You Are Here: Home » చిన్నారి » చాడీల నక్కలు

చాడీల నక్కలు

అనగనగా ఒక అడవిలో రెండు నక్కలు ఉండేవి. వాటికి తమ పనుల మీద కన్నా ఇతర విషయాల మీదనే శ్రద్ధ ఎక్కువ. దాంతో అవి నిరంతరం ఇతర జంతువులు మాట్లాడుకునే విషయాలు రహస్యంగా వింటుండేవి. విన్న తరవాత ఆ మాటలకు ఉన్నవీ లేనివీ మరిన్ని విషయాలు జోడించి ఇతర జంతువులకు చాడీలు చెబుతుండేవి. ఇలా చాడీలు చెప్పడం ఈ నక్కలకు అలవాటుగా మారిపోయింది. ఈ నక్కల వైఖరితో అడవిలోని జంతువులన్నీ అనవసరంగా లేనిపోని గొడవలు పెట్టుకుని ఇబ్బందులు పడేవి.

ఇదంతా గమనించిన ఒక కోతి నక్కలకు ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆ కోతి నక్కల కదలికలను గమనించసాగింది. ఆ రెండు నక్కలు ఏ జంతువు దగ్గరకు వెళ్లబోతున్నాయో ముందే గమనించేది. వాటి కంటె ముందుగా ఆ కోతి వాటి దగ్గరకు వెళ్లి, నక్కల తంపులమారితనం గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఇలా ముందుగానే ఇతర జంతువులకు నక్కల గురించి చెప్పి ఉంచటంతో ఒకరోజు అన్ని జంతువులు ఒకచోట గుమిగూడాయి.

ఎప్పటిలాగే నక్కలు ఇతర జంతువులకు ఏవో చాడీలు చెప్పటానికి వచ్చే సరికి జంతువులన్నీ కలిసి నక్కలను చితకబాదాయి. ఆ దెబ్బలు తట్టుకోలేక రెండు నక్కలూ పరుగు తీశాయి. అప్పుడు కోతి వాటి దగ్గరకు వెళ్లి, ‘‘చాడీలు చెప్పటం తప్పు. చాడీలు చెబితే ఎంత నష్టం జరుగుతుందో మీరు గమనించాలనే ఇలా చేశాను’’ అని చెప్పింది. తప్పును గ్రహించిన నక్కలు కోతిని క్షమాపణ కోరాయి. అప్పటినుంచి చాడీలు చెప్పడం మానేశాయి.
నీతి: ఇతరులతో స్నేహంగా మెలగాలే కాని ఒకరి మీద ఒకరికి నేరాలు చెప్పకూడదు. అలా చేయడం వల్ల ఎప్పటికైనా ఆపదలు తప్పవు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top