You Are Here: Home » చిన్నారి » తగినశాస్తి

తగినశాస్తి

అనగనగా ఒక ఊరిలో ఒక రొట్టెల వ్యాపారి ఉండేవాడు. అతడు రొట్టెల తయారీకి అవసరమైన నేతిని మరొక వ్యాపారి దగ్గర కొనేవాడు. అలా కొంతకాలం గడిచిన తరవాత ఒకరోజు రొట్టెల వ్యాపారికి నేతి వ్యాపారి మీద అనుమానం వచ్చింది. అతడు ఇస్తున్న నెయ్యి పూర్తిగా కేజీ ఉంటుందో లేదో తెలుసుకోవాలని భావించాడు. తూకం వేస్తే పావు కేజీ తక్కువ వచ్చింది. రొట్టెల వ్యాపారి తాను మోసపోతున్నట్లుగా గ్రహించాడు.

వెంటనే రాజు గారి దగ్గరకు వెళ్లాడు. తనని నేతి వ్యాపారి మోసం చేశాడని రాజుకి ఫిర్యాదు చేశాడు. వెంటనే రాజు భటుల్ని పిలిచి, నేతి వ్యాపారిని తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ మేరకు నేతి వ్యాపారిని రాజుగారి ఆస్థానానికి తీసుకువచ్చారు భటులు.

అప్పుడు రాజు ‘‘ఏమయ్యా! నువ్వు ఎంతకాలం నుంచి రొట్టెల వ్యాపారిని మోసం చేస్తున్నావు.?’’ అని నేతి వ్యాపారిని అడిగాడు. ‘‘మహారాజా! నేనేం మోసం చేయలేదు’’ అన్నాడు అమాయకంగా నేతి వ్యాపారి.

‘‘ఏదీ… నేతిని తూకం వేసే రాయిని చూపించు…’’ అని అడిగాడు రాజు.
‘‘అయ్యా! నా దగ్గర తూకం వేసే రాళ్లేవీ లేవు. తక్కెడ మాత్రం ఉంది. నేను రోజూ నా కుటుంబానికి కావలసిన కేజీ రొట్టెలను ఆయన దగ్గర కొనుక్కొని వస్తాను. ఆ రొట్టెలను తక్కెడలో ఉంచి నేతిని తూచి రొట్టెల వ్యాపారికి ఇస్తున్నాను. అంతే తప్ప అంతకు మించి నాకు ఏ మోసం తెలియదు’’ అన్నాడు నేతి వ్యాపారి.

అప్పుడు రాజుగారు రొట్టెల వ్యాపారిని పిలిచి, ‘‘నీ దగ్గర ఈ నేతి వ్యాపారి రొట్టెలు కొంటున్నాడా?’’ అని అడిగాడు. ‘‘కొంటున్నాడు’’ అని సమాధానం చెప్పాడు రొట్టెల వ్యాపారి. మోసం ఎవరు చేశారో రాజుకి అర్థం అయింది. ‘‘నువ్వు మోసం చేద్దామనుకున్నావు. కాని నువ్వే మోసపోయావు. నువ్వు శిక్షార్హుడవు. నువ్వు చేసిన మోసానికి నేతి వ్యాపారికి పరిహారం చెల్లించు’’ అని రాజు తీర్పు చెప్పాడు.

‘‘క్షమించండయ్యా’’ అంటూ తన తప్పుని ఒప్పుకున్నాడు రొట్టెల వ్యాపారి. ‘‘ఇంకెప్పుడూ ఎవరినీ మోసం చేయకు’’ అని హెచ్చరించి పంపించాడు రాజు. అప్పటి నుంచి రొట్టెల వ్యాపారి మోసం చేయడం మానేసి నిజాయితీగా జీవించసాగాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top