You Are Here: Home » సఖి » రుచి » ఉల్లి చలవ

ఉల్లి చలవ

వేసవిలో చలవ చేసే కొబ్బరినీళ్లు, చెరుకురసం, మజ్జిగలాంటి ద్రవాలతో పాటు నిమ్మ, కీర దోసలకు కూడా గిరాకీ ఎక్కువే. వీటితో పాటు అందరికీ అందుబాటులో తల్లిలా మేలు చేసే ఉల్లి కూడా ఒకటుందని మరవకండి. ఇలా వెరైటీగా తిని చూడండి, వడదెబ్బ వందగజాల దూరం పారిపోకపోతే అడగండి!

ఆనియన్ రింగ్స్ 
కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ – 1, మైదాపిండి – 150 గ్రా., వంటసోడా – చిటికెడు, ఉప్పు – రుచికి తగినంత, గుడ్డు – 1, పాలు – పావులీటరు, బ్రెడ్ పొడి – 80 గ్రా., నూనె – వేగించడానికి సరపడా.
తయారుచేసే విధానం:ఉల్లిపాయని గుండ్రంగా తరిగి, చక్రాలుగా విడదీయాలి. ఒక పాత్రలో మైదా, వంటసోడా, ఉప్పు కలిపి ఉల్లి రింగులకు అంటించాలి. మరో పాత్రలో గుడ్డు, పాలు వేసి బాగా గిలకొట్టి, రింగుల్ని ముంచి బ్రెడ్ పొడిలో పొర్లించి నూనెలో దోరగా వేగించాలి. కరకరలాడే రింగ్స్‌ని టమోటా సాస్‌తో సాయంత్రం ఫలహారంగా తింటే బాగుంటాయి.

ఉల్లి కారం
కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ – 1, కారం – 1 టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, టమోటా గుజ్జు – 1 టీ స్పూను, ఉప్పు – రుచికి తగినంత.
తయారుచేసే విధానం:ఉల్లిపాయని ముక్కలుగా తరగాలి. మిక్సీలో జీలకర్ర, ఉల్లి ముక్కలు, టమోటా గుజ్జు, కారం, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అతి సులభంగా, నిమిషాల్లో తయారయ్యే ఈ చట్నీ ఇడ్లీ, మసాలదోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

పింక్ సలాడ్
కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు – 2, నిమ్మకాయలు – 3, సన్ ఫ్లవర్ ఆయిల్ – 1 టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి తగినంత.
తయారుచేసే విధానం:ఉల్లిపాయల్ని సన్నగా, పొడుగ్గా తరిగి ఒక పాత్రలో వేసి చిటికెడు ఉప్పు, స్పూను నిమ్మరసం చల్లి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత గోరువెచ్చని నీటిని ఉల్లితరుగు మునిగే వరకు పోసి మరో పది నిమిషాలు ఉంచి నీరంతా ఒంపేయాలి. మళ్లీ ఉప్పు, నూనె, నిమ్మరసం కలిపి మూతపెట్టి ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయానికి ఉల్లి తరుగంతా పింక్ రంగులోకి మారిపోయి చూడడానికి చాలా అందంగా కన్పిస్తుంది. ఉప్పు, నిమ్మరసంలో ఊరడం వల్ల ఉల్లి సరికొత్త రుచితో నోరూరించేలా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top