You Are Here: Home » ఇతర » తోడుదొంగలు

తోడుదొంగలు

F2పూర్వం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ ప్రాంతంలో ఇద్దరు తెలివెైన మిత్రులు ఉండేవారు. ఈ మిత్రుల్లో ఒకడు చూడడానికి లావుగా ఉంటే మరొకడు బక్కపల్చగా ఉండేవాడు. వీరు అస్తమానం తమ తెలివితేటల్ని ఉపయోగించి ఇతరుల్ని ఎలా మోసం చేయాలి? ఎలా బుట్టలో పడేయాలని ఆలోచిస్తూ రోజుకో ఎత్తుగడ వేసేవారు. మాయమాటల్ని చెప్పి మోసగించడం వీరికి వచ్చిన ఏకైక విద్య. ముఖ్యంగా ఈప్రాంతానికి వచ్చే విదేశీయుల్ని వీరు టార్గెట్‌ చేసి వారిని రకరకాలుగా మోసగించేవారు. కానీ టర్కీని పాలిస్తున్న రాజు దయాహృదయుడు, స్నేహశీలి, పరోపకారి. రాజు తన తెలివితేటల్ని ఉపయోగించి రాజ్యంలో ప్రజలకు ఏమాత్రం కష్టం రాకుండా చూసేవాడు. కానీ ఖజానాలో కోట్లాది డబ్బు ఉండడంతో రాజు తన దర్బారులో పెద్ద పెద్ద కవుల్ని, కళాకారుల్ని, గాయకుల్ని పెంచి పోషించేవాడు. దీనికితోడు దేశవిదేశాల నుండి ఎందరో ఔత్సాహికులు చిత్రవిచిత్ర వస్తువుల్ని తెచ్చి రాజుకు చూపించి ఆయన మెప్పు పొంది పెద్ద ఎత్తున నగదు, ఆభరణాల్ని పొందేవారు.

ఆనోటా ఈ నోటా ఈ విషయం జోడుదొంగలకు చేరింది. ఎన్నాళ్లిలా చిన్నా చితకా దొంగతనాలు, మోసాలు చేస్తూ బతకడం, కనీసం ఒక్క పెద్ద చేపను వలలో వేసుకుంటే జీవితాంతం హాయిగా బతికేయవచ్చని జోడుదొంగలు ఆలోచించి ఆలోచించి, ఎలాగెైనా రాజును బుట్టలో పడేద్దామనే నిర్ణయానికి వచ్చారు.రాజుకు కళలన్నా, వింతలు విశేషాలన్నా ఆసక్తితో పాటు అవి ప్రదర్శించిన వారికి అమూల్యమైన కానుకల్ని ఇచ్చి పంపించే సాంప్రదాయం ఉండడంతో ఇద్దరు దొంగలు అదే మార్గాన్ని ఎంచుకున్నారు. అందులో లావుపాటి దొంగ మాయలమరాఠీ అవతారం ఎత్తి తన పేరును కాసిమ్‌గా మార్చుకున్నాడు. బక్కపల్చటి దొంగ ముఖానికి కృత్రిమంగా తయారు చేసినే కుక్క తొడుగును తొడిగించి తమ ప్లాన్‌కు కార్యరూపం ఇచ్చారు. ముందుగా కాసిమ్‌ ఇస్తాంబుల్‌ ప్రాంతంలో ఊరూరా తిరిగి తన వద్ద ఉన్న కుక్కకు అపార తెలివితేటలున్నాయని దానికి డాన్స్‌, మ్యూజిక్‌ వంటి అన్ని కళల్లోనూ నేర్పరని ప్రచారం చేశాడు. నెమ్మదిగా ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఎలాగెైనా ఆ కుక్క తేలివితేటల్ని ప్రత్యక్షంగా తిలించాలని భటుల్ని ఇస్తాంబుల్‌ పంపి కాసిమ్‌ను అతడు పెంచుకుంటున్న కుక్కను తీసురావాలని ఆదేశించాడు.

కాసిమ్‌ దర్బారులోకి ప్రవేశించగానే రాజుగారి అతిథి మర్యాదలకు ఆశ్చర్యపోయాడు. దర్బారులో అందరూ కొలువుతీరగా కాసిమ్‌ పెంపుడు కుక్క కళను ప్రదర్శించమని ఆజ్ఞాపించాడు. వెంటనే కాసిమ్‌ కుక్కను నృత్యం చేయమని ఆదేశించాడు. కుక్క ముసుగులో ఉన్న రెండో దొంగ ఆనందంగా కుప్పి గంతులు వేయడం ప్రారంభించాడు. రాజు ఆనందభరితుడెై కుక్కను ఏదెైనా పాట పాడించాలని కాసిమ్‌ను అడిగాడు. వెంటనే కుక్క పాడడం ప్రారంభించింది. రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాసిమ్‌ ఇంతటితో ఊరుకోకుండా తన పెంపుడు కుక్క పియానో కూడా వాయిస్తుందని గొప్పలు చెప్పాడు. వెంటనే రాజు దర్బారులో పియానో తెప్పించడం కుక్క పియానో వాయించడంతో రాజు ఆశ్చర్యపోయి ఎలాగెైనా ఆ కుక్కను సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరాడు. ఎంతడబె్బైనా తీసుకుని కుక్కను ఇక్కడే వదిలి వెళ్లాలని కాసిమ్‌ను కోరాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాసిమ్‌ ‘‘రాజా నేను ఎంతో కష్టపడి ఈ కుక్కను కొన్నేళ్లపాటు శిక్షణ ఇచ్చాను.

నాకు, నా కుటుంబానికి ఇదొక్కటే ఆధారం, నేను చనిపోయిన తర్వాత కూడా ఈ కుక్కే మా కుటుంబాన్ని పోషిస్తుంది, కాబట్టి కనీసం కోటి రూపాయలు ఇవ్వండి’’ అని రాజును వేడుకున్నాడు. రాజు సరేనని కోటి రూపాయలు ఇచ్చి, వెంటనే ఆ కుక్కను సైనికులకు అప్పగించాడు. ఈ కుక్కకు ఉన్న అపార తెలివితేటల్ని మనం ఉపయోగించుకుని మన రాజ్యంలో ఉన్న అడవి మృగాలకు కూడా ఈ కళ నేర్పించేందుకు పులులు, సింహాలున్న బోన్‌లో కుక్కను వదలాలని ఆజ్ఞాపించాడు. ఈ మాట విన్న వెంటనే కుక్క వేషంలో ఉన్న రెండో దొంగ భయంతో తలపెై ఉన్నముసుగును తీసి పరిగెత్తడం ప్రారంభించాడు. భటులు వెంబడించి వారిద్దరినీ బంధించి రాజుగారి ముందు హాజరుపర్చారు. ఆ దొంగలిద్దరూ రాజుగారి కాళ్లపెై పడి ప్రాణభిక్ష పెట్టాలని ప్రాధేయపడ్డారు.

రాజు వారిద్దరినీ మందలించి ‘‘నువ్వు కుక్క ముసుగులో మనిషిని తీసుకువచ్చావనే విషయాన్ని నేను అది నాట్యం చేస్తున్నపుడు, పియానో వాయిస్తున్నప్పుడే పసిగట్టాను, కానీ మీకు బుద్ధి చెప్పాలని, నిజాన్ని మీ నోటితో చెప్పించాలని కుక్క ముసుగులో ఉన్న దొంగను పులులున్న బోనులోకి పంపాలని చెప్పాను’’ అని అన్నాడు.జోడు దొంగలు చేసిన తప్పుని ఒప్పుకుని రాజుకు క్షమాపణ కోరారు. రాజు వారిని మన్నించడమేగాక, ఓగంట పాటు దర్బారులో ఉన్న కళాకారులందరికీ వినోదాన్ని పం చినందుకు విలువెైన కానుకల్ని ఇచ్చి పంపాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top