్‌గా అనుకుంటే అవుతుందా’’.
‘‘కట్నం గురించే కదరా నీ డౌటు…
‘‘ఆలులేదు చూలులేదు… నువ్వు కట్న కానుకల వరకూ వెళ్ళావా…’’
‘‘నా కూతుర్ల కోసం బాగానే సంపాదించానురా’’ ఈ రోజుల్లో పెళ్ళి చేయాలంటే ఎంతెంత కట్న కానుకలివ్వాలి నాకు తెలుసురా….’’
‘‘నిజమే… ఇలా సడన్‌గా నువ్వు నేను అనుకుంటే సరేనా…’’
‘‘నీ ఇల్లు… కటుంబం… సంప్రదాయం అన్ని బావున్నాయిరా…’’

‘‘బావుంటాయిరా… కానీ అమ్మాయ, అబ్బాయి లకు ఒకరికొకరు నచ్చాలిగా…’’
‘‘నా కూతురు చక్కని చుక్క డౌట్‌ లేదు…’’
‘‘నా కొడుకు కత్తి…’’
‘‘మరింకేం చేసేద్దాం…!’’
‘‘అలా తొందరపడకు’’
‘‘పెళ్ళి కెదిగిన కూతురు వుంటే తెలుస్తుంది రా నీకు…’’
‘‘నీకేవుంది పెళ్ళికెదిగిన కూతురు’’
‘‘నా సమస్య నీకర్దకావడం లేదురా..ఎన్ని సంబం ధాలు చూసిన నా కూతురుకు నచ్చడం లేదు.’’
‘‘ఎవరినైనా ప్రేమించిందేమో’’
‘‘ఛ… ఛ… అలాంటిది కాదురా…’’

‘‘ఈ రోజుల్లో పిల్లలు లవ్‌లెటర్లు రాసుకోవడం లేదు.. యస్‌.యం.యస్‌.లు ఇచ్చుకుంటున్నారు’’
‘‘ఇంతకు ముందు చూసిన సంబందాల్లో అబ్బాయిలు నచ్చక వద్దంది. అంతే’’
‘‘మరి నా కొడుకు నచ్చుతాడంతావా’’
‘‘తప్పకుండా… నేను మేనేజ్‌ చేస్తా… మంచి సంబంధం అసలు మనం కలిసింది ఇలా జరగడానికే అనుకుంటూ లేకపోతే నువ్వు ఉత్తరం రాయడమేమిటో, నేను రావడమేమిటో సరే నా కొడుక్కి నచ్చితే నాకేం ప్రొబ్లం లేదు. ఓ.కే.నా…’’
‘‘అబ్బా..! సంతోషం అయితే ఒక చిన్న పని చేయ్యరాదు. నువ్వు నీ కటుంబం వచ్చే అదివారం మా ఇంటికి రండి. అందరం

కలుద్దాం. పిల్లా, పిల్లాడు కలిసి మాట్లాడుకుంటా రు. నచ్చితే సరే…’’
‘‘సరే… అలాగే చేద్దాం..!’’
‘‘అయితే మరి నేను బయలుదేరుతా…’’
‘‘భోజనం చెయ్యవా..?’’
‘‘అమ్మో…! కతికితే అతకదు ముందు, ముందు కలుస్తాం కదా…!’’
‘‘నువ్వు భోజనం చెయ్యకపోతే… నా పెళ్ళాం నాకు భోజనం పెట్టదు. ముందు తిందాం పదా…’’
‘‘అబ్బా’’..!
‘‘నువ్వేం టెన్షన్‌ పడుకు… నేనున్నాను కదరా…’’ ‘‘సరే’’
అయిష్టంగానే, భయం భయంగా భోజనం చేసి, రేపటి ఆదివారం అందరూ రావాలని మరి మరి చెప్పి వెళ్ళాడు.

ఇంటికి వచ్చిన కిషన్‌ ఖుషీ ఖుషీగా వున్నాడు. ఆనందం తో తాండవం చేశాడు. భార్య మెచ్చుకుంది, ముద్దాడింది. ఈ సంబంధం కుదిరితే పెద్దమ్మతల్లికి పొట్టేలును కోస్తానని మొక్కుకుంది.
ఆదివారం ఎప్పడోస్తుందా అని ఇంటిల్లిపాది ఇంటిముందు నిలబడి ఎదురుచూశారు.
ఆదివారం నాడు పురుషోత్తం కుటుంబం పేరంటానికి వచ్చినట్టు వచ్చారు.
కిషన్‌ కుటుంబం అతిధులను ఆహ్వానించా రు. ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పరిచయస్తుల్లా కలిసిపోయారు.
కిషన్‌ ఇల్లు, ఇంటిల్లిపాది పురుషోత్తంకు నచ్చారు.
పురుషోత్తం కొడుకు రవి కిషన్‌ కుటుంబానికి నచ్చాడు.
పిల్లలంతా ప్రేమగా మాట్లాడుకున్నారు, పెద్దలు కబుర్లు చెప్పుకున్నారు.

కిషన్‌ తన ఆస్తిపాస్తుల గురించి, కట్నకానుకుల గురించి విడమర్చి చెప్పాడు. పురుషోత్తం తృప్తి చెందాడు.
పెళ్ళి పేరంటాలు ఎప్పుడు ప్రారంభిద్దాం అని పెద్దలు చర్చించడం మొదలుపెట్టారు.
ఇంతలో కిషన్‌ కూతురు మాధవి రవిని బయటకు వెళదారం అని పిలిచింది.
కాబోయే మొగుడిని అప్పుడే కొంగున ముడేసుకుంటుందని చిలిపిగా అనుకున్నారు
అందరు.
ఇద్దరూ కాఫీషాప్‌లో కూర్చోని కాఫీ తాగుతూ…
‘‘మీరు అందంగా వున్నారు. మంచివాడిలాగా కనబడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా మంచి శాలరీ వస్తుందనుకుంటా…’’
మాధవి మాటలు విని రవి గర్వంగా ఫీల్‌ అయ్యాడు…

‘‘నాకు చాలా హ్యాపీగా వుంది’’.
ఆనందపడ్డాడు రవి.
‘‘కానీ…’’ మెల్లగా నసిగింది మాధవి.
కంగారుగా చూశాడు రవి.
‘‘నేను… నా క్లాస్‌మట్‌ సతీష్‌ను ప్రేమించాను…’’
ఊరుముతో కూడిన పిడుగు నెత్తిన పడినట్టు గాబరా పడ్డాడు రవి.
‘‘అతనికి కూడా నేనంటే చచ్చేంత ప్రేమ…’’
కరెంట్‌ షాక్‌ కొట్టినట్లు జల్లు మన్నది రవి శరీరం.
‘‘ఇంట్లో ఈ విషయం తెలియదు. చెప్పాలం టే భయంగా ఉంది. చెప్పినా వాళ్ళు ఒప్పుకో రు. అందుకే చూసిన సంబంధాలన్ని చెడగొట్టాను. మిమ్మల్ని నచ్చలేదనే అవకాశం లేదు’’.
పిచ్చి పట్టినట్టు వినసాగాడు.

‘‘దయచేసి మీరు ఏమీ అనుకోకుండా నాకో సాయం చేయ్యగలరా…’’
‘‘చెప్పు’’ కోపాన్ని ఆపుకుంటూ అన్నాడు.
‘‘నా ప్రేమ వ్యవహారాన్ని మీరే సెటిల్‌ చేసి నా పెళ్ళి జరిపించాలి…’’
‘‘నేనేం చేయ్యాలి..’’
‘‘మా నాన్నతో జాగ్రత్తగా మాట్లాడి ఓప్పించాలి’’.
రవికి ఏం చేయ్యాలో పాలుపోవడం లేదు… ఏంటి గోల తండ్రి బలవంతం చేసి ఏవేవో చెప్పి తీసుకొచ్చాడు. తనకు తలనొప్పి తెచ్చి పెట్టాడు.
‘‘నేను మెంటల్‌గా టార్చర్‌ అనుభవిస్తున్నాను… చచ్చిపోతాను…’’
మెహానికి చేతులను అడ్డం పెట్టుకుని ఏడుస్తుంది. కళ్ళలోంచి నీళ్ళు జలజలా రాలుతున్నాయి.
ఒకక్షణం రవి కంగారుపడి ఓదార్చాడు…

‘‘మీరే ఏదో ఒకటి చేసి నా సమస్యను సెటిల్‌ చెయ్యాలి…’’ ఏడుస్తూనే మాట్లాడుసాగింది.
‘‘అలాగే… చేస్తాను. మందు నువ్వు ఏడుపు ఆపు… ప్లీజ్‌’’ అని బ్రతిమాలాడు.
కొద్ది సేపటికి దుఃఖాన్ని ఆపి, కళ్ళు తుడుచుకుంది.
రవి సతీష్‌ గురించి వివరాలు అడిగాడు. అన్ని వివరాలు చెప్పింది.
రవి మాధవి పెళ్ళికి కావలసిన సాయం చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
‘‘పద… వెళదాం’’. అని ఇంటికి బయలు దేరారు.
ఇంట్లో అందరూ వేడి వేడి టీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
రవి మెల్లగా తండ్రిని పిలిచి జాగ్రత్తగా మాధవి ప్రేమ విషయం చెప్పాడు.
హై వోల్టేజి షాక్‌ కొట్టినట్టు కొయ్యబారిపోయాడు పురుషోత్తం. ఒళ్ళంతా ఎన్నో రోజులు నిరహార దీక్ష చేసినంత నీరసపడింది.

దేవుడా…! ఏంటి నాకీ శిక్ష… ఎందుకు నాకీ పరీక్ష… నేనేం పాపం చేశాను… ఇప్పుడు ఏం చేయ్యాలి. కిషన్‌ గాడికి ఈ విషయం ఎలా చెప్పాలి..?
పురుషోత్తంకు ఒళ్ళంతా వణుకు పుట్టసాగింది. రవి తండ్రికి ధైర్యం… మెల్లగా కిషన్‌ను బయటకు పిలిచి… విషయమంతా జాగ్రత్తగా చెప్పాడు.
కిషన్‌ మెదడు మెద్దు బారిపోయింది. ఒక్కక్షణం ఏమీ అర్థంకాకుండా… శరీరం చల్లబడిపోయింది. పిచ్చి చూపులు చూడసాగాడు. పురుషోత్తం కిషన్‌ మోహం మీద నీళ్ళు చల్లి కూర్చోబెట్టాడు.
కిషన్‌ భార్యకు విషయం తెలిసి గుండెలు బాదుకుంటూ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడిచినట్టు ఏడవసాగింది.
రవికి విషయం పూర్తిగా అర్థమయ్యింది. కొద్ది సేపటివరకు ఆనందంగా కల కలలాడిన ఇల్లు క్షణకాలంలో విషాదంగా మారింది.

మధ్యతరగతి, సాంప్రదాయ కుటుంబాల్లో అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందంటే ఆ కు టుంబ ఎందుకో కానీ తట్టుకోలేదు. అందరూ తప్పుచేసిన వాళ్ళుగా ఫీల్‌ అవుతారు.
రవి రంగంలోకి దిగి కిషన్‌ దంపతులను ఓదార్చాడు. కిషన్‌ భార్య కూతురును ఎందుకు కన్నానని తల బాదుకోసాగింది. కూతురు ఛస్తే పీడవిరగడయ్యేదని శాపనార్థాలు పెట్టసాగింది.
రవి కిషన్‌ దంపతులకు ధైర్యం చెప్పాడు. మాధవి ప్రేమించిన సతీష్‌ కూడా తన లాగే చదువుకున్నవాడేనని, మంచి కుర్రాడని, అన్ని విషయాలు తాను మాట్లాడతానని, మాధవి పెళ్ళి చేసే భాద్యత తన భుజస్కందాలపై వేసుకున్నాడు.
పోషించబోయే పాత్ర తారుమారయింది. రవి మాధవికి అన్నలాగా పెళ్ళి పెద్దగా తిరిగి మాధవి ప్రేమించిన సతీష్‌ కుటుంబాన్ని కలిసి ఒప్పించి ఇద్దరి పెళ్ళి చేశాడు.
మాధవి సంతోషించింది.

కిషన్‌ మాత్రం సంతోషంగా లేడు. పురుషో త్తం ధైర్యం చెప్పాడు. పెళ్ళిసందడి ముగిసిన నాలుగు రోజుల తరువాత కిషన్‌ పురుషోత్తంతో…
‘‘ఓరేయ్‌… ! నా పెళ్ళి సంబంధం మా తల్లిదండ్రులు చూశారు. వాడికి నచ్చి నాకు సరైన భార్య అవుతుందని ఎంతో ఆలోచించి నా పె ళ్ళి చేశారు. నేను సంతోషంగా వున్నాను. మ రి నా కూతురు ఎందుకు ఇలా చేసిందిరా…!’’ అని నిర్వేదంగా పురుషోత్తంను అడిగాడు.
‘‘కాలం కలికాలం ఒకేలా వుండదురా..! అప్పట్లో కుటుంబాలు కలిసిమెలిసి జీవనం సాగించేవారు. ఒకరికి ఒకరు ప్రతీ ఒక్కరూ పరస్పరం కలిసి దూరదృష్టితో, వివేకంగా ఆలోచింది ఒక నిర్ణయం తీసుకునేవారు. ఆ నిర్ణయం ఎప్పుడు కరెక్ట్‌గా వుండేది. ఇప్పుడు ఎవ్వరికి వారే యమునా తీరు అన్నట్టు వారికి నచ్చితే చాలు ప్రపంచంతో పనిలేదు. నీ కూతురు కొంత నయం లేచిపోయి పెళ్ళి చేసుకోలేదు… సంతోషం. కొంతమంది లేచిపోయి పెళ్ళి చేసుకుని కన్నవారికి కడుపుకోత రగుల్చుతున్నారు. నువ్వు ఈ విషయంలో అదృష్టవంతుడివి రా…’’ అన్నాడు పురుషోత్తం…
కిషన్‌ ఏమీ మాట్లాడలేదు…

– అల్లం శశిధర్‌,
సెల్‌: 98490 75672.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top