You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » కోరిన కోరికలు తీర్చే శ్రీలక్ష్మీనారాయణ స్వామి

కోరిన కోరికలు తీర్చే శ్రీలక్ష్మీనారాయణ స్వామి

కోరిన కోరికలు తీర్చే శ్రీలక్ష్మీనారాయణ స్వామి

 

భారతదేశంలోని అతి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైవున్న ఈ క్షేత్రాన్ని దర్శించని వారుండరు. భక్తుల కోరికలు తీర్చడానికి పలు ప్రాంతాలలో వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారు. తిరుపతి చుట్టు ప్రక్కల ప్రదేశాలలో కూడా తన విశ్వరూపంతో భక్తులను స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ కోవకు చెందనదే వేపంజరిలో వున్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. ఈ ప్రాంతం తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలోనూ, చిత్తూరుకు 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మానవుని పంచ మహాపాతకాలను హరించి, కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఈ క్షేత్రం ‘వేం పంచ హరి’గా పిలవబడింది. ‘వేం’ అనగా పాపమని, ‘పంచ’ అనగా ఐదు, ‘హరి’ అంటే హరించమని అర్థముంది. అంటే, తాము చేసే పంచమహాపాపాలను హరించమని భక్తులు భగవంతుని ప్రార్థిస్తుంటారు. కాబట్టి ఈ క్షేత్రానికి ‘వేం పంచ హరి’ అని పేరు వచ్చిందని ఒక కథనం. కాలక్రమంలో దీని పేరు వేపంజరిగా ప్రసిద్ధి గాంచింది.

 

gods
స్థలపురాణానికి సంబంధించి, క్రీ.శ. 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో తొండ మండల గ్రామంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి స్వయంగా వెలిసాడని చరిత్ర చెపుతుంది. కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న సమయంలో, ఓ వైష్ణవ భక్తుని కలలో గోచరించిన శ్రీమన్నారాయణుడు, తాను సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లుగా తెలిపాడు. ఆ భక్తుడు తన కలలో కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించగా, రాజు సకల జనుల సమేతంగా స్వామి ఉన్న పుట్టకోసం వెదకడం జరిగింది.

చివరకు ఓ చిట్టడవిలో కనిపించిన పుట్టను తొలగించగా, స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీలక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ కాంతులీనుతూ దర్శనమిచ్చింది. ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై ప్రతిష్టింపజేసిన రాజావారు, వెను వెంటనే అక్కడ ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేసాడు. అలా మూడవ కుళోత్తుంగ చోళుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము, ఆయన కాలములో నిత్య పూజలతో, ఉత్సవాలతో కళకళలాడింది. అనంతరం పట్టించుకునే వారే కరువై ప్రకృతి బీభత్సాలకు, శత్రువుల దండయాత్రలకు ఆలయం ధ్వంసమయ్యే స్థితికి చేరుకుంది. దాని ఫలితం ఉంటుందిగా మరి.

thirumalaఅనంతరం ఆ ప్రాంతమంతా అనావృష్టి తాండవించింది. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. పంటలు లేకపోవడంతో కరువు కరాళ నృత్యం చేయసాగింది. ఆ స్థితిలో గ్రామస్తులంతా గుమిగూడి, తమ ప్రాంతానికే ఎందుకీ దురవస్థ అని ఆలోచించి, శ్రీలక్ష్మీనారాయణ స్వామికి నిత్య పూజలు జరుగక పోవడమే క్షామానికి కారణమని గ్రహించారు. అనుకున్నదే తడవుగా, ఆరోజు నుంచి ఆలయంలో నిత్య పూజలు మొదలయ్యాయి. ఫలితంగా మరలా ఆ ప్రాంతమంతా పచ్చ పచ్చని పైరులతో కళకళలాడటం ప్రారంభించింది.

ఈ స్వామి వారి విగ్రహం సుమారు క్రీ.శ. 1178-1218 కాలం నాటిది. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండ పెట్టుకుని దర్శనమిస్తారు. ఈ మనోహర రూపాన్ని దర్శించుకోడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. స్వయంగా స్వామి, అమ్మవారితో కలిసి భక్తుల కోరికలను తీరుస్తూ వుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయం భక్తుల పాలిట కోరికలు తీర్చే కల్పవృక్షంగా మారింది.

విశిష్టమైన వేపంజరి గ్రామంలో శ్రీమన్నారాయణుని ఆలయమే కాక, ఇంకా పలు ఉపాలయాలు, చూడదగిన విశేషాలెన్నో వున్నాయి. అందులో ప్రధానమైంది అష్టలక్ష్మీ ఆలయం. మన రాష్ట్రంలోనే ప్రముఖ స్థానాన్ని ఆ సంపాందించుక్ను ఈ ఆలయంలో శ్రీవారు కుబేరలక్ష్మీతో మధ్యస్థంగా వుండగా చుట్టూ అష్టలక్ష్ములు కొలువై ఉన్నట్టుగా విగ్రహాలు వున్నాయి.

దశవతార పుష్కరిణి
ఆలయానికి ఈశాన్యదిశలో స్వామివారి దశావతార పుష్కరిణి వుంది. ఈ పుష్కరిణిలో స్వామివారు కృష్ణ లీలలను తెలియజేసే కాళీయమర్దన రూపంలో వుండగా, దశవతార విగ్రహం పలువురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్కో యుగంలో శ్రీమహావిష్ణువు పాపాత్ములను సంహరించటానికి దశావతారా లు ఎత్తాడని లోకవిదితమే. అయితే ఏ విష్ణు ఆలయంలో చూసినా, దశావతారాలు విడివిడిగా కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం స్వామి వారి దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి వుండి 21 అడుగుల దశావతార విగ్రహం రూపంలో అద్భుతమయిన రూపంలో కనిపిస్తుంది.

nagupamuఅంతేకాక స్వామి వారి నాభిభాగంలో బ్రహ్మదేవుడు. వక్షస్థల భాగంలో శివుని రూపం కలిగి వుంటారు. ఫలితంగా త్రిమూర్తులందరిని ఒకేచోట దర్శించుకునే అవకాశం భక్తజనులకు కలుగుతుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే దేవతల వైద్యుడైన ధన్వంతరీ ఆలయం వుంది. ఇక్క డకు వచ్చిన భక్తులు వారి అనారోగ్యాన్ని గురించి ధన్వంతరీ దేవుని ముందు చెప్పుకుని, మంత్రాన్ని జపించి అందుకు తగిన ఫలితాన్ని పొందుతుంటారు.

పూజలు-సేవలు
ప్రాతః కాలంలో ఐదు గంటలకు తెరవబడే ఈ ఆలయాన్ని రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో మూలవరులకు అభిషేకం, స్వర్ణపుష్పార్చన, కల్యాణోత్సవం (నిత్యం), దీపకైంకర్యం, పుష్ప కైంకర్యం (నెలకోసారి), నిత్యార్చన, గోసంరక్షణ, అన్నదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, కైంక ర్యాలు, ఉభయం, నిర్వహించబడతాయి. ఈ దేవాలయం, ప్రాంగణం, పరిసరాలు సువిశాలంగా కనిపిస్తూ ఆహ్లాదకర వాతా వరణంతో కనిపిస్తూ భక్తుల మనసులను అలౌకిక ఆనందాన్ని అందజేస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సమయంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామివారికి వైభవో పేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి.

ఎక్కడుంది? ఎలా వెళ్లాలి?
చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే మన రాష్ట్రం లోని విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి వంటి పలు ప్రాంతాల నుండి బస్సు, రైలు సౌకర్యాల ద్వారా చేరు కోవచ్చు. అలా తిరుపతి వరకు వెళ్లి అక్కడ నుండి బస్సు ప్రయా ణం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే చెనై్న, బెంగళూరుల నుండి కూడా వేపంజరికి బస్సు సౌకర్యం వుంది. తిరుపతికి వెళ్లే యాత్రీకులు ముందస్తు ప్రణాళికతో ఈ ఆలయాన్ని కూడా దరించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.

శాపవిమోచన వృక్షం
దశావతార పుష్కరిణి ప్రవేశించే దారిలో రెండు దశాబ్దాల చరిత్రగల మర్రిచెట్టు వుంది. దీనికి శాప విమోచన వృక్షమని పేరు. ఈ చెట్టు కింద బ్రహ్మదేవునికి పూజలు జరుగుతూ వుంటాయని, చనిపోయి ఆత్మలుగా మారిన వారు ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ మోక్షాన్ని పొందుతారని ఒక కథనం ప్రచారంలో వుంది. అందుకే ఈ చెట్టుకు శాపవిమోచన వృక్షమని పేరు వచ్చింది. ఈ చెట్టు నుంచే వేపంజరి దిద్యక్షేత్రానికి శాప విమోచన క్షేత్రమన్న పేరు ఉంది.

సుదర్శన, యోగ మందిరం
ఈ పుణ్య క్షేత్రంలో మరొక విశేషం యోగమందిరం. ఈ మందిరంలోని ఓ విగ్రహం పైభాగంలో సుదర్శన చక్రం, కింద భాగంలో యోగనరసింహస్వామి కలిసిన విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ సుదర్శన మంత్రాన్ని జపిస్తూంటే సమస్త పాపాలన్నీ పటాపంచలై ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

కల్పవల్లి వృక్షం
రాగి, వేప, మద్ది, చింత, మర్రి, బిల్వ, పనస మొదలగు ఏడు వృక్షాలు కలిగిన ఈ స్థలంలో కల్పవల్లి మరియు మునీశ్వర దేవతలు పూజలందుకుంటారని అందుకే దీనిని కల్పవృక్షమంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఈ తల్లి భక్తుల పాలిట కొంగుబంగారంగా మారింది.

నక్షత్ర వనం
ఈ వనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ సమేతంగా కొలువై వుంటారు. వారి చుట్టూ నవగ్రహాలు ప్రతిష్టించబడి వుంటాయి. అంతేకాక 27 నక్షత్రాలకు సంకేతంగా 27 వృక్షాలున్నాయి. దీని దగ్గర్లో 18 మెట్లతో అయ్యప్పస్వామి విగ్రహం వుంది. శబరిమలైని తలపించే విధంగా స్వామి విగ్రహం కనిపిస్తుంది. అంతేకాక పుష్కరిణికి ఉత్తరదిశలో శ్రీవిద్య వినాయక విగ్రహం కూడా వుంది.ఇంకా ఈ క్షేత్రంలో 33 అడుగుల ఎత్తుతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి వారి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. దీనితో పాటు, గంగమ్మ మరియు భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా వుండటం విశేషం. ఇలా ఆలయ ప్రాంగణమంతా శిల్పకళా శోభితంగా అలరారుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top