You Are Here: Home » చిన్నారి » క్రమశిక్షణ

క్రమశిక్షణ

అనగనగా ఒక ఊరిలో శ్యామ్, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కానీ ఎప్పుడూ ఏదో ఒక కారణంగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండేవి. ఒక రోజు వాళ్లిద్దరూ ఇంటి దగ్గర పార్కులో కూర్చుని తమ ఇష్టాల గురించి మాట్లాడుకోవటం ప్రారంభించారు.
‘‘నాకు ఉదయాన్నే నిద్రలేవటం అసలు ఇష్టం ఉండదు. కాని చదువుకోవటం కోసం లేవక తప్పటం లేదు’’ అని రాజుతో చెప్పాడు శ్యామ్.

అప్పుడు రాజు ‘‘అది చాలా మంచి అలవాటేగా, బాధపడటం ఎందుకు?’’ అన్నాడు. ‘‘పొద్దున్నే లేవటం, పళ్లు తోముకోవటం, స్నానం చేయటం, స్కూల్‌కి వెళ్లటం, చదువుకోవటం ఇవన్నీ నాకు చాలా బోర్‌గా అనిపిస్తున్నాయి. నాకు ఇష్టం వచ్చినప్పుడు పడుకొని, ఇష్టం వచ్చినప్పుడు లేచి రోజంతా అటుఇటు తిరుగుతూ ఆడుకుంటుంటే బాగుంటుంది అనిపిస్తోంది’’ అన్నాడు శ్యామ్.
‘‘మనకి నచ్చినట్లుగా ఉండటం మంచిదే, కానీ అది మనకు గానీ ఇతరులకు గానీ నష్టం కలిగించేదిగా ఉండకూడదు. క్రమశిక్షణ ఎవరికైనా అవసరమే’’ అన్నాడు రాజు.

అందుకు శ్యామ్ ఒప్పుకోలేదు. చాలాసేపు ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇద్దరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. శ్యామ్ తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఎలాంటి క్రమశిక్షణ లేకుండా తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా తయారయ్యాడు. రాజు ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకోలేదు. ఎలాగైనా శ్యామ్‌లో మార్పు తేవాలనుకున్నాడు రాజు.

కొంత కాలానికి శ్యామ్ వాళ్ల కుటుంబం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. శ్యామ్ వాళ్ల అమ్మకి మొక్కలంటే ప్రాణం. ఆమె ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో గులాబీ తోటను పెంచేది. శ్యామ్,రాజు ఇద్దరికీ ఆ తోటంటే ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా గులాబీతోటలోకి వెళ్లేవారు. శ్యామ్ వాళ్లు ఊరికి వెళ్లే ముందు తోట బాధ్యతను రాజుకి అప్పగించారు.

కొన్ని నెలల తర్వాత శ్యామ్ వాళ్లు ఊరి నుంచి తిరిగి వచ్చారు. రాగానే తోటలోకి వెళ్లి చూసుకున్నారు. గులాబీ మొక్కలన్నీ ఎండిపోయాయి. తోటంతా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అది చూసి శ్యామ్ తల్లి చాలా బాధపడింది. శ్యామ్‌కి విపరీతమైన కోపం వచ్చింది.
శ్యామ్ వెంటనే రాజు దగ్గరకు వెళ్లి, ‘‘నీకు తోట బాధ్యత అప్పగిస్తే ఇలా చేస్తావా, కొంచెం కూడా జ్ఞానం లేదు’’ అని చెడామడా తిట్టాడు.

‘‘నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఊరికి వెళ్లిన తర్వాత బాగా గుర్తుకు వచ్చాయి. నేను కూడా ఎలాంటి క్రమశిక్షణ లేకుండా నీలాగే ఉంటే బావుంటుందనిపించింది. ఆ తోటలో మొక్కలు కూడా వాటి ఇష్టం వచ్చినట్లు అవి పెరుగుతాయిలే అని వదిలేశాను. స్నేహితుడివి అయిన నీ దారిలో నడవటం తప్పు కాదు కదా!’’ అన్నాడు రాజు.

శ్యామ్ తలదించుకొని వెళ్లిపోయాడు. రాత్రంతా బాగా ఆలోచించిన తర్వాత క్రమశిక్షణ ఎంత ముఖ్యమైందో గ్రహించాడు. మరుసటి రోజు నుంచి అన్నీ క్రమశిక్షణగా చేయటం మొదలుపెట్టాడు. శ్యామ్‌లో వచ్చిన మార్పుకి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. వాళ్ల కన్నా ఎక్కువగా రాజు ఆనందించాడు.

శ్యామ్‌లో తాను కోరుకున్న మార్పు వచ్చినట్లు నిర్ధారించుకున్నాడు రాజు. ఒకరోజు శ్యామ్ దగ్గరకు వచ్చి ‘‘ఆ మొక్కలు అన్నీ చనిపోలేదు. వాటిని తీసుకు వెళ్లి మా ఇంటి వెనుక కుండీల్లో పెంచుతున్నాను. నీలో ఈ మార్పు కోసమే మీ తోటను అలా చేశాను’’ అని చెప్పి మొక్కలను తెచ్చి పెట్టాడు. శ్యామ్ వాళ్ల ఇంట్లో వాళ్లందరూ సంతోషించి, స్నేహితుడిలో మార్పు తీసుకురావడానికి రాజు చేసిన పనిని మెచ్చుకున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top