You Are Here: Home » చిన్నారి » గొర్రె ఉపాయం

గొర్రె ఉపాయం

ఒక వ్యాపారి అడవి మార్గంలో తన గొర్రెల గుంపును తరలిస్తున్నాడు. అందులో నుంచి ఒక గొర్రె తప్పిపోయి ఆ అడవిలోనే ఉండిపోయింది. అది కడుపు నిండా కావలసినంత గడ్డిని మేస్తూ, స్వేచ్ఛ దొరికినందుకు సంతోషిస్తూ అటుఇటు తిరగసాగింది.

దాన్ని ఒక నక్క చూసింది. ‘నేను ఇంతవరకూ ఎప్పుడూ గొర్రె మాంసం రుచి చూడలేదు. దీన్ని మచ్చిక చేసుకుని ఏ పులి చేతో, సింహం చేతో చంపించాలి,’ అనుకుని వెళ్ళి పలకరించింది. గొర్రె కూడా ఒంటరితనంతో విసిగిపోయి ఉండడంతో నక్కతో మాటలు కలిపింది. అలా వాటి స్నేహం మొదలైంది. కొన్ని రోజుల తరువాత…

‘‘మిత్రమా! మన స్నేహానికి గుర్తుగా నీకు విందు ఇవ్వాలనుకుంటున్నాను. నాతో మా ఇంటికి రా?’’ అని గొర్రెను పిలిచింది నక్క.

‘‘సరే’’ అంటూ గొర్రె నక్క వెంట బయలుదేరింది. నక్క దాన్ని అడవిలో దట్టంగా ఉండే ప్రాంతం వైపు తీసుకువెళ్ళసాగింది. ‘ఈరోజు గొర్రెను తీసుకువస్తానని పులితో చెప్పాను. దీని మాంసాన్ని చెరి సగం పంచుకోవాలి,’ అనుకుంటూ గొర్రె మాంసాన్ని రుచి చూడబోతున్నందుకు లోలోపలే ఆనందించసాగింది నక్క.

కొంతదూరం వెళ్ళాక గొర్రెకు అనుమానం కలిగింది. ‘ఈ నక్క తనను మోసం చేయడంలేదు కదా! విందు అని చెప్పి తనను ఏదైనా ఉచ్చులో బిగిస్తోందా?’ అనుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంశయించింది.

అది గమనించిన నక్క ‘‘భయం లేదు మిత్రమా! ఇక్కడ క్రూరమృగాలు ఉండవు,’’ అంది.
‘‘అందుకోసం కాదు. నాకు కడుపులో ఏదో వికారంగా ఉంది. అయినా క్రూరమృగాలంటే నాకేం భయం లేదు. నన్ను తింటే అవి చచ్చూరుకుంటాయి’’ అంది గొర్రె చాలా తెలివిగా అప్పటికప్పుడే ఒక ఉపాయం ఆలోచిస్తూ.

నక్క అదిరిపడింది. ‘‘ఏం ఎందుకలా?’’
‘‘నన్ను మా యజమాని ఈ అడవిలో ఎందుకు వదిలేశాడనుకున్నావు? మా ఊళ్లో పాము విషం కక్కిన ఆకులను నేను తిన్నాను. దాంతో నా శరీరమంతా విషం పాకిపోయింది. కావాలంటే నా ముఖం, కాళ్లు చూడు ఎంత నల్లగా ఉన్నాయో! నన్ను పెంచుకోలేక, చంపి తినలేక నా యజమాని ఇక్కడ వదిలేశాడు. నన్ను ఏ జంతువైనా తింటే అదే చస్తుంది’’ అంది గొర్రె ఓరకంట నక్కను గమనిస్తూ.
ఆ మాటలు వినగానే నక్క ముఖంలో భయం కనిపించింది. ఆ తరువాత తనను తాను నిగ్రహించుకుని ‘‘మిత్రమా! నీకు ఒంట్లో బాలేదన్నావు. నాకు కూడా కడుపులో ఏదోలా ఉంది. విందు ఇంకోరోజు పెట్టుకుందాం. నిన్ను తరవాత కలుస్తాను’’ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క.

గొర్రె ఎత్తు పారింది. ఆ తరువాత నక్క గొర్రెకు కనబడితే ఒట్టు.
నీతి: ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా, తప్పించుకునే మార్గాన్ని వెతుక్కోవాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top