You Are Here: Home » చిన్నారి » తినమరిగిన కుక్క

తినమరిగిన కుక్క

అనగనగా ఒక గ్రామంలో దానయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను గొప్ప ధనవంతుడు. కానీ చాలా పిసినారి. తన ధనాన్ని ఎవరైన దోచుకుపోతారని భయపడేవాడు. అందుకే ఇంటికి కాపలా కోసం ఒక కుక్కని పెంచుకోసాగాడు. ఆ కుక్క కొద్ది రోజులు బాగానే ఉంది, ఆ తర్వాత ఇంట్లో కోడి పెట్టే గుడ్లను తినటానికి అలవాటు పడింది. దానయ్య పెంచుతున్న కోళ్లు పెట్టిన గుడ్లన్నింటినీ ఆ కుక్క తినేసేది. గుడ్లు ఎలా మాయం అవుతున్నాయో తెలుసుకోవాలని దానయ్య భార్య ఒక రోజు గమనించింది. కుక్క బాగా ఎరిగిన దానిలాగా కోళ్ల గూటిలోకి వెళ్లిపోవడం, కోడిగుడ్లను తినడం చూసింది. దాంతో ఆ కుక్కను నాలుగు దెబ్బలేసి ఇంటి నుంచి తరిమేశారు.

గుడ్లు తినటానికి అలవాటు పడిన కుక్కకు ఇక ఏ ఇతర ఆహారమూ నచ్చేది కాదు. దాంతో పక్షుల గుడ్లు తినటానికి ప్రయత్నించేది. అందుకోసం ఆ కుక్క పొలం గట్ల మీద, నదితీరాల్లో తిరుగుతూ తీతువు పిట్టల గుడ్లు, ఇసుకలో తాబేళ్ల గుడ్ల కోసం వెతికేది.

ఓ రోజు కుక్క నది గట్టుమీద ఓ నత్తగుల్లను చూసింది. ఆకలితో ఉన్న కుక్క దాన్ని ఏదో గుడ్డు అనుకొని గబుక్కున మింగేసింది. కుక్క పొట్టలోకి వెళ్లిన నత్తగుల్ల ముక్కలు పేగుల్లోకి చొచ్చుకొని వెళ్లి పోయాయి. పొట్టలోకి వెళ్లిన నత్త కుక్కను బాధించసాగింది. కుక్క బాధతో చాలా సేపు విలవిల లాడింది. తర్వాత ఎప్పటికో కడుపునొప్పి తగ్గింది. ‘‘గుండ్రని వస్తువులన్నీ గుడ్లనుకుని, పొరపడ్డాను. కంటికి కనపడ్డ వస్తువుల్ని ముందూ వెనకా చూడకుండా తింటే ఇలాగే తిప్పలు పడాల్సి వస్తుంది. తినదగిన వస్తువని తెలుసుకొన్న తర్వాతే తినాలి. తెలుసుకోకుండా తింటే కష్టాలు తప్పవు. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది’’అని అనుకుంది. అప్పటి నుంచి ఆ కుక్క జాగ్రత్తగా ఉండసాగింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top