You Are Here: Home » ఇతర » గులియన్‌ బారి సిండ్రోమ్

గులియన్‌ బారి సిండ్రోమ్

Syndaమానవుని కదలికలకు మెదడు, వెన్నుపూస ఎంత ముఖ్యమైనవో, నరాలు కూడా అంతే ముఖ్యమైనవి. మెదడు నుంచి వచ్చే సంకేతాలు నరాల ద్వారానే కండరాలకి వెళ్ళి కదలికలు జరుగుతాయి. ఎప్పుడైతే నరాలు దెబ్బతింటాయో స్పర్శలో తేడా రావడం, కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడం జరుగుతాయి. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, కాళ్ళు గుంజుతూ ఉండడం, స్పర్థ కోల్పోవడం, కింద నుంచి పైకి లేవలేకపోవడం, చెప్పులు జారిపోవడం, నడకలేకపోవడం నరాల జబ్బు లక్షణాలు. సాధారణంగా షుగరు జబ్బువారిలో, పూర్తి శాఖాహారుల్లో, మద్యం సేవించేవారిలో నరాలు దెబ్బతింటాయి. అయితే వీటన్నింటితో పాటు జ్వరాల వలన, ప్రత్యేకంచి వైరస్‌ జ్వరం తరువాత కొంతమందిలో నరాలు దెబ్బతింటాయి. ఒకటి నుంచి రెండు వారాల్లోనే పెరిగిపోయే నరాల జబ్బునే ‘గులియన్‌ బారి సిండ్రోమ్‌’ అంటారు.

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మనిషిలోని రోగనిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ అనే పదార్థాలను తయారుచేస్తుంది. ఇవి వైరస్‌ని చంపడంతో పాటు, మనిషి నరాలని కూడా దెబ్బతీస్తాయి. ఇవి తయారైన పరిమాణాన్ని బట్టి జబ్బు తీవ్రత ఉంటుంది. 70 శాతం మందిలో ఈ జబ్బు రెండువారాల్లో ముదిరి మనిషిని నడవలేని దశకి తీసుకెవెళుతుంది. తర్వాత అలా నిలబడిపోయి ఒక నెల తరువాత క్రమంగా కండరాలు పనిచేయడం మొదలుపెడతాయి. మిగిలిన 30 శాతం మందిలో జబ్బు ముదిరి, శ్వాస తీసుకోవటానికి అవసరమైన కండరాలు కూడా చచ్చుబడిపోయి, ఊరిపి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇటువంటి వారు మింగే శక్తి కూడా కోల్పోతారు, మెడలు నిలుపలేరు. ఈ దశలో వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందిచవలసి ఉంటుంది.

నిర్ధారణ ఎలా? : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు నిపుణుడైన న్యూరాలజీస్టును కలిసి, ఎన్‌.సి.ఎస్‌. పరీక్షను చేయింకోవాలి. ఈ పరీక్షతో జబ్బును నిర్ధారంచవచ్చు. ఇటువంటి లక్షణాలే కలగజేసే వేరే జబ్బుల గురించి తెలుసుకోవటానికి కొన్ని రక్తపరీక్షలు అవసరంపడతాయి.
వైద్యం ఎలా? : నరాలు కొంచెం మాత్రమే దెబ్బతిని, రోగి నడవగలుతున్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు, ఫిజియోథెరపీతోనే నెమ్మదిగా రెండుమూడు నెలల్లో పూర్తిగా జబ్బు తగ్గిపోతుంది. అయితే జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాసకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు లేక రోజురోజుకీ బలం బాగా తగ్గిపోతున్న రోగిని ఐసియులో చేర్చి జాగ్రత్తగా వైద్యం అందించాలి. ఐవిఐజి అనే మందును 5 రోజులు ఇవ్వవచ్చు. అయితే ఇది బాగా ఖరీదైన మందు రోగి బరువుని బట్టి, మందు ఖరీదే 2-3 లక్షల వరకు ఉంటుంది.
ప్రత్యామ్నాయం ఎలా : పైన మందు పెట్టుకోలేకపోతే, ప్లాస్మాథెరపీ అనే పద్ధతి ద్వారా ఈ జబ్బు ముదరకుండా చేయవచ్చు. ఈ పద్ధతి వలన తొందరగా రోగి కోలుకోగలుగుతాడు. అయితే మూడు నుంచి ఐదుసార్లు ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. లక్ష రూపాయలలోపే ట్రీట్‌మెంట్‌ చేయవచ్చు. 70-80 శాతం మంది ఈ ప్రక్రియ తర్వాత కొన్ని వారాల్లోనే సొంతంగా నడవగలుగుతారు. 20 శాతం మందిలో అంతకన్నా ఎక్కువ సమయమే పట్టవచ్చు.

Daveenఅయితే పైన పేర్కొన్న రెండు పదార్థాలు కూడా ఎంత తొందరగా మొదలుపెడితే అంత తొందరగా ఫలితం ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా కొన్ని వారాలు ఫిజియోథెరపీ సక్రమంగా చేస్తూంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది.కాబట్టి ఎవరిలోనైనా కానీ, జర్వంతో పాటుకానీ, జర్వం తగ్గిపోయిన తర్వాత కాళ్ళు, చేతులు చచ్చుబడిపోతున్నా, తిమ్మిర్లు వచ్చి నడవలేకపోతున్నా వెంటనే దగ్గరలో డాక్టరుని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేసుకొని వెంటనే వైద్యం మొదలుపెడితే ప్రాణహాని నుంచి బయటపడవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top