You Are Here: Home » చిన్నారి » చలికాలంలో కొబ్బరినూనె ఎందుకు గడ్డ కడుతుంది?

చలికాలంలో కొబ్బరినూనె ఎందుకు గడ్డ కడుతుంది?

చలికాలం రాగానే ఇంట్లో ఉన్న కొబ్బరినూనె గడ్డకట్టడాన్ని మనం గమనిస్తుంటాం. కాని వంటకు ఉపయోగించే వేరుశనగనూనె వంటివి మాత్రం గడ్డకట్టవు. దానికి కారణం ఏమిటనే సందేహం కలుగుతుంది. శీతకాలంలో ఉష్ణోగ్రత బాగా తగ్గి గాలి చల్లబడుతుంది. దాని వలన ద్రవరూపంలో ఉన్న పదార్థాలన్నీ చల్లబడతాయి. నూనెలలో కొవ్వు ఆమ్లాలు, గ్లిజరిన్‌లు ఉంటాయి. కొవ్వు ఆమ్లాలను సంతృప్త, అసంతృప్త ఆమ్లాలుగా వర్గీకరించవచ్చు.

అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ శాతం ఉంటే నూనెలు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఘనీభవన ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఘనీభవన ఉష్ణోగ్రత అంటే ద్రవపదార్థం ఘనపదార్థంగా మారే ఉష్ణోగ్రత. కొబ్బరినూనెలో సంతృప్త కొవ్వు అమ్లాలు 90 శాతం ఉంటాయి. అందువల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గగానే అది గడ్డ కడుతుంది. కానీ వేరుశనగ, సన్‌ఫ్లవర్ లాంటి నూనెలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం ఎక్కువ గా ఉంటుంది. అందుకే అవి త్వరగా ఘనీభవించవు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top