You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » కండరాలు ఎందుకు బలహీనపడతాయి?

కండరాలు ఎందుకు బలహీనపడతాయి?

NewsListandDetailsకండరాలు, నరాలు కలిసికట్టుగా వ్యాధిగ్రస్తమయ్యే వ్యాధులలో మయస్తీనియా గ్రెవిస్‌ ముఖ్యమైనది. ఇది దీర్ఘకాలంపాటు కొనసాగుతూ అదుపాజ్ఞలలో ఉండే నియంత్రిత కండరాలను బలహీనపరుస్తుంది. రక్షణ శక్తి వికటించి, స్వయంప్రేరితంగా మారటం వలన ఇది వస్తుంది. అందుకే దీనిని ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌గా పరిగణిస్తారు. నరాలనుంచి కండరాలకు ప్రసారమయ్యే సంకేతాల వ్యవస్థ దెబ్బ తినడం వలన ఈ వ్యాధి వస్తుంది.
మయస్తీనియా గ్రెవిస్‌ అనేది గ్రీకు, లాటిన్‌ భాషలనుంచి ఏర్పడిన పదం. మయస్తీనియా అంటే కండరాల బలహీనత. గ్రెవిస్‌ అంటే తీవ్రమైనదనీ లేదా మృత్యు సమానమైనదనీ అర్థం.
ఈ వ్యాధికి ప్రస్తుతం ఆశావహ చికిత్సలు లభిస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఈ వ్యాధి అరుదైనదే కాకుండా నొప్పి లేనిది కూడా. స్పర్శ గ్రహణంలో ఇబ్బంది ఉండదు. ఉష్ణోగ్రతల వలంటివి మామూలుగానే తెలుస్తాయి. దీని వలన తక్షణ ప్రాణభయం లేదు. వ్యాధిగ్రస్తుల్లో 5 నుంచి 10 శాతం మందికి వ్యాధి ఉధృతి దానంతట అదే తగ్గిపోయి లక్షణ రహితంగా మారుతుంది.
ఈ వ్యాధికి సంబంధించి అనేక విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉదాహరణకు కొంతమందిలోనే ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే ప్రశ్న. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చాలామందిలో ఈ వ్యాధి ఎందుకు రావటం లేదన్నది తెలుసుకోవాల్సిన నిజం. దీనిని తీవ్రతరం చేసే అంశాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అలాగే వయసు మళ్లిన మగవారిలో దీని ఉనికి ఎందుకు పెరుగుతున్నదనేది శోధించాల్సిన అంశం.
మయస్తీనియా గ్రెవిస్‌ ప్రధాన లక్షణం కండరాల బలహీనత. పని చేసే కొద్దీ బలహీనత పెరుగుతూ, విశ్రాంతి తీసు కునే కొద్దీ తిరిగి బలం పుంజుకోవడం అనేది ఈ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగపడే ప్రధాన లక్షణం.
సాధారణంగా కనురెప్పల కండరాలు, హావభావాలను పలికించే కండరాలు, నమలటం, మాట్లాడటం, మింగటం వంటి పనులు చేయటానికి దోహదపడే కండరాలు ఈ వ్యాధి ప్రభావానికి లోనవుతాయి. ఒక్కొక్కసారి శ్వాస వ్యవ స్థకు చెందిన కండరాలు, చేతుల కండరాలు కూడా ప్రభావితమవవచ్చు.
ఈ వ్యాధికి ఇతర రూపాలు సైతం ఉన్నాయి. ఉదాహరణకు ఇది జన్మతః ప్రాప్తించినదై ఉంటే దానిని కంజెనిటల్‌ మయస్తీనియా అంటారు. లాంబర్ట్‌ ఏట్సన్‌ మయస్తీనిక్‌ సిండ్రోమ్‌లో నియంత్రిత కండరాలే కాకుండా, అనియంత్రిత కండరాలు కూడా ఈ వ్యాధి ప్రభావానికి లోనవుతాయి.
కారణాలు
మోటారు వాహనాలకు ఇగ్నీషన్‌ ఎలా పని చేస్తుందో కండరాల వ్యవస్థను చైతన్యం చేయడానికి నరాల సంకేత వ్యవస్థ అలా పని చేస్తుంది. ఈ వ్యాధిలో నాడీ సంకేతాలు కండరాలను సక్రమంగా చేరుకోవు. నరాగ్రాలు కండరాలను చేరుకునే చోట అంటే న్యూరోమస్క్యులర్‌ జంక్షన్‌లో ఏర్పడిన లోపాల కారణంగా సంకేతాలకు అడ్డు ఏర్పడుతుంది.
సాధారణంగా నాడీ సంకేతాలు నరాగ్రాలకు చేరుకున్న ప్పుడు ఎసిటిల్‌కోలిన్‌ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది కండరాలలోని రిసెప్టార్లను చేరుకుని కండరాలు సంకోచించడానికి సహాయపడుతుంది. మయస్తీనియా గ్రెవిస్‌ వ్యాధిలో ప్రతిరక్షక కణాలు తయారై ఎసిటిల్‌ కొలిన్‌ రిసెప్టార్లను అడ్డగించటమో, మార్చటమో, లేదా దెబ్బ తీయటమో చేస్తాయి. దీనితో కండరం సంకోచించగలిగే శక్తిని కోల్పోతుంది.
థైమస్‌ గ్రంథి పాత్ర
ఛాతి ఎముక కింద, పైవైపు థైమస్‌ గ్రంథి ఉంటుంది. చిన్న వయసులో వ్యాధి రక్షణ శక్తి కలిగించడంలో ఈ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగే కొద్దీ దీని పని తీరు తగ్గిపోతుంది. ఈ కారణం చేతనే పసి వయసులో దీని ఆకారం పెద్దగా ఉంటుంది. యుక్త వయసు వచ్చేసరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుంది. తరువాత కాలంలో క్రమంగా కుంచించుకుపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దీని స్థానాన్ని కొవ్వు కణాలు భర్తీ చేస్తాయి.
మయస్తీనియా గ్రెవిస్‌ వ్యాధికి గురైన వ్యక్తుల్లో థైమస్‌ గ్రంథి అసాధారణంగా తయారవుతుంది. దానిలోగుంపులు, గుంపులుగా ఇమ్యూన్‌ కణాలు కనిపిస్తాయి. (మామూలుగా పెద్దల్లో ఇమ్యూన్‌ రెస్పాన్స్‌కు సూచనగా ఇవి ప్లీహంలోనూ, లింఫ్‌ గ్రంథులలోనూ తయారవుతాయి తప్పితే, థైమస్‌ గ్రంథిలో కనిపించవు.) కొంతమందిలో థైమస్‌ గ్రంథి బాగా పెరిగి థైమోమా లేదా ట్యూమర్‌గా మారే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటివి ప్రమాదరహితమైనవిగానే ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో మాత్రం కేన్సర్‌గా మారే అవకాశం లేకపోలేదు. .
లక్షణాలు
ఈ వ్యాధిలో ఆధీనంలో ఉండే అన్ని వాలెంటరీ కండ రాలు వ్యాధి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కళ్లు, కనురెప్పలు, ముఖం, గొంతు మొదలైన భాగాలలోని కండరాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి.
వ్యాధి ప్రాదుర్భావం ఉన్నట్లుండి జరుగుతుంది. మొదట్లో చాలామంది ఈ వ్యాధిని గురించి ఆలోచించరు. చాలా కేసుల్లో మొట్టమొదట కనిపించే లక్షణం కంటి కండరాల్లో పట్టు తగ్గి శక్తి లేకుండా తయారవడం.
కొంతమందిలో మింగుతుంటే ఇబ్బంది, మాట స్పష్టతను కోల్పోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీని వలన బాధితులు మాట్లాడేది ఎదుటి వారికి స్పష్టంగా అర్థం కాదు.
వ్యాధి అందరిలో ఒకే మాదిరి తీవ్రతతో ఉండకపోవచ్చు. కొంతమందిలో కేవలం కంటి కండరాలే ప్రభావితమైతే మరికొంతమందిలో శ్వాసవ్యవస్థకు చెందిన కండరాలన్నీ ప్రభావితమవుతాయి. దీనిలో ప్రధానంగా కనిపించే లక్షణం కనురెప్పల్లో ఒకటి కాని, రెండు కాని వాలిపోవటం. అలాగే చూపు మసకబారటం లేదా ద్వంద్వదృష్టి వంటివి కూడా ఉండవచ్చు.
నడకలో నిలకడ ఉండదు. బాధితులు తూలుతున్నట్లు నడుస్తారు. కాళ్లు, చేతులలో పట్టు సడలుతుంది. ముఖంలో హావభావాలు మారుతాయి. నమలటం, మింగటం కష్టంగా ఉంటాయి. ఒక్కొక్కసారి తినే తిండి పొలమారి ఊపిరితిత్తులను వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. శ్వాస వేగం పెరుగుతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top