You Are Here: Home » చిన్నారి » టైటానిక్

టైటానిక్

ఒక పదం 1912లో మరోసారి కొత్తగా పుట్టింది. దీనికి నిఘంటువు చెప్పే అర్థం సరిపోదు. ఇక్కడ భాషకన్నా భావం ముఖ్యం. ఆ కొత్తపదం ‘టైటానిక్’. దానర్థం ఏమిటి? ఒక విశేషణం, ఒక చరిత్ర, ఒక చెదిరిపోయిన కల, ఒక ఉద్వేగం, ఒక దుఃఖం, ఒక సజీవసమాధి, ఒక మూఢనమ్మకం, ఒక విలాసం, ఒక పుట్టిమునిగిన ఓడ, ధైర్యం, కర్తవ్యం, ఆర్తనాదం, విధ్వంసం, మృత్యువు, మహాసముద్రంలో కలిసిపోయిన వందలాదిమంది కన్నీటిధార.

కనీ వినీ ఎరగని రీతిలో నిర్మితమై, మహా ఆర్భాటంగా మొదలై, తొట్టతొలి ప్రయాణంలోనే మంచుకొండను ఢీకొట్టి అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ ఓడ. వేలమందిని జలసమాధి చేసిన ఆ ఘోరప్రమాదం జరిగి నేటికి సరిగ్గా వందేళ్లు.

‘ఈవా’ ఏడేళ్ల పాప. ఆ పిల్ల కళ్లు బాగుంటాయి. భవిష్యత్తులో ఒక పరిపూర్ణ స్త్రీత్వపు వికాసానికి తగినంత వెలుగుంటుంది వాటిల్లో. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తను కూడా చెప్పలేదు. రెండ్రోజుల్లో వాళ్లు కెనడా వెళ్లిపోతున్నారు. కొత్త ఊరు, కొత్త స్నేహితులు, కొత్త ఆటలు. పాత దిగులుని కొత్త మురిపెం మింగేసింది.

ఇంకెంత! ఒక్కరోజు గడిస్తే చాలు. తెల్లారితే టైటానిక్ సౌతాంప్టన్(ఇంగ్లాండ్) నుంచి న్యూయార్క్(అమెరికా)కు తన తొట్టతొలి ప్రయాణాన్ని సాగించనుందని పేపర్లలో కూడా రాశారు.

టైటానిక్!
మనుషులింకా గుర్రపుబళ్లల్లో తిరిగే కాలాన, పక్కవాళ్లను ఫొటో తీస్తుంటే తొంగి చూసే ముఖాలున్న కాలాన ఈవా టైటానిక్‌లో ప్రయాణించబోతోంది. సముద్రాన్ని ఓడలో ఈదబోతోంది. ఎంత పెద్ద ఓడ! అందులోనే స్విమ్మింగ్‌పూల్స్, డైనింగ్‌హాల్, సెలూన్, లైబ్రరీ, కెఫేలు, జిమ్, ప్లే గ్రౌండ్. అబ్బో! ఉద్వేగాన్ని ఎంత అణిచిపెట్టుకుంటే, తన ఫ్రెండ్స్ దగ్గర మామూలుగా ఉండగలగాలి! అసలు టైటానిక్ అంటేనే విలాసానికి మరోపేరుగా ఉండాలనికదా యాజమాన్యం లక్ష్యం!

బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ షిప్పింగ్ కంపెనీ ‘వైట్ స్టార్ లైన్’. ఘన చరిత్ర కలిగిన వైట్‌స్టార్ ఇప్పుడు ‘కునార్డ్ లైన్’ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోంది. బ్రిటిష్-అమెరికన్ సంస్థ అయిన కునార్డ్ లైన్ వేగవంతమైన ఓడల్ని నడుపుతుందని పేరు. దాంతో యాత్రికులు అటు క్యూ కడుతున్నారు. పైగా రంగంలో ఉన్న జర్మన్ సంస్థలు కూడా ప్రయాణికుల్ని ఎగరేసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో పోటీలో ముందుండాలంటే వేగం ఒక్కటే చాలదు. విలాసంతో పడగొట్టాలి! అత్యాధునిక పరిజ్ఞానంతో అత్యంత భారీనౌకను నిర్మించ తలపెట్టాడు వైట్‌స్టార్ చైర్మన్ జె.బ్రూస్ ఇస్మే.

వైట్‌స్టార్‌తో మొదట్నుంచీ మంచి సంబంధాలున్న ‘హార్లండ్ అండ్ వోల్ఫ్’కు కబురు వెళ్లింది. ప్రపంచానికే ఓడలు అందజేస్తామని గర్వంగా ప్రకటించుకునే నౌకా నిర్మాణ సంస్థ అది. ఐర్లాండ్‌కు చెందిన ఈ సంస్థను ఎడ్వర్డ్ జేమ్స్ హార్లండ్, గుస్తావ్ విల్‌హెల్మ్ వూల్ఫ్ స్థాపించారు, తమ పేర్ల మీదుగా. తరాలుగా ఈ రంగంలో ఉన్న ఈ కంపెనీ ప్రస్తుత చైర్మన్ విలియం పిర్రీ.

ఐదు శాతం లాభపు మార్జిన్ ఒప్పందంతో పిర్రీ ఆ ప్రాజెక్టును చేపట్టాడు. ప్రపంచ చరిత్రలోనే అంత భారీ నౌకను నిర్మించడానికి అంతకుముందు ఎవరూ సాహసించలేదు. వైట్‌స్టార్ తలపోసింది. హార్లండ్ అండ్ వోల్ఫ్ సాధ్యం చేసింది. దీనికోసం వందలాదిమంది డిజైనర్లు, ఎగ్జిక్యూటివ్లు, కార్మికులు నెలల తరబడి పనిచేశారు.

1908లో కాగితం మీద కనబడిన స్కెచ్ ఇప్పుడు కళ్ల ముందట, కళ్లు పట్టనంతగా కనబడుతోంది. 883 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తు, 46000 టన్నుల బరువు, బొగ్గును నిరంతరం మండించటానికి 29 బాయిలర్లు, మూడువేల మందిని అవలీలగా మోసుకెళ్లగలిగే సామర్థ్యం. (ఇప్పటి లెక్కల్లో) రెండు వేల కోట్ల రూపాయల పైనే ఖర్చు!

10 ఏప్రిల్ 1912
టైటానిక్ ఈ రోజు మిట్టమధ్యాహ్నం తన తొలి ప్రయాణం సాగించనుంది.
ఈవా తన తల్లిదండ్రులు ఎస్తేర్, బెంజమిన్‌తో కలిసి ఓడ ఎక్కింది. వాళ్లు న్యూయార్క్‌లో దిగి, విన్నిపెగ్ వెళ్లాలి. అక్కడో పొగాకు దుకాణం పెట్టుకోవాలి. కొత్త బతుకుదెరువును వెతుక్కుంటూ బెంజమిన్ ఈ ప్రయాణం తలపెట్టాడు. తలా 7 పౌండ్ల థర్డ్ క్లాస్ టికెట్ కొన్నాడు.

వీడ్కోలు, కౌగిలింతలు, ఆనందబాష్పాలు, అన్నీ ముగిశాక, కదులుతున్నట్టు తెలియకుండా చేప పిల్ల ఈదినట్టుగా టైటానిక్ బయల్దేరింది. తీరం నుంచి సముద్రంలోకి దూకి, మరో తీరాన్ని అందుకోవడానికి నెమ్మదిగా పుంజుకుంటూ 9 నాట్స్ వేగంతో పయనిస్తోంది.

ప్రయాణికుల్లో క్రీడాకారులు, మిలిట్రీ అధికారులు, శిల్పులు, ఉపాధ్యాయులు, వడ్రంగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, డ్రైవర్లు ఉన్నారు. కొంతమంది శ్రీమంతులైతే వాళ్లవెంట దాసదాసీలు, వంటగత్తెల్ని వెంటబెట్టుకుని మరీ ఎక్కారు. చంటిపిల్లలు, కన్నెపిల్లలు, పెళ్లి కుదిరినవాళ్లు, మహిళలు, పురుషులు, వృద్ధులు, ప్రణయయాత్రకు వెళ్తున్నవాళ్లు, విహారయాత్ర చేస్తున్నవాళ్లు ఉన్నారు.

డబ్బుల రూపంలో చెప్పాలంటే 870 పౌండ్లు చెల్లించగలిగే ఫస్ట్‌క్లాస్ పెరల్ స్వీట్‌వాళ్లూ, 30 పౌండ్ల ఫస్ట్‌క్లాస్ బెర్త్‌వాళ్లూ, 12 పౌండ్ల సెకండ్ క్లాసు వాళ్లూనూ. వీళ్లందరికోసం క్లీనర్లు, స్టోర్ కీపర్లు, సీమన్లు, వైద్యులతో కూడిన నౌకా సిబ్బంది ఉండనే ఉంది. మొత్తం ఆ ఓడలో ఉన్న జీవితాల సంఖ్య 2340!

చుట్టూ నీలంగా ఎటు చూసినా ఎత్తుపల్లాలు లేని ఒక సమాంతర నేలలా ఉంది అట్లాంటిక్ మహాసముద్రం. సమూహంలో ఒకలా, ఏకాంతంలో ఒకలా, ఎవరికి కావాల్సినట్టు వాళ్లకు కబుర్లు చెబుతోంది.
ఈవా వాళ్లమ్మ అసలే పాతకాలపు మనిషి. టైటానిక్‌కు ధార్మికంగా నామకరణం జరగలేదట. నిర్మాణ సమయంలో 17 మంది చనిపోయారట. అందుకే ఎక్కీ ఎక్కగానే అపశకునం తోచిందట.

అయినా భయం దేనికి?
సాక్షాత్తూ వైట్‌స్టార్ ఛైర్మన్ బ్రూస్ ఇస్మే వాళ్లతో వస్తున్నాడు. తొలి ప్రయాణమైనా సాధారణంగా ఆయన రాడు. కానీ ఇది టైటానికమ్మా! పైగా కెప్టెన్‌గా ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ ఉన్నాడు. ఆ రంగంలో 38 ఏళ్ల అనుభవశాలి. ఎంత కష్ట సమయంలోనైనా తొణకడు. ఇక అపనమ్మకానికి తావెక్కడ?
థామస్ ఆండ్రూస్ కూడా వాళ్లతో ప్రయాణిస్తున్నాడు. నావల్ ఆర్కిటెక్ట్ అయిన థామస్ ‘హార్లండ్ అండ్ వోల్ఫ్’లో డ్రాఫ్టింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్. ఓరకంగా టైటానిక్ డిజైన్‌లో ఈయన కీలక పాత్రధారి.

తనతోపాటు కంపెనీ తరఫున ఒక బృందాన్ని కూడా వెంట తెచ్చాడు. ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ చేయడానికి నోట్సు రాస్తూ కూర్చున్న ఆండ్రూస్, ‘‘మనిషి మెదడు ఎంత పర్ఫెక్ట్‌గా చేయగలదో అంత చేశాం’’ అని సంతృప్తి చెందాడు. తన రెండేళ్ల కూతురు ఎల్బాను మిస్సవుతున్నానని తప్పించి ఏ అసంతృప్తీ లేదు. జీవనవిధానాల్లోంచే మనిషి తన భాషను అల్లుకునే తీరు మారినట్టుగా అప్పటికే ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్ పుట్టింది: ‘‘ఇది టైటానికబ్బా, దీనికేమవుతుంది?’’. ‘మనిషికేగానీ దేవుడికేగానీ దీన్ని నాశనం చేయడం సాధ్యంకాదు.’

మొదటి స్టాపు ఫ్రాన్సులోని చెర్బోగ్. అక్కడ రెండు గంటలు ఆగింది. చేర్చాల్సిన ఉత్తరాల కట్టలు వచ్చిపడ్డాయి. ఎక్కాల్సిన ప్రయాణికులు ఎక్కారు. కొత్త పెయింట్ వాసనకు ఒకావిడ ముక్కుతో నిరసన తెలిపింది. ఇక్కడే జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఎక్కాడు. ప్రయాణికులందరిలోకీ ధనవంతుడు, రచయిత. గర్భిణి అయిన భార్య కూడా ఆయన వెంట ఉంది.

ఓడ స్పీడందుకుంది. 20 నాట్స్ వెళ్తోంది. సముద్రపు నీళ్లతో ఇంజిన్లు చప్పుడుచేస్తూ మాట్లాడుతున్నాయి. రెండ్రోజుల ప్రయాణం తర్వాత ఏర్పడే కొత్త పరిచయాల్తో కొత్త కబుర్లు కొత్త ఉత్సాహంతో చెప్పుకుంటున్నారు ప్రయాణికులు. చిరునామాలు మార్చుకుంటున్నారు. బంధుమిత్రులకు టెలిగ్రాములు పంపుతున్నారు. నీలాకాశం సాక్షిగా ఒకట్రెండు కౌమారపు ప్రేమలు కూడా చిగురిస్తున్నాయి. ‘అంతా బాగానే జరుగుతోంది కదా!’ అని పెద్దమనిషిలాగా కెప్టెన్ స్మిత్ ‘బ్రిడ్జి’ మీదకు వచ్చి చీఫ్ ఆఫీసర్ హెన్రీని ఆరా తీస్తున్నాడు.

తెల్లారి క్వీన్స్‌లాండ్ (ఇప్పుడు కౌ; ఐర్లాండ్) పోర్టులో ఆగింది. ఆహార పదార్థాలు, బొగ్గు, ఇతరత్రా సామాన్లు వచ్చిచేరాయి. కొందరు దిగారు, కొందరు ఎక్కారు. దిగినవాళ్లకు అదృష్టవంతులమని తెలిసే అవకాశముంది. ఎక్కినవాళ్లకు దురదృష్టవంతులమని తెలిసే అవకాశముందా?

సాఫీగా ఓడ వేగం 22 నాట్స్‌కు చేరింది. ఇంజిన్లు కూడా పూర్తి సహకారం అందిస్తున్నాయి. మరో రెండు బాయిలర్లు వెలిగిస్తే మరింత వేగాన్ని అందుకోవచ్చు. చూస్తుంటే అనుకున్నదానికంటే ఒకరోజు ముందే న్యూయార్క్ చేరిపోయిన కొత్త రికార్డు కూడా టైటానిక్ ఖాతాలో పడేట్టుగా ఉంది. అప్పుడిక పేపర్లలో హెడ్‌లైన్స్ చూడాలి!

14 ఏప్రిల్ 1912
ఆరోజు ఆదివారం. అట్లాంటిక్ మహాసముద్రం ప్రశాంతంగా ఉంది. నాల్రోజులుగా ఓడ ఏ అవాంతరం లేకుండా ప్రయాణిస్తోంది. అయితే, పొద్దున, 420ూ నుంచి 49-510గి మధ్యలో ఐస్‌బెర్గ్స్ ఉన్నాయని వైర్‌లెస్ మెసేజ్ అందుకున్న ఆపరేటర్ బ్రైడ్, షిప్‌చార్ట్‌లో రాశాడు. మరొకటి మధ్యాహ్నానికి అందింది. మాటలు వేరుగానీ సందేశం అదే. ‘ఫీల్డ్ ఐస్ ఎక్కువుంది’. అలాంటి సందేశాలు ఈరూట్లో సహజమే. అందుకే అందరూ మామూలుగానే ఉన్నారు. కెప్టెన్ స్మిత్ కూడా రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో నిద్రకుపక్రమిస్తూ ‘బ్రిడ్జ్’ మీద డ్యూటీలో ఉన్న సెకండ్ ఆఫీసర్ లైటాలర్‌కు చెప్పాడు: ‘ప్రాబ్లెమ్ ఏదైనా వస్తే నన్ను లేపు’

ప్రాబ్లెమ్ రానే వచ్చింది. నిద్ర నుంచి లేపేట్టుగా కాదు, నిద్రనుంచి ఉలిక్కిపడి లేచేట్టుగా. అర్ధరాత్రి 11.40కి సముద్రంలో నిగడదన్ని పైకి కనీకనిపించకుండా ఉన్న మంచుకొండను ఓడ ఢీకొందని సిబ్బంది గుర్తించింది. ఎంత నష్టం జరిగిందన్నది అంచనాకు సాధ్యం కావట్లేదు. అసలు ప్రమాదం జరిగిందా?
నెమ్మదిగా ఓడ లోపలికి నీళ్లు ప్రవేశించడం మొదలైంది. ఏ నీటిని ఛేదించడానికి మనిషి పడవను నిర్మించాడో అదే నీరు ఇప్పుడు…

ఏం చేయడం? దగ్గర్లో ఏదైనా ఓడ ఉందేమో కాంటాక్ట్ చేశారు. సమీపంలో ఉందన్న ‘కర్పాతియా’ కూడా వాళ్లను చేరుకోవడానికి 4 గంటలు పడుతుంది. ఇక సమయమే ప్రాణాల్ని కాపాడాలి!
(15 ఏప్రిల్) 12.30 ప్రాంతంలో లైఫ్‌బోట్లను దించడం మొదలుపెట్టారు. ఆడవాళ్లను పిల్లల్ని తొలి ప్రాధాన్యంగా పంపడం ప్రారంభించారు. అప్పటికీ ప్రయాణికులకు టైటానిక్‌కు ప్రమాదం జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. 1.30కి ఓడ ఒరిగిపోవడం మొదలైంది. బోట్లో చోటు కోసం అంతా తండ్లాడుతున్నారు.

బెంజమిన్ పరుగెత్తుకుంటూ కిందికి వెళ్లాడు. ఈవా నిద్రపోతోంది. కూతురు చుట్టూ బ్లాంకెట్ నిండుగా కప్పి, భార్యతో సహా పైకి వచ్చాడు. కుదుపులకు ఈవా మేల్కొంది. అతికష్టమ్మీద ఇద్దరినీ 14వ నంబర్ లైఫ్‌బోట్‌లో ఎక్కించి కూతురితో అన్నాడు: ‘‘అమ్మ చేతిని గట్టిగా పట్టుకో, మంచి పాపవు కదూ!’’

2.20కి ఓడ పూర్తిగా మునిగిపోయింది. వందలాది మంది హాహాకారాలు చేస్తూనేవున్నారు. చిట్టచివరి ఆశ కోసం పెనుగులాడుతూనే వున్నారు. గడ్డకట్టే చలిలో చేతులకున్న గడియారాల ముళ్లు నిలిచిపోయినట్టుగా, గుండెలు కొట్టుకోవడం ఆగిపోయింది. ఢీ కొట్టిన తర్వాత 2 గంటలా 40 నిమిషాల వ్యవధిలో అంతా ముగిసిపోయింది. టైటానిక్ అనేది ఇక లేదు. అన్నీ పర్ఫెక్ట్ అంతా పర్ఫెక్ట్ అనుకున్న టైటానిక్ తొట్టతొలి ప్రయాణంలోనే నట్టేట మునిగింది. మనిషిని ప్రకృతి పూర్తిగా లొంగదీసుకుంది.

తర్వాత అందరూ అన్నట్టుగా ఛైర్మన్ ఇస్మే వేగం కోసం ఒత్తిడి చేశాడన్నా, కెప్టెన్ స్మిత్ మంచుకొండ హెచ్చరికను ఖాతరు చేయలేదన్నా, ఆర్కిటెక్ట్ ఆండ్రూస్ వాటర్‌టైట్ సెక్షన్స్‌లో తగినంత జాగ్రత్త తీసుకోలేదన్నా, ఆరు గంటలు మాత్రమే ట్రయల్ రన్ చేశారన్నా, ఇంకా ఎందరు ఎన్ని కారణాలు చెప్పినా… ఒకే ఒక్క ఉమ్మడి సత్యం! ఆర్కిటెక్ట్ ఆండ్రూస్ మరి కనబడలేదు. శ్రీమంతుడు జాకబ్ మరి కనబడలేదు. కెప్టెన్ స్మిత్ మరి కనబడలేదు. చీఫ్ ఆఫీసర్ హెన్రీ మరి కనబడలేదు. ఈవా వాళ్ల నాన్న బెంజమిన్ కూడా మరి కనబడలేదు. ఏ తల్లి గర్భంలో పుట్టారో ఆ చీకట్లో సముద్రగర్భంలో కలిసిపోయారు.

మరిన్ని లైఫ్‌బోట్స్ ఉంటే అందరూ బతికేవారని తర్వాతి అభిప్రాయం. అప్పటి భద్రతాసూత్రాల ప్రకారం టైటానిక్ 20 బోట్లు మోసుకెళ్లింది. సగం మందికి సరిపోతాయవి. అయితే, ప్రయాణికులు ఎక్కడానికి సందేహించడంతో తొట్టతొలుత బయల్దేరిన కొన్ని పడవలు సగం సగమే నిండుతూ వెళ్లాయి. ఆ వెళ్లినవి కూడా తిరిగిరాలేదు. తిరిగివస్తే మూకుమ్మడిగా మీదపడితే మునిగిపోతామని భయపడ్డారు. లైఫ్‌బోట్లకు జరిగిన తొక్కిసలాటలో కొందరి కాళ్లు, చేతులు విరిగాయి.

ఓ దశలో సిబ్బంది రివాల్వర్స్ వాడాల్సివచ్చింది. లైఫ్‌బోట్ల నుంచి ‘కర్పాతియా’లోకి చేరుకున్న ప్రయాణికుల్లో ఆరుగురు మరణించారు. మిగిలినవాళ్లు ఏప్రిల్ 18న న్యూయార్క్ చేరుకున్నారు. కౌగిలింతలు, కన్నీళ్లు, సంతోషం, సంభ్రమం… మనవాళ్లు ఎవరొచ్చారు? ఎవర్రాలేదు? గాలింపు చేపట్టిన మరో ఓడ 306 శవాలను మోసుకొచ్చింది. కొన్ని మాంసపుముద్దల్ని అంకెల్లోనైతే లెక్కించగలిగారుగానీ ఆనవాళ్లతో గుర్తించలేకపోయారు.

ఏప్రిల్ 19న ఐర్లాండ్‌లో ఉన్న ఆండ్రూస్ తండ్రికి న్యూయార్క్‌లో ఉన్న ఒక బంధువు ద్వారా టెలిగ్రామ్ అందింది: ‘టైటానిక్ ఆఫీసర్లతో మాట్లాడాను. చివరిక్షణం వరకూ ఆండ్రూస్ ధీరుడిలా ప్రవర్తించాడు. ఇతరుల క్షేమం కోసమే ఆరాటపడ్డాడు. మీ అందరికీ హృదయపూర్వక సానుభూతి.’

టైటానిక్ ప్రమాదం తర్వాత సముద్ర ప్రయాణ భద్రత విషయంలో ముఖ్యంగా రెండు మార్పులొచ్చాయి. ఐస్‌బెర్గ్ పాట్రోల్ ఏర్పాటుచేయడం, ప్రతి ప్రయాణికుడికీ సరిపోను లైఫ్‌బోట్స్ ఉండేలా చూడటం.

73 ఏళ్ల తర్వాత- 1985లో రాబర్ట్ బాలార్డ్ అనే అమెరికా నేవీ ఆఫీసర్ టైటానిక్ శిథిలాలున్న ప్రాంతాన్ని గుర్తించి, ఫొటోలు తీశాడు. గాలింపులో దొరికిన ప్రయాణికుల తాలూకు వస్తువుల్ని పలుచోట్ల ప్రదర్శించారు. రెండు ముక్కలైన టైటానిక్ మహా ఓడ శిథిలాలు మహాసముద్రం అడుగున ఇప్పటికీ ఉన్నాయి. వందలాది శవాలు మాత్రం ఏమయ్యాయో!
……………………
మరికొన్ని టైటానిక్ సంగతులు
పూర్తి పేరు రాయల్ మెయిల్ స్టీమర్ టైటానిక్. మహాశక్తిమంతమైన అని టైటానిక్ అర్థం.
సంఖ్యల విషయంలో స్పష్టత లేదు. ఉన్నమేరకు ప్రయాణికులు 1455, సిబ్బంది 885. మొత్తం 2340లో బతికి బయటపడింది 745 మంది. ఫస్ట్ క్లాసులో 40 శాతం మంది, సెకండ్‌లో 56 శాతం, థర్డ్‌లో 75 శాతం, సిబ్బందిలో 76 శాతం చనిపోయారు. మరణించింది ఎక్కువగా మగవాళ్లే. సెకండ్ క్లాసులో 92 శాతం పురుషులు చనిపోయారు.

చనిపోతున్నప్పుడు కూడా శ్రోతల(?) దుఃఖం తగ్గించడానికి ఎనిమిది మందితో కూడిన టైటానిక్ బ్యాండ్ సంగీతం వినిపిస్తూనే ఉందట. వీళ్లందరూ మరణించారు.

బతికి బయటపడ్డవాళ్లలో బ్రిటన్లకంటే ఎక్కువమంది అమెరికన్లు ఉండటానికి కారణం బ్రిటిష్ వారి మర్యాదతో కూడిన ప్రవర్తన, అమెరికావాళ్ల దుందుడుకుతనమూనట. లైఫ్‌బోట్లలోకి ఎక్కేటప్పుడు తోసుకుంటూ వెళ్లి కూర్చున్నవాళ్లు అమెరికన్లేనట.

వైట్‌స్టార్ లైన్ 1934లో తన ప్రత్యర్థి కునార్డ్ లైన్‌లోనే విలీనమవడం ఒక విచిత్రం!

ఇంకా ఆడవాళ్లు, పిల్లలు ఉండగానే లైఫ్‌బోట్లోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడన్న అపవాదును ఎదుర్కొన్నాడు వైట్‌స్టార్ ఛైర్మన్ జె.బ్రూస్ ఇస్మే. పత్రికలు ‘పిరికిపంద’ అని రాశాయి. చెడ్డపేరుతో పదవీ విరమణానంతరం ప్రజాబాహుళ్యానికి దూరంగా బతికి, 1937లో మరణించాడు.
……….

ప్రయాణికుల సంగతులు
గడ్డకట్టే చలిలో ఓడనుంచి సముద్రంలో పడినా చార్లెస్ జాగిన్(ఇంగ్లండ్) బతికి బయటపడటం ఒక అద్భుతం. ప్రమాదానికి ముందు రెండు బాటిళ్ల విస్కీ తాగివున్నాడట. లోపలి వేడి బయటి చలినుంచి కాపాడిందంటారు.

{పధాన వ్యాసంలో పేర్కొన్న ఈవా, బ్రైడ్, లైటాలర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈవా నిండుగా జీవించి 91 ఏళ్ల వయసులో 1996లో చనిపోయింది.

టైటానిక్‌లో బతికి బట్టకట్టి సుదీర్ఘ కాలం జీవించిన మనిషిగా పేరొందింది ఇంగ్లండ్‌కు చెందిన మిల్వినా డీన్. ప్రయాణించినప్పుడు తొమ్మిది వారాల పసిపిల్లామె. ఎత్తుకోవడానికి సహ ప్రయాణికులు ముచ్చటపడేవారట. లైఫ్‌బోట్ 10లో అమ్మ, అన్నయ్యతో పాటు ‘కర్పాతియా’కి చేరుకుంది. తండ్రి మాత్రం తిరిగిరాలేదు. 97 ఏళ్ల వయసులో 2009లో మరణించింది డీన్.

అమెరికాలో టైటానిక్ ఆకృతిలో ఒక మ్యూజియం ఏర్పాటుచేశారు. టికెట్‌ను అప్పటి ప్రయాణికుల పేర్లమీదుగా ఇస్తారు. లోనికి వెళ్లి గ్యాలరీలన్నీ చూశాక, మనకొచ్చిన ప్రయాణికుడు ప్రమాదంలో పోయాడా, బతికాడా తెలుసుకోవాలి. చావు కూడా వినోదమే!

పుస్తకాలుగా, సినిమాలుగా, టీవీ సిరీస్‌ల రూపంలో సృజనకారులకు ఎన్నోమార్లు కథా వస్తువైంది టైటానిక్. వీటన్నింటిలోకీ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో 1997లో వచ్చి 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ‘టైటానిక్’ మనకు సుపరిచితం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top