You Are Here: Home » చిన్నారి » తత్కాల్‌తో తాంబూలాలు

తత్కాల్‌తో తాంబూలాలు

ఆ ఉదయం పూట చంద్రం తన ఆఫీసులో కూర్చుని సీరియస్‌గా గోళ్లు గిల్లుకుంటుండగా ‘ఆఫీసర్‌గారు రమ్మంటున్నారు’ అంటూ లోపల్నుండి పిలుపు వచ్చింది. ఆ పిలుపు వినీ వినగానే చంద్రం గుండె వేగం ఒక్కసారిగా పెరగ్గా, వణుకుతున్న కాళ్లతో ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్లే చిన్నపిల్లవాడిలా భయపడుతూ ఆఫీసర్ క్యాబిన్‌లోకి వెళ్లి నంగి నంగిగా ఓ గుడ్ మార్నింగూ, ఓ వెల్‌కమూ, ఓ ఆల్ ది బెస్టూ చెప్పి గోడకానుకుని నిలబడ్డాడు.

ఓ పదినిమిషాల పాటు చంద్రం చేత అలా నిరీక్షింపజేసిన తర్వాత, ఆఫీసర్‌గారు తన కళ్ల సందుల్లోంచి గుర్రుగా చూస్తూ, ‘‘ఏంటీ! శెలవు కావాలని అర్జీ పెట్టావూ? ఇలా ఎవరికి వారు ఎప్పటికప్పుడు శెలవులు పెడితే ఆఫీసు పనంతా ఎక్కడికక్కడ ఆగిపోదూ!’’ అంటూ ఘీంకరించారు.
‘ఆఫీసు పనా?’ అనుకున్నాడు చంద్రం తన గోళ్ల వంక చూసుకుంటూ. అయినా ఈయన శెలవెప్పుడు ఇచ్చాడనీ! ఎప్పుడో ఏడాది క్రితం తన మేనల్లుడి పెళ్లంటేనూ ఆ పెళ్లి శుభలేఖ జిరాక్సు తీసుకునిగానీ శెలవు మంజూరు చేయలేదు.

‘‘అది కాదు సార్. నాకు పెళ్లి కుదిరింది. రేపు పదో తారీఖున తాంబూలాలు పుచ్చుకుంటున్నాం. అందుకనే శెలవు కావాలని అడుగుతున్నాను’’ అంటూ వీలయినంత దీనంగా అడిగాడు చంద్రం.
ఆ మాటలు వినగానే ‘‘పెళ్లా?’’ అని అరిచారు ఆఫీసర్‌గారు ఉలిక్కిపడుతూ. ఆపై కొండపల్లి బొమ్మలా మెడకాయ తిప్పుతూ, ‘‘ఆహా! నువ్వేదో అమాయకుడివనుకున్నాను. ఫర్వాలేదే! నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావన్నమాట.

అయినా ఆ తాంబూలాల కార్యక్రమం ఏదో ఆదివారం పెట్టుకోవచ్చు కదా!’’ అని దెప్పుతూ శెలవు చీటీపై సంతకం చేశారు. అసలే కుదరక కుదరక ముప్ఫై తొమ్మిదేళ్లకి పెళ్లి కుదరబోతుంటే, మధ్యలో ఈ దెప్పిపొడుపులొకటి అని నొచ్చుకుంటూ ఆఫీసరుగారి క్యాబిన్‌లోంచి బయటపడ్డాడు చంద్రం.

ఎలాగోలా శెలవు దొరికిన విజయోత్సాహంతో తన సీట్లో కూలబడుతూ ‘హమ్మయ్య! సగం టెన్షన్ వదిలిపోయిందనుకో’ అంటూ తన పక్క సీటులో ఉండే శేఖరానికి వినబడేలా ఓ నిట్టూర్పు విడిచాడు. ‘‘అదేమిటీ ఇంకా టికెట్టు దొరకందే’’ అని సదరు శేఖరం గుర్తుచేయడంతో, సుందరం నెత్తిన ఇంకో బండ పడింది. అసలే తను పనిచేస్తున్నది చెన్నై బ్రాంచిలో, పెళ్లికూతురు వాళ్లదేమో హైదరాబాదయ్యె! రెండు ఊళ్ల మధ్య ఉన్నది మూడే మూడు రైళ్లు.

వాటిలో ప్రయాణించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఓ పదిరైళ్లకు సరిపడా జనం. వచ్చేది పండుగ సీజన్. ‘నో’ అంటూ ఒక్కసారిగా అరిచాడు చంద్రం ఆ గణాంకాలన్నీ తల్చుకుని. ఆ సాయంత్రం ఆఫీసు నుండి బయటకి వచ్చీరాగానే శేఖరాన్ని వెంటబెట్టుకుని ఆదరాబాదరాగా రిజర్వేషన్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు చంద్రం.

లైన్లో నిల్చున్న ఓ నలభై నిమిషాలకి కాబోసు, చంద్రం వాళ్ల వంతు వచ్చింది. తన చేతిలోంచి ఓ రిజర్వేషన్ ఫారాన్ని కౌంటర్ లోపలికి అందించి వీలైనంత సౌమ్యంగా ‘సైడ్ లోయర్ బెర్త్ ప్లీజ్’ అని అభ్యర్థించాడు. దానికి ఎటువంటి ప్రతిస్పందనా లేకపోయేసరికి ‘సైడ్ అప్పర్ ఆల్సో ఓకే’ అని రాజీపడ్డవాడిలా ఓ ఫోజిచ్చాడు. అప్పుడొచ్చింది లోపల్నుండి ప్రతిస్పందన ‘నూత్తి పదనారు వెయిటింగ్’ అని. చంద్రానికి ఆ నూత్తి పదనారు ఏమిటో అర్థం కాలేదు గానీ వెయిటింగ్ అన్నది మటుకు దిమ్మతిరిగేలా అర్థం అయి ఉసూరుమంటూ కౌంటర్ నుండి కదిలాడు.

‘‘మరేం కంగారుపడకు. నాకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఒకడున్నాడు. మన తెలుగువాడే! తనేమన్నా సాయం చేయగలడేమో చూద్దాం పద’’ అంటూ స్టేషన్ దగ్గర్లో ఉన్న టీస్టాల్లో పొగలు కక్కుతున్న టీ తాగుతూ చంద్రానికి అభయమిచ్చాడు శేఖరం. ఆపై స్టేషన్ దగ్గర్లోని సందులు, గొందుల్లోంచి పద్మవ్యూహంలోని అభిమన్యుడిలా చొచ్చుకుపోతూ ఓ బడ్డీకొట్టు ముందుకు చంద్రాన్ని చేర్చాడు.

తన ఎదురుగా ఉన్న బడ్డీకొట్లో పేర్చి ఉన్న సిగరెట్ ప్యాకెట్లూ, పాన్‌పరాగ్ దండలూ, దువ్వెనలూ, సబ్బులూ చూస్తున్న చంద్రాన్ని కాస్త పైకి చూడమన్నట్లుగా సైగచేశాడు శేఖరం. చంద్రం పైకి చూడగానే పైన ఉన్న ఓ పాత బోర్డుమీద ఓ రెండు విమానం బొమ్మలూ, వాటి మధ్యన ‘ఏళుమళై ట్రావెల్స్: బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ టు ఆల్ ప్లేసెస్ – ప్రొప్రైటర్ ఏళుమళై’ అని రాసి ఉంది.

శేఖరాన్ని చూడగానే కొట్లో సాదరంగా లేచి నిల్చున్న వ్యక్తిని చంద్రానికి పరిచయం చేస్తూ, ‘‘ఇతనే నేను చెప్పిన ట్రావెల్ ఏజెంట్ ఏడుకొండలు’’ అంటూ ‘చూశావా నా పరపతి’ అన్నట్లు ముసిముసిగా నవ్వాడు శేఖరం.

‘‘మీ పేరు ఏడుకొండలైతే బోర్డుమీద ఏళుమళై అని ఉందేమిటి?’’ అని అయోమయంగా అడిగాడు చంద్రం.
చంద్రం అడిగిన ప్రశ్నకు ఏడుకొండలు కాసింత సిగ్గుపడుతూ ‘‘మన రాష్ట్రంలోనేమో బయటివాళ్లకి ఎక్కువ విలువనిస్తాము. ఇక్కడేమో తమ వాళ్లకే ఎక్కువ విలువనిస్తారు. అందుకనే ఏడుకొండలుగా కాక ఏళుమళైగా చలామణీ అవుతున్నాను’’ అంటూ ప్రాంతీయ‘తత్వాన్ని’ వివరించాడు.

ఏడుకొండలు ఉరఫ్ ఏళుమళై లౌక్యాన్ని చూసిన చంద్రానికి ఆశ్చర్యంతో పాటుగా అతడు తన కార్యాన్ని సాధించగలడన్న నమ్మకం కూడా కలిగింది. కానీ ఆ నమ్మకం బలపడేలోగానేఏడుకొండలు మాటలకి మళ్లీ కుప్పకూలిపోయింది ‘‘ప్చ్! కష్టం సార్. ఓ నెలరోజులు ముందుగానైతే ఏర్పాటు చేయగలను కానీ, మరీ వారం ముందరైతే కష్టమండీ’’ అంటూ చంద్రం వంక జాలిగా చూశాడు.

ఏడుకొండలు అంత నిష్కర్షగా తన అశక్తతని వెలిబుచ్చడంతో కంగుతిన్న శేఖరం, ‘‘నువ్వే అలాగంటే ఎలా ఏడుకొండలూ, తను ఎలాగైనా ఆ రోజుకి హైదరాబాద్ వెళ్లి తీరాలి…’’ అంటూ సమస్య తీవ్రతని తెలియజేశాడు.

శేఖరం మాటలకి ఏడుకొండలు ‘చ్చు చ్చు చ్చు’ అని కాసేపు సానుభూతిని వ్యక్తం చేసి, ఆపై ఓ పరిష్కారం కనుక్కునేవాడిలా కాసేపు బడ్డీకొట్టు పైకప్పు వంక చూస్తూ, ‘‘దీనికల్లా ఒకటే మార్గం ఉందండీ, మీ ప్రయాణానికి ఓ రోజు ముందరగా తత్కాల్ రిజర్వేషన్ చేయించుకోవడమే. అయితే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. మామూలు టికెట్టు మీద నూట యాభై రూపాయల తత్కాల్ ఛార్జీ ప్లస్. పొద్దున్నే ఐదు గంటలకల్లా కౌంటర్ దగ్గర కాపు కాసినందుకుగాను ట్రావెల్ ఏజెంట్‌కి మూడు వందల కమీషన్. ఇంతా చేసి టికెట్టు దొరుకుతుందన్న గ్యారెంటీ ఇవ్వలేను. ఎందుకంటే సామాన్యంగా కౌంటర్ తెరిచిన పావుగంటలోపే తత్కాల్ టిక్కెట్లన్నీ ఖర్చయిపోతాయి గనుక! మీకు కనుక ఈ పద్ధతి ఓకే అయితే, ఓ రోజు ముందర నాకు డబ్బులిచ్చి వెళ్లండి’’ అంటూ వ్యూహరచనని వివరించిన మిలిటరీ కమాండర్‌లాగా వారిద్దరి వంకా ఠీవిగా చూశాడు.

‘‘అవసరమైతే మళ్లీ వస్తాం’’ అని ఏడుకొండలు దగ్గర శెలవు తీసుకుని, ఆ సందుల్లోంచి తిరుగుముఖం పట్టిన ఇద్దరూ బ్లాక్‌లో ఫ్లాప్ సినిమాని చూసినవాళ్లలా నిరుత్సాహంగా నడవసాగారు.
‘నాకిలా జరగాల్సిందే’ అనుకున్నాడు చంద్రం కసిగా. తాను హైదరాబాద్‌లో ఉండగా ఎన్ని సంబంధాలు వచ్చాయనీ! పెళ్లికూతురి జడ చిన్నదిగా ఉందని ఓ సంబంధాన్నీ, పెళ్లిచూపుల్లో పెట్టిన కారప్పూస నిలవ వాసన వచ్చిందని ఓ సంబంధాన్నీ, అమ్మాయి జాతకంలోని గురుడు, శుక్రుడి వంక కోపంగా చూస్తున్నాడని ఓ సంబంధాన్నీ… ఇలా ఎన్నో సంబంధాలని వదులుకున్నాడు. ఇప్పుడిక వదులుకునే వయసా దాటిపోయింది.

సందులూ గొందుల్లోంచి శేఖరం వెనకే యాంత్రికంగా నడుస్తూ ఉన్న చంద్రం మెదడు మటుకు ఆలోచనల్తో తెగ వేడెక్కిపోయింది. ఆ వేడిలోనే ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు-‘ఎవడికో మూడు వందలు ఇచ్చి టికెట్ రిజర్వ్ చేయించుకోవడమేవిటి నాన్సెన్స్! ఆ తత్కాల్ టికెట్ ఏదో నేనే సంపాదిస్తాను. నేనంటే ఏమిటో ఈ ప్రపంచానికి నిరూపిస్తాను’ అంటూ శేఖరం భుజాల మీద చేతులు వేసి, అతన్ని కుదిపేస్తూ ఆవేశంగా తన నిర్ణయాన్ని తెలియజేశాడు.

ఆ మరుసటి నాలుగు రోజులూ చంద్రం ఆలోచనలన్నీ తత్కాల్ టికెట్ చుట్టూనే… సంభాషణలన్నీ తత్కాల్‌పైనే..! కనపడ్డ ప్రతివాడినీ, ‘‘నీకు తత్కాల్ అంటే ఏమిటో తెలుసా?’’ అని నిలదీయసాగాడు. చివరికి ఓ రోజు ఫైలుమీద తన పేరుకి బదులు ‘తత్కాల్’ అని సంతకం చేసి, ఆ పూట భోజనానికి సరిపడా తిట్లు తిన్నాడు.

చివరికి ఆ రోజు రానే వచ్చింది. తత్కాల్ టికెట్టు కోసం బయల్దేరవలసిన ఆ శుభఘడియలు రానే వచ్చాయి. పరీక్షలప్పుడు కూడా పదిగంటల వరకూ నిద్రపోయేంతటి స్థితప్రజ్ఞత గల మన చంద్రం, ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి, కాలకృత్యాలన్నీ ముగించుకుని, బాబాగారి పటానికి దణ్నం పెట్టుకున్నాడు. ఆపై హాల్లో ఉన్న తన తల్లిని కూడా లేపి, ఆమె ఆశీస్సులని తీసుకుందామనుకున్నాడు కానీ అలా అర్ధరాత్రి పూట లేపితే ఆశీస్సులు లభిస్తాయో లేదో అని సంశయించి రోడ్డుమీదకి వచ్చి సిటీబస్సు కోసం నిరీక్షించసాగాడు.

నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై అలా ఓ పావుగంట పాటు నిరీక్షించిన తర్వాత వచ్చిన సిటీబస్సులోకి ఆబగా ఎక్కిన చంద్రం కళ్లకి ఆ బస్సులోని డ్రైవరూ, కండక్టరూ, ఉన్న నలుగురు ప్రయాణికులూ అంతా తనలాగే మత్తుగా ఉన్నట్టు తోచారు. మొత్తానికి బస్సు బస్సంతా ఆ చీకటి రోడ్లపై మత్తుగా కదలసాగింది. ఊరు ఊరంతా ఒళ్లు తెలియకుండా గురక పెడుతున్న ఆ వేళలో తమవంటి కొద్దిమంది అభాగ్యులు మాత్రమే ఇలా రోడ్ల వెంబడి తిరగడం తల్చుకుని చంద్రం మనసు బాధగా మూలిగింది.

కాని, కిక్కురుమనకుండా తన స్టాప్ వచ్చేదాకా కూర్చుండిపోయాడు. రిజర్వేషన్ కౌంటరు వద్దకు చేరుకునేసరికి తను తప్ప వేరే మానవుడెవ్వడూ ఉండడన్న నమ్మకంతో నింపాదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న చంద్రానికి అల్లంత దూరం నుండే కనబడుతున్న జనసందోహాన్ని చూసి మత్తు కాస్తా ఎగిరిపోయి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు.

అమ్మో! ఇంతమంది జనమే అనుకుంటూ చంద్రం లబలబా గేటు దగ్గర ఉన్న వాచ్‌మన్ దగ్గరకి పరిగెత్తి అతని దగ్గరున్న పుస్తకంలో తన పేరు నమోదు చేసుకున్నాడు – ఆ లిస్టులో తనకంటే ముందర 46 మంది పేర్లున్నాయి!

ఓ పాతిక మంది కూర్చుని ఉన్న డ్రైనేజీ గట్టుమీద తను కూడా ఇరుక్కుని కూర్చున్న చంద్రం తన వాచీవంక చూసుకునేసరికి సమయం ఐదున్నర. ఇంకా రెండుగంటల పాటు ఆ డ్రైనేజీ కంపుని ఆస్వాదిస్తూ గడపాలనే సత్యానికి చంద్రం కడుపులో దేవినట్లయ్యింది. ఉబుసుపోక తన చుట్టుపక్కల జనాల్ని గమనించడం మొదలుపెట్టిన చంద్రానికి వాళ్లలో చాలామంది ట్రావెల్ ఏజెంట్లేనని అర్థమయ్యింది. పైగా వారిలో కొందరు రాత్రి పదిగంటలకే అక్కడికి వచ్చి పడుకున్నారని తెలియడంతో ఏడుకొండలుని మించిన లౌకికులు ఆ మహానగరంలో చాలామందే ఉన్నారన్న విషయం బోధపడింది.

ఎప్పుడు కోడి కూస్తుందా, ఎప్పుడు లేచి కాఫీ కలుపుకుందామా అని ఎదురుచూసే ఒంటరి ముసలమ్మలాగా, ఎప్పుడు ఎనిమిదవుతుందా, ఎప్పుడు కౌంటర్ తెరుస్తారా అని చంద్రం నీరసంగా ఎదురుచూడసాగాడు. ఐతే, ఆ గుంపులో ఉన్నవారందరూ చంద్రంలాగా నిస్పృహగా ఉన్నారనుకోవడానికి లేదు. ప్రతి గుంపులోనూ ఓ ధీరోదాత్తుడు ఉంటాడు. క్లిష్ట సమయాలలో తాను నిబ్బరంగా ఉండటమే కాకుండా, తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉత్తేజపరుస్తూ ఉంటాడు.

అలాంటి పెద్దమనిషే ఒకాయన చంద్రం పక్కన ఉన్నాడు. సదరు ధీరోదాత్తుడు తన చుట్టూ ఉన్న గుంపుని ఉద్దేశించి ‘రైలు ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు’, ‘స్వాతంత్య్రసంగ్రామంలో రైళ్ల పాత్ర’, ‘రైళ్లలో సెల్‌ఫోన్ వాడకం’ లాంటి అనేకానేక విషయాలపై సుదీర్ఘంగా ఉపన్యసించసాగాడు.

అలా ఉపన్యాసాలూ, నిట్టూర్పులూ, తిట్లూ, కబుర్ల మధ్య కాలం గూడ్సుబండిలా నిదానంగా కదలసాగింది. ఆరున్నరకి కాబోసు రకరకాల క్యాన్లు తగిలించిన ఓ సైకిల్‌ని నడుపుకుంటూ ఓ ముసలాయన ఆ గుంపు మధ్యలోకి వచ్చాడు. టీ, బిస్కెట్లూ, సిగరెట్లూ, సమోసాలూ, చెగోడీలూ.. లాంటి నిత్యవసర వస్తువులతో ఆ క్యాన్లన్నీ కళకళలాడిపోతున్నాయి. గుంపు గుంపంతా కలిసి ఆ క్యాన్లని ఖాళీ చేసిన తర్వాత, ఆ ముసలాయన తన సైకిల్‌ని నడిపించుకుంటూ కదిలిపోయాడు.

ముసలాయన వెళ్లిపోయిన కాసేపటికి వార్తాపత్రికలు అమ్ముకునే ఓ కుర్రవాడు వచ్చి కాసేపు హడావిడి చేసి, పత్రికలు కొన్నవాళ్లకి కృతజ్ఞతలు చెప్పి, కొననివాళ్లని బూతులు తిట్టి వెళ్లాడు. పనిలో పనిగా ఓ ఇద్దరు కుర్రవాళ్లు వచ్చి ఏవో కరపత్రాలు పంచిపెట్టారు. అప్పటికి సమయం ఏడుగంటలా ముప్ఫై నిమిషాలు కావడంతో తత్కాల్‌కి కౌంట్‌డౌన్ మొదలయ్యింది.

కౌంటర్ దగ్గరున్న వాచ్‌మన్ కదలికలని బట్టి అతను తలుపులు తీయడానికి సిద్ధపడుతున్నాడన్న విషయాన్ని పసిగట్టిన జనం ఒక్కసారిగా డ్రైనేజీ గట్లూ పొదలూ వదిలి, సంభాషణలన్నీ మధ్యలోనే తుంచివేసి, స్కూలు గంట చెవినపడ్డ పిల్లల్లాగా కౌంటర్ వైపుకి పరుగులు తీశారు. ఎవరో వాచ్‌మన్ దగ్గర ఉన్న లిస్టు తీసుకుని పేర్లని చదవడం మొదలుపెట్టగానే, ఆ ప్రకారంగా ఒక్కొక్కరే లోపలికి వెళ్లి లైన్లో నిలబడ్డారు, అప్పటికి సమయం-7.45.

తెలుగు సినిమాల్లోని టైం బాంబులాగా గోడగడియారంలోని ముల్లు నిదానంగా కదలసాగింది, అప్పుడయింది 8.00 గంటలు – బూమ్! దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు ఒక్కసారిగా ‘నాకో బెర్త’ంటే, ‘నాకో బెర్త’ంటూ కంప్యూటర్లని ప్రాధేయపడసాగారు. చంద్రం ముందున్న లైను చకచకా కదలసాగింది. ఎవరన్నా ప్రయాణికుడు కౌంటర్ ముందర రెండు నిమిషాలకి మించి నిల్చుంటే, హాహాకారాలూ, బూతులూ వినవస్తున్నాయి. బుకింగ్ క్లర్కులు కూడా తాము ప్రభుత్వోద్యోగులన్న సంగతి పక్కనపెట్టి చురుగ్గా పనిచేయసాగారు. అయినా టికెట్లు అయిపోయాయనో, చిల్లర తేలేదనో కొంతమంది ప్రయాణికులని తిప్పి పంపక తప్పడం లేదు.

8.20కి చంద్రం వంతు వచ్చింది. అప్పటికే ముందున్న ప్రయాణికుడు టికెట్ దొరకలేదని తిట్టుకుంటూ వెనుదిరగడంతో, తాను కూడా ఎక్కడ ‘వెయిటింగ్’అన్న మాట వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కౌంటర్ లోపలికి తన ఫారాన్ని అందించి కౌంటర్ పైన ఉన్న డిస్‌ప్లే వంక గుడ్లప్పగించి చూడసాగాడు. ట్రైన్ నంబరుని, ప్రయాణపు తేదీని బుకింగ్ క్లర్కు తన ముందున్న కీబోర్డుపై టపటపలాడించగానే ‘29 ఎవైలబుల్’ అన్న ఎర్రటి అక్షరాలు డిస్‌ప్లేపై ప్రత్యక్షం కావడంతో ‘యాహూ’ అని అరవబోయి తమాయించుకున్నాడు.

ఆ పూట చంద్రం తన ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరికీ మనిషికి ఏడెమినిది సార్లు చొప్పున తన తత్కాల్ విజయగాథని వినిపించాడు. అయితే అతని విజయాన్ని చూసిన ఏ దేవతకి కన్నుకుట్టిందో గాని, ఆ మరుసటిరోజు మధ్యాహ్నం అతడికో ఫోన్ వచ్చింది.

‘ఎవరో దగ్గరి బంధువులు చనిపోతేనూ పెళ్లికూతురి కుటుంబం బెంగళూరుకి వచ్చిందట. వెళ్లడమైతే వెళ్లారుగానీ తిరిగి రావడానికి టికెట్టు దొరక్కపోవడంతో గత మూడు రోజులుగా పెళ్లికూతురి తండ్రి తత్కాల్ కోసం ప్రయత్నిస్తున్నాడనీ, టికెట్ దొరికిన వెంటనే కబురు చేస్తామనీ, అప్పుడు వచ్చి తాంబూలాలు పుచ్చుకోమని’ సదరు ఫోన్ కాల్ సారాంశం. హతవిధీ! ఇప్పుడు మన చంద్రం మరోసారి తత్కాల్ కోసం బయల్దేరాలన్నమాట! ఇక తిరుగు ప్రయాణమంటారా, అది ఇంకో హసనం!

కె.ఎల్.సూర్య

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top