You Are Here: Home » చిన్నారి » గ్రహించే నేర్పు

గ్రహించే నేర్పు

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు. అతడు తన రాజ్యానికి సమర్థుడైన మంత్రిని నియమించాలనుకున్నారు. రాజుగారి ఆస్థానంలో మంత్రి పదవికి సమానమైన అర్హతలు ఉన్న వారు నలుగురు ఉన్నారు. అందుచేత వారికి పరీక్ష పెట్టి గెలిచిన వ్యక్తిని మంత్రిగా నియమించాలనుకున్నారు రాజుగారు.

ఒకరోజు ఆ నలుగురినీ పిలిచి ‘‘నా దగ్గర ఒక తాళం కప్ప ఉంది. గణిత శాస్త్ర రీత్యా ప్రత్యేకంగా తయారైన తాళం ఇది. దీన్ని తెరవటానికి నలుగురూ సిద్ధంగా ఉండండి. త్వరగా తెరిచిన వారు ఈ రాజ్యానికి మంత్రి కాగలరు’’ అన్నారు. వారిలో ముగ్గురు మాత్రం మంత్రి పదవి దక్కించుకోవాలనే ఉద్దేశంతో రాత్రంతా అనేక గ్రంథాలను తిరగేశారు. కానీ వారికి ఎటువంటి సమాచారం లభించలేదు. వారిలో నాలుగోవాడు భూపాలుడు. అతడు మాత్రం కొద్దిసేపు కొన్ని గ్రంథాలు మాత్రమే తిరగేసి నిద్రపోయాడు.

మర్నాడు రాజుగారి సభలో ఆ వైజ్ఞానిక నైపుణ్యంతో తయారు చేయబడిన తాళం కప్పని ఐదుగురు భటులు మోసుకొచ్చి ఆ నలుగురి ముందు ఉంచారు. రాజు గారు సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. ఆ బ్రహ్మాండమైన తాళం కప్పని చూడగానే వారిలో దడ మొదలైంది. మొదటి ముగ్గురూ తమతో తెచ్చుకున్న తాళపత్ర గ్రంథాల్ని కంగారుగా అటు ఇటు తిప్పారు. ఆ కంగారులో వారు తాళం కప్పని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయారు. దాంతో తాళం తెరవటంలో విఫలమయ్యారు. ఇక తాము చేయగలిగిందేమీ లేదని ఓటమిని అంగీకరించారు.

ఇక మిగిలింది భూపాలుడు. అతను మాత్రం ఏ మాత్రం ఆతృత పడకుండా తాళం కప్పను జాగ్రత్తగా పరిశీలించాడు. ఆశ్చర్యం! దానికి తాళం వేయనే లేదని గ్రహించాడు భూపాలుడు. అందుచేత గణిత సూత్రాలు, తాళం చెవి వంటి వేటితోనూ పని లేకుండానే క్షణంలో తెరవగలిగాడు. రాజుగారి ప్రశంసలు పొంది మంత్రి పదవిని సాధించుకున్నాడు. సభలో అందరి మన్ననలను పొందాడు. భూపాలుడు సంతోషంగా రాజుగారి కొలువులో మంత్రిగా చేరాడు.
నీతి : నిదానంగా పరిశీలించడం ముఖ్యం. తొందరపాటు పనికిరాదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top