You Are Here: Home » చిన్నారి » కుందేలు ధైర్యం

కుందేలు ధైర్యం

అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒకసారి అడవికి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆ కుందేలుని పెంచుకోవాలని తమతో పాటు ఒక ఓడలో తీసుకొని వెళ్లారు. అయితే ఆ ఓడ ఒక దీవికి సమీపంలో పెద్ద ప్రమాదానికి గురయింది. ఆ ప్రమాదంలో అందరూ సముద్రంలో మునిగిపోయారు. కుందేలు మాత్రం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఆ దీవికి చేరుకుంది. ఆ చిన్న దీవిలో ఎడారిలోలాగానే ఇసుక ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతం కుందేలుకి ఉండడానికి అనుకూలంగా అనిపించలేదు. ఆ పక్కనే ఒక కొండ ఉంది. ఆ కొండకి అవతల నివసించడానికి అనువుగా ఉంటుందేమోనని భావించిన కుందేలు నెమ్మదిగా ఆ కొండను ఎక్కడం ప్రారంభించింది.

ఆ కొండను ఎక్కి చూస్తే అవతలి వైపు బోలెడన్ని పళ్లతోటలూ, కూరగాయల తోటలూ కాస్త దూరంలో ఒక ఊరూ కనిపించాయి కుందేలుకి. చాలా సంతోషించింది. గబగబ కొండ దిగబోయింది. కానీ దారి పక్కన ఒక భయంకరమైన ఆకారం పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ కనిపించింది. భయంతో పక్కన ఉన్న పొదల్లో దాక్కుంది కుందేలు. ఆ ఆకారం చాలా దూరంలో ఉంది. కానీ అది ఆగిఆగి చేస్తున్న శబ్దాలు మాత్రం చాలా దగ్గరగా వినిపిస్తున్నాయి. కుందేలుకి ఆ పొదల్లో కొన్ని జంతువుల కళేబరాలు కనిపించాయి. అవి కూడా ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి భయపడి పొదల్లో దాక్కుని చనిపోయాయేమో అనుకుంది.

ఎంతసేపు దాక్కున్నా ఆ శబ్దాలు ఆగేలా లేవు. ఏం జరిగినా పరవాలేదు, ముందుకు వెళ్లడమే మంచిది అనుకుని బయలుదేరింది కుందేలు. నెమ్మదిగా ఆ ఆకారం దగ్గరకు చేరుకుంది. దాని దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తే అది పెద్దపెద్ద బండరాళ్లతో ఉన్న ఒక కొండ గుహ. గ ట్టిగా గాలి వీచినప్పుడల్లా ఆ గుహలోంచి శబ్దాలు వ స్తున్నాయి. అసలు సంగతి అర్థమైన కుందేలు ఆనందంగా పరిగెత్తుకుంటూ కొండ దిగేసింది.

కుందేలు కొండ దిగడం చూసిన కొందరు తోటపని వాళ్లు ఆశ్చర్యపోయారు. ‘‘ఆ రాక్షసుడు ఉన్న కొండ మీదనుంచి ఎవరూ ఇంతవరకు కిందికి దిగిరాలేదు’’ అనుకున్నారు. అప్పటి నుంచి ఆ కుందేలు ధైర్యం గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు. కుందేలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనకు కావలసిన పళ్లు, కూరగాయలు తింటూ సంతోషంగా బతకసాగింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top