You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » నరహంతక నియంత

నరహంతక నియంత

నరహంతక నియంత
నరహంతక నియంత
ఆత్మవిశ్వాసం లేని భయస్థుల ప్రతీకార భావనే ద్వేషం.
ఎవరన్నారీ మాట? జార్జి బెర్నార్డ్ షా.
యూదులపై హిట్లర్ ద్వేషభావం కూడా ఇలాంటిదే.
పిచ్చుక రెట్ట వేసినందుకు మొత్తం పక్షి జాతినే ద్వేషించాడు హిట్లర్!
తల టోపీ గాలికి పడిపోతే మొత్తం పంచభూతాలనే ద్వేషించాడు హిట్లర్.

అరవై లక్షల మంది అమాయక యూదులను గ్యాస్ చాంబర్లలో
అమానుషంగా, ఘోరాతి ఘోరంగా చంపి
గుట్టలుగా పోసిన హిట్లర్ మళ్లీ ఇప్పుడు టాపిక్ అయ్యాడు!
రేపు అతడి డెత్ డే!! అయితే అది కాదు విశేషం.
67 ఏళ్లుగా నిషేధంలో ఉన్న హిట్లర్ ఆత్మకథ ‘మీన్ కేంఫ్’ను
జర్మనీ ప్రభుత్వం… పిల్లల పాఠ్యాంశాలలో చేర్చబోతోంది!!
ఏమిటీ విపరీత ధోరణి?
కొత్త సిలబస్ చదివి కొత్త హిట్లర్‌లు తయారవరని గ్యారంటీ ఏమిటి?
అసలేమిటి హిట్లర్ క్యారెక్టర్? ఇదే ఈవారం బయోగ్రఫీ.

1945 – జర్మనీ. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక – వేసవిలో ఒక రోజు.
అమెరికన్ సైనికులు ఇల్లిల్లూ వెదకుతున్నారు. హిట్లర్‌తో సంబంధం ఉన్న ఏ ఒక్క జర్మన్ జాతీయుడినీ వారు వదలిపెట్టదలుచుకోలేదు. ఆధారం దొరికితే అరెస్ట్ చేస్తున్నారు. దొరక్కపోతే ఒక చెంప దెబ్బ కొట్టైనా అక్కడి నుంచి కదులుతున్నారు!
మ్యూనిచ్ నగరానికి పశ్చిమంగా ఉన్న ఒక చిన్న గ్రామంలోకి ప్రవేశించారు కొందరు సైనికులు. అక్కడ వారికి హ్యూగో జేగర్ అనే వ్యక్తి ఎదురయ్యాడు.
‘‘ఏయ్… నీ ఇల్లెక్కడ?’’ అని అడిగారు.
‘‘రండి, తీసుకెళ్తాను’’ అన్నాడు జేగర్!
అతడికి తెలుసు… వాళ్లను ఇంటికి తీసుకెళ్లాక ఏం జరుగుతుందో. మూలమూలలా గాలిస్తారు. తనెవరో తేలిగ్గా తెలిసిపోతుంది. సైనికులలో ఆవేశపరులెవరైనా ఉంటే అక్కడిక్కడ తనని కాల్చి చంపుతారు. వాళ్లలో ఒకళ్లిద్దరైనా ఆలోచనాపరులుంటే ట్రక్కులోకి ఎక్కించుకుని వెళ్తారు. తర్వాత ఏం చేస్తారన్నది తర్వాతే తెలియడం.
ఒకవేళ సైనికులను ఇంటికి తీసుకు వెళ్లకపోయినా దాదాపుగా ఇలాగే జరుగుతుంది.

నువ్వు జర్మన్‌వే కదా అంటారు. తను అవునంటాడు. ఇల్లు చూపించమంటారు. తనకు ఇల్లే లేదంటాడు. ఇల్లు లేని వాడు, హిట్లర్ లేని దేశంలో బతికుండీ ప్రయోజనం ఏమిటని అడుగుతారు. ఊహించని క్షణంలో వాళ్లలో ఒకడు తనని షూట్ చేస్తాడు.
అయితే జేగర్ తన చావును వాయిదా వెయ్యదలచుకున్నాడు. తన దగ్గర ఇంకా ఒక ఫుల్‌బాటిల్ బ్రాందీ మిగిలే ఉంది. ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానితో కలిసి ఆ రాత్రి అతడు మద్యం సేవించాలి. ముందు రోజు ఖరారు చేసుకున్న కార్యక్రమం అది. అదృష్టం బాగుంటే కార్యక్రమం ప్రారంభమౌతుంది. లేదంటే దురదృష్టం తనని ట్రక్కులో మోసుకెళుతుంది, ఫుల్ బాటిల్‌ని యజమానికి వదిలేసి.

‘‘ఈ తోలు సంచిలో ఏముందో తెరువు’’ – తుపాకీ మడమతో సంచిని పొడిచాడొక సోల్జర్.
తీసి చూపించాడు జేగర్.
లోపల బ్రాందీ బాటిల్!. దాని పక్కనే ‘పుట్-అండ్-టేక్’ గేమ్ ఆడుకోడానికి కావలసిన సామగ్రి. అడుగున ఏవో కొన్ని ఫొటో స్లయిడ్స్. సైనికులు ఆ స్లయిడ్స్‌ని పట్టించుకోలేదు. బాటిల్ ఓపెన్ చేసి, గేమ్ ఆడడం మొదలుపెట్టారు!
ప్రాణం ఉసూరుమంది జేగర్‌కి. ప్రాణం పోవడం కన్నా, ప్రాణం ఉసూరుమనడం నయమనిపించి మౌనంగా ఉన్నాడు.
సైనికులు తాగుతున్నారు. పుట్-అండ్-టేక్ ఆడుతున్నారు. మధ్య మధ్యలో జేగర్‌ని ఆరా తీస్తున్నారు.
‘‘ఊ… ఇక్కడేం చేస్తుంటావ్?’’
‘‘ఉద్యోగం వెదుక్కుంటున్నా. మ్యూనిచ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నాకొక ఫ్లాట్ ఉండేది. యుద్ధం దానిని కూలగొట్టేసింది. ఇక్కడొచ్చి ఉంటున్నాను.’’
‘‘ఇది నీ ఇల్లు కాదా? ముందే ఎందుకు చెప్పలేదు?!’’
‘‘చెబితే వింటారా?’’
‘‘నిజమే. మీ జర్మన్‌లను నమ్మేందుకు లేదు. కిరాతకుడైన హిట్లర్‌ని ఆరాధించినవారు కదా!’’
సైనికులు బయల్దేరారు. వాళ్లలో ఒకడు తూలి సంచి మీద పడ్డాడు. సంచిని ఒక బండ బూతు తిట్టాడు. అంతేతప్ప బోర్లించి చూడలేదు.
జేగర్ బతికిపోయాడు!

సంచిలోనీ ఫొటో స్లయిడ్స్ బయటికి తీసి తక్షణం వేరే చోటికి తరలించాడు. అదొక్కటే కాదు, ఇంట్లో ఇంకా చాలా సంచులున్నాయి. వాటినీ తరలించాడు. అన్నిట్లోనూ కలిపి రెండువేల వరకూ స్లయిడ్స్!
అవన్నీ హిట్లర్ ఫొటోలు!! హిట్లర్‌ను అతడు తీసిన కలర్ ఫొటోలు.
జేగర్ ప్రముఖ ఫొటోగ్రాఫర్. హిట్లర్‌కు నచ్చిన ఫొటోగ్రాఫర్! 1939 ఏప్రిల్ 20 న హిట్లర్ యాభయ్యవ జన్మదిన వేడుకల్ని బెర్లిన్‌లో భారీ ఎత్తున ఏర్పాటు చేసినప్పడు ఒక్క జేగర్‌కు మాత్రమే హిట్లర్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అప్పుడు తీసినవే ఆ స్లయిడ్స్‌లోని ఫొటోలు.
1945లో యుద్ధం ముగిశాక పదేళ్ల పాటు వాటిని స్విస్ బ్యాంకులో దాచి ఉంచి, 1955లో బయటికి తీసి ‘లైఫ్’ పత్రికకు అమ్మేశాడు జేగర్.
‘లైఫ్’ వాటిలో కొన్ని ఫొటోలను 1970 ఏప్రిల్ సంచికలో ప్రచురిస్తూ – ‘మామూలుగా అయితే ఏమంత అభిమానించని వ్యక్తుల కోసం మేమింత స్థలాన్ని కేటాయించడం జరగదు’ అని వ్యాఖ్యానించింది!

2012 – జర్మనీ – ఏప్రిల్ నెల.
జర్మనీలో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలున్నాయి. ఇప్పుడు వాటి మధ్యకు ఓ పిల్ల పార్టీ చేరబోతోంది! పేరు : ‘పైరట్స్ పార్టీ’. గత వారం జరిగిన ఒపీనియన్ పోల్ లో ఈ పిల్లపార్టీకి అనూహ్యంగా మూడో ర్యాంక్ వచ్చింది! అంటే – వచ్చే ఏడాది పార్లమెంటులోకి ప్రవేశించబోతోంది. పైరట్స్ పార్టీ ఇంటర్నెట్ ఫ్రీడమ్ కోసం పోరాడుతుంటుంది. దాని బాస్ డెలియస్. అతడి వయసు 29. ఓపీనియన్ పోల్ ఫలితాలు విన్నాక డెలియస్ సంతోషంతో ఊగిపోయాడు.

‘‘1928-33 మధ్య హిట్లర్ ‘నాజీ’ పార్టీ ఎంత వేగంగా పెరిగి పెద్దదయిందో, అంతేవేగంగా మేమిప్పుడు పెద్దవాళ్లం అవుతున్నాం’’ అన్నాడు. ఈ పోలిక ప్రపంచానికి కోపం తెప్పించింది. మాటను వెనక్కి తీసుకోవాలని జర్మనీలోని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. డెలియస్ వెంటనే సారీ చెప్పుకున్నాడు. పైరట్స్ పార్టీ కార్యవర్గం హుటాహుటిన సమావేశమై ఇంకెప్పుడూ హిట్లర్‌తో పోలిక పెట్టుకోకూడదని తీర్మానించింది.

వాస్తవానికి పైరట్ పార్టీ తను ఉన్న ఉత్సాహంలో నాజీ పార్టీతో పోల్చుకోవడం తప్పేమీ కాదు. హిట్లర్ అసాధారణంగా ఎదిగినవాడు. పార్టీ పెట్టాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో అతడికి 19,18,300 ఓట్లు పడ్డాయి. అప్పుడతడు జైల్లో ఉన్నాడు. అయినా అన్ని పడ్డాయి. ఆ తర్వాత 1930లో జర్మనీ అర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో హిట్లర్‌కు 64 లక్షల 9 వేల ఓట్లు వచ్చాయి! 1932లో అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలబడినప్పుడు అతడికి కోటీ 37 లక్షల 45 వేల 800 ఓట్లు పోలయ్యాయి. జర్మనీ ఛాన్స్‌లర్ ఎన్నికల్లో కోటీ 72 లక్షల 77 వేల ఓట్లు సాధించాడు.

మరి పోల్చుకుంటే తప్పెలా అవుతుంది? తప్పే.
హిట్లర్ అనేక విధాలుగా గొప్పవాడు. కానీ మనిషిగా అన్ని విధాలా అధముడు. అందుకే ఏ సభ్య సమాజమూ, ఏ నాగరిక సమాజమూ అతడిని అంగీకరించదు. చరిత్రను నమోదు చెయ్యడం తప్పనిసరై ‘లైఫ్’ పత్రిక అతడి ఫొటోలను విధిలేక ప్రచురించిందన్నా, పైరట్స్ పార్టీ పోలికపై ప్రపంచం విరుచుకుపడిందన్నా ఇదే కారణం.
హిట్లర్ అరవై లక్షల మంది యూదుల్ని చంపించాడు! ఒక జాతిని తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా జీవించాడు. ఆ క్రమంలో తన సైనికులనూ చంపుకున్నాడు. శత్రు సైనికులకు చిక్కకుండా భార్యనూ చంపాడు. చివరికి తనను తానే పిస్తోలుతో కాల్చుకుని చనిపోయాడు.
ఇలాంటి మనిషిని ఏమనాలి?
ఏమైనా అనొచ్చు. ‘మనిషి’ అని మాత్రం అనకూడదు.
మనిషి కాకపోతే మరేమిటి హిట్లర్?

హిట్లర్ క్యారెక్టర్‌ని ఎనలైజ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వేల పుస్తకాలు, లక్షల వ్యాసాలు వచ్చాయి. వాటన్నిటినీ కాల్చి బూడిద చేస్తే భూమికి తలంటి స్నానం చేయించినట్లే. హిట్లర్ లాంటి మనిషి భూమికి భారమని చెప్పడం ఇందులోని అంతరార్థం కాదు. చనిపోయాక కూడా హిట్లర్ జ్ఞాపకాలు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని.
బతికుండగా హిట్లర్ ప్రపంచానికి అర్థంకాలేదు. చనిపోయాకా అర్థం కావడం లేదు! సైకియాట్రిస్టులు అతడి స్వభావాన్ని తమకు చాతనైనంత వరకు విశ్లేషించి చేతులెత్తేశారు. కొందరు ఏవో ఊహల్ని అల్లి ప్రచారంలోకి తెచ్చారు.
ఒకటి మాత్రం నిజం. హిట్లర్ లాంటి వాడొకడు… పుట్టడమే హిట్లర్‌గా పుట్టి ఉండడు. పుట్టాక హిట్లర్‌గా తయారయ్యాడంటే దానిక్కారణం అతడొక్కడే అయి ఉండడు. ఏదో జరిగుండాలి. ఏం జరిగింది?

అలాయెస్ హిట్లర్. ఫాదర్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్!
అదేమిటి? సన్నాఫ్ అని కదా చెప్పాల్సింది!!
అవును అలాగే చెప్పాలి. కానీ అలాయెస్‌కు తన తండ్రెవరో తెలీదు. స్కూల్ సర్టిఫికెట్‌లో కూడా తండ్రి పేరు లేదు. తల్లి పేరొక్కటే ఉంది.
ఒకవేళ అలాయెస్‌కు తండ్రెవరో తెలిసి ఉన్నా అప్పుడు కూడా అతడు ఫాదర్ ఆఫ్ హిట్లర్‌గానే గుర్తింపు పొందేవాడు. హిట్లర్ జీవించి ఉన్న కాలంలో జర్మనీకి గానీ, జర్మనీ ప్రజలకు గానీ ప్రత్యేక గుర్తింపు లేదు. కంట్రీ ఆఫ్ హిట్లర్, పీపుల్ ఆఫ్ హిట్లర్. అలాగే ఫాదర్ ఆఫ్ హిట్లర్. మదర్ ఆఫ్ హిట్లర్.
హిట్లర్‌ది జర్మనీ కాదు! ఆ పక్కన ఆస్ట్రియా-హంగేరి. అక్కడి ఒక పల్లెలో పుట్టాడతడు. హిట్లర్‌కి మూడేళ్ల వయసులో అలాయెస్ తన కుటుంబాన్ని జర్మనీకి తరలించాడు. ఆరుగురు పిల్లల్లో నాల్గవ వాడు హిట్లర్. మొదటి ముగ్గురూ పసికందులుగా చనిపోయారు. హిట్లర్ తర్వాతివాడు ఎడ్మండ్…. హిట్లర్‌కు పదకొండేళ్లప్పుడు పొంగు వ్యాధితో చనిపోయాడు. ఊహ వచ్చాక హిట్లర్ చూసిన తొలి మరణం అది. చిన్నారి తమ్ముడు తన కళ్లముందే చనిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు హిట్లర్. ఎవరి మీదో తెలియని కోపంతో పెంకి పిల్లవాడయ్యాడు. తండ్రికి ఎదురు తిరిగేవాడు. స్కూల్లో టీచర్లకు తిరుగు సమాధానాలు ఇచ్చేవాడు. తండ్రి అతడిని తరచు కొట్టేవాడు. స్కూల్లో టీచర్లు కొట్టేవారు. వచ్చి తల్లికి చెప్పుకునేవాడు. ‘‘నాన్న మాట వినాలి’’ అని చెప్పేవారు ఆవిడ. ‘‘ఎందుకు వినాలి?’’ అని అడిగేవాడు. ‘‘నీ మంచి కోసం’’ అని చెప్పేవారు ఆవిడ. ‘‘మరి స్కూల్లో టీచర్లు కొట్టేది కూడా నా మంచి కోసమేనా?’’ అని అడిగేవాడు. ‘‘అవును. నీ భవిష్యత్తు కోసం’’ అని తల్లి సమాధానం.

హిట్లర్… తల్లిని ప్రేమించాడు కానీ, తల్లి మాటల్ని విశ్వసించలేదు. కొట్టినవాడిని తిరిగి కొట్టడమే న్యాయం అనుకున్నాడు. కానీ తండ్రిని కొట్టలేడు. టీచర్లను కొట్టలేడు. మరి ఆ కోపం ఎవరిపై చూపించాలి. తోటి ిపిల్లలు దొరికారు. హిట్లర్‌కి కొట్లాటలంటే ఆసక్తి. మనుషులు గొడవపడుతుంటే అక్కడికి వెళ్లి నిలబడేవాడు. దేశాలు యుద్ధం చేసుకుంటుంటే ఆ విశేషాలు చెప్పమని తల్లిని పీక్కుతినేవాడు.
హిట్లర్ అతి దగ్గరగా చూసిన రెండో మరణం తన తండ్రిది. తమ్ముడు చనిపోయిన మూడేళ్లకు తండ్రీ చనిపోయాడు. కానీ తమ్ముడు చనిపోయినప్పుడు పడినంత బాధ… తండ్రి చనిపోయినప్పుడు పడలేదు.

తండ్రంటే కోపం, తల్లంటే అంటే ప్రేమ. ఇదీ అప్పటి హిట్లర్ మానసిక స్థితి. భర్త ఆసరా పోయాక క్లారాకు తన కొడుకు గురించి బెంగ పట్టుకుంది. అతడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనుకున్నారు. మంచి స్కూల్లో చేర్పించారు. అక్కడా హిట్లర్ తిన్నగా లేడు. అతడి ప్రవర్తన నచ్చక పోవడంతో స్కూల్ యాజమాన్యం అతడిని తీవ్రంగా మందలించింది. కోపం పట్టలేకపోయాడు హిట్లర్. తప్పతాగి స్కూల్‌కి వెళ్లి తన స్కూల్ సర్టిఫికెట్‌ని పరపరా చింపేశాడు. ఆ ముక్కల్ని టాయ్‌లెట్ పేపర్‌గా ఉపయోగించాడు! అది స్కూల్ డెరైక్టర్ కంట్లో పడింది. అప్పటికప్పుడు రిజిస్టర్‌లోంచి హిట్లర్ పేరును తొలగించి ఇంటికి పంపేశాడు.

హిట్లర్‌కి పెయింటర్ అవ్వాలని కోరిక! అయితే వియెన్నాలోని ‘అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ అతడికి సీటివ్వలేదు. రెండుసార్లు ప్రయత్నిస్తే రెండుసార్లూ తిరస్కరించింది. ఆర్ట్ కాదు కానీ, ఆర్కిటెక్ట్‌వి కమ్మని ఎవరో సలహా ఇచ్చారు. ఆర్కిటెక్ట్ స్కూలు అతడిని చేర్చుకుంటానంది కానీ, హైస్కూల్ సర్టిఫికెట్ తెమ్మంది. అలా ఆ కోరికా తీరకుండా పోయింది. అప్పటికి హిట్లర్ వయసు పద్దెనిమిదేళ్లు.

ప్రపంచం ఎందుకనో అతడికి నచ్చడం లేదు. మాటిమాటికీ అతడికి ఈ ప్రపంచంపై కోపం వస్తోంది. ఇష్టమైన పనిని చెయ్యడానికి ఇన్ని ప్రతిబంధకాలేమిటని అతడి కోపం. సరిగ్గా ఆ సమయంలో హిట్లర్ తల్లి చనిపోయారు. నలభై ఏడేళ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ ఆవిణ్ణి తీసుకుపోయింది. హిట్లర్ తట్టుకోలేపోయాడు. ‘‘అమ్మా…’’ అని పెద్దగా ఏడ్చాడు. ఈ ప్రపంచంలో అతడు ప్రేమించే ఏకైక వ్యక్తి తల్లి. ఆమెని కోల్పోయాక హిట్లర్ ఒంటరివాడయ్యాడు. డబ్బు లేదు. ఉద్యోగం లేదు. ఉండేందుకు వియన్నాలో ఇల్లు లేదు. అనాథాశ్రమం దిక్కయింది.

ప్రపంచాన్ని ద్వేషించిన హిట్లర్, ప్రపంచంలోంచి యూదులను వేరు చేసి మరీ ప్రత్యేకంగా ద్వేషించడం ఈ దశలోనే మొదలైంది. ఆస్ట్రియాలో సంక్షోభం తలెత్తితే అందుకు కారణం యూదులేనని హిట్లర్ భావించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికీ యూదులే కారణమని నమ్మాడు. హిట్లర్ క్రైస్తవమత విశ్వాసి. యూదుల్ని, యూదు జాతిని ద్వేషించిన వాడే నిజమైన క్రైస్తవుడని ప్రబోధించినవారిని అతడు అమితంగా ప్రేమించాడు. బాల్యం నుంచి యుద్ధాలపై ఉన్న మక్కువ, యవ్వనంలో యూదులపై మొదలైన ద్వేషం రెండూ కలిసి హిట్లర్‌ని మిలటరీ జీవితం వైపు లాగాయి.

మొదట అతడు బవేరియన్ ఆర్మీలో సిపాయిగా చేరాడు. బవేరియా… జర్మనీలోని ఒక రాష్ట్రం. తర్వాత ఫ్రాన్స్, బెల్జియంల సైనిక పటాలాలలో పని చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన 1914లో ఆ ఒక్క ఏడాదే నలభై వేల మంది సైనికులు మరణించారు. హిట్లర్ సేనాపతిగా ఉన్న దళంలో మొత్తం 250 మందికి గాను 42 మంది సైనికుల ప్రాణాలు మాత్రమే మిగిలాయి. మరణాల సంఖ్యతో నిమిత్తం లేకుండా హిట్లర్ సమర్థుడైన దళపతిగా పేరుమోశాడు! రెండు బ్రేవరీ అవార్డులు సాధించాడు. మొదటిది ఐరన్ క్రాస్ సెకండ్ క్లాస్.

రెండోది ఐరన్ క్రాస్ ఫస్ట్ క్లాస్. యుద్ధం కొనసాగుతున్న సమయంలో 1916లో సొమ్మె నది ఒడ్డున హిట్లర్ గాయపడ్డాడు. అందుకతడికి ‘ఊండ్ బాడ్జ్’ లభించింది. ఈ పురస్కారాలన్నీ హిట్లర్‌కి కిక్ ఇచ్చాయి. అయితే యుద్ధం ముగిసే సమయానికి 1918లో శత్రుదేశ సైనికులు ప్రయోగించిన మస్టర్డ్ గ్యాస్ కారణంగా అతడు తాత్కాలిక అంధత్వానికి గురయ్యాడు. కొన్నాళ్లు వైద్య శిబిరంలో ఉన్నాడు. తిరిగి బైటికి వచ్చాక కళ్లు తెరిచి జర్మనీని నిశితంగా పరిశీలించాడు. యుద్ధంలో ఓడిపోయి, తీవ్రంగా గాయపడి రక్తం వోడుతోంది జర్మనీ. హిట్లర్ మనస్సులో తళుక్కున ఏదో మెరిసింది. జర్మనీని కాపాడేందుకే తను పుట్టానని అనుకున్నాడు!

హిట్లర్‌కి జీవితంలో అనేక అనుభవాలున్నాయి. అన్నిటి కన్న గొప్ప అనుభవం వార్‌ఫీల్డ్. కమాండింగ్ ఆఫీసర్లు తన సాహసాన్ని పొగిడినప్పుడు హిట్లర్‌కు లేనిపోని యుద్ధాలన్నీ చెయ్యాలనిపించేది. యుద్ధం పూర్తయ్యాక కూడా అతడు చాలాకాలం పాటు ఆర్మీలోనే ఉండిపోడానికి అదొక కారణం. 1919-1920 మధ్య ‘జర్మన్ వర్కర్స్ పార్టీ’లో సభ్యుడిగా ఉన్నప్పుడు అతడికో ఆలోచన వచ్చింది, తనే ఒక పార్టీని ఎందుకు పెట్టకూడదు?! వర్కర్స్ పార్టీలోని కొన్ని అత్యున్నతస్థాయి పెద్ద తలకాయలు అతడికి గెడైన్స్ ఇచ్చాయి. ఎలా డ్రెస్ చేసుకోవాలి? ఎలా స్పీచ్ ఇవ్వాలి, పెద్దవాళ్లతో ఎలా పరిచయాలు పెంచుకోవాలి? అనే విషయాలపై అవగాహన తెప్పించాయి.

అలా 1920లో నాజీ పార్టీ పుట్టింది. హిట్లర్ చనిపోయే వరకు ఆ పార్టీ ఉంది.
నాజీ పార్టీ అధినేతగా బవేరియన్ రాజధాని మ్యూనిచ్‌లో హిట్లర్ ఇచ్చిన ప్రసంగం జర్మనీని కుదిపేసింది. జర్మనీతో పాటు, ప్రపంచంలో ఉన్న యూదులందర్నీ భయభ్రాంతుల్ని చేసింది. కొద్ది సమయంలోనే హిట్లర్ ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఆవేశపూరిత ప్రసంగాలకు శిక్షగా జైలుపాలు కూడా అయ్యాడు. అక్కడా అతడికి విశేష ఆదరణ లభించింది. జైలు గార్డులు అతడికి సెల్యూట్‌లు కొట్టారు. జైల్లో ఉన్నా బయట ఉన్నట్లే అతడు అన్ని సదుపాయాలూ అనుభవించాడు. జైలు గదిలోనే తన ఆత్మకథ ‘మీన్ కేంఫ్’ రాశాడు. వెనువెంటనే అది 2 లక్షల 40 వేల కాపీలకు పైగా అమ్ముడయింది. తర్వాత కోటి కాపీలు!

హిట్లర్‌కి ఇప్పుడు అధికారం కావాలి. సైనికుడిగా, సేనాపతిగా, రాజకీయ వక్తగా, జర్మనీ రక్షకుడిగా అతడికి రావలసినంత పేరు వచ్చేసింది. దాంతో పూర్తిస్థాయి పాలిటిక్స్‌లోకి వచ్చేశాడు. ఓట్ల వర్షం కురిసింది. మొదట జర్మనీ ఛాన్స్‌లర్ అయ్యాడు. తర్వాత జర్మనీ నియంత అయ్యాడు.
హిట్లర్ నియంత అయ్యాక జర్మనీలోని రాజకీయ పార్టీలన్నిటినీ రద్దు చేశాడు. దేశంలో ఉన్నదీ, ఇక ఉండవలసిందీ ఒకటే పార్టీ… అది నాజీ పార్టీ అని ప్రకటించాడు. అధికారాలన్నీ తన దగ్గరే ఉంచుకున్నాడు. ఖాళీ అయిన స్థానాలను భర్తీ చెయ్యకుండా వదిలేశాడు. జర్మనీ పేరు మాత్రం మారలేదంతే. మిగతా అంతా హిట్లర్‌మయం!

హిట్లర్ పాలనలో జర్మనీ జాతకం మారిపోయింది. కొత్త పరిశ్రమలొచ్చాయి. కొత్త ఉద్యోగాలు పుట్టాయి. నిరుద్యోగం లేదు. నీరసం లేదు. ఎక్కడ చూసినా పనులే. డ్యామ్‌లు, రైల్‌రోడ్‌ల నిర్మాణాలే. జనం ఇంత తిని ఇంత వెనకేసుకుంటున్నారు. మధ్యమధ్యలో హిట్లర్ వస్తున్నాడు. కుటుంబ జీవితం ఎంత విలువైనదో ప్రసంగించి పోతున్నాడు. బతకడానికి పని కావలసిందే. అలాగని పనిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని అంటున్నాడు. మగాళ్లు ఖాళీగా ఉండడం ఎంత తప్పో, ఆడవాళ్లు ఇల్లొదిలి పని కోసం బయటికి రావడం అంత తప్పని చెబుతున్నాడు. పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చెయ్యడమే స్త్రీల ప్రధానం ధ్యేయం కావాలని ప్రబోధిస్తున్నాడు. హిట్లర్ ఆరాధ్యుడయ్యాడు.

హిట్లర్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవాడు. మధ్యలోనే స్కూల్ మానేసినవాడు. ఒకపూట తిండి కోసం తిప్పలు పడినవాడు. జైల్లో గడిపినవాడు. ఇంత పెద్ద ప్రపంచంలో తనకంటూ ఒక్క సే్నిహ తుడైనా లేనివాడు. ఆలాంటి వ్యక్తి లక్షలాది జర్మన్‌లకు నేషనల్ హీరో అయ్యాడు. కానీ ఆ హీరోలో ఒక విలన్ ఉన్నాడు. ఆ విలన్‌కు రెండు ధ్యేయాలున్నాయి. ఒకటి: ఈ భూమండలంపై ఒక్క యూదుడైనా మిగలడానికి లేదు! ఇంకొకటి: జర్మనీని మించిన సైనిక శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండేందుకు లేదు!

యూదులను పథకం ప్రకారం తుడిచిపెట్టేందుకు ‘గెస్టాపో’ అనే ఒక సీక్రెట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు హిట్లర్. జర్మన్ యూదుల బ్రతుకును దుర్భరం చెయ్యడం గెస్టాపో ప్రధాన లక్ష్యం. అంతేకాదు, తన ఆత్మకథ ‘మీన్ కేంఫ్’లో హిట్లర్ ఏవైతే భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నాడో వాటన్నిటినీ ప్రభుధర్మంగా ఆచరణలోకి తేవడం కూడా గెస్టాపో పనే.

మరోవైపు – మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందాలన్నిటినీ హిట్లర్ ఉల్లంఘించడం మొదలుపెట్టాడు. జర్మనీకి గానీ, జర్మనీ ప్రజలకు గానీ ఏ చిన్న బాధ కలిగినా, నష్టం జరిగినా అందుకు యూదులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాడు!

హిట్లర్ ఎందుకింత క్రూరంగా మారిపోయాడు? చరిత్రకారులు తెలుసుకోలేపోయారు. హిట్లర్ తరచు కడుపునొప్పితో, దురదలు పుట్టించే చర్మవ్యాధితో బాధపడేవాడని, అతడి అమానుష నిర్ణయాలు, కర్కోటక ఆదేశాలు, ఘోరమైన చర్యల వెనుక వీటి ప్రభావం ఉంటే ఉండొచ్చని ఒక అంచనా.

శుభ్రమైన, ఆరోగ్యవంతమైన, అన్ని విధాల బలమైన ఒక ఆర్యన్ జర్మనీ జాతిని హిట్లర్ తయారు చెయ్యాలనుకున్నాడు. అందుకోసం మారణహోమానికి పాల్పడ్డాడు. ‘బతకడానికి అనర్హులు’ అనిపిస్తే చాలు వాళ్లను చంపించేవాడు. ముఖ్యంగా పిల్లలు! వాళ్లలో అంగవైకల్యంకానీ, బుద్ధిమాంద్యం కానీ కనిపిస్తే గెస్టాపో కాల్చి చంపేది. ఈ వికలాంగులు పెరిగి పెద్దయితే జర్మనీకి చెడ్డపేరని హిట్లర్ భయం. ఒక్కో దేశాన్ని ఆక్రమించుకోవడం, ఎదురు తిరిగివారిని మృత్యుశిబిరాల్లో పడదోసి హతమార్చడం హిట్లర్ పాలసీ అయింది.

సొంత దేశంలో కూడా తనను వ్యతిరేకించినవారిని, తన ఆదేశాలను పాటించనివారిని, కాళ్లూచేతులు, ముక్కూముఖం సరిగా లేనివాళ్లని, హోమో సెక్సువల్స్‌ని, మానసిక రోగులను, యుద్ధ ఖైదీలను, వృద్ధులను… ఇలా సుమారు కోటీ నలభై లక్షలమందిని చంపించాడు. వారిలో అరవై లక్షల మంది యూదులే!
సరిగ్గా ఆ సమయంలో… హిట్లర్‌లో సామ్రాజ్య విస్తరణ కాంక్ష చిగురించింది! బ్రిటన్, ఫ్రాన్స్‌ల మీద యుద్ధానికి సిద్ధంగా ఉండమని సైనిక దళాలకు వర్తమానం పంపాడు. ఇక్కడే అతడు పెద్ద పొరపాటు చేశాడు. ఎంతసేపూ జర్మనీ బలాలను చూసుకుని మురిసిపోయాడే తప్ప బలహీనతలను పట్టించుకోలేదు.

జర్మనీకి కోటిమంది సైనికులున్నారు. వేలాది వైమానిక బలగాలున్నాయి. వందల యుద్ధట్యాంకులు ఉన్నాయి. జలాంతర్గాములు ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా పొడవాటి తుపాకులున్నాయి. గుట్టలు గుట్టలుగా ఇతర మారణాయుధాలున్నాయి. ఇన్ని ఉన్నా జర్మన్ దగ్గర ఆయిల్ లేదు. ముఖ్యమైన ముడి సామగ్రి లేదు. జర్మనీకి వీటిని సరఫరా చేస్తూ వస్తున్న దేశాలు ఒకమాట మీద నిలబడి సప్లయ్ ఆపేస్తే చాలు యుద్ధంలో జర్మనీ ఓడిపోతుంది. ఆ విషయం గ్రహించలేకపోయాడు హిట్లర్.

హిట్లర్‌ని ఎప్పుడూ ఒక భయం వెంటాడుతుండేది. తను త్వరగా చనిపోతానేమోనని! నిజానికి అతడి భయం వేరు. తను చనిపోతే తను చంపదలచినవారు ఎక్కడ బతికిపోతారోనని నిరంతరం అతడు కలవరపడుతుండేవాడు. అందుకే ఒక పథకం ప్రకారం ప్రపంచాధిక్యానికి ప్రయత్నించాడు. మొదట పోలండ్‌పై దండెత్తాడు. అలా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.

తర్వాత డెన్మార్క్, నార్వే, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, బెల్జియం హిట్లర్ ఖాతాలోకి వచ్చేశాయి. ఆ ఊపులో రెండో తప్పు చేశాడు హిట్లర్! మూడు లక్షలమంది జర్మన్ సైనికులను వెంటేసుకుని వెళ్లి సోవియట్ యూనియన్‌ని ఎటాక్ చేశాడు!! దాంతో హిట్లర్‌కి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పడింది. ఎందుకు వాళ్లతో పెట్టుకోవలసి వచ్చింద న్న ప్రశ్నకు హిట్లర్ సమాధానం : జర్మనీపై సోవియెట్ యూనియన్ చెయ్యబోయే దాడిని అడ్డుకునేందుకే ఇలా ముందుగా దాడి చేశాం’’ అని!

స్టాలిన్‌గ్రాడ్‌లో హిట్లర్‌కి పెద్ద దెబ్బే తగిలింది. అక్కడి 6వ ఆర్మీ మొత్తం సోవియెట్‌ల అధీనంలోకి వెళ్లిపోయింది! కానీ ఒక్క అడుగైనా వెనక్కి వెయ్యడానికి వీల్లేదని హిట్లర్ తన సైనికుల్ని ఆదేశించాడు. చివరి వరకు పోరాడాల్సిందేనని గర్జించాడు. జర్మనీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సోవియెట్ సైన్యం జర్మనీలోకి తోసుకొచ్చింది. హిట్లర్ బంకర్‌లోకి తప్పించుకున్నాడు. పైన ఆమెరికా విమానాలు డేగల్లా తిరుగుతూ హిట్లర్ కోసం గాలిస్తున్నాయి. జర్మన్ వ్యతిరేక దేశాలన్నీ ఫ్రాన్స్‌లో కలుసుకుని అక్కడినుంచి ముందుకు కదిలాయి. హిట్లర్‌కి అర్థమైపోయింది… యుద్ధం ముగింపుకొచ్చిందని.

‘‘హిట్లర్… నువ్వు నీ బవేరియా వెళ్లిపో’’ అని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. హిట్లర్ తన బంకర్ నుంచి కదల్లేదు. సోవియెట్ దళాలు బంకర్‌కు బాగా సమీపానికి వచ్చేశాయి. హిట్లర్ లొంగిపోదలచుకోలేదు. సైనేడ్ కాప్స్యూల్ మింగాడు. తనని తాను పిస్తోలుతో కాల్చుకున్నాడు. అంతకు అరనిమిషం ముందు… తనెంతగారొ ప్రేమించే భార్యను కాల్చేశాడు.

హిట్లర్ బతికున్నంత కాలం అతడి మీద వచ్చిన పుస్తకం ఒకటే. మీన్ కాంఫ్. అది కూడా హిట్లర్ రాసుకున్నది. అతడు చనిపోయాక వేలాది పుస్తకాలు వచ్చాయి. హిట్లర్ మనస్తత్వాన్ని విశ్లేషించాయి. హిట్లర్‌కు అనేక రకాల శారీరక బాధలు ఉన్నట్లు కొందరు చరిత్రకారులు రాశారు. స్కిన్ లీజన్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, పార్కిన్సన్స్ డిసీజ్, సిఫిలిస్, యాస్పర్గర్ సిండ్రోమ్, కాన్‌స్టిపేషన్, కాళ్ల దురద… ఇలా దాదాపు పాతికకు పైగా వ్యాధులు అతడిని జీవితాంతం పట్టి పీడించాయట!

‘‘హిట్లర్ పడ్డ బాధల్లో అన్నిటికన్నా పెద్ద బాధ… దంత సమస్య, నోటి దుర్వాసన. హిట్లర్ వ్యక్తిగత దంత వైద్యుడు హ్యూగో బ్లాష్క్ తన శక్తి మేర సర్జరీలు చేసి హిట్లర్ పళ్లబాధలు తగ్గించే ప్రయత్నాలు చేశాడు కానీ అవి పెద్దగా ఫలించలేదు. భరించలేని ఆ బాధను పోగొట్టుకోడానికి పళ్లను పీకించుకోడానికి కూడా హిట్లర్ వెనకాడలేదు’’ అని డాక్టర్ హ్యాగో నుంచి సేకరించిన సమాచారంతో పరిశోధకులు కొందరు రాశారు. పళ్ల బాధలతో పాటు హిట్లర్‌కు కడుపునొప్పి, గొంతునొప్పి కూడా ఉండేవని, వీటివల్ల అతడు ఒక్కోసారి సైకోలా ప్రవర్తించేవాడనీ కొన్ని పుస్తకాలలో ఉంది.

హిట్లర్‌లోని మానవీయ కోణాలు, గుణాలను కూడా ఈ పుస్తకాలు ప్రస్తావించాయి! వాటిని బట్టి చూస్తే – హిట్లర్ గ్రేట్ యానిమల్ లవర్! జంతువధను నిరసించేవాడు!! తన పెంపుడు కుక్కను ప్రాణసమానంగా చూసేవాడు. పొగతాగేవాడు కాదు. ధూమపానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం కూడా చేపట్టాడు!
చిత్రం ఏమిటంటే – హిట్లర్ చరిత్రను లిఖించినవారిలో చాలామంది ఆయన అభిమానులే! నేటికీ ఆయనను అభిమానించేవారు లక్షల్లో ఉన్నారు. హిట్లర్ లాంటి వాడొకడు లేకుంటే మనుషులు ఇష్టానుసారం ప్రవర్తిస్తారని, సమాజంలో ఒక వ్యవస్థ అంటూ లేకుండా అంతా అడ్డదిడ్డం అయిపోతుందనీ వాదించేవారున్నారు.
ఎవరు ఎలా ఎందుకు సమర్థించినా హిట్లర్ ఒక కిరాతకుడైన నియంత అన్నది మాత్రం వాస్తవం. శారీరక రుగ్మతలలో బాధ పడడం, జంతువులను ప్రేమించడం వంటివి అతడి ఘాతుకాలకు ఏమాత్రం సహేతుకతను, సానుభూతినీ ఇవ్వలేవు. హిట్లర్ ఒక ఉన్మాది. మనుషులు మసలే ఈ భూమి మీద పుట్టవలసినవాడు కాదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top