You Are Here: Home » ఇతర » తెలుగు నాటక ప్రస్థానం

తెలుగు నాటక ప్రస్థానం

నాటకం ఒక మహాయోగ సాధన. నటుడు ఒక మహాయోగి.’’ ఆంధ్రదేశ మంతట తెలుగు పద్య నాటకాలు విశేష ఆదరణ పొందుతూ అశేష ప్రజల హౄఎదయాలను ఆకర్షించి రంజింప జేస్తున్న రోజులలో స్ర్తీ పాత్రలు ధరించడానికి నటీమణులు లేని ఆ కాలంలో స్ర్తీ పాత్రలు ధరించిన పురు షూలు. ఆ పాత్రలకు జీవం పోశారు. ముప్పిడి జగ్గరాజు. కోపల్లె హనుమంతరావు. ఉప్పులూరి సంజీవరావులు వారిలో ప్రముఖులు. తరువాత కాలంలో పురుషూలు వేసే స్ర్తీ పాత్రకు చిరునామాగా నిలిచిన నటమాణిక్యం స్థానం నరసింహారావు.

freఆంధ్ర నాటకరంగ అప్సరస’గా పేరుపొందిన సత్యభామ, చిత్రాంగి, మీరాభాయి, మధురవాణి, లీలావతి, మోహిని, అనసూయ, చింతామణి, రోషనార, చంద్రమతి, దేవదేవి, యశోద, మల్ల మదేవి మొదలైన స్ర్తీ పాత్రలు ధరించి ఆనాటి ప్రేక్షకుల హృదయాలను ఉర్రూతలూగించారు. సత్య భామకి కావలసిన అహం, మధురవాణికి ఉండవలసిన గాంభీర్యం, చిత్రాంగికి తగిన శృంగారం… ఇలా అన్నీ స్థానం వారికి ఎలా అలవడ్డాయో అని ఆశ్చర్యం కలగకమానదు.రంగస్థలంపై నటిస్తు న్నప్పుడు మగవాళ్లతోపాటు ఆడవాళ్లూ కూడా స్ర్తీయే అని భ్రమపడేవారట మగవాళ్లలో కొందరు ప్రేమలేఖలు రాస్తే మరికొందరు మహిళలు గ్రీన్‌రూమ్‌లోకి వెళ్లి బొట్టు పెట్టి తమ ఇళ్లకి ఆహ్వానించే వారట.

ఒకసారి స్థానం వారు ఒక ఊళ్లో నాటకం వేయడానికి వెళ్లారు. వేదికవద్ద ఒక ఇంట్లో ఆయన మేకప్‌ వేసుకొని కూర్చుని వున్నారు. ఇంతలో ఆ ఇంటివారిని పేరంటానికి పిలవడానికి వచ్చిన మహిళలు ఆ ఇంట్లోవారితో పాటు అక్కడే స్ర్తీ వేషంలో ఉన్న స్థానం వారికి కూడా బొట్టుపెట్టి పేరంటానికి పిలిచారట. అలా స్ర్తీ వేషంలో మహిళల్ని కూడా పొరబడేలా చేయగలస్థాయి ఒక్క స్థానం వారికే చెల్లింది. తన యావత్‌ జీవితాన్ని కళాసేవకే అంకితం చేసిన స్థానం నరసింహారావు 1902 సెప్టెంబర్‌ 23న గుంటూరు జిల్లా బాపట్లలో ఆదెమ్మ, హనుమంతరావు దంపతు లకు జన్మించారు. గుంటూరు బాపట్లలోనే మెట్రిక్‌ వరకూ చదువు కొనసాగించారు.

చిన్నతనం నుండే నరసింహారావుకు నటనలో, సంగీతంలో, చిత్రకళలో, ప్రాచీన సాహిత్యంలో ఆసక్తి కలిగింది. ఆయన సహజ ప్రతిభకు కృషి, దీక్షానిరతి తోడుకావడంతో ఈ ఆసక్తి సహస్ర దళాలతో వికసించి సౌరభాలను విరజిమ్మింది. సుమారు ఇరవై సంవత్సరాల వయస్సు వరకూ ఆయన చిత్రకళా సాధన. ఫోటోగ్రఫీ అభ్యాసం కొనసాగాయి. కొంతకాలం తెనాలి తాలూకా హైస్కూల్‌లో డ్రాయింగ్‌ టీచర్‌గా కూడా పనిచేశారు.

ప్రారంభంలో ‘ప్రాంప్టర్‌’గా స్థానం వారువుండేవారు ఒకసారి బాపట్లలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు. హరిశ్చంద్ర పాత్రను చోరగుడి హనుమంతరావు వేస్తున్నారు. చంద్రమతి పాత్ర వేయాల్సినవారు కారణాంతరాలవల్ల రాలేదు. చేసేది లేక, ఆ రంగంపై మక్కువ చూపేవాడు ఆ నాటకానికి ’’ప్రాంప్టర్‌’’ గా వున్న స్థానం వారికి బలవంతంగా చంద్రమతి పాత్ర అంటగట్టారు. అసలే బిడియం. ఆపైన భయం. అన్నాళ్లూ తెరవెనుకవుండేవాడు ఒక్కసారిగా ప్రధాన నాయిక పాత్ర ధరించడంతో రావుగారి స్థితి చిరుగాలిలో లేతాకు అయింది.

హనుమంతరావు స్టేజీ మీదకు వెళ్లి ’దేవీరమ్ము’ అంటున్నారు. స్థానం వారికి కాళ్లు వణుకుతున్నాయి. చెమటలు పట్టాయి. ఎంతకీ స్టేజీమీదకు వెళ్లడం లేదు. ఇక నిర్వాహకులు ఆలస్యం చేయకుండా స్థానం వారిని బలవంతంగా ముందుకు తోసారు. తూలుతూ వచ్చి స్టేజీమీద పడబోయారు వెంటనే హరిశ్చంద్ర పాత్రధారి హనుమంతరావు ’’దేవీ ఇది అరణ్య ప్రాంతం రారుూ రప్పా వుండును. చూసి జాగ్రత్తగా నడుపుము’’ అంటూ సందర్భోచిత సంభాషణతో స్థానం వారి భయానికి కళ్లెం వేశారట!

అలా పందొమ్మిది సంవత్సరాల చిన్న వయసులో బిడియంతో భయంతో తెలుగు రంగస్థలంపై అడుగిడిన స్థానం, సుమారు 40 సంవత్సరాలపాటు నిరంతరం నటనను అభినయ కళను ఒక తపస్సుగా ఆరాధించి తెలుగు నాటక రంగంలో ఒక ప్రత్యేక ’’నటస్థానం’’ సంపాదించారాయన. చంద్రమతి పాత్రధారణ నరసింహారావు జీవితానికే మహత్తరమైన మలుపు అయ్యింది. ఆయన జీవన సరళీ మారింది. ముందు చేపట్టిన ఉపాధ్యాయ వృత్తి వదలి నటజీవన వృత్తికి చేరువయ్యారు. తెనాలిలో కృష్ణ హిందూ థియేటర్స్‌ నాటక సంస్థలో నరసింహరావుకి స్ర్తీ పాత్రధారిణి ఉద్యోగం లభించింది. నెలకు 25 రూపాయలు జీతం.

అనంతరం ‘రామవిలాస సభ’లో ప్రవేశించి అనేక నాటకాల్లో నటించారు. కొన్నాళ్లకు ఆయనే దాని నిర్వాహకులయ్యారు. మాధవపెద్ది వేంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, గోవిందరాజుల వేంకట సుబ్బారావు, పెద్దిభొట్ల వేంకటాచలపతి, పిల్లలమర్రి సుందరరామయ్య, లింగమూర్తి తదితర ఉద్దండ నటులు నరసింహారావు సహచర కళాకారులు. రామవిలాస సభ క్రమశిక్షణకు, ఆత్మవిమర్శకు మారుపేరుగా నిలిచింది. స్థానం వారు పోషించిన విభిన్న స్ర్తీ పాత్రలలో ఆహార్యంలో అభినయంలో వాచకంలో సంగీతంలో హావభావ ప్రదర్శనలో అపూర్వ విశిష్టతను ప్రత్యేకతను ప్రతిభను ప్రదర్శించి ఆయా పాత్రలకు అనుగుణంగా నవరసాలను పోషించారు.

ప్రేక్షక హృదయాలను రంజింపజేశారు. నిరంతరంగా నిర్విరామంగా నిత్యనూతనంగా నలభై సంవత్సరాలు నటజీవితానికి అంకితం అయి నటనను ఒక తపస్సుగా నిర్వహించి మూడువేల పర్యాయాలు రంగస్థలంపై వివిధ విభిన్న వైవిధ్య విలసిత పాత్రలలో తమ నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఇంతటి సమున్నత నాటక శేఖరుని బాల్యం అంతా బరువులమయమే! ఆయన పదహారవ ఏటనే తండ్రి హనుమంతరావు మరణించారు. అప్పటినుండి ఆయనకు అన్నివిధాలా మేనమామ కామరాజు వేంకట నారాయణ అండగా నిలిచేవారు. నారాయణ కూడా స్వయానా నటులు నాటకప్రియులు.

అల్లుడు నరసింహారావు, నటనాభిలాషను అభినయ కళాప్రావీణ్యాన్ని వేంకటనారాయణ ప్రోత్స హించి మెరుగులు దిద్దారు. స్థానం వారు నటుల ుగానే సుప్రసిద్ధులు ఆయన కవి అన్న విషయం చాలామందికి తెలియదు. కావ్యాలు ఏమీ రాయలేదు గానీ పద్యాలు, గేయాలు రాశారు. శ్రీకృష్ణ దేవరాయలు అనే నాటకం వెలువరించారు. ‘నటస్థానం’ పేరిట స్వీయ చరిత్ర రాసుకున్నారు. కేవలం ఆంధ్రదేశంలోనే గాక బర్మాలో ప్రదర్శనలు ఇచ్చి మెప్పుపొందారు. తన మొత్తం నటప్రస్థా నంలో సుమారు 1500 నాటక ప్రదర్శనలు చేసిన ఇతర సేవల విషయానికొస్తే 1949లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌ సభలకు అధ్యక్షునిగా హైదరాబాద్‌ ఆకాశవాణి నాటక ప్రయోక్తగా పనిచేసి తెలుగు నాటక రంగాన్ని పరిపుష్టం చేశారు.

ఇంతటి నటనా విదూషకులైన స్థానం వారి నటనను డాక్టర్‌ సర్వేపల్లి, హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ వంటి శ్రేష్టులు ప్రశంసించగా ఆంధ్ర బాలగంధర్వ, నాటక కళాప్రపూర్ణ నటశేఖర వంటి బిరుదులెన్నో వరించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఇలా తెలుగు రంగస్థల సేవకు వన్నె చిన్నెలు సమకూర్చి నటులకు మార్గదర్శకుడైన ఈ నటశేఖరుడు 21, ఫిబ్రవరి 1971న తన భౌతిక జీవిత నాటకానికి భరతవాక్యం పలికారు. ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్ర్తీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.

-నండూరి రవిశంకర్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top