You Are Here: Home » చిన్నారి » కవితలు » కల్పవృక్షమూ – గీతన్న

కల్పవృక్షమూ – గీతన్న

taddyమనిషి ఎత్తును నోటితో కొలవాలన్నా
ఎతె్తైన మనిషిని దెప్పి పొడవాలన్నా
సనాతన ఉపమానం తాటి చెట్టు

పొలంలోనైనా పెరట్లోనైనా
రేవులోనైనా బాటలోనైనా
ఎన్నేళ్ళు బతికినా ఎంతెత్తుకెదిగినా
మూడడుగుల నేలతోనే సంతృప్తి

మొదలు మొదలుకుని మట్టల దాకా
శరీరం మొత్తాన్ని
మనిషికి దానం చేసే తాటిచెట్టు
కల్పవృక్షం కాక మరేమవుతుంది?

నల్లని దేహంలోంచి చల్లని కల్లును
తెల్లని నుంజుల్ని ప్రసాదించే తాటిచెట్టు
రత్నగర్భ కాక మరేమవుతుంది?

గీతన్నకు ఎవరెస్టు శిఖరం తాటిచెట్టు
గీతన్న వేదం గీత
గీత అంటే భగవద్గీతో బ్రాహ్మణ గీతో కాదు
గీతన్న గీసే మానవ గీత

తాటిచెట్టెక్కడమంటే
ఆకాశానికి నిచ్చెన వెయ్యడం కాదు
ఆకాశాన్నే నేలకు దించడం
సూదులు, దబ్బనాల వంటి తాటి బరకలను
తొడలతో పలకరిస్తూ ఎండిన పొట్టతో
మాగిన మట్టలను నిమురుతూ
తలగుడ్డతో సూర్యుడికి సలాం చేస్తూ
కాళ్ళు చేతులు నడుము త్రిభంగిమలో చేసే
లయబద్ధ ఆరోహణ నాదం ఏ వేదంలో ఉంది?

కాళ్ళను నడుమును రెండుతాళ్ళతో బంధించుకొని
కొమ్మలు లేని చెట్టు మీద కొమ్మలా నిలబడడం
ఏ నాట్యశాస్త్రంలో ఉంది?

ఎండిన బరకలన్నిటినీ
సన్నటి కత్తితో చెక్కి చెక్కి
ఊట పుట్టే మూలం దాకా చెక్కి
కుంత గట్టి కల్లు పట్టడం గంగావతరణమే!

rachapalemఎడమచేతిలోని తాటికాయ మీద
కుడి చేతిలోని సన్నని కత్తి
సుతారంగా ముంజల్ని తీసిచ్చే విద్య ఏ శాస్త్రం నేర్పింది?
గీతన్న ఒక వేదం, గీతన్న ఒక శాస్త్రం!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top