You Are Here: Home » చిన్నారి » క్రీడాస్ఫూర్తి

క్రీడాస్ఫూర్తి

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో కొంతమంది పిల్లలున్నారు. వాళ్లకు ఫుట్ బాల్ ఆట అంటే చాలా ఇష్టం. రోజూ వాళ్ల ఇళ్లకు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేవారు. అయితే వాళ్లలో ఎవరి దగ్గరా ఫుట్‌బాల్ లేదు. వారి దగ్గర ఉన్న బాల్‌లతోనే ఫుట్‌బాల్ ఆడుకునేవారు. ఒకరోజు వాళ్లంతా ఊరి బయట ఉన్న పెద్ద స్థలంలో నిజమైన ఫుట్‌బాల్ ఆటఆడుకోవాలనుకున్నారు. ఆటకు అవసరమయ్యే వస్తువులను ఒక్కొక్కరు ఒక్కోటి తేవాలని, ఆదివారం నాటికి అన్నీ సమకూర్చుకుని, ఆటస్థలాన్ని శుభ్రం చేసుకోవాలనుకున్నారు.

అనుకున్నట్టుగానే ఆదివారం అంతా సిద్ధమయ్యారు. రెండు జట్లుగా విడిపోయారు. కానీ ఆ జట్లకి లీడర్లుగా ఎవరుండాలనే దగ్గర పేచీ వ చ్చింది. ఒకబ్బాయి ‘‘నేను బాల్ తీసుకొని వచ్చాను. నన్ను లీడర్‌గా పెట్టుకోండి’’ అన్నాడు. మరో అబ్బాయి ‘‘నేను విజిల్ తెచ్చాను. నేనే లీడర్‌గా ఉంటాను’’ అన్నాడు. అలా ఒకరు నెట్ తెచ్చాననీ, జెండాలు తెచ్చాననీ, ఆట స్థలం సిద్ధం చేశామనీ లీడర్లుగా ఉండడానికి పోటీ పడ్డారు. ఆఖరుకు వాళ్లు తెచ్చిన వాటిని అక్కడే వదిలేసి వెళ్లారు. మైదానానికి దగ్గరలో ఉన్న గుంతల దగ్గర ఒక రేకుడబ్బాను బాల్ లాగా వాడుతూ ఆడసాగారు.
ఆ దారిన వెళ్తున్న పెద్దవాళ్లు ‘‘ఈ పిల్లలు ఆట బాగానే ఆడుతున్నారు. కానీ ఈ రేకుడబ్బాతో కాకుండా నిజమైన బాల్‌తో ఆ పక్కన చక్కగా ఉన్న స్థలంలో ఆడితే వీళ్ల ఆట ఇంకెంత మెరుగు పడేదో!’’ అంటూ వెళ్లారు.

ఆ మాటలు విన్న పిల్లలు ‘నిజమైన ఫుట్ బాల్‌తో ఆడాలని ఎన్నో రోజులు కష్టపడి అన్నీ సమకూర్చుకున్నాం. తగాదా వల్ల వాటిని పక్కన పడేసి ఇలా పిచ్చిగా ఆడుతున్నాం’ అని బాధ పడ్డారు. వారిలో ఒకబ్బాయి ‘‘ఈసారికి మన అందరిలోనూ బాగా ఆడే వాళ్లను లీడర్లుగా పెట్టుకుందాం. తర్వాత నుంచి ఒక్కోసారి ఒక్కొక్కరం లీడరుగా ఉందాం’’ అన్నాడు. అందరూ అందుకు ఒప్పుకున్నారు. ఆట మొదలు పెట్టారు. వాళ్ల ఏర్పాట్లూ, ఆట తీరూ గమనించిన ఆ ఊరి వాళ్లందరూ ఆ ఆట చూడడానికి వచ్చారు. ఆట అయిపోయాక అందరూ పిల్లలను అభినందించారు. కొన్నాళ్లకు ఆ పిల్లలందరూ మంచి ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. వారిలో ఉన్న క్రీడాస్ఫూర్తి కారణంగానే మధ్యలో గొడవలు పడినా తిరిగి ఐకమత్యంగా అనుకున్నది సాధించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top