You Are Here: Home » చిన్నారి » కథలు » కొత్త సూర్యోదయం

కొత్త సూర్యోదయం

sunday-storeగురువారం…
మిట్ట మధ్యాహ్నపు ఎండ మండిపోతూ నడి వేసవిని తలపిస్తోంది.
సాయి బాబా గుడి జనంతో కిటకిటలాడుతోంది.
మధ్యాహ్న ఆరతి పూర్తయింది. ఇహ భోజనాలు పెట్టడమే తరువాయి.
భక్తులందరూ తిన్న తర్వాత బిచ్చగాళ్ళకు పెడతారు.
రంగడికి కడుపు ఆకలితో నకనకలాడుతోంది. గుడికి దూరంలో విశాలంగా పరచుకున్న రావి చెట్టుకింద సొట్టలు పడిన సత్తుప్లేటు… చెంబు… చిన్న సంచితో కూర్చుని వున్నాడు. చుట్టూ చుశాడు తనలాగే చుట్టుతా కమ్ముకుని వున్నారు బిచ్చగాళ్ళు. ఈలవేస్తే పరిగెట్టడానికి సిద్దంగా వుండే అథ్లెట్స్‌ లా వున్నారు.
తినడానికి రమ్మని పిలిచారు. గుడి దగ్గరికి అందరూ ఒకేసారి పరిగెట్టారు. తిట్లూ… శాపనార్థాలు… ఈసడింపులతో మొత్తానికి ఆ కార్యక్రమం పూర్తయింది.

దాదాపు అన్ని పదార్థాలు అయిపోయాయి… అరకొరగా దొరికిన వాటితో అర్థాకలిగా తిని ఈసురోమంటూ బయటికి వచ్చారు.
అన్నదానం పుణ్యకార్యమైన… ఆ దేవుడి సమక్షంలో కూడా బేధభావాలు. మనుషులందరు… ఒకటని… మనిషిలో దైవత్వాన్ని చూడాలని పురాణాల్లో చదివినా… మహానుభావులు చెప్పినా మార్పురాదు. రంగడికి చిరాగ్గా వుంది. తిన్న ఆ కాస్తా ఆకలికి అజ్యం పోసినట్టుంది తప్ప కడుపు నిండలేదు. ఏం చేయగలడు? దూరంగా వున్న బోరింగ్‌ దగ్గరికి వెళ్ళి నీళ్ళతో కడుపు నింపుకున్నాడు.

ఊరికి కొద్ది దూరంలో వుండే ఓ పాడుపడిన సత్రం ఆ ఊరి బిచ్చగాళ్ళకు ఆవాసం. రాత్రి కాగానే అందరూ అక్కడికి చేరుకోవాలసిందే!
అక్కడ కరెంట్‌ దీపాల్లేకపోయినా ఆ రోజు పౌర్ణమి కావడంతో వెన్నెల వెలుగు విస్తృతంగా పరచుకునుంది.
రంగడు అక్కడున్న అందరి వంకా చూశాడు. కొంత మంది సారా తాగి పిచ్చి పిచ్చిగా ఏవేవో పేలుతున్నారు… మరికొందరు బీడీ తాగుతూ తాదాత్మ్యులవుతున్నారు. ఇంకొందరు రాత్రికోసం ఆడవాళ్ళని దువ్వుతున్నారు. రోజు వుండే వాతావరణమైనా ఆరోజెందుకో వాళ్ళని… తమ బతుకుల్ని చూస్తుంటే కంపరం కలుగుతోంది.
గబ గబా అక్కడే వున్న అరుగు ఎక్కి ‘‘అందరు ఓ మాటు ఇటు రండహే!’’ అని బిగ్గరగా అరిచాడు.
అందరు రంగడి వంక చూశారు. దగ్గరికి రమ్మన్నట్టుగా చేతులుపాడు. నెమ్మదిగా లేచి దగ్గరికి వచ్చి కింద కూర్చున్నారు.

‘‘మనలో స్వతహాగా మొదట్నించి వున్న బిచ్చగాళ్ళు కొంతమందైతే… పరిస్థితులవల్ల బిచ్చగాళె్ళైన నాలాంటి వారు మరికొందరు. తమ గుర్తింపుని తమలోనే దాచుకుని… ఆశక్తులమని… అభాగ్యులమని బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. నా విషయమే తీసుకుంటే… నా పేరు రంగారావు… నేను ప్రైవేటు ఉద్యోగం చేసి రిటైరయ్యాను. అదృష్టం కొద్దీ కొంతకాలం క్రితం మా ఆవిడ కాలంచేసింది… పిల్లల నిరాదరణ భరించలేక బ్రతకడానికి భయపడి ఇలా బిచ్చగాడిగా మారాను. మీలో కూడా బాగా బ్రతికిన వాళ్ళు… కళాకారులైన వాళ్ళు వున్నారనిపిస్తోంది. అలావుంటే దయచేసి బయటకి రండి’’ అన్నాడు. కొంతమందికి రంగడేం చెబుతున్నాడో అర్థం కాలేదు… అర్థమైన వాళ్ళు బయట పడడమిష్టం లేక మిన్నకుండిపోయారు.
‘‘అర్థమైంది మీకు ఇలా పురుగుల్లా వుండడమే ఇష్టం.

జీవచ్ఛవాలుగా బ్రతికినంత కాలం బ్రతికి అనామకులుగా కన్ను మూయాలనే నిర్ణయించుకున్నారు. భేష్‌! విచక్షణ జ్ఞానం వున్న మనుషులుగా పుట్టి చివరికి అలా కన్ను మూస్తారన్నమాట. అప్పుడెప్పుడో ఒకసారి నటి కాంచన గుడి మెట్లదగ్గర అడుక్కుంటూ కనిపిస్తే… ఆయనెవరో గుర్తుపట్టి… ప్రపంచానికి చూపించాడు… అమెని స్వచ్ఛంద సంస్థలు అదుకున్నాయి. అలాగే మొన్నోసారి ఒక గాయకుడు అడుక్కుంటుంటే అదీ వార్తయింది… గిన్నీస్‌ బుక్కులోకి ఎక్కినవారు… వ్యాపారాల్లో నష్టం వచ్చినవారు… సర్వం కోల్పోయిన రైతులు… ఆటల్లో పతకాలు సాధించినవారు… ఒకరనేమిటీ ఎందరెందరో మహానుభావులు.. అందరూ ఇదే బాట పడుతున్నారు. చావాలనుకునే వాళ్ళని చచ్చి ఏమి సాదిస్తారు? బ్రతికి సాధించాలి! అంటారు. ఇలా బ్రతికి మనమేం సాధిస్తాము? ఆలోచించండి.

మనలోని ఆలోచనలు ఇంకిపోలేదు.. ఉత్సాహం నీరుకారిపోలేదు… బ్రతకాలన్న తపన తీరలేదు… జనసత్వాలు నిజంగా ఉడిగిపోలేదు. చచ్చేదాకి ఉన్నతంగా… ఉత్తమంగా జీవించే ప్రయత్నం చేయాలి. నేను దురదృష్టవశాత్తు ఇన్నాళ్ళూ ఇలా అజ్ఞాతంలో వుండిపోయాను. ఇప్పుడు ఆలోచనలు పురివిప్పుతున్నాయి. ఏదైనా చేసి ప్రపంచానికి చూపించాలన్న తపన అధికమవుతోంది. మీలో ఇంకా మార్పు రాలేదు కాబట్టి మీరు మురికి మనుషులుగానే వుండండి. నేను రేపటి నుండి… కాదు కాదు ఈ క్షణం నుండి కొత్త జీవితం ప్రారంభిస్తాను’’ అని ముగించి అరుగు దిగబోయాడు అంతలో…
‘‘మనమేంచేయగలం?’’ ఒక గొంతు ప్రశ్నించింది.

రంగారావులో ఆసక్తి చోటు చేసుకుంది.
‘‘ఎవరది?’’
‘‘నా పేరు భగవాన్‌, మాది గుడివాడ. బట్టల షాపులుండేవి. పార్ట్‌నర్‌ మోసం చేయడంతో… అప్పుల్లో కూరుకుపోయి… పారిపోయి ఇలా తలదాచుకుంటున్నాను’’.
మరొకరు లేచారు. ‘‘నా పేరు రాఘవ. నేను సినిమాల్లో అడపాదడపా పాటలు పాడేవాన్ని. బాగానే సంపాదించాను. అర్థిక వ్యవహారాల్లో సరైన పరిజ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో అవకాశాలు సన్నగిల్లినప్పుడు తెలిసింది… కాని అప్పటికే చేతులు కాలిపోయాయి.’’
అలాగే బొమ్మలేసే తిరుమలేశు… ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌లో చేతులు కాల్చుకున్న షకీల్‌… హీరోయిన్‌ అవుదామని భాగ్యనగరానికి వచ్చి సర్వం కోల్పోయిన అభాగ్యురాలు శమంత… అందరూ బైటపడ్డారు.
‘‘నాకీ రోజు చాలా ఆనందంగా వుంది. మనలో కళాకారులున్నారు.. తమ తమ రంగాల్లో నిష్ణాతులున్నారు. అవకాశమొస్తే అకాశాన్నంటే వ్యక్తిత్వమున్నవారు వున్నారు.

కాని దౌర్భాగ్యం వల్ల మనమిలా అమావాస్య చంద్రుల్లా వుండవలసి వచ్చింది. మనని మనం ప్రోత్సహించుకోవాలి… పైకి రావడానికి దారులు వెతుక్కోవాలి. సెల్ఫ్‌ ఎస్టీమ్‌ పెంచుకోవాలి అనుక్షణం పాజిటీవ్‌ యాటీట్యూడ్‌తో వుండాలి. రేపతినుండి మనకి కొత్త సూర్యోదయం మొదలవుతుంది. మనం ఎదిగి ఇన్నాళ్ళు మనతో పాటు వున్న ఈ నిజమైన బిచ్చగాళ్ళకి దారి చూపించాలి.’’
అక్కడున్న బిచ్చగాల్లకి ఏమీ అర్థం కాలేదు… కానీ తమ మధ్య కొంతమంది ఉన్నతులు వున్నారని మాత్రం అర్థమైంది. వాళ్ళని గౌరవించడం ఆ క్షణం నుండే మొదలెట్టారు. హఠాత్తుగా మొదలైన ఆ పరిణామానికి మొహమాటం కలిగినా ఒకింత గర్వం కూడా కలిగింది వాళ్ళకి.

తెల్లవారింది.
అందర్లో ఏదో తెలీని ఉత్సాహం. ఎవరూ అడుక్కోడానికి వెళ్ళలేదు.
అందరూ రంగారావు దగ్గరికి చేరారు. అవును మరి అతడే వాళ్ళ మార్గదర్శి.
‘‘ముందుగా ఇందులో నాటక పరిజ్ఞానం వున్న వాళ్ళెవరున్నారు?’’ అని అడిగాడు.
‘‘నేను దర్శకత్వం చేయగలను… మేకప్‌ వేసే జోసఫ్‌ పక్క వీధిలో వుంటాడు… మాటలు ఇదిగో… ఈ రమణ రాస్తాడు… ఒహ పోతే కథ…?’’
‘‘కథ నేనిస్తాను.. నా పేరు రావినూతల రామబ్రహ్మం… ఉద్యోగం చేస్తూ కథలు రాసేవాన్ని… రెండు మూడు బహుమతులు కూడా అందుకున్నాను.’’

‘‘ఇంకేం… నా అలోచన వృధా కాలేదు. మనకి గుర్తింపు… నాలుగు డబ్బులు రావాలంటే… ముందు ఒక నాటకం వేయాలి… మన ఏరియాలో వుండే కమ్యూనిటీ హాలులో నాటకమేద్దాం!’’
‘‘అవునూ… ఇది సాధ్యమవుతుందా!
మనని మనుషులుగా గుర్తించని వాళ్ళు… మనకి కమ్యూనిటీ హాలిస్తారా..? మన
నాటకాన్ని చూస్తారా?’’ అనుమానం
వెలిబుచ్చాడు శ్రీనాథ్‌.

‘‘గెలుపు కోసం అడుగు వేసేవాడు… ఓటమి గురించి ఆలోచించడు… మన కాలనీలో వుండే జర్నలిస్ట్‌ నాగేష్‌తో నేను మాట్లాడతాను… మీడియానే మనకి కొండంత అండ’’.
***
వాళ్ళలోని ఆనందానికి అవధి లేకుండా పోతోంది. నిన్న మొన్నటి దాకా అనామకులుగా పురుగుల్లా బ్రతికారు. ‘గరీబీ హాటావో’ నినాదంతో ఎన్నెన్నోసార్లు గద్దెనెక్కిన ప్రభుత్వాలు వాళ్ళని దారిద్య్రరేఖకు దిగువనే వుంచేశాయి. ఇనాళ్ళకి వాళ్ళలో చైతన్యం వచ్చింది. తమని తాము నిరూపించు కోవాలను కుంటున్నారు. విశ్శనాథ కాలనిలోని కమ్యూనిటీ హాలులో నాటకం వేస్తున్నారు… విరివిగా టిక్కెట్లు కొని వాళ్ళని ప్రోత్సహించండి. నాటకం ద్వారా వచ్చిన డబ్బుతో తమ తమ రంగాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేద్దామనుకుంటున్నారు. వాళ్ళతో పాటు వున్న బిచ్చగాళ్ళకి దారీ తన్ను చూపాలనుకుంటున్నారు.

ఇది నిజంగా వారి జీవితాల్లో శుభోదయం. రండి అందరం కలిసి వాళ్ళ పునర్జీవితానికి పునాధులేద్దాం…’ ఇదే సారాంశంతో అన్ని పేపర్లలోనూ… అన్ని ఛానల్స్‌లోనూ ప్రముఖ వార్తగా చోటుచేసుకుంది.
నిన్నటి దాకా ఇంటింటికి తిరిగి అడుకున్న వాళ్ళు ఇప్పుడు తమకి ఉదారంగా ఏమీ ఇవ్వవద్దని టికెట్లు కొంటే చాలని అభ్యర్థిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలవాళ్ళు… ఉద్యోగులు… స్కూలు పిల్లలు… విరాళాలు పంపారు.
రంగారావు వాళ్ళ అభిమానానికి కదిపోతున్నాడు… పైకి రావాలనుకుంటే ఆదుకునే ఆపన్న హస్తాలెన్నో!

తమ జీవితాశయమే ఆ నాటకం అన్నట్టు రాత్రి పగలు రిహార్సులు చేస్తున్నారు.
అనుకున్న రోజు రానే వచ్చింది.
కమ్యూనిటీ హాలు జన సంద్రంతో క్రిక్కిరిసిపోయింది.
అడుగడుగునా చప్పట్లతో నాటకం రక్తి కట్టింది. ‘ఛానల్‌ టీవీ లు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నాటకాలు చూస్తారా? అదీ బిచ్చగాళ్ళు వేసేది’ అన్నవాళ్ళ నోళ్ళు మూతలు పడ్డాయి. ‘కష్టానికి ఫలితం వుంటుంది. మంచికి ప్రోత్సాహం వుంటుంది’ అని మరోసారి ఋజువయింది.
స్థానిక ఎమ్మెల్యే సత్యం బాబు వాళ్ళని సన్మానించి ‘భవిష్యత్తులో ప్రభుత్వం నుండి ఏ సహాయం కావలసి వచ్చినా చేయడానికి సిద్ధంగా వున్నానని… ముందస్తుగా స్థలాలిచ్చి ఇళ్ళు కట్టించి ఇస్తానని’ వాగ్దానం చేశాడు.

రంగారావు లేచి అందరికి కృతజ్ఞతలు చెప్పి ‘‘బ్రతకడం కాదు బ్రతుకుతున్నామన్నది ముఖ్యం. నాలో ఆ ఆలోచన రాకపోతే ఇంకా మేము మురికి కూపాల్లోనే వుండే వాళ్ళం. పరిస్థితులు ఎంతగా దిగజార్చినా గుర్తింపుని… జీవితాన్ని కోల్పోకూడదు. బ్రతుకుపోరాటంలో విజయుల మవడానికే ప్రయత్నించాలి తప్ప ఓటమికి లొంగిపోకూడదు. దారులన్నీ మూసుకుపోయాయని కాకుండా కొత్త దారులు వెతుక్కోవాలి. ప్రతిభని గౌరవించేవాళ్ళు ఎప్పుడూ వుంటారు… కాకపోతే ప్రతిభని ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించగలగాలి. ఇప్పుడు మేము చేసిందదే! ఈ విషయం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇహ జిల్లాల వారీగా బిచ్చగాళ్ళలో స్ఫూర్తినింపి వాళ్ళని సమాజానికి ఉపయోగపడేలా చేయడమేనా ధ్యేయం అంతేకాదు వాళ్ళ పిల్లలు కూడా నిరక్షరాస్యులుగా పెరుగుతూ సంఘ వ్యతిరేకులుగా తయారవుతున్నారు…

వాళ్ళని సాన పట్టి తీర్చిదిద్దవలసిన అవసరం కూడా మనమీద వుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా పార్టీలు… నాయకులు… నాయకత్వాలు… ప్రభుత్వాలు ఏవీ చెయ్యవని అర్థమైపోయింది. మనమే నడుము కట్టాలి. మనుషులు మనుషులుగా బ్రతికేలా ఆలోచనలు రేకెత్తించాలి. విలువైన మానవ వనరులని నిర్వీర్యం కానీయకూడదు. ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి. అదే మన నినాదం కావాలి.’’ అని ముగించాడు.
ఎన్నో సభల్లో అప్పటిదాకి ఎన్నెన్నో చప్పట్లు మోగినా ఇప్పటి ఈ చప్పట్లకి మాత్రం ఎంతో విలువుంది అందుకే ఔట్లుగా పేలుతున్నాయవి.

– ప్రతాప వెంకట సుబ్బారాయుడు,
సైనిక్‌పురి, సికింద్రాబాద్‌-94
సెల్‌: 9393981918

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top