You Are Here: Home » చిన్నారి » తగిన శాస్తి

తగిన శాస్తి

అనగనగా ఒక అడవిలో ఒక నీటిఏనుగు ఉండేది. దానికి కోపం ఎక్కువ. అది ఉండే చోటుకు వేరే జంతువులు వస్తే ఊరుకునేది కాదు. ఒకరోజు ఒక తాబేలు అనుకోకుండా ఆ నీటిఏనుగు ఉన్న చోటుకు వచ్చింది. దానికి ఆ నీటిఏనుగు సంగతి బొత్తిగా తెలియదు. తాబేలును చూసిన నీటిఏనుగుకు విపరీతంగా కోపం వచ్చింది.

‘‘ఇది నా చోటు. నేనుండే చోటుకు రావడానికి నీకెంత ధైర్యం’’ అని రంకెలు వేస్తూ, వేగంగా తాబేలు మీదకు దూసుకెళ్లింది. తనను తాను ప్రమాదం నుంచి కాపాడుకోవడం కోసం తాబేలు తన వీపు మీద ఉండే కవచంలోకి ముడుచుకుపోయింది.
తాబేలు దగ్గరకు వచ్చిన నీటిఏనుగుకు అది రాయిలా కనిపించింది. తాబేలు తల, కాళ్లూ ఏవీ కనిపించలేదు. తనను తాబేలు ఆట పట్టిస్తోందని నీటిఏనుగుకు మరింత కోపం వచ్చింది. తాబేలును కాలితో ఒక్క తన్ను తన్నింది. అది వెళ్లి కాస్త దూరంలో పడింది. నీటిఏనుగుకు ఇంకా కోపం తగ్గలేదు. తాబేలు దగ్గరకు మళ్లీ వెళ్లి మరోసారి గట్టిగా తన్నింది. గట్టి రక్షణ కవచం ఉన్న తాబేలును నీటిఏనుగు ఏమీ చేయలేకపోయింది.

ఇదంతా చెట్టు మీద నుంచి చూస్తున్న కొన్ని కొండముచ్చులు చప్పట్లు చరుస్తూ నవ్వుకోసాగాయి. వాటి కిచకిచలు శృతి మించేసరికి నీటిఏనుగు దృష్టి వాటి మీద పడింది. తాబేలును కొట్టమని నీటి ఏనుగును, తప్పించుకోమని తాబేలునూ ప్రోత్సహిస్తూ ఆ దెబ్బలాటను చూస్తూ ఆనందిస్తున్నాయి కొండముచ్చులు. తాబేలు కూడా వాటిని గమనించింది. నెమ్మదిగా తల బయటకు పెట్టి నీటిఏనుగు వైపు చూసింది. నీటిఏనుగు ఏదో సైగ చేసింది. తాబేలు ఆ సైగను అర్థం చేసుకుని మళ్లీ లోపలకు ముడుచుకుంది. కొండముచ్చులకు తగిలేలా గురిచూసి నీటిఏనుగు తాబేలును గట్టిగా విసిరికొట్టింది. అది సరిగ్గా కొండముచ్చుల దగ్గర పడింది.

రాయిలా ఉన్న తాబేలు వచ్చి గట్టిగా తగలడంతో కొండముచ్చుల మూతులు చితికిపోయాయి. నీటిఏనుగూ, తాబేలూ కలిసి కొండముచ్చులను చూసి నవ్వడం మొదలుపెట్టాయి. ‘దెబ్బలాటను చేతనైతే ఆపాలి కాని ప్రోత్సహిస్తే ప్రమాదం’ అని గ్రహించిన కొండముచ్చులు అప్పటినుంచి జాగ్రత్తగా ఉండసాగాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top