You Are Here: Home » చిన్నారి » కవితలు » కన్నతల్లి నా కోమళ్ళ

కన్నతల్లి నా కోమళ్ళ

అయ్య చేసే కూలీపని
అవ్వ చేసే పాచిపని
అన్న చేసే జీతగాని పని…

రోజుకు ఒక్కపూటైన సరే
గొడ్డుకారం మెతుకులు తిని
తాకటలేని అతుకుల బతుకులు మాయి
చినిగిన అంగి అతుకుల లాగు

ఎర్రని దారం కండెతో
మా అవ్వ చేతి కుట్టు
మా మానాలను దాచే
ఆ ‘చందన’నపు పట్టు

పండగలు, పబ్బాలు
అందరికి విందు వినోదాలిస్తే
ఆపూట పస్తులతో గడిపే మాకు
అరువు తెచ్చిన నూకల పరం
నల్లరేగడి మట్టిపెల్లలేరుతూ
మొండి చింతకిందున్న
పెద్దమనిషి చిన్నరామయ్య తాత
అగ్గిపుల్ల ఇస్తేగాని… ఆకలి కోరలు తెరిచిన
పొయిలో పిల్లి పడక తీయదు

పాయసం కోసం అలకపాన్పెక్కిన
అన్నదమ్ములకు ఎసరొచ్చిన
అటికెల్నుంచి పొంగిన
గంజి మెతుకులని అవ్వ చిప్పలో పొస్తే
బాంబినో సెమియా తాగిన రుచి

చిర్రగోనె, గోటిలాటలో పోరగాండ్లం
కేరింతలు కొడుతు.. ఊరంతా చుడితే
మాసిన మా ముఖం మీద పేరుకున్న
ఉప్పు సెమటల తుప్పు వొదులగొడుతు
వొట్ల కాళ్ళు సేతులతో ఉట్టి మీదున్న

అటికెలో బువ్వ
ఉలువల దప్పడం
రొచ్చుగా కల్పుకొని
రోజు గొడ్డుకారం తిన్న నాలుకలపై
ఆ పూట ‘రుచి’ ఏమిటో సూత్తం
కారం సెగ అంగిలికి తగిలి
చన్నీళ్ల నల్లపటువ గుటగుట ఓదారుస్తది

రాత్రిళ్లు గాంధీ బొమ్మకాడ
చిందోళ్ళ బాగోతమే మా సిన్మా
జోరబొంతలు పట్టుకొని
బాగోతుల గద్దె ముందు జాగకోసం
పోరగాళ్ల పోటాపోటీ జబర్దస్తీ
కుస్తీలకు రేగిన దుమ్ము
బందరమియగాడు మాపిర్రలపై
ఒకటితైగాని ఆటలాగయి

దగ దగ మెరిసే కిరీటాలు
భీమ, కీచక గదాయుద్ధం
తెల్లారితే పప్పుగుత్తులే గదలై
అన్నదమ్ముల ఆటపాట కేరింతలు
మా పేదరికం మరిచినోళ్ళం…
రెక్కాడితే డొక్కాడని మా గూడు
బతుకు తెరువుకు వలస పక్షులైనయి
కన్న ఊరు, నడిచిన బాటలు
ఆడిపాడిన బొమ్మరిల్లు మది నిండా
కదలాడుతున్నయి

ఊల్లోని మా పూరి గుడిశె శిథిలమై
లేలేత నా చిరుప్రాయం గుర్తులు
కాలగర్భంలోకి దిగుతున్నయి

Editorial-Photo3బతుకు పోరులో మాదింకా బువ్వ పోరాటమే
చేస్తున్నం…
కన్నతల్లి నా కోమళ్ల సూడాలని
మట్టి పరిమళాల మాధుర్యాన్ని
తనువు తీరా పొందాలని
తపిస్తున్నా…. కలకంటున్నా….

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top