You Are Here: Home » చిన్నారి » కష్టానికి ఫలితం

కష్టానికి ఫలితం

ఒక ఊళ్ళో ఒక రైతు దగ్గర కోడి, బాతు, కుక్క, పంది ఉండేవి. అవి స్నేహంగా ఉంటూ కలిసి మెలసి తిరిగేవి. కోడి కష్టపడి పనిచేస్తే మిగతావి మాత్రం సోమరితనంతో కాలం గడిపేవి.
ఒకరోజు కోడికి కొన్ని మొక్కజొన్న గింజలు కనబడ్డాయి. ‘‘వీటిని ఎవరు నాటుతారు?’’ అని అడిగింది.

‘‘నేను కాదు. నేను కాదు’’ అని బాతు, కుక్క, పంది… అన్నాయి.

కొన్నిరోజుల తరువాత కోడి ‘‘మొక్కలకు నీళ్లు ఎవరు పెడతారు?’’ అని అడిగింది.
‘‘నేను పెట్టలేను. నేను పెట్టలేను’’ అని తప్పించుకున్నాయి.

రోజులు గడిచాయి. ‘‘పంట కోతకు వచ్చింది. ఎవరు కోస్తారు?’’ అని అడిగింది కోడి. ‘‘ఆ పని నాకు రాదు. నాకు రాదు’’ అన్నాయి అవి. ఈవిధంగా కోడికి ఏ పనిలోనూ సహాయం చేయలేదు.

కోడి మొక్కజొన్న గింజలను పిండి పట్టించి కమ్మని రొట్టెలు తయారుచేసింది. ఆ రొట్టెల వాసనకు బాతు, కుక్క, పందులు, ‘‘నాక్కావాలి… నాక్కావాలి….’’ అంటూ పరుగెత్తుకుని వచ్చాయి.

‘‘గింజలు నేను నాటాను. మొక్కలకు నీళ్ళు నేను పెట్టాను. పంటను నేనే నూర్పాను. పిండి పట్టించి రొట్టెలు కూడా నేనే చేశాను. మరి ఇప్పుడు రొట్టెలు మీకెందుకు ఇవ్వాలి?’’ అని ప్రశ్నించింది కోడి. అవి చూస్తుండగానే కోడి తన పిల్లలతో కలిసి రొట్టెలు చక్కగా తినేసింది.
బాతు, కుక్క, పంది ‘కష్టపడిన వారికే ఫలితం దక్కుతుంది’ అని అర్థం చేసుకున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top