You Are Here: Home » ఇతర » నదీ సంగమ పుణ్యహేల కుంభమేళ

నదీ సంగమ పుణ్యహేల కుంభమేళ

హిందువులందరూ ఒకచోట చేరుకుని పాపప్రక్షాళన చేసుకునే పవిత్రయాత్ర కుంభమేళా. ఈ నదీసంగమ ప్రదేశంలో ఎక్కడెక్కడి నుంచో ప్రవహించే జీవనదులు అనేక ఔషధగుణాల్ని తమలో నింపుకుని ఇక్కడ ఒకదానికొకటి సంగమిస్తారుు. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసి పాపకర్మల నుంచి విముక్తులై ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగాలనీ, పరమేశ్వరానుగ్రహానికి పాత్రులు కావాలనీ దేశం నలుమూలల నుంచే కాక విదేశాల్లో ఉన్న హిందువులు కూడా తరలి వస్తారు.


సాధారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకొక సారి కుంభమేళా జరుగుతుంది. అలాగే 6 ఏళ్ళకు ఒక మారు జరిగే కుంభమేళాని అర్ధకుంభమేళా అంటారు. ఈ అర్ధకుంభమేళా ఒకొక్కసారి ప్రయాగలో గానీ, హరిద్వార్‌లో గానీ జరుగుతుంది. అదేవిధంగా పూర్ణకుంభమేళా అనేది 12 సంవత్సరాల కొకమారు ప్రయాగ, హరిద్వార్‌, ఉజ్జయిని, నాసిక్‌ల్లో జరుగుతుంది. అలాగే 12 పూర్ణకుంభమేళాలు కలిపి ఒక మహాకుంభవేళా జరుగుతుంది. అంటే 140 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ మహాకుంభమేళా అలహాబాద్‌లో జరుగుతుంది. ఇది మరింత ప్రశస్తమైనదని పూరాణాల ద్వారా తెలుస్తుంది.

జనవరి 2007లో చివరగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభ మేళా లో 17 మిలియన్‌ లకు పైగా హిందువులు హాజరయ్యారు. అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజే 5 మిలియన్‌ లకు పైగా భక్తులు ఈ పుణ్యస్థలానికి తరలివచ్చారు. 2001లో జరిగిన చివరి మహా కుంభమేళాకు దాదాపు 60 మిలియన్‌లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.

పురాణాలలో, చరిత్రలో…
629-645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ రచనలలో మొదటగా కుంభమేళాకు గురించి ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రాచీన భారత వేద కాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు పరిశోధకులు, చరిత్రకారులు చెప్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాధలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీర సాగర మధన సందర్భంలో, భాగవత పురాణం, విష్ణు పురాణం, మహా భారతం, రామాయణం మొదలైన గ్రంధాల్లో కూడా కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.

Kumbh2పురాణాలు గనుక పరికిస్తే దేవతలు తమ శక్తీని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీర సాగర మధనానికి పూనుకుంటారు. అందుకు అమృతం సగం సగం పంచుకుందుకు ఒప్పందం చేసుకుని, తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం (కుండ) కనబడగానే పోట్లాట మొదలవుతుంది. పన్నెండు రోజులపాటు రాత్రింపవళ్ళు (మానవ సం.ల్లో 12 ఏళ్ళు) దేవతలు రాక్షసుల మధ్య అమృతభాడం కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహా విష్ణువు ఈ అమృతపు భాండాన్ని తీసుకుని పారిపోతూ ఉండగా ఆ కుంభంలోని అమృతం కొన్ని చుక్కలు ప్రయాగ, హరిద్వార్‌, ఉజ్జయని, నాసిక్‌ల్లో పడ్డాయని కొందరి అభిప్రాయం. ఇప్పుడు అటువంటి మహాద్భాగ్యం మనకి కలిగింది. 140 సంవత్సరాల కొకమారు జరిగే మహాకుంభమేళా మన తరంలోనే రావడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఈ గొప్ప అవకాశాన్ని వీలున్నంత వరకూ అందరూ సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం.ఇప్పటికే దేశం నలుమూలల నుంచీ తండోపతండాలుగా హిందువులు తరలివచ్చారు. అనేక మంది సాధువులు, సాధుపుంగవులు, పీఠాధిపతులు, మతప్రవక్తలు, తాంత్రికులు, తపస్విలు మొదలైన వారి అందరి దర్శనభాగ్యం కూడా ఒకే వేదిక మీద జరిగే అపూర్వ ఘట్టం ఈ కుంభమేళా.

అదే విధంగా మరో పురాణ గాథ కూడా ఉంది. వినత, కద్రువల పందెంల్లో తల్లిని దాస్యవిముక్తురాలిని చేయడానికి గరుత్మంతుడు అమృత భాండాన్ని ముక్కున కరిచి వాయువేగ మనోవేగాలతో వస్తుండగా, అందులోని కొన్ని అమృత బిందువులు ఈ నదులలో పడ్డాయని మరో కథనం ప్రచారంలో ఉంది. ఏదిఏమైనా శాస్ర్తీయ పరంగా మానవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అనేక వనమూలికల మీదుగా ప్రవహిస్తూ వచ్చే ఈ మూడు నదులు ఇక్కడ సంగమించడం వల్ల మనిషుల ఆయుర్ధాయం పెరిగి, ఆరోగ్యవంతులు అవుతారన్నది మాత్రం వాస్తవం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top