You Are Here: Home » చిన్నారి » గుర్రం తొందరపాటు

గుర్రం తొందరపాటు

అనగనగా ఒక ఊరిలో ఒక గుర్రం ఉండేది. దానికి ఎప్పుడూ ఊళ్లోనే ఉండటం విసుగనిపించింది. అడవి ఎలా ఉంటుందో చూడాలనే కోరిక కలిగింది. దాని పూర్వికులు అడవిలోనే ఉండేవారనే సంగతి ఎవరో అనుకుంటున్నప్పుడు విన్నది. అప్పటినుంచి అడవికి వెళ్లి చూసి రావాలని సరదాపడింది. ఒకరోజు అవకాశం దొరకగానే అడవిలోకి వెళ్లింది. అయితే అడవి కొత్త కావడంతో దారి తప్పింది. ఎలా బయటపడాలో తెలియక అక్కడక్కడే తిరగసాగింది. ఆ అడవిలో ఉండే ఒక ఎలుగుబంటి, ఒక నక్క గుర్రానికి సహాయం చేశాయి.

గుర్రం తిరిగి వెళ్లిపోతున్నపుడు తను ఉండేచోటుకు ఒక్కసారైనా వచ్చి వెళ్లాలని ఎలుగుబంటిని, నక్కని ఆహ్వానించింది. అవి సరేనన్నాయి. కొన్నిరోజుల తర్వాత తప్పకుండా వస్తామని మాట ఇచ్చాయి. గుర్రం తన ఊరికి వచ్చేసింది. ఎలుగుబంటి, నక్క ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూసింది. అంతేకాదు అవి తన దగ్గరకు రాగానే తినడానికి ఏం పెట్టాలా అని కూడా ఆలోచించింది. అన్ని జంతువులూ మాంసం తినవనీ, కొన్ని మాత్రమే తింటాయనీ అడవిలో తిరిగినపుడు గుర్రం గమనించింది.

అందుకే మాంసం, పండ్లు… రెండూ తెచ్చి ఉంచింది. ఎలుగుబంటి పెద్దగా, భీకరంగా ఉంటుంది కాబట్టి దానికి మాంసం, నక్క చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి పండ్లు పెట్టాలనుకుంది. గుర్రం ఆశించినట్టుగానే కొన్నిరోజుల తరవాత ఎలుగుబంటి, నక్క ఆ ఊరికి వచ్చాయి. వాటిని చూసి ఎంతో సంబరపడింది గుర్రం.

తను చేసే మర్యాదలకు అవి రెండూ ఉబ్బితబ్బిబ్బవుతాయనుకుంది గుర్రం. ఎలుగుబంటి ముందు తట్టెడు మాంసం తీసుకొచ్చి గుమ్మరించింది. నక్క ముందు బుట్టెడు పండ్లు ఉంచింది. ఎలుగుబంటి, నక్క… రెండూ తెల్లమొహం వేశాయి. అవి తమ ముందు ఉంచిన ఆహారాన్ని కాస్త కూడా తినలేదు. తినమని గుర్రం బలవంత పెట్టడంతో ఎలుగుబంటి ముందు పెట్టిన మాంసం తీసుకుంది నక్క. ఎలుగుబంటి, నక్కకి పెట్టిన పండ్లు తీసుకుని తినేసింది. వెడుతూవెడుతూ గుర్రానికి తమ ఆహారపు అలవాట్ల గురించి చెప్పాయి.

వాటి అలవాట్ల గురించి సరిగా అంచనా వేయలేకపోయినందుకు గుర్రం చాలా బాధ పడింది. అయినా ‘‘ఏ విషయం గురించైనా ముందుగా తెలుసుకోవాలే కాని తొందరపడి ఒక అంచనాకు రాకూడదు’’ అని అవి నీతిబోధ చేసి వెళ్లిపోయాయి. అప్పటి నుంచి గుర్రం తన ఇంటికి ఎవరిని పిలిచినా ముందుగా వారి అలవాట్లు తెలుసుకోవడం మొదలుపెట్టింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top