You Are Here: Home » చిన్నారి » చెడ్డవారి స్నేహం

చెడ్డవారి స్నేహం

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఏనుగు, ఒక సింహం ఉన్నాయి. అవి రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి. సింహం మాంసాహారి, ఏనుగు శాకాహారి. సింహం భయంకరమైనది, ఏనుగు సాత్త్వికమైనది. అయినా ఆ రెండింటికి మంచి స్నేహం కుదిరింది. ఆ అడవిలోని జంతువులన్నీ వాటి స్నేహం గురించి కథలుగా చెప్పుకునేవి.

అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానిది కపటబుద్ధి. ఎవరైనా ఆనందంగా కనిపిస్తే చూసి సహించలేకపోయేది. ఏనుగు, సింహం స్నేహంగా ఉండటం దానికి నచ్చలేదు. ఎలాగైనా ఆ రెండింటినీ విడగొట్టాలనుకుంది.

ఒకరోజు సింహం, ఏనుగులను కలిసి, ‘‘మీ స్నేహం చూడముచ్చటగా ఉంది. నాకు మీతో స్నేహం చేయాలని ఉంది. నన్ను కూడా మీ జట్టులోకి చేర్చుకుంటారా?’’ అని అడిగింది. అవి ‘సరే’ అన్నాయి. ఆ రోజు నుండి నక్క వాటితో తిరగసాగింది.

ఒకసారి సింహానికి జబ్బు చేసింది. చాలారోజుల వరకు ఆ జబ్బు తగ్గలేదు. ఆ రోజు సింహం ఒంటరిగా గుహలో పడుకుని ఉంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న నక్క సింహం దగ్గరకు వెళ్ళి ‘‘రాజా! ఇందాకే నేను ఒక స్వామిని కలిసి వస్తున్నాను. మీ ఆరోగ్యం కుదుటపడాలంటే ఏనుగు మెదడు తినాలని స్వామి చెప్పాడు’’ అని చెప్పింది.

అప్పుడే సింహాన్ని చూడటానికి గుహకు వస్తున్న ఏనుగు బయటి నుండి నక్క మాటలు వింది. నక్క కుతంత్రం దానికి అర్థం అయ్యింది. అది లోపలికి వస్తూనే ‘‘నక్క మిత్రుడు చెప్పింది నిజమే! ఆ స్వామిని నేను కూడా ఇప్పుడే కలిసి వస్తున్నాను. మీ జబ్బుకు ఏనుగు మెదడు మంచి ఔషధమట’’ అంది.

‘‘అయితే రాజా! ఏనుగు మెదడును ఒక జ్ఞాని అయిన నక్క రక్తంలో ముంచి తినాలని చెప్పాడు. మరి మన నక్క మిత్రుడిని మించిన జ్ఞాని ఇంకెవరైనా ఉన్నారా? మీకోసం ప్రాణాన్ని ధారపోసే త్యాగగుణం మన మిత్రుడికి ఉంది’’ అంటూ ఏనుగు… నక్క చూడకుండా సింహానికి కన్ను గీటింది.

సింహానికి అంతా అర్థమయ్యింది. ‘‘అయితే ఏనుగు మిత్రమా! ముందు నక్కను చంపేయమంటావా?’’ అంటూ పంజా విసరబోయింది.

అంతే నక్క భయపడి అక్కడి నుండి పారిపోయింది. పారిపోతున్న నక్కను చూస్తూ ఏనుగు, సింహం హాయిగా గాలి పీల్చుకున్నాయి.
నీతి: చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top