You Are Here: Home » చిన్నారి » దేవుడు చూపిన దుశ్శకునం

దేవుడు చూపిన దుశ్శకునం

ఉన్నది గాలి కాదు పొగ. పారుతున్నది నీరు కాదు డ్రయినేజీ. పెరుగుతున్నది మొక్కలు కాదు విషం. పాకుతున్నది పాములు కాదు ఎలక్ట్రిక్ తీగలు. గగనాన వ్యాపించింది మబ్బులు కాదు
సెల్‌ఫోన్ టవర్లు. ఎగురుతున్నది పిచ్చికలు కాదు…. ప్రాణం
కొడిగడుతున్న నిరుపేదజీవులు…

అనగనగా ఒక పిచ్చిక.
అవును. ఇక మీదట అనగనగా ఒక పిచ్చికే.
ఇప్పుడు పిచ్చికలు లేవు. నీరెండ పూట అడావిడిగా ఒకదాని వెంట ఒకటి పరపరమని ఇంట్లోకి దూరి ఏదో పనున్నట్టుగా అంతలోనే మాయమయ్యే ఆడ పిచ్చికలు ఆ వెంట మగపిచ్చికలు ఇప్పుడు లేవు. బావిగట్టున బిందె పెట్టగా పెట్టగా ఏర్పడిన సొట్టలో నిలిచిన నీటిని ముక్కుతో తాగి చుట్టుపక్కల పరికించి చూసి కాళ్లను అటూ ఇటూ డాన్సాడించి అంతలోనే చటుక్కున ఎగిరి వెళ్లే జోడు పిచ్చికలు ఇప్పుడు లేవు. ఇళ్ల వసారాలకు కట్టిన వరికంకి పై వాలి అంతలోనే ఎగిరి అంతలోనే గింజను ముక్కున కరుచుకొని అంతలోనే అదే భాగ్యమన్నట్టు ఎగిరెళ్లిపోయే తోడు పిచ్చికలు ఇప్పుడు లేవు. అద్దం ఉందంటే చాలు దాని కొస మీద వాలి ప్రతిబింబాన్ని ముక్కుతో రాసి మాటిమాటికీ ముఖాన్ని చూసుకుంటూ ఇంటి పనుల్లో ఉన్న ఇల్లాలికి నవ్వు తెప్పించే అందాల పిచ్చికలు ఇప్పుడు లేవు. పైకప్పుకూ వాసాలకూ మధ్య కాసింత జాగా దొరికితే గడ్డి తెచ్చి ఒద్దికగా గుచ్చి గూడుగా చేసి గుడ్లను పెట్టి పిల్లలను పొదిగి మన సంసారంలో తమదీ ఒక సంసారం చేసుకునే అపురూప పిచ్చికలు ఇప్పుడు లేవంటే లేవు.

పిచ్చికలన్నీ అంతరించాయి.
మిగిలింది ఒకే ఒక జంట. అవి ఎక్కడికి పోవాలి?
ఎగురుతున్నాయి. ఎగురుతున్నాయి. ఎగురుతూనే ఉన్నాయి అవి. ఒకప్పుడు ఆ జంట కళకళలాడుతూ ఉండేది. ముద్దు
మురిపాలతో ఉండేది. ఆ.. ఏమవుతుందిలే ఈ జగత్తంతా ఉందిగా అనే ధైర్యంతో ఉండేది. కాని ఇప్పుడు ఆ ధైర్యం పోయింది. పల్లెల్లో వాటికి చోటు పోయింది. గతంలో ఆ జంట ఒక పెంకుటింట్లో కాపురం ఉండేది. దానిని కూలగొట్టి శ్లాబ్ వేసి మిద్దె కట్టారు. పూరింటికి మారితే దానిని పడగొట్టి రేకుల ఇల్లు కట్టుకున్నారు. చేసేదేం లేక రాతి కట్టుబడి ఉన్న బావి లోతున గూడు కట్టుకుని ఊపిరి పీల్చుకుంటే బావి పూడ్చేసి బోరు వేశారు. పంట పొలాలను ఆశ్రయిద్దామంటే సెజ్‌లయ్యాయి. మిగిలిన భూములు రియల్ ఎస్టేట్ ఫ్లాట్‌లుగా కొలతలు వేసుకున్నాయి.

మిగలింది ఒక్కటే జంట. ఒక ఆడ పిచ్చిక. ఒక మగ పిచ్చిక. ఎగురుతున్నాయి. ఎగురుతున్నాయి. ఎగురుతూనే ఉన్నాయి. వాటికి అలుపు వచ్చింది.
ఇంకా ఎంతసేపు పెనిమిటీ అంది ఆడపిచ్చుక.
అది రెక్కలు ఆడించలేకపోతోంది. ఆకలితో దప్పికతో దాని గుండెండి పోతోంది.
ఇంకెంత… వచ్చేస్తోంది నగరం అని ధైర్యం చెప్పింది మగపిచ్చిక.
అవి ఎగిరాయి. ఎగిరాయి. ఎగిరి ఎగిరి పల్లె వదిలి పట్నం వదిలి దూరాభారాలన్నింటినీ వదిలి అంతిమంగా నగరానికి చేరుకున్నాయి. నగరమా అది? సిమెంటు బస్తాల గోడౌన్. ఎక్కడ చూసినా ఎత్తయిన కట్టడాలు. ఎక్కడ చూసినా జర్రున జారే పాలిష్ బండలు. ఎక్కడ చూసినా రయ్యిన దూసుకుపోయే బ్రాండ్ న్యూ కార్లు. ఎక్కడ చూసినా ఒక మబ్బునో ఒక వెన్నెలనో ఒక మనసు తాకే చల్లని సమీరాన్నో మరిచి హడావిడిగా పరుగుతీసే మనుషులు.

ఎక్కడ పెనిమిటీ ఎక్కడ దిగుదాం మనం దిక్కుతోచక అడిగింది ఆడపిచ్చిక.
ఏం తిందాం మనం ఎవరు పెడతారు మనకు అని ఆందోళన పడింది ఆడపిచ్చిక.
మగ పిచ్చిక ధైర్యం కోల్పోలేదు. ఆడ పిచ్చికను ఒక అపార్ట్‌మెంట్ కిటికీలోని పాడైన ఏసిపెట్టె కింద దించి ఇప్పుడే వస్తానని చెప్పి ఆహారం కోసం ఎగిరింది. ఎగిరింది ఎగిరింది మూసీనది మురికి మీద ఎగిరింది. ఎగిరింది ఎగిరింది హైటెక్ సిటీ నెక్ టై మీద ఎగిరింది. ఎగిరింది ఎగిరింది ఎక్స్‌ప్రెస్ హైవే నలుపు మీద ఎగిరింది. ఎగిరింది ఎగిరింది సంపన్నుల కాంక్రీటు బీడు భూములన్నింటిపైనా ఎగిరింది. పిచ్చికకు ఏం కావాలి?

చారెడు వడ్లగింజలు. గుప్పెడు సజ్జపలుకులు. దోసెడు జొన్నకొరల్రు.
ఇంత పెద్ద నగరంలో దొరకలేదు. సిమెంటు తప్ప ఏమీ దొరకలేదు. రాళ్ల గుండెలు తప్ప ఏమీ దొరకలేదు.
పెనిమిటీ… ఆకలేస్తోంది పెనిమిటీ అని విలవిల్లాడిపోయింది ఆడపిచ్చుక.
లాభం లేదు. వెనకకు మరలాల్సిందే. మగ పిచ్చుక మునిపంటి కింద బాధ నొక్కి పెట్టి ఆడపిచ్చుకను తీసుకొని తిరిగి బయలు దేరింది. ఆహారం కోసం వేట. ఆకలి తీర్చుకోవడం కోసం వేట. కింద బోలెడన్ని పొలాలు. అడుగడుగున పొలాలు. అయితే అవి- తిండి కోసం కాక డబ్బు కోసం వేసిన పొలాలు.

పత్తి పొలాలు. రెండూ దిగాయి. నేలకు రాలిపడి- ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న పురుగులు కనిపించాయి. పురుగుమందుల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ పురుగులు విషం. కాని ఆకలేస్తోందే! మరి తట్టుకోలేక ఆడ పిచ్చిక ఒక్కో పురుగూ ఒక్కో పురుగూ తినడం మొదలుపెట్టింది. మరికాసేపటికి దాని నోటి నుంచి నెత్తురు చిమ్మింది.

పెనిమిటీ… పెనిమిటీ… నేను పోతున్నా పెనిమిటీ….
మగపిచ్చుక దిక్కు తోచనట్టుగా అటూ ఇటూ ఎగిరింది. గుండెలు బాదుకుంటూ ఎగిరింది. అయ్యో అయ్యో అనుకుంటూ ఎగిరింది.
ఆడపిచ్చుక ఇప్పుడు లేదు. మిగిలింది ఒకటే పిచ్చిక. ఆఖరి పిచ్చిక. దానికి దేవుడు చెప్పి పంపిన మాట గుర్తుకొచ్చింది- నువ్వు మనిషికి తోడు. మనిషి నీకు తోడు. మీ ఇద్దరు కలిసి మెలిసి బతుకుతారు పోండి…
కాని మనిషి ఇవాళ దాని చేయి వదిలేశాడు.
ఇందుకు ప్రతీకారంగా దేవుడు- మనిషి చేయి వదిలేయాలి.
వదిలేసేలా చేస్తాను అనుకుంది మగపిచ్చిక.
ఆ మాట అడగడానికే ఎగరుతోంది ఎగురుతోంది… ఆకాశం వైపు రెక్కలు సాచి కోపంగా ఆగ్రహంగా ధర్మగంట మోగిం చేందుకు అనంత లోకాలవైపు ఎగురుతూనే ఉంది.

కథ ముగిసింది. రచయిత పాపినేని శివశంకర్- 2003లో
రాసిన- చివరి పిచ్చిక- కథ ఇది.
దీనికి వ్యాఖ్యానం అనవసరం.
దేవుడు- మనిషికి రెండు చేతులు ఇచ్చాడు బాగు పడమని.
మనిషి- ఆ రెండు చేతులతో చేయాల్సినంత విధ్వంసం చేసేశాడు.
యుగాంతానికి వేరే వేరే శకునాలు అక్కర్లేదు.
పిచ్చిక మాయమైపోతుండటమే అతి పెద్ద దుశ్శకునం.
మనిషికి మూడింది. వాడు ఇప్పటికైనా మేలుకోకపోతే ఇంకా త్వరగా మూడుతుంది. మూడాలి.
– సాక్షి ఫ్యామిలీ

పాపినేని శివశంకర్: కవిగా, కథారచయితగా, విమర్శకుడిగా సుప్రసిద్ధులు. నాలుగు కవితా సంపుటులు, రెండు కథాసంపుటులు వెలువరించారు. వాసిరెడ్డి నవీన్‌తో కలిసి ప్రతిఏటా ఉత్తమ కథాసంకలనాలు-కథ- వెలువరిస్తూ కథాసాహిత్యానికి విశేషసేవ చేస్తున్నారు. స్వస్థలం గుంటూరుజిల్లా నెక్కల్లు. ప్రిన్సిపాల్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. నివాసం గుంటూరు.
ఫోన్: 8978012323

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top