You Are Here: Home » చిన్నారి » గుర్రం గర్వం

గుర్రం గర్వం

ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. ఆ అడవిలో పుష్కలంగా దొరికే పచ్చగడ్డిని తిని బాగా ఎత్తుగా, బలంగా తయారయ్యింది. దానితో ఆ గుర్రం తన ఆకారం పట్ల విరవ్రీగిపోయేది. ఒకరోజు గుర్రానికి నీటి కాలువ దగ్గర ఒక ఒంటె కనబడింది. దాని ఆకారాన్ని చూడగానే గుర్రానికి నవ్వొచ్చింది. పడీ పడీ నవ్వసాగింది.

‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అని అయోమయంగా అడిగింది ఒంటె.
‘‘నువ్వెలా ఉంటావో నీకు తెలుసా? వంకర్లు తిరిగిన పెద్ద మెడ, వీపు మీద ఇంత మూట, సన్నటి పొడవైన కాళ్ళు… మొత్తానికి నీ రూపు భలేగా ఉంటుందోయ్’’ అని సకిలిస్తూ నవ్వింది గుర్రం.

గుర్రం మాటలకు ఒంటె బాధ పడింది. జవాబు చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు అక్కడే గుర్రానికి ఒంటె తారసపడింది.

‘‘ఏమిటోయ్ మిత్రమా! ఎలా ఉన్నావు?’’ ఒంటెను పలకరించింది గుర్రం.
‘‘నీకోసమే వచ్చాను మిత్రమా. నీ అందమైన రూపం గురించి నిన్న నా స్నేహితులతో చెప్పాను. కాని వాళ్ళు నా మాటలు నమ్మటం లేదు. నిజంగానే అంత అందంగా ఉంటుందా, అని ఎగతాళి చేశారు. నువ్వు నాతో వస్తే, వాళ్ళకి నిన్ను చూపిస్తాను’’ అంది ఒంటె.

గుర్రం సంతోషంగా ఒప్పుకుని ఒంటె వెంట బయలుదేరింది. అవి రెండూ అడవి దాటి ఎడారి వైపు ప్రయాణం చేయసాగాయి. ఇసుకలో చకాచకా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న ఒంటెను అనుసరించడం గుర్రానికి కష్టమైంది. రానురాను దాని కాళ్లు ఇసుకలో కూరుకుపోయి అడుగుపడటమే గగనమయ్యింది.

‘‘త్వరగా నడువు మిత్రమా! నా స్నేహితులంతా ఆత్రుతగా ఎదురుచూస్తూంటారు’’ అంటూ ఒంటె నడక వేగం పెంచింది.
మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. బలమైన గాలికి ఇసుకరేణువులు గుర్రం ముక్కులోకి, కళ్ళలోకి దూరుతున్నాయి. దాహంతో గుర్రానికి నాలుక పిడచకట్టుకుపోగా ‘‘ఇంకెంత దూరం నడవాలి?’’ అని నీరసంగా అడిగింది.

‘‘ఇంకో గంట నడవాలి’’ అని చెప్పింది ఒంటె.
మరికొంత దూరం వెళ్ళగానే ఇక గుర్రం అడుగులు ముందుకు వేయలేకపోయింది.
‘‘చూశావా! ఎవరికి ఏ రూపం అవసరమో దేవుడు వారికి అలాంటి రూపమే ఇస్తాడు. నేను అందంగా లేనని నన్ను గేలి చేశావు. నువ్వు ఎంతో అందంగా బలంగా ఉన్నానని విరవ్రీగావు. ఇప్పుడు ఏమైంది? ఎడారిలో నివసించే నేను ఈ ఇసుకలో తేలికగా నడవడానికి వీలుగా నా ఆకారం ఇలా ఉంది’’ అని చెప్పింది ఒంటె.తప్పు తెలుసుకున్న గుర్రం సిగ్గుతో తల వంచుకుంది.
నీతి: అహంకారం మంచిదికాదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top