You Are Here: Home » చిన్నారి » చిట్టెలుక జీవిత పాఠం

చిట్టెలుక జీవిత పాఠం

ఒక అడవిలో ఒక కలుగులో బుజ్జి ఎలుక ఒకటి ఉండేది. ఒకరోజు అది బయటి ప్రపంచాన్ని చూద్దామని బయలుదేరింది. కొద్ది దూరం పోగానే దారిలో దానికొక కోడి కనిపించింది. ఆ కోడి కొ కొ క్కో అంటూ గింజలు ఏరుకుని తింటోంది. కోడిని చూడగానే బుజ్జి ఎలుకకు ఎంతో భయం వేసింది. గబుక్కున ఒక పొద చాటుకు దాక్కుని తొంగి చూసింది. కోడి ఎలుకను చూసినా పట్టించుకోకుండా గింజల కోసం నేలను పొడవసాగింది.

‘అమ్మో దీని పేరేమిటోగాని పొడవైనముక్కుతో, రంగురంగులుగా, సూదుల్లాంటి ఈకలతో ఎంత భయంకరంగా ఉందో?! బాబోయ్ దీని కంట పడ్డానా నా పని ఇంతటితో ఆఖరు.’ అనుకుని చిట్టెలుక భయపడి అక్కడి నుండి పారిపోయింది.

అలా అలా… ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఒక చోట ఒక చెట్టు కింద దానికి ఒక పిల్లి కనబడింది. కడుపునిండా తిని ఉన్న ఆ పిల్లి చెట్టు నీడలో గాఢంగా నిద్రపోతోంది. ఆ పిల్లి బుర్ర మీసాలతో, నున్నటి జుత్తుతో ఎంతో అందంగా ఉంది. పిల్లిని చూడగానే ఎలుకపిల్లకు ముచ్చట వేసింది.

‘చెట్టు క్రింద తపస్సు చేస్తున్న అయ్యవారిలా ఎంత చూడచక్కగా ఉంది. దీనితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో కదా!’ అని అనుకుంటూ పిల్లినే తేరిపార చూడసాగింది ఎలుక.
నిద్రలో కూడా ఎలుక వాసనను పసికట్టింది పిల్లి. నాలుక చిన్నగా చప్పరించింది. నెమ్మదిగా ఒక కన్ను తెరిచి చూసింది. ఎదురుగా తనవంకే మైమరచి చూస్తున్న ఎలుక కనబడింది. తనకిష్టమైన ఆహారం అలా అంత దగ్గరగా కనబడగానే పిల్లి ఇక ఆగలేకపోయింది. చెంగున ఎలుక మీదకు దూకింది.

ప్రమాదాన్ని పసికట్టి ఎలుకపిల్ల ముందు బిత్తరపోయింది. ఆ తరువాత ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగెత్తింది. ఆ రోజు దాని అదృష్టం బాగుంది. పిల్లికి దొరక్కుండా ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరగలిగింది.ఆ సంఘటనతో రూపం చూసి మోసపోకూడదని ఎలుకపిల్ల పాఠం నేర్చుకుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top