You Are Here: Home » భవిత » విద్య » కర్పూర వసంతరాయడు అనే బిరుదున్న రాజు?

కర్పూర వసంతరాయడు అనే బిరుదున్న రాజు?

రెడ్డిరాజుల చరిత్ర-ఆధారాలు

కాకతీయుల పతనాంతరం ఆంధ్రదేశంలో సామంత రాజులు, సేనానులు, స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేశారు. మహమ్మదీయులకు వ్యతిరేకంగా ముసునూరి, రేచర్ల వెలమలు, రెడ్డిరాజులు పోరాడారు. ఇదేకాలంలో తుంగభద్రా నదీతీరంలో విజయనగర సామ్రాజ్యం వెలసింది. అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరం, కందుకూరు ప్రాంతాల్లో క్రీ.శ. 1324 నుంచి క్రీ.శ. 1434 వరకు కొండవీటి రెడ్లు పాలించారు. రేచర్ల పద్మనాయకులు రాచకొండ, దేవరకొండ తెలంగాణ ప్రాంతంలో ప్రధానపాత్ర వహించారు. మధ్యయుగానికి చెందిన ఈ రాజవంశాల చరిత్రకు ప్రధానంగా రాగి, శిలా శాసనాలు, సంస్కృతం, తెలుగు గ్రంథాలు, మెకంజీ కైఫీయతులు, చాటుకృతులు, బిరుదావళులు, వంశావళులు వంటివి ముఖ్య ఆధారాలు.

శాసనాలు: క్రీ.శ.13వ శతాబ్దం నాటి ముట్లూరి, అనితల్లి కలువచేరు, మోటుపల్లి అభయ, విలస తామ్రశాసనాలు ముఖ్యమైనవి. ప్రోలయ నాయకుని విలసతామ్రశాసనం ముస్లింల దురాగతాలను వర్ణించింది. వెంకటాధ్వరి రాసిన విశ్వగుణ దర్పణం తెలుగునాడుపై ముస్లిం దాడులను విశదీకరిస్తోంది. వెలుగోటివారి వంశావళి రేచర్ల వెలమల చరిత్రను చెబుతుంది.

సంస్కృత గ్రంథాలు: కాళిదాసు మూడు సం స్కృత నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రంలను కుమారగిరి రాజీయం పేరుతో కాటయ వేమారెడ్డి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశాడు. అమరుశతకానికి శృంగార దీపిక పేరుతో పెదకోమటి రెడ్డి వ్యాఖ్యానం రాశాడు. వామన భట్టబాణుడు రాసిన వేమభూపాల చరితం, రేచర్ల సింగభూపాలుడి రసార్ణవసుధాకరం, విశ్వేశ్వరుని చమత్కార చంద్రిక, అమృతా నందయోగి విరచిత, అలంకార సంగ్రహం లాంటి గ్రంథాల ద్వారా రెడ్డి రాజుల నాటి సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి.

తెలుగు గ్రంథాలు: పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన శ్రీనాథుడు భీమేశ్వర పురాణం, కాశీఖండం, క్రీడాభిరామం; కొమ్మనకవి రాసిన శివలీలావిలాసం, కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రిం శిక, మంచెన కేయూర బాహు చరిత్ర, ఎర్రాప్రగడ నృసింహ పురాణం, ఉత్తర హరివంశం, గౌరన నవనాథ చరిత్ర, శ్రీనాథుడి చాటుకృతులు (పొగడ్తలు), మెకంజీ కైఫీయతులు (స్థానిక చరిత్రలు), స్థానిక బిరుదుల ఆధారంగా రెడ్డిరాజుల చరిత్ర తెలుసుకోవచ్చు. కొండవీటి సీమ గురించి గుడికట్టులేఖలు, దండకవెలలు లాంటి ఖాతాపుస్తకాలు (గ్రామసీమల జమా ఖర్చుల రికార్డు) ద్వారా తెలుసుకోవచ్చు.
మహమ్మదీయ చరిత్ర కథనాలు: అల్లాఉద్దీన్ కాలం నాటి, తారీఖ్-ఇ-అలాయి గ్రంథాన్ని అమీర్ ఖుస్రూ రాశాడు. తారీఖ్-ఇ- ఫిరోజ్ షాహినీని జియాఉద్దీన్ బరానీ రాశాడు. ఈ రచనల ద్వారా రెడ్డిరాజుల కాలంనాటి రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులు తెలుసుకోవచ్చు.
రెడ్డిరాజుల వంశ చరిత్ర మహమ్మదీయుల నుంచి ఆంధ్రదేశం విముక్తి పొందిన తర్వాత వెలసిన స్వతంత్ర రాజ్యాల్లో కొండవీటి రెడ్లు సమర్థులు. అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరాలను రాజధానులుగా చేసుకొని మధ్యాంధ్ర దేశాన్ని సుమారు వందేళ్లకు పైగా పాలించారు. వీరిని పంట రెడ్లని కూడా పిలుస్తారు. వీరిది దేసటి కులం.

వెల్లచౌరి గోత్రం. ఈ వంశంలో మొదటివాడు కామారెడ్డి. ఇతడి కుమారుడు కోమటి ప్రోలయరెడ్డి. వీరు కాకతీయ ప్రతాపరుద్రుడికి సమకాలికులు. ప్రాచీనాంధ్రకావ్యాల్లో రెడ్డి పదానికి రట్టడి, రడ్డి, రడ్డు, రెడ్డి అనే రూపాలున్నాయి. రట్టడి పదం కాలక్రమంలో రడ్డు, రడ్డె, రెడ్డిగా మారింది. రట్టడి- రెడ్డి పదాలు 12వ శతాబ్దంనాటి శాసనాల్లో కన్పిస్తాయి. కొండవీటి రెడ్లకు కోమటి అనే పదం ఉపనామంగా ఉండేదని కొండవీటి కైఫీయత్ గ్రంథంలో ఉంది. క్రమేణా పేరు ముందు కోమటి చేర్చడం ఆచారంగా మారింది. రెడ్డిరాజుల కులదైవం-మూలగూరమ్మ

ప్రోలయ వేమారెడ్డి (క్రీ.శ. 1325-1353):
ఇతడు కోమటి ప్రోలయరెడ్డి రెండో కుమారుడు. ఇతడి రాజధాని అద్దంకి. ఆంధ్ర స్వాతంత్య్రోద్యమంలో ముసునూరి ప్రోలయ నాయకుడికి సహకరించాడు. ముట్లూరి శాసనం ఇతడిని మ్లేచ్ఛాబ్ధి కుంభోద్భవుడని వర్ణించింది. స్వతంత్ర రెడ్డి రాజ్య స్థాపకుడితడే. ఎర్రాప్రగడ యవన నృపబలాబ్ధి అని ఈయన్ని వర్ణించాడు. బహుశా తుగ్లక్‌లను ఎదిరించడం వల్ల వీరిని యవనులని పేర్కొన్నారు. నెకరికంటి, చీమకుర్తి శాసనాల ప్రకారం గుంటూరు ప్రాంతం ఈయన ఆధీనంలోనే ఉంది.

ప్రోలయ వేమారెడ్డి త్రిపురాంతకం, శ్రీశైలం, అహోబిలం ప్రాంతాలను రెడ్డిరాజ్యంలో విలీనం చేశాడు. ధరణికోట (అమరావతి), ధనప్రోలు (చంద వరం), వినుకొండ, కొండవీడు, బెల్లంకొండ, కొండపల్లిల్లో పటిష్టమైన దుర్గాలు నిర్మించాడు. శ్రీశైలం, అహోబిలం దేవాలయాలకు శ్రీశైలంలోని పాతాళ గంగకు మెట్లు నిర్మించాడు. సత్రాలు, చలి పందిళ్లు, తోటలు నిర్మించాడు. అనేక గ్రామాలను బ్రాహ్మణులకు అగ్రహారాలుగా దానం చేశాడు. ఈయనకి ధర్మప్రతిష్టాపగురు, నిస్సీయ భూదాన పరశురామ, అపరిమిత భూదాన పరశురామ అనే బిరుదులున్నాయి. కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రగడ హరివంశాన్ని తెలుగులోకి అనువదించి, ప్రోలయవేమారెడ్డికి అంకితమిచ్చాడు. ఇతడు శివభక్తుడు. అనేక క్రతువులు, యజ్ఞయాగాలు చేసి అనవరత పురోహిత కృత సోమపాన, ధర్మప్రతిష్టాపకుడు వంటి బిరుదులు పొందాడు. కొండవీడు, కొండపల్లెల్లో దుర్భేద్యదుర్గాలు నిర్మించి రాజ్యరక్షణకు కట్టుదిట్టం చేశాడు. ఆకుమళ్ల విరూపణ్ణ శాసనాలు ప్రకా రం ఈయన రాజ్యంలో కొంతభాగం హంపీ విజయనగర రాజుల వశమైనట్లు తెలుస్తోంది.

అనపోతారెడ్డి (క్రీ.శ.1354-1364):
ప్రోలయ వేమారెడ్డి అనంతరం అతడి పెద్ద కుమారుడు అనపోతారెడ్డి రాజ్యానికొచ్చాడు. కళింగగాంగులు, పద్మనాయకులు, బహమన్ లతో యుద్ధాలు చేశాడు. అనేక దుర్గాలు వశం చేసుకోవడంతో ఈయనకు వీరన్నవోత భూపతి, వీప విజేత బిరుదులు ఉన్నట్లు ద్రాక్షారామ శాసనం ద్వారా తెలుస్తోంది. బహమనీ సుల్తానులు అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని ధ్వంసం చేయగా, దాన్ని అనపోతారెడ్డి పునః నిర్మించినట్లు ఆలయ శాసనం విశదీకరిస్తోంది. ఇతడు రాజధానిని అద్దంకి నుంచి కొండవీటి దుర్గానికి మార్చినట్లు క్రీ.శ. 1364 నాటి మన్యమాపురం శాసనం పేర్కొంటోంది.

ఇతడు గొప్ప పరాక్రమ వంతుడు. వర్తక వాణిజ్యాభివృద్ధికి మోటుపల్లి రేవు సంస్కరించాడు. ఈ రేవు నుంచి వివిధ ద్వీపాంతరాలకు వర్తకం జరిగేది. మోటుపల్లి రేవు వర్తకుల సంరక్షణ కోసం మోటుపల్లిలో అభయశాసనం వేయించాడు. వర్తకుల సదుపాయం కోసం బంగారంపై పన్ను ఎత్తేశాడు. ఖజానాకు ఆధారమైన సుంకాదాయ పన్నును కూడా తీసివేశాడు.

మోటుపల్లి బాపట్లకు 17 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉంది. దీన్ని శాసనంలో ముకుళపురమని పేర్కొన్నారు. కాకతి గణపతిదేవుడి కాలంలో మోటుపల్లిని దేశీయాక్కొండ పట్టణమని పేర్కొన్నారు. మార్కోపోలో ‘ముటఫిలి’ అని పేర్కొన్నాడు. రెడ్డి రాజులకు మోటుపల్లి రేవు ఆర్థికంగా పటిష్టం చేసింది. ఈరేవు కుమారగిరిరెడ్డి కాలంనాటికి ఎంతో అభివృద్ధి చెందింది. ఈ కాలంనాటి అవచి తిప్పయ శెట్టి వంటి వర్తకులు విదేశీ నౌకాయానం ద్వారా వ్యాపారం చేశారు. అనపోతారెడ్డి అస్థానంలో బాల సరస్వతి అనే కవి విద్యాధికారిగా ఉండేవాడు. అనపోతారెడ్డి శాసనాలన్నీ బాలసరస్వతి రాశాడు.

అనవేమారెడ్డి (క్రీ.శ. 1364-1386):
అనపోతారెడ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి చిన్నవాడు కావడంతో అతడి తమ్ముడు అనవేమారెడ్డి రాజ్యానికొచ్చాడు. ఇతడు రెడ్డి రాజ్య ఔన్నత్యాన్ని తన విజయాల ద్వారా ప్రతిష్టించాడు. కృష్ణానది ముఖద్వారమైన దివిసీమను జయించాడు. శూరవర పట్టణం నుంచి భీమవరం సూర్యవంశరాజులను, కామవరం భక్తిరాజును, నిరవద్యపురం (నిడదవోలు) చాళుక్యులను జయించి రాజమహేంద్రవరం, దక్షిణ కళింగ, శ్రీశైలం ప్రాంతాలను రెడ్డి రాజ్యంలో విలీనం చేశాడు. హైహేయల నుంచి జలదుర్గమైన కోనసీమ, పానార సీమ (రాజోలు తాలూకా) లను వశపర్చుకున్నాడు. సింహాచలం, వడ్డాది, మాడేముల (మాడుగుల) ప్రాంతాలను జయించాడు. ఇతడి రాజ్యం శ్రీశైలం నుంచి తూర్పు సముద్రం, సింహాచలం నుంచి నెల్లూరు వరకు వ్యాపించింది. ఇతడికి ఛూరికాసహాయ ప్రజాపరిచిత, చతుర్విదోపాయ వంటి బిరుదులున్నాయి. మరుగుపడిన వసంతోత్సవాలను జరిపించాడు. చెల్లెలు వేమసాని పుణ్యార్థం కోనసీమలోని నడువూరు గ్రామాన్ని వేమవరమని పేరుపెట్టి బ్రాహ్మణులకు దానం చేశాడు. ప్రతి ఏటా వసంతోత్సవాన్ని నిర్వహించడంతో ఈయన వసంతరాయుడు, కర్పూర వసంతరాయుడు అనే బిరుదులు పొందాడు.

అనవేమారెడ్డి శైవ మతాభిమాని. ద్రాక్షారామ భీమేశ్వరంలో మండపాలు, శ్రీశైలంలో భక్తుల కోసం వీర శిరోమండపం, సింహాచలంలో అనవేమగిరి మండపం నిర్మించాడు. ఇతడి మంత్రుల్లో మావిండి పెద్దన్న, ఇమ్మడీంద్రుడు ముఖ్యులు. ఇమ్మడీంద్రుడికి రాజమండ్రి తాలూకాలోని ఇమ్మడిలంక గ్రామాన్ని దానమిచ్చాడు.

కొమరగిరి రెడ్డి (క్రీ.శ. 1386-1402):
అనవేమారెడ్డి మరణాంతరం కొమరగిరి రెడ్డిరాజ్యానికొచ్చాడు. ఈయనకి, పెదకోమటి వేమారెడ్డికి మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. చివరకు కొమరగిరి రెడ్డి అనంతరం పెదకోమటి వేమారెడ్డి రాజయ్యేలా రాజీ కుదిరింది. కొమరగిరి రెడ్డి కళాపిపాసి, భోగలాలసుడు, సాహిత్యాభిలాషి కావడంతో రాజ్య భారమంతా అతడి బావమరిది కాటయవేమారెడ్డికి అప్పగించాడు. విజయనగర రెండో హరిహర రాయలపై కాటయ వేమారెడ్డి విజయం సాధించి త్రిపురాంతకం, శ్రీశైలం ప్రాంతాలు స్వాధీనం చేసుకున్నాడు.

కాటయ వేమారెడ్డి విజయాలను శ్రీనాథుడి కాశీఖండం, భీమేశ్వర పురాణం, కొమ్మన శివలీలా విలాసం గ్రంథాలు విశదీకరిస్తున్నాయి. కొమరగిరి రెడ్డి వసంతోత్సవాలు, కవి పండిత సదస్సులు, నాట్యశాస్త్రం, అభినయ విద్యకు ప్రోత్సహించాడు. ఈయన గ్రహరాజసౌథం అనే ప్రాసాదం నిర్మించాడని కొండవీటి కైఫీయత్ పేర్కొంది. కాటయ వేమారెడ్డి రాసిన కుమారగిరి రాజీయం వ్యాఖ్యానం ఆధారంగా రంప, కిమ్మూరు, బెండపూడి దుర్గాలు (తూర్పు గోదావరి), వజ్రకూటం (విశాఖ జిల్లా), రామగిరి, వడ్డాది, మాడుగుల, కటకం (ఒరిస్సా) ప్రాంతాలను కాటయ వేమారెడ్డి జయించినట్లు తెలుస్తోంది.

పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ. 1402-1420):
క్రీ.శ. 1402లో పెదకోమటి వేమారెడ్డి కొండవీటి సింహాసనాన్ని అధిష్టించాడు. రాజమహేంద్రవరం కోసం కాటయవేమారెడ్డి పెదకోమటి వేమారెడ్ల మధ్య వైరం కొనసాగింది. క్రీ.శ. 1412లో పెదకోమటి రాజమహేంద్రవరంపై దాడిచేసి ఓడిపోయినట్లు కోరుమిల్ల శాసనం, కొమ్మ న శివలీలావిలాస గ్రంథం ద్వారా తెలుస్తోంది. పెదకోమటి స్వయంగా కవి, పండితుడు, అలంకార శాస్త్రవేత్త, సంగీతశాస్త్రజ్ఞుడు. సాహిత్య చింతామణి అనే సంగీతశాస్త్ర గ్రంథం రచించాడు. అమరుక కావ్యానికి శృంగారదీపిక అనే పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం రాశాడు.

ఇతడి ఆస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారిగా నియమితుడయ్యాడు. ఇతడి ఆస్థాన కవి వామన బట్టబాణుడు. ఇతడు వేమభూపాల చరితం(వీర నారాయణ చరిత) గ్రంథం రచించాడు. పెదకోమటి వేమారెడ్డి వైద్యశాస్త్రాన్ని ప్రోత్సహించాడు. భూలోక ధన్వంతరిగా పేరొందిన భాస్కరాచార్యుడికి పొన్నెపల్లి, వేమవరం గ్రామాలను ధానం చేశాడు. పెదకోమటి భార్య సూరమాంబ సంతానసాగరం అనే పెద్ద చెరువును గుంటూరుజిల్లా ఫిరంగిపురం వద్ద తవ్వించింది. ఈ గ్రామంలోనే వీరభద్రస్వామి ఆలయానికి ఎదురుగా శిలాశాసనం వేయించింది. పెదకోమటి మంత్రుల్లో మామిడి సింగమాత్యుడు, సింగన మంత్రి ముఖ్యులు. పెదకోమటి వేమారెడ్డికి సర్వజ్ఞచక్రవర్తి అనే బిరుదుంది.

రాచవేమారెడ్డి (క్రీ.శ. 1420-1424):
కొండవీటి రెడ్ల రాజుల్లో చివరివాడు ఇతడే. ఈయన పెదకోమటి వేమారెడ్డి కుమారుడు. ఇతడు అసమర్థుడు. ఖజానా నింపడానికి పొయ్యిలపై పన్నులు, పురిటి సుంకాలు వసూలు చేశాడు. పురిటి సుంకాన్ని చెల్లించడానికి నిరాకరించిన ఎల్లయ్య అనే బలిజ నాయకుడు రాచవేమారెడ్డిని హతమార్చినట్లు కొండవీటి దండ కవిలె (కైఫీయత్) ద్వారా తెలుస్తోంది. దాంతో కొండవీటి రాజ్యం అంతమైంది. తర్వాత విజయనగర రాజులు ఆధిపత్యం చెలాయించారు.

మాదిరి ప్రశ్నలు

1. చాటుకృతులు అంటే?
1) హాస్యగీతాలు 2) శతకాలు
3) నాటకాలు
4) రాజులను పొగిడే గీతాలు

2. కైఫీయత్‌లు వేటిని వివరిస్తాయి?
1) స్థానిక గాథలు (చరిత్రలు)
2) న్యాయపాలన
3) గ్రంథాలయాలు 4) యక్షగానాలు

3. ఏ రెడ్డిరాజు రాజధానిని అద్దంకి నుంచి కొండవీటికి మార్చారు?
1) ప్రోలయ వేమారెడ్డి
2) అనపోతారెడ్డి 3) రాచవేమారెడ్డి
4) కుమారగిరి రెడ్డి

4. కొండవీటి దుర్గాన్ని నిర్మించిన రెడ్డిరాజు?
1) కొమరగిరి రెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) అనపోతారెడ్డి
4) కాటయ వేమారెడ్డి

5. కర్పూర వసంతరాయడు అనే బిరుదున్న రాజు?
1) కొమరగిరి రెడ్డి 2) అనవేమారెడ్డి
3) కాటయవేమారెడ్డి
4) పెదకోమటి వేమారెడ్డి

6. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదున్న రాజు?
1) అనపోతారెడ్డి 2) రాచవేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కాటయ వేమారెడ్డి

7. సంథనసాగరం నిర్మించినవారు?
1) రుద్రమదేవి 2) లకుమాదేవి
3) కాటయవేమారెడ్డి
4) సూరమాంబ

8. పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు?
1) కొమరగిరి రెడ్డి 2) పెదకోమటి
3) రాచవేమారెడ్డి
4) కాటయవేమారెడ్డి

9. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి?
1) శ్రీనాథుడు
2) వామన భట్ట బాణుడు
3) ఎర్రాప్రగడ
4) మామిడి సింగనామాత్యుడు

10. ధర్మప్రతిష్టాప గురు బిరుదున్న రాజు?
1) అనపోతారెడ్డి 2) కొమరగిరి రెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) ప్రోలయ వేమారెడ్డి

11. రెడ్డిరాజుల ప్రథమ రాజధాని?
1) పిఠాపురం 2) రాజమహేంద్రవరం
3) అద్దంకి 4) దేవరకొండ

12. లకుమాదేవి ఎవరి ఆస్థాన నృత్యకారిణి?
1) కొమరగిరి రెడ్డి 2) కాటయ వేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి

13. రెడ్డిరాజుల కులదేవత?
1) లకుమాదేవి 2) మూలగూరమ్మ
3) ప్రసూనాంబ 4) భ్రమరాంబ
సమాధానాలు:
1) 4 2) 1 3) 2 4) 3 5) 2 6) 3 7) 4 8) 3 9) 2 10) 4 11) 3 12) 1 13) 2

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top