You Are Here: Home » చిన్నారి » కవితలు » ఓ విధ్వంస ముఖచిత్రం

ఓ విధ్వంస ముఖచిత్రం

పికలు మృగ్యమైన చోట
బీభత్సాలు
పురుడు పోసుకుంటూనే ఉంటాయి
చరిత్ర పుటల్లోకి
ఓ విధ్వంస రచన జారిపోతూనే ఉంటుంది

చర్యలు ప్రతి చర్యలు
పోటీ పడుతున్న వేళ
ప్రాణాలు సైతం లూటీ అవుతూనే ఉంటాయి

అభద్రత వెన్ను తట్టినప్పుడల్లా
అశాంతి, అవకాశవాదం
ఉసిగొల్పినప్పుడల్లా
కాలికింది భూమి కూడా
బద్దలవుతూనే ఉంటుంది

వివేకాలు కోల్పోయిన క్షణాలన్నీ
రుధిర తర్పణాలై
రాలుతూనే ఉంటాయి

ఆవేశాలు అగ్నిపర్వతాలవుతున్నప్పుడల్లా
మంచి చెడులు ఒకే నేలపై
కుప్పలుగా బూడిదవుతూనే ఉంటాయి

భగ భగ మండే నిజాలు
వికృత దృశ్యమవుతున్నప్పుడల్లా
ఓ విధ్వంస ముఖ చిత్రం
తెర మీద
సాక్షాత్కరిస్తూనే ఉంటుంది.

మనుషుల మేళ!
కానొక వేదిక మీద కొందరు కలుస్తారు
ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోవడం
ఒకరిని మరొకరు నిచ్చెనమెట్లు ఎక్కించడం
ఒక్కరు నిజాయితీగా మనసు విప్పి చెప్పరు

కబుర్లు కండలు తిరిగి నిగ నిగ లాడతాయి
కొందరి నోళ్ళు నీళ్ళూరుతాయి అసూయతో
కలల తెర మీద జీవితచిత్రానికి రంగులు పులిమి
కథ అడ్డం తిరిగితే గుండు సున్నలా బిక్క మొహం

తోల్రాన్‌ కవిత
బురదగుంటలో జారిపడ్డవాడు బొంకుతాడు
బ్రతుకు అందమైన బొచ్చుకుక్కలా ఉండాలని
బొట్టు పెట్టి వడ్డించేవాడు మనవాడు కావాలని
బొంకడం అంటే ఈగలు ఈలలు వేసినట్లుండాలి.

రకరకాల మనస్తత్వాల రసాయన చర్యలు
రంగులు మార్చుకొన్న వికృత చేష్టా ఫలాలు
రగడ రగడ కావచ్చు, తియ్యని చెరకుగడ కావచ్చు
రుగ్మతలతో రోజు సరి కొత్త రోదన జీవితం నడక
బొల్లిముంత వెంకట రమణారావు

రచనా విధానం
త్రోలాన్‌ కవితా ప్రక్రియ నాలుగు భాగాలుగా ఉంటుంది. ఒకొక్క భాగం నాలుగు వరుసలు కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియను వాలెరీ పీటర్‌సన్‌ బ్రౌన్‌ ప్రారంభించాడు. ఈ కవితలో ప్రాస విధానం ఉన్నప్పటికీ, భావ సౌలభ్యం కోసం తెలుగులో ప్రాసను వినియోగించలేదు.మొదటి భాగంలో నాలుగు వాక్యాలు. అనంతరం రెండవ భాగంలో- మొదటి భాగంలోని మొదటి వరుస రెండవ అక్షరంతో మొదలు పెట్టాలి. అలా రెండవ భాగం నాలుగు వాక్యాలు ప్రతి వాక్యం మొద ఉపయోగించిన అక్షరంతోనే వ్రాయాలి. మూడవ భాగంలో – రెండవ భాగంలోని మొదటి వాక్యం రెండవ అక్షరంతో మొదలు పెట్టాలి. నాలుగవ భాగంలో- మూడవ భాగంలోని మొదటి వాక్యం రెండవ అక్షరంతో మొదలు పెట్టాలి.

కొలకలూరి పురస్కారాలు
కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారం ఎస్‌.ఎ. రావు రచించిన ‘మానవతా ఎక్కడున్నావు?’ కు లభించినట్టు డా కొలకలూరి ఆశాజ్యోతి తెలిపారు. కొలకలూరి భాగీరథీ కవిత్వ పురస్కారాన్ని రామాచంద్రమౌళి రచించిన ‘ఒక దేహం, అనేక మరణాలు’కు ప్రదానం చేయనున్నట్టు డా కొలకలూరి ముధుజ్యోతి తెలిపారు. ఈ రచనలకు పురస్కారం రూ.10 వేలు ఫిబ్రవరి 26వ తేదీ హైదరాబాద్‌ పి.ఎస్‌. తెలుగువిశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌కళా ప్రాంగణంలో జరిగే సాహిత్య కార్యక్రమంలో అందజేస్తారు.

rameshయువ పురస్కారం
న్యూఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ మొదటిసారిగా ప్రారంభించిన ‘జాతీయ యువ పురస్కారం’కు కథా రచయిత డా వేంపల్లి గందాధర్‌ తెలుగు భాషనుంచి ఎంపికయ్యారు. వీరి కథా సంకలనం ‘మొలకల పున్నమి’కి ఈ గౌరవం దక్కింది. మొత్తం 16 భారతీయ భాషల్లో యువ పురస్కారాలను ప్రకటించారు. పురస్కారంగా రూ.50 వేల నగదు బహుకరించనున్నట్టు అకాడమీ కార్యదిర్శ అగ్రహార కృష్ణమూర్తి ప్రకటించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top