You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » ఖడ్గధారి కందుకూరి

ఖడ్గధారి కందుకూరి

పాతదాన్ని సమాజం వదులుకోదు. కొత్తదాన్ని పడనే పడనివ్వదు. అందుకే – సమాజాన్ని మార్చడానికి బయల్దేరినవాళ్లు రెండు గుర్రాల మీద రెండు ఖడ్గాలతో యుద్ధం చేయవలసి వస్తుంది. కిందపడ్డామా? పైకి లేచామా అన్నది కాదు ప్రశ్న. పోరాడామా లేదా? అదీ పాయింట్! పోరాడేందుకు చేసే చిన్న పెనుగులాట కూడా పెద్ద సంస్కరణే అవుతుంది. అలా చూస్తే – వితంతు పునర్వివాహాల కోసం, సామాజిక దురాచారాల నిర్మూలన కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటానికి ‘సంస్కరణ’ అనే మాట చిన్నదవుతుంది. ఆ వ్యక్తిని కేవలం ‘సంస్కర్త’ అనడం పొరపాటవుతుంది. మరి ఏమందాం? అనేందుకు ఏమీ లేదు. కందుకూరి వీరేశలింగం పంతులు. అంతే. ఈ మాట చాలు. రేపు ఆ మహనీయుడి జయంతి. ఇది ఆయన బయోగ్రఫీ 

కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్త
బయోడేటా
జననం : 16 ఏప్రిల్ 1848
జన్మస్థలం: రాజమండ్రి
తల్లిదండ్రులు: సుబ్బారాయుడు, పున్నమ్మ
భార్య : రాజ్యలక్ష్మి (జ.1851 మ. 1910)
ప్రావీణ్యం : పండితుడు, కవి, రచయిత, జర్నలిస్టు
వృత్తి : అధ్యాపకుడు
ప్రతిష్ట : తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను
తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత
సంస్కరణలు: బాల్యవివాహాలను, మూఢనమ్మకాలను వ్యతిరేకించారు.
స్త్రీ విద్యను, వితంతు పుర్వివాహాలను ప్రోత్సహించారు.
స్థాపనలు : ‘వివేకవర్థిని’ పత్రిక, అదే పేరుతో ముద్రణాలయం,
‘సత్యవర్థిని’, హాస్య సంజీవిని’ అనే మరో రెండు పత్రికలు.
‘హితకారిణి’ సమాజం
రచనలు : వందకు పైగా.
బిరుదు : గద్యతిక్కన, రావు బహదూర్
మరణం : 27 మే 1919 (మద్రాసులో)

నాలుగేళ్ల వయసులో నాన్నెవరో తెలుస్తుంది. నాన్న ముద్దు చెయ్యడం, నాన్న చక్కిలిగింతలు పెట్టడం, నాన్న ఏదైనా కొని తేవడం, నాన్న కోసం ఎదురు చూడ్డం, ఎత్తుకోమని నాన్నకు చేతులు చాపడం… అన్నీ తెలుస్తాయి.కానీ -నాలుగేళ్ల వయసులో… నాన్న చనిపోతే తెలీదు.‘‘నాన్న పోయారు’’ అన్నారెవరో. ‘‘ఎక్కడికి పోయారు’’ – అని అడిగాడు వీరేశలింగం. అప్పుడతడి వయసు నాలుగేళ్లు. ఇంటిపెద్ద శవాన్ని ఇంట్లో అందరూ చూశారు.

ఇంట్లో చిన్నవాడైన వీరేశాన్నే చూడనివ్వలేదు. కర్మకాండలన్నీ పూర్తయ్యేవరకు ఆ చిన్నారిని ఇంకొకరి ఇంటికి పంపించేశారు. తిరిగి తీసుకొచ్చాక అతడిని చూసి ఇంట్లో అందరూ ఏడ్వడం మొదలుపెట్టారు! ‘‘ఎందుకేడుస్తున్నారు?’’ – వచ్చీరాని మాటలతో అడిగాడు వీరేశం.‘‘నాన్న పోయారు’’ అని చెప్పి, భోరుమన్నారెవరో. ‘‘ఎక్కడికి పోయారు, తిరిగి ఎప్పుడొస్తారు?’’ సమాధానం చెప్పేవారెవరూ లేరక్కడ.

తమ్ముడి అంత్యక్రియలు ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకున్న వేంకటరత్నం మీదికి ఎగబాకాడు వీరేశం. ‘‘ఏమైంది బాబాయ్… అందరూ ఏడుస్తున్నారు’’ అని అడిగాడు. తండ్రిని ‘నాన్న’ అని, పెదనాన్నను ‘బాబాయ్’ అని పిలవడం వీరేశం అలవాటు. ఇంట్లో బాబాయ్ ఉన్నప్పుడు వీరేశం భూమ్మీద ఉండడు. బాబాయ్ చేతుల్లో ఉంటాడు. లేదంటే బాబాయ్ భుజాల మీద ఉంటాడు. బాబాయ్ ఒక్కరోజు కనపడలేదంటే బెంగపెట్టుకుంటాడు. తండ్రి దగ్గర వీరేశానికి ఎగబాకేంత చనువు లేదు. ఆయన స్ట్రిక్టు. బాబాయ్ అబ్బాయ్ ఫ్రెండ్స్. బాబాయ్‌తో బయటికి వె ళితే అబ్బాయ్ చేతుల నిండా చిరుతిళ్లే. ‘‘ఏమైంది బాబాయ్’’ అని మళ్లీ అడిగాడు వీరేశం.

అతడిని చేతుల్లోకి ఎత్తుకుని బయటికి తీసుకెళ్లాడు వేంకటరత్నం. అరవై రెండేళ్ల వయసులో అన్నిటినీ తట్టుకునే శక్తి ఉంటుంది. మారుతున్న రుతువుల్ని, మారని మనుషుల్నీ; అనారోగ్యాన్నీ, అసహాయతల్ని; అవమానాలని, ఆరోపణల్ని; నా అనుకున్నవాళ్లని, కాదనుకుని వెళ్లిన వాళ్లని; ఊరికే దూషించి దుమ్ము పోసిన వారినీ, నిందలు వేసిన వారిని… అందరినీ, అన్నిటినీ తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ -అరవై రెండేళ్ల వయసులో… జీవిత భాగస్వామి క్షణమైనా పక్కన లేకపోతే ఒంట్లో ఊపిరి ఉన్నట్లుండదు. ఇంట్లో దీపం ఉన్నట్లుండదు. కంటికి చూపు ఉన్నట్లుండదు. బతుకులో తీపి ఉన్నట్లుండదు.

వీరేశలింగం పంతులుగారికి అరవై రెండేళ్లు. ఆయన అర్ధాంగికి యాభై ఎనిమిదేళ్లు. వాళ్ల అనుబంధానికి యాభై ఏళ్లు. ఎనిమిదేళ్లకే ఆమె భార్య. పన్నెండేళ్లకే ఆయన భర్త. ఆరోజు -ఎప్పటిలా తెల్లవారుజామునే ఆవిడ ఆయనకు వంట చేసి పెట్టారు. ఎప్పటిలా ఆ సాయంత్రమూ తనే స్వయంగా వండి వడ్డించారు. అంతకు ముందు రోజు -పంతులుగారింట్లోని ఆవు ఈనినప్పుడు రాజ్యలక్ష్మిగారే ఆయనకు జున్ను చేసి పెట్టారు. తక్కినవాళ్లకు కొంచెం పెట్టారు. తనింత తిన్నారు. ఆవేళ సాయంత్రం పంతులుగారిని చూడ్డానికి స్నేహితుడు కనపర్తి శ్రీరాములుగారు వస్తే ఆయనకూ కొద్దిగా జున్ను పెట్టారు. చక్కగా మాట్లాడారు. చలాకీగా ఉన్నారు.

పంతులుగారికి, రాజ్యలక్ష్మిగారికి కలిసి భోంచేయడం అలవాటు. భోంచేస్తున్నప్పుడు… క్రితం రోజు తిన్న జున్ను ఎంతో రుచిగా ఉందని పంతులుగారు గుర్తు చేసుకున్నారు. మర్నాడు ఉదయం తను చేయవలసిన పనిని రాజ్యలక్ష్మి గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘ప్రేమావతిని ఉదయాన్నే డాక్టరు దగ్గరికి తీసుకెళుతున్నాను’’ అని భర్తతో చెప్పారు.
ఒక బ్రాహ్మణ వితంతువు కని వదిలేసిన బిడ్డ… ప్రేమావతి. పంతులుగారు నడుపుతున్న పతిత యువతీ రక్షణశాలలో ఆ బిడ్డ ఉంటోంది. రాజ్యలక్ష్మిగారే ఆ చిన్నారిని పెంచుతున్నారు.

భోజనం అయ్యాక పంతులు గారు మేడ మీది గదిలోకి వెళ్లిపోయారు. పనులన్నీ ముగించుకుని, పశువులకు మేత వేయించి, తాంబూలం వేసుకుని రాజ్యలక్ష్మి కూడా మేడ పైకి వచ్చే సరికి రాత్రి పదయింది. ఈశ్వర ప్రార్థన కూడా అయ్యాక ఆమె వెళ్లి వసారాలో ఉన్న మంచం మీద పడుకున్నారు. అప్పటికి పంతులుగారు గాఢ నిద్రలో ఉన్నారు. సాధారణంగా ఆయన రాత్రి ఎనిమిది గంటలకు భోజనం చేసి తొమ్మిది గంటలకే నిద్రపోతారు. రాజ్యలక్ష్మి తెల్లవారుజామున నాలుగింటికే నిద్రలేచి వచ్చి భర్త మంచం పక్కన పడక్కుర్చీలో ఐదింటివరకూ కూర్చుని కష్టసుఖాలు కలబోసుకుంటారు. తర్వాత ఈశ్వర ప్రార్థన ముగించుకుని కిందికి వెళ్లిపోతారు.

అయితే ఆ రాత్రి మూడు గంటలైనా కాకముందే పంతులుగారికి మెలకువ వచ్చింది. తలుపు తీసుకుని మెల్లిగా వసారాలోకి వెళ్లారు. అలా వెళుతున్న చప్పుడు వినబడగానే రాజ్యలక్ష్మి లేచి, ‘కిందికి వెళుతున్నారా? దీపముందా? జాగ్రత్తగా చూసుకుని వెళ్లండి’ అనడం, ఆయన వినడం ఒక అలవాటు.కానీ ఆవేళ ఆవిడ పలకరింపు లేదు!!పంతులుగారు ఆవిడ మంచం దగ్గరికి వెళ్లారు. ‘‘నిద్రపోతున్నావా?’’ అని మెల్లిగా అడిగారు.జవాబు లేదు.తిరిగి వెళ్లి తన మంచం మీద మేను వాల్చారు. గడియారం నాలుగు కొట్టగానే తిరిగి మెలకువ వచ్చింది.

నిజానికైతే మెలకువ కన్నా ముందు రాజ్యలక్ష్మిగారు ఆయన దగ్గరికి రావాలి. వచ్చి ఆయన పక్కన కూర్చోవాలి. ఆవేళ అలా జరగలేదు! పంతులుగారు లేచి, మళ్లీ ఆవిడ మంచం దగ్గరికి వెళ్లారు. ‘‘మెలకువ రాలేదా?’’ అని అడిగారు. సమాధానం లేదు. రాత్రి బాగా పొద్దు పోయేవరకు పనులు చూసుకుంటూ అలసిపోయిందేమో, నిద్రాభంగం చేయడం ఎందుకని ఆయన వెళ్లి పడక్కుర్చీలో కూర్చున్నారు. గడియారం ఐదు గంటలు కొట్టింది. అప్పటికీ రాజ్యలక్ష్మిగారు లేవలేదు. ఉదయం ఐదు తర్వాత ఆమె పడుకుని ఉండగా ఎప్పుడూ చూడలేదు పంతులుగారు.
దగ్గరికి వెళ్లి మళ్లీ పిలిచారు.

కదలిక లేదు. మీద చెయ్యి వేశారు. ఒళ్లు చల్లగా తగిలింది!!‘‘ప్రాణం పోయి మూడునాలుగు గంటలు అయుంటుంది’’ అన్నాడు వైద్యుడు వచ్చి చూసి. పంతులుగారు నిశ్చేష్టులయ్యారు. సమీపానికి వెళ్లి భార్య ముఖంలోకి చూశారు. నిద్రపోతున్నట్లే ఉంది. పక్క దుప్పటి ఏ మాత్రం చెదరలేదు. తలలోని గులాబీ పువ్వు కూడా అప్పుడే తురుముకున్నట్లుంది. పడుకోబోయే ముందు వేసుకున్న లవంగపు మొగ్గ పళ్ల మధ్య… ఉన్నది ఉన్నట్లే ఉంది. పంతులుగారు కూలిపోయారు. అతడి దుఃఖాన్ని పొదివి పట్టుకోగల శక్తి అక్కడెవ్వరికీ లేదు. రాజ్యలక్ష్మిగారే బతికి వచ్చి ఆయన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి.

కందుకూరి వీరేశలింగం పంతులు జీవిత చరిత్రను ఇలా కాకుండా ఇంకోలా మొదలుపెట్టేందుకు లేదు. ఎందుకంటే -తండ్రి మరణానికి ముందు ఆయనకు స్ఫురణల్లేవు. భార్య మరణం తర్వాత ఏర్పడిన స్మృతుల్లేవు. ఈ రెండు ఘటనల మధ్య నిడివిలో… సమాజంలోని వైరుధ్యాలతో ఆయన పడిన దీర్ఘ ఘర్షణే…. ఆయన జీవితం.‘నాలుగైదు సంవత్సరముల ప్రాయము వచ్చు వఱకును నన్నుఁ గూర్చి చెప్పకోవలసిన దేదియు నాకు స్ఫురణకు రాలేదు’ అని స్వయంగా ఆయనే తన ‘స్వీయచరిత్రము’ మొదటి ప్రకరణంలో రాసుకున్నారు.తండ్రి మరణం, తల్లి ప్రేమ … ఇవి రెండే పంతులుగారి తొట్టతొలినాళ్ల జ్ఞాపకాలు! కొడుకుపై తల్లికి ఎంత ప్రేమంటే… ఇలాంటి ప్రేమ ఏ తల్లికీ ఉండకూడదని వీరేశలింగం పంతులు కోరుకున్నంత!!

‘అన్నమెంత యెక్కువగాఁ దిన్ననంత బలియుదురన్న నమ్మకము కలదయి యజ్ఞానము చేత నా ప్రియమాత నన్ను శీఘ్రముగా బలిపింపవలెనన్న యుత్కంఠతోను, సచ్చింతతోను నాకన్నమెక్కువగాఁ బెట్టి నోటిలోని ముద్దను మ్రింగకున్నప్పుడు మిరెపుకాయలగుండ నా నాలుకకు రాచుచుండుటయు, నోటిలోని ముద్ద మ్రింగి కారముచే నే నేడ్చినప్పుడు నెత్తి మీఁద మొట్టుచుండుటయు నెందుచేతనో కాని నేడు జరిగినట్టుగా నా మనస్సున దృఢముగా నాటుకొని యిప్పటికిని మఱపునకు రాకున్నవి. బిడ్డలయందలి యతిప్రేమచేతఁ దల్లు లెప్పుడు నిట్టియవివేక కార్యములను జేయకుండుదురు గాక ’ అని పంతులుగారు అదే మొదటి ప్రకరణంలో వాపోయారు!

ఎవరి జీవితపు తొలి జ్ఞాపకమైనా అమ్మ ముద్దుతోనో, అమ్మ పెట్టిన ముద్దతోనో ఆరంభం అవుతుంది. పంతులుగారికీ అంతే. అయితే ఆయనకు అమ్మ ముద్దు కన్నా ముందు తన తండ్రి అకస్మాత్తుగా ఒకానొక రోజు నుండి కనిపించకపోవడం స్ఫురణకొస్తుంది. అలాగే – వేళకింత ముద్ద పెట్టేందుకు లేకుండా ఒకానొక రాత్రి తన అర్ధాంగి తనను విడిచి వెళ్లిపోవడం గుర్తుకొస్తుంది.

జీవితం మొదలయ్యే ప్రత్యేక సందర్భాలు, ప్రత్యక్ష క్షణాలు కొన్ని ఉంటాయి. లంకంత ఇల్లుందని జీవితం మొదలు కాదు. పెద్ద బంధుగణం ఉందని మొదలు కాదు. గొప్ప చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యాన్ కింది టేబుల్… ఇవేవీ జీవితాన్ని మొదలుపెట్టవు. పెట్టినా అది పెట్టుడు ముహుర్తంలా ‘పెట్టుడు జీవితం’ అవుతుంది తప్ప జీవితం అవదు.
కందుకూరి వీరేశలింగం జీవితం అనేక సంఘర్షణలతో, అనేక సందర్భాలతో, అనేక క్షణాలతో మొదలైంది.

పిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసి పడేస్తారెందుకు?
ఆడపిల్లల్ని చదువుకోనివ్వరెందుకు? అడుగు బయటికి పెట్టనివ్వరెందుకు?
చిన్న వయసులో భర్త చనిపోతే మళ్లీ పెళ్లి చేయరెందుకు?
లంచం ఇవ్వకుండా ఉద్యోగం రాదెందుకు?

కులమతాల అడ్డుగోడలెందుకు? అబద్ధాలెందుకు? అవినీతి ఎందుకు?
కళ్ల ముందే నచ్చని విషయాలు జరుగుతుంటే మనుషుల్లో ఇంత మౌనం ఎందుకు?
అన్నీ ఆలోచనలే వీరేశలింగానికి. వాటిని పట్టుకుని సంఘంతో గొడవకు, ఘర్షణ దిగాడు.
పదేళ్ల వయసు వరకు… అతడి జీవితం బాగుంది. పదేళ్ల తర్వాత – సమాజంలో స్త్రీలు, పిల్లల జీవితం బాగోలేదన్న విషయం కొద్దికొద్దిగా అర్థమౌతున్న కొద్దీ అతడి జీవితమూ బాగోలేకుండా పోయింది!

ఏం చేసి వీళ్లను కాపాడాలి? చిన్న వయసుకు పెద్ద సమస్య! వీరేశలింగం తన ఐదో యేట బడిలో చేరి నేర్చుకున్నవి… బాల రామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ట శతకం. పన్నెండో ఏట నుంచీ పూర్తిగా ఇంగ్లీషులోకి వచ్చేశాడు. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ భావాలు, ఇంగ్లిష్‌లో సంభాషణలు. సిలబస్‌తో పాటు అతడు కేశవ్ చంద్రసేన్ పుస్తకాలు చదివాడు. బెంగాల్ రచయిత అతడు. స్త్రీని స్థిమితంగా ఉంచలేని సమాజం అది ఎంత ఆధునికమైనదైనా, నాగరికమైనది కానే కాదని చంద్ర సేన్ రాశాడు. అది పట్టేసింది వీరేశలింగాన్ని. తను అనుకుంటున్నదే ఆయనా రాశాడు!

అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్నాడు వీరేశలింగం. ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా! ఎవరి స్వార్థం వారిదే. ఎవరి నమ్మకాలు వారివే. ప్రజలారా మారండి అని వ్యాసాలు రాశాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు.ఎవరూ మారలేదు. వీడెవరో పిచ్చివాడు అనుకున్నారు. కొత్త పిచ్చోడు అనుకున్నారు. రాజారామ్మోహన్ రాయ్‌ననీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్‌ననీ అనుకుంటున్నాడేమో అన్నారు. ఇది బెంగాల్ కాదు, ఆంధ్రదేశం బ్రదర్ అని హితవు చెప్పారు.

వీరేశలింగానికీ సమాజానికీ పడడం లేదు. సమాజం అతడికన్నా బలమైనది. అంతకన్నా మొండివాడు వీరేశలింగం. ఉపాధ్యాయుడుగా అతడు శక్తిమంతుడు. ఒక తరాన్ని మలచగలడు. పత్రికా సంపాదకుడిగా అతడు శక్తివంతుడు. భావ విప్లవం తేగలడు. కానీ తరాన్ని మలచడానికి, విప్లవం రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకు బాల్యవివాహాల బలిపీఠాల నుంచి చిన్నారులను రక్షించేదెలా? బాల వితంతువుల యవ్వనాన్ని భద్రపరిచేదెలా? సమాజం ఉలిక్కిపడి లేచేలా గట్టి దెబ్బ వేయాలి అనుకున్నాడు వీరేశలింగం.

ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉండాలంటే – ఊరూరూ తిరిగి, వీధి వీధి తిరిగి తనకు తగిలిన గాయాన్ని ఈ దురాచార సమాజం ఏడ్చుకుంటూ చూపించుకోవాలి.పంతులుగారికి అప్పటికే రాజమహేంద్రవరం నిండా, ఆంధ్రదేశం నిండా శత్రువులు మొనదేలిన రాళ్లలా తయారై ఉన్నారు. విజయనగరం మహారాజుగారి బాలికల పాఠశాల ప్రాంగణంలో రెండు నెలల వ్యవధిలో ఆయన ఇచ్చిన రెండు స్పీచ్‌లు సంప్రదాయాల తాళాలు బద్దలు కొట్టి, ఇళ్లలో చొరబడి, వితంతు బాలికల కోసం వెదకడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా అదే చర్చ. ఆయనదే రచ్చ!

‘‘ఎవరయ్యా ఈ త్రాష్టుడు. విలువల్ని భ్రష్టుపట్టించడానికే పుట్టాడా ఈ రాజమహేంద్రవరంలో?’’‘‘ఒక పెళ్లి చాల్లేదా సంఘ సంస్కర్త గారికి! వితంతువులను ఉద్ధరించే పేరుతో ఊరిమీద పడ్డాడు!!’’‘‘వీడిదసలు బ్రాహ్మణ పుట్టకేనా? సభల్లో ఏం కూస్తున్నాడో విన్నారా?’’ వీరేశలింగం కనిపిస్తే పట్టుకుని కుళ్లబొడిచేయాలన్నంత కోపంతో ఉంది ఊరూవాడ. ‘మనవాళ్లు పూర్వాచార పరాయణులగుట చేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారమునైన నంగీకరింతురుగాని, యాచార విరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు’ అని వీరేశలింగం ఏమాత్రం మొహమాటం లేకుండా, మర్యాద లేకుండా సభల్లో ఉపన్యసించడం పెద్దపెద్దవాళ్లకు ఆగ్రహం తెప్పించింది.

భువనగిరి పరదేశీ సోమయాజులు, శ్రౌతము కోటీశ్వరశాస్త్రులుగారు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, ఓగిరాల జగన్నాథం, వేంకటరాయ శాస్త్రులు, దంతులూరి నారాయణ గజపతిరావు, దాసు శ్రీరాములు పంతులు వంటి మహామహులు వీరేశలింగంపై విరుచుకుపడ్డారు. ఆయనపై ఖండన గ్రంథాలు రాశారు.

ఉత్తరాలు రాశారు. వాటిలో ఏ ఉత్తరానికీ ఆయన విలువ ఇవ్వలేదు. ఒక ఉత్తరానికి తప్ప. అది.. కృష్ణమండలంలోని తిరువూరు డిప్యూటీ తాసిల్దారు బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందం గారి నుంచి వచ్చిన ఉత్తరం. ‘తిరువూరు తాలూకా రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదనీ, ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె తల్లి సీతమ్మ సిద్ధ్దంగా ఉన్నారని’ అందులోని సారాంశం. ‘మీదే ఆలస్యం’ అని పంతులుగారు తక్షణం రిప్లయ్ ఇచ్చారు. అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరం తెప్పించి తన ఇంట్లో, తన భార్య సంరక్షణలో ఉంచుకున్నారు. ఆ వెంటనే వరుడి వేట మొదలైంది!

విశాఖపట్నం పోలీస్ హెడ్ క్వార్టర్ట్స్‌లో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు అనే యువకుడు ఆ క్షణంలో పంతులుగారి మదిలో మెదిలారు. గతంలో అతడు పంతులుగారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అతడికి కబురు పంపారు. శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాడు. అది అతడికి పంతులుగారిపై ఉన్న గౌరవం. శ్రీరాములుకు అంతకుముందే పెళ్లయింది. భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా వితంతు వివాహం చేసుకోడానికి అతడు వేచి ఉన్నాడు. చివరికి గౌరమ్మ దొరికింది!

పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి. వరుడి పేరును కూడా పంతులుగారు రహస్యంగా ఉంచారు. గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికీ తెలిసింది కానీ వరుడెవరో బయటికి పొక్కలేదు. పెళ్లికి కావలసిన రక్షణ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్నల్ పోర్చిస్ దొరగారి నుంచి లభించింది. పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడా రామకృష్ణయ్యగారు సమకూర్చారు. వధూవరులకు కావలసిన నైతిక స్థయిర్యాన్ని పంతులుగారు ఇచ్చారు. అలా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది.

చివరి నిమిషంలో వరుడి తల్లిదండ్రులకు విషయం తెలిసి గగ్గోలు పెడుతూ కల్యాణ మంటపానికి చేరుకున్నారు. వేయడానికి అక్షింతలు, ఇవ్వడానికి అశీర్వచనాలు తప్ప వాళ్లకేం మిగల్లేదు. ఆ వివాహానికి వెళ్లిన వాళ్లందరినీ సమాజం గుర్తుపెట్టుకుని మరీ వెలి వేసింది. వేడుకలకు, వివాహాలకు పిలవడం మానేసింది. పంతులుగారిని చీడపురుగుగా చూసింది. పనిగట్టుకుని వేధించింది. వీరేశలింగం భయపడలేదు. వెనకడుకు వెయ్యలేదు. నేనింతే అన్నాడు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా పెళ్లిళ్లు చేస్తానని సవాల్ విసిరాడు. ‘‘ఈ బక్క పీనుగకు చావైనా రాదే! వీడి మీది గౌరవంతో వీడి పెళ్లానికి ఇంకో పెళ్లి చేద్దుము’’ అని శుద్ధ సంప్రదాయవాదులు పంతులుగారిని రహస్యంగా తిట్టుకున్నారు. ఆ రహస్యం ఆయన చెవిన పడి నవ్వుకున్నారే గానీ, నమ్మిన తోవను వదిలి వెళ్లలేదు.

వీరేశలింగం పంతులుగారు శారీరకంగా బలహీనులైతే కావచ్చు. మానసికంగా బలవంతులు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మిగారు. వీళ్లందరి సహకారంతో పంతులుగారు తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. తను బతికుండగా నలభై వరకూ వితంతు వివాహాలు జరిపించారు. ఈ దుస్సాహసమే ఆయన్ని నేడు సంఘసంస్కర్తగా నిల బెట్టింది.

వివేక వర్థిని
ఉన్నత విద్యానంతరం వీరేశలింగం అధ్యాపక వృత్తిని చేపట్టారు. రాజమండ్రి, కోరంగి, ధవళేశ్వరం, మద్రాసులలోని పాఠశాలల్లో పని చేశారు. అధ్యాపకుడిగా పనిచేస్తుండడంతో ‘పంతులు’గారని, వీరేశలింగం పంతులుగారని ప్రాచుర్యం పొందారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి 1876లో ఉపాధ్యావృత్తి నుండి జర్నలిస్టుగా మారి ‘వివేకవర్థిని’ అనే మాసపత్రికను ప్రారంభించారు. మొదట ఈ పత్రిక మద్రాసు నుండి వచ్చేది. తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి – రాజమండ్రిలోనే సొంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పత్రికను నిర్వహించారు.ఆ రోజుల్లోనే లంచగొండితనం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు… ఇలా ఎన్నో అన్యాయాలు సమాజంలో జరుగుతుండేవి. వాటిపైకి తన పత్రిక ‘వివేకవర్థిని’ని ఆయన ఎక్కుపెట్టారు.

ఖండించారు, కళ్లు తెరిపించారు
19వ శతాబ్దంలో దేశమంతటా సంస్కరణ ఉద్యమం మొదలైంది. బ్రిటిష్ భాషాసంస్కృతుల సహచర్యం, వారి విజ్ఞానశాస్త్రం అన్ని రంగాలలో కొత్త ఆలోచనలు కలిగించాయి. ఆ ఆలోచనలకు తెలుగునాట కందుకూరి వీరేశలింగం ప్రధాన చోదకశక్తి అయ్యారు. సాహిత్యంతో ఉద్యమాన్ని ముందుకు నడిపారు.కేవలం రచనలకు, ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా, ఆచరణాత్మకంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.తొలి వితంతు పునర్వివాహాన్ని 11 డిసెంబర్ 1881న తన ఇంట్లోనే జరిపించారు!

ఈ క్రమంలో అనేక విమర్శలకు, అవమానాలకు, సంఘ బహిష్కరణలకు గురయ్యారు.పంతులుగారి కంటే ముందు బెంగాల్‌లో రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్త్రీ అభ్యుదయం కోసం కృషి ప్రారంభించారు. వారి నుంచి పంతులుగారు ప్రేరణ పొందారు. స్వయంగా పత్రికలు నడిపారు.

నవల, వ్యాసం, ఉపన్యాసం, విమర్శ వంటి ప్రక్రియలకు ఆద్యులు.తెలుగులో వచ్చిన తొలి సాంఘిక నవల ‘రాజశేఖర చరిత్ర’ (1878) పంతులు గారు రాసిందే. సమకాలీన సమాజంలోని కుళ్లును, అజ్ఞానాన్ని ఎత్తి చూపుతూ, రకరకాల గుడ్డి నమ్మకాలను సహేతుకంగా ఖండించి, కళ్లు తెరిపించే ప్రయత్నం ఈ నవల్లో జరిగింది. పంతులుగారి ప్రతి రచనలోనూ సంఘ సంస్కరణే అంతర్లయ. 1880 నవంబరులో స్త్రీ విద్యపై ఆయన ఇచ్చిన ఉపన్యాసం తెలుగులో పాఠ్యాంశం అయింది.

స్త్రీ విద్యపై పంతులుగారి ఉపన్యాసం (1880)లోని కొన్ని భాగాలు
ఒక్క పురుషులకు మాత్రమే కాక స్త్రీలకు సహితమూ విద్య యావశ్యకమనుట, స్త్రీలకు కూడా వినయ వివేకాది సద్గుణములు కలుగవలయునని కోరు వారికెల్లరకును గరతలామలకమై యుండును. పూర్వకాలమునందు మనదేశంలో స్త్రీ విద్య వ్యాపించి యున్నదనుటకు భోజరాజు ప్రభుత్వ కాలమునందును, కృష్ణదేవరాయల ప్రభుత్వ కాలమునందును స్త్రీలు చెప్పిన శ్లోకములును, పద్యములును చాలినంత నిదర్శనములుగానున్నవి.

మొల్ల యనునామె రామాయణమును సైతము రచించి యున్నది. అంతియకాక పూర్వకాలమందు పురుషుల వలెనే స్త్రీలును ఎల్లర చేతను గౌరవింపబడుచుండిరి. సీత మొదలగు వారు తమ భర్తలతో సభలకు వచ్చి సింహాసనము మీద కూర్చుండుట మొదలగు సంగతుల పెక్కింటి నిందుకు దృష్టాంతముగా జెప్పవచ్చును.

స్త్రీలు స్వతంత్రురాండ్రుకారన్న మాత్రమున వారు గౌరవింపనర్హురాండ్రు కారని యెంచుట కేవలము పొరపాటు. స్త్రీలను పురుషులతో సమానంగా గౌరవించుచున్నంతకాలమును మనదేశము యున్నతస్థితి యందే ఉండినది. అట్లు గౌరవించుటమాని, విద్య చెప్పించుట వదిలివేసి, వారిని దాసీజనులవలె చూడ మొదలుపెట్టిన తరువాతనే మన దేశమునకిట్టి దౌర్భాగ్యదశ యారంభమయినది.

స్త్రీలు తమ పురుషులకాలోచన చెప్పుటయందు మంత్రుల వంటివారయి యుండవలయునని స్మృతులు ఘోషించుచుండుట చేత వారియెడ గౌరవముంచి వారి యాలోచనలను గణ్యతలోనికిదెచ్చుట పురుషుల విధియని వేరు చెప్పనక్కర యుండదు. మన వారు స్త్రీలకు మంచి విద్యను జెప్పించి వివేక మహితురాండ్రనుగాజేసి, పిమ్మల వారి యాలోచనను సహితము తగిన విషయములందంగీకరించి వారిని గౌరవించుచు మన పూర్వులు పొందియుండిన మహోన్నతదశను మరల పొందుటకయి ప్రయత్నింతురని మరి మరి కోరుచున్నాము.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top