You Are Here: Home » చిన్నారి » నక్క మిత్రద్రోహం

నక్క మిత్రద్రోహం

అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఎలుగు బంటి ఉండేవి. అవి రెండూ చాలా స్నేహంగా ఉండేవి. అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది. అది వాటితో స్నేహం చేయాలనుకుంది. కోతి, ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి తాను స్నేహం చేయాలనుకుంటున్న సంగతి చెప్పింది. అవి కూడా సరేనన్నాయి. కానీ నక్కని కొంత కాలం జాగ్రత్తగా గమనించి నమ్మకం కుదిరాకే స్నేహం చేస్తామని చెప్పాయి. నక్క కూడా అందుకు ఒప్పుకుని వాటితోనే ఉండసాగింది.

కోతి, ఎలుగుబంటి కలిసి అడవిలో కొత్త కొత్త ప్రదేశాలకు వెళుతూ ఆహారాన్ని వెతుక్కునేవి. ఒక్కోసారి నక్క కూడా వాటితో కలిసి వెళ్లేది.ఒకరోజు నక్క నిద్ర పోతుండగా కోతి, ఎలుగుబంటి కలిసి బయటికి వెళ్లాయి. అడవిలో వాటికి ఒక చోట చాలా తియ్యని పండ్లున్న చె ట్లు కనిపించాయి. అవి కొన్ని పండ్లను తిన్నాయి. మరుసటి రోజు కూడా అక్కడికే రావాలనుకున్నాయి. తాము ఉండే చోటుకి తిరిగి వెళ్లాక నక్కకు ఆ సంగతంతా చెప్పాయి.

తెల్లవారి అదే చోటుకు పండ్ల కోసం వెళ్లాయి. కానీ అక్కడ చెట్లకు ఒక్క పండు కూడా లేదు. చెట్ల కింద సగం కొరికి పడేసిన కొన్ని పండ్లు కనిపించాయి. తమకు ఒక్క పండైనా మిగల్లేదని కోతి, ఎలుగుబంటి బాధ పడ్డాయి. ఆ తర్వాత ఇంకో చోటుకు వెళ్లి కొన్ని పండ్లను కోసుకొని తిని, మరి కొన్నిటిని జాగ్రత్తగా ఒకచోట దాచుకున్నాయి. ఆ సంగతి కూడా నక్కకు చెప్పాయి. కోతి, ఎలుగుబంటి ఆ మరుసటి రోజు వెళ్లి చూస్తే దాచుకున్న పండ్లు కనిపించలేదు.

నక్క తమతో స్నేహంగా ఉంటూనే తమ రహస్యాలని అడవిలో ఉండే ఇతర జంతువులకు చెప్తోందని తెలుసుకున్నాయి. ఒకరోజు అవి నక్కతో తాము అడవిలో చాలా దూరంలో కొత్త రకం పండ్లున్న చాలా చెట్లని చూసి వచ్చామని చెప్పాయి. నక్క వెళ్లి వేరే జంతువులకు ఆ కబురు అందించింది. అవన్నీ కలిసి కష్టపడి నక్క చెప్పిన చోటుకి చేరుకున్నాయి. కానీ అక్కడ పండ్ల చెట్లేవీ కనిపించలేదు. ఆ కోపంతో అవన్నీ కలిసి నక్కని పట్టుకుని చితక బాదాయి. నక్కకి బుద్ధి రావాలని తామే అలా చేశామని చెప్పిన కోతి, ఎలుగుబంటి అప్పటినుంచి దానికి దూరంగా ఉండసాగాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top