You Are Here: Home » ఇతర » దైవ కుమారుని దివ్యాగమనం

దైవ కుమారుని దివ్యాగమనం

ఏ మతమూ సమాజానికి అతీతం కాదు. ఏ వ్యక్తీ ధర్మానికి ప్రతీక కాదు. మానవ సమాజంలో ధర్మసంస్థాపన అన్ని మార్గాల్లోనూ జరుగుతూ ఉంటేనే మానవ లోకం శాంతి సౌఖ్యాలతో నిలబడుతుంది. ఏ మత గ్రంధం బోధించినా సర్వమానవ సౌభ్రాతృత్వాన్నే అలవరచుకోమని వక్కాణిస్తుంది. అందుకు మార్గాన్ని ఆయా గ్రంధాలే సూచించాయి. హింస, రాక్షసత్వం, అసూయ, ద్వేషం, మచ్చరం వంటి దుర్గుణాల్ని విడిచిపెట్టి – ప్రేమ తత్వంతో అందర్నీ ఒక్కటిగానే జీవించమని బోధించాయి. అలా ఒకొక్క మతానికి ఒకొక్క మత గ్రంథం ఆవిర్భవించింది. గ్రంథాలు వేరైనా, పరమార్థం ఒక్కటే. అటువంటి గ్రంథాల్లో క్రైస్తవ మతస్తుల్ని లోకంలో నిలబెట్టిన పవిత్ర గ్రంథం ‘బైబిల్‌’
ప్రతి ఏటా క్రైస్తవులకు వచ్చే అతి పెద్ద పండుగ ‘క్రిస్‌మస్‌’. ఈ పండుగని ప్రపంచదేశాల్లోని క్రైస్తవులందరూ ఏసు క్రీస్తు పుట్టినరోజు పండుగగా ఆనందోత్సాహాలతో చాలా ఘనం గా జరుపుతారు. నిజానికి ఏసుక్రీస్తు జననం ఫలానా దినమున అని ఎక్కడా పేర్కొనలేదు. ఏ వాక్యంలోను ఈ ప్రస్తావన కనిపిం చదు. యేసుక్రీస్తు శిష్యులే కాదు క్రీస్తు జనన సందేశాన్ని అం దించిన దేవదూత కూడా ఫలానా రోజున అని చెప్పినట్టు ఈ గ్రంధంలో ఎక్కడా కనిపించదు. అయినా కొన్ని విశ్వాసాలనను సరించి డిశంబర్‌ 25 క్రీస్తు పుట్టిన రోజుగా నిర్ధారించుకుని అందరూ అమితోత్సాహాలతో ఈ వేడుక జరుపుకుంటున్నారు.

క్రీస్తు జననం: నేటికి యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాల కు పైగా దాటింది. ఆకాలంలో అంటే, 2000 ఏళ్ళ క్రితం రోమా రాజ్యాన్ని అగస్టీన్‌ సీజర్‌ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్క వేయించాలన్న కుతూహలం కలిగింది. అందుకు వీలుగా ప్రజలంతా డిశంబరు 25 నాటికల్లా ఎవరి గ్రామాలకు వారు తరలి వెళ్ళిపోవాలని దండోరా వేయించాడు. అప్పుడు ‘నజరేతు’ అనే పట్టణంలో జోసఫ్‌, మేరీ అనే దంపతులు నివసిస్తున్నారు. ఒకరోజు ‘గాబ్రియల్‌’ అనే దేవదూత మేరీ స్వప్నంలో కనబడి మేరీకి దేవుని అనుగ్రహం కలిగిందని, అందువలన కన్యగానే గర్భవతివి అవవుతావనీ, నీకు కుమారుడు జన్మిస్తాడనీ, అతడికి ‘యేసు’ అని నామకరణం చేయమని చెప్తాడు. యేసు అంటే రక్షకుడు అని అర్ధం. అంతేకాక అతడు దేవుని కుమారుడని కూడా ప్రకటిస్తాడు. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భవతి అయ్యింది.

అప్పుడు అదే దేవదూత జోసఫ్‌ కలలో కనిపించి మేరీని విడిచిపెట్టవద్దనీ, మేరీ భగవంతుని అనుగ్రహం వలన గర్భవతి అయ్యిందని, ఆమెకు పుట్టే కుమారుడే దేవుని కుమారుడై నమ్మిన ప్రజలందరినీ వారి వారి పాపాల నుంచి రక్షిస్తాడనీ చెప్పాడు. దానితో జోసఫ్‌ మేరీని ఎంతో ప్రేమగా చుసుకున్నాడు. జోసఫ్‌ స్వగ్రామం బెత్లేహం. అందువలన రాజాజ్ఞ ప్రకారం మీరీ, జోసెఫ్‌లు బెత్లేహంకు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గంలో ఎన్నో కష్టాలకోర్చి, ఆ గ్రామం చేరిన తరువాత వీరిద్దరికీ వసతి ఎక్కడా దొరకలేదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో ఉండటానికి అంగీకరించాడు. ఆ పాకలోనే మేరీ ఒక మగ శిశువును ప్రసాదించింది. ఆ పుట్టిన బిడ్డని పొత్తిళ్ళతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టింది.

ఆ రాత్రి సమయంలో కొందరు గొర్రెల కాపర్లు మందలకు కాపలా కాస్తుండగా దేవదూత ఆకాశం నుండి మిరుమిట్లుగొలిపే కాంతితో వారి ముందుకు దిగివచ్చి, మీకొక శుభవార్త చెపుతున్నాను- ఈరోజు బెత్లేహంలో ఒక పశువుల పాకలో లోకరక్షకుడైన బాలుడు పుట్టాడు. అతడే అందరికీ ప్రభువు అని చెప్పాడు. భయభ్రాంతులై వింటున్న ఆ గొర్రెల కాపర్లు వెంటనే ఆ పశువుల పాకకు చేరుకుని దేవదూత చెప్పిన విధంగా పశువుల తొట్టిలో పండుకుని ఉన్న శిశువును, మేరీ జోసఫ్‌లను చూసారు. వారు ఈ విధంగా దేవదూత చెప్పిన సమాచారాన్నీ, వారు చూసినదానినీ ప్రజలందరికీ తెలియజేసారు.

ఈ విధంగా 2000 సంవత్సరాలకు పూర్వం డిశంబర్‌ 24 అర్ధరాత్రి ‘యేసుక్రీస్తు’ దేవుని కుమారునిగా ఈ భూమి మీద పుట్టాడు. అందువల్ల డిశంబర్‌ 25 నాడు క్రిస్‌మస్‌ పండుగగా ఆయన పుట్టినరోజుని ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు వారి పవిత్ర గ్రంధమైన ‘బైబిల్‌’ను అన్ని చర్చిల్లోను భక్తిశ్రద్దలతో పఠిస్తారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top