You Are Here: Home » చిన్నారి » కథలు » ఇద్దరు మిత్రుల కథ

ఇద్దరు మిత్రుల కథ

విక్రమార్కుడు మళ్లీ రొటీన్‌గా శవాన్ని భుజాన వేసుకుని బంజారాహిల్స్‌ సమాధులవైపుగా వెళుతున్నాడు. జిడ్డు భేతాళుడు వస్తూనే విక్రమార్కుడిని చూసి ‘రొటీన్‌ తెలుగు సినిమా హీరోలా నువ్వలా శవాలను భుజాన వేసుకుని వెళుతుంటే నాకు నవ్వొస్తోంది. సరే నీ బాధ తెలియకుండా ఓ మాంచి కహానీ చెబుతాను మాట్లాడకుండా విను….ఆఖర్లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి టైప్‌లో ప్రశ్నలుంటాయి కంగారు పడకు…త్రిలింగదీవి ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్లు పుట్టడమే బహు పేదరికంతో పుట్టారు. కానీ ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. ఏనాటికైనా తాము కూడా రాజుల్లా రాజకోటలు, బంగారు సింహాసనాలు, వజ్రకిరీటాలు చేయించుకోవాలని అనుకునేవారు. ఇద్దరూ ఒకే కంచంలో భోజనం చేసేవారు. ఒకళ్లింట్లో ఒకళ్లు రాత్రివేళల్లో పొద్దుపోతే పడుకునేవారు.

అలా ఉన్న స్నేహితులను చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో ఒకసారి కొండవాగు దగ్గర ఆడుకుంటూ జారిపోయి ఇద్దరూ లోయలో పడి అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరు స్నేహితులూ జంబూద్వీపంలో వేర్వేరు ప్రాంతాలలో పుట్టారు. కర్ణాటక ప్రాంతంలో వాయుజనార్థనవర్మగా ఒకరు ఆంధ్రప్రదేశ్‌లో జగదీశ్వరవర్మగా మరొకరు పుట్టారు. ఇద్దరూ కూడా తమ తమ రాజకీయపలుకుబడుతు ఉపయోగించుకుని పూర్వజన్మలో తాము సాధిద్దామనుకున్న రాజకోటలు, బంగారు, వజ్రవైఢూర్యములు ఈ జన్మలో సంపాదించుకున్నారు.

అయితే వాయుజనార్థనవర్మ మాత్రం కేవలం తన తెలివితేటలతో ప్రభుత్వ లొసుగులను ఆసరా చేసుకుని అతి పెద్ద అవినీతి సామ్రాజ్యాధీశుడయ్యాడు. జగదీశ్వరవర్మ మాత్రం అనుభవశాలి అయిన తండ్రి రాజకీయపలుకుబడితో అతి పెద్ద ధనసామ్రాజ్యాధీశుడు అయ్యాడు. అయితే గత జన్మ అనుబంధమో ఏమోగానీ ఇద్దరూ కూడా వ్యాపార లావాదేవీల దృష్ట్యా మంచి స్నేహితులుగా కలిశారు. ఒకరి పలుకుబడితో ఒకరు తరాలు తిన్నా తరగని ఆస్తులు కూడగట్టుకున్నారు. ఇదంతా చూసి కాలానికి కన్నుకుట్టింది. కొంతకాలానికి ఓడలు బండ్లు…బండ్లు ఓడలు అవుతాయనే సామెత చందాన పరిస్థితులు ప్రతికూలమయ్యాయి.

గాలిజనార్థనవర్మను ఢిల్లీ సుల్తానులు అక్రమంగా ధనం సంపాదించావంటూ అభియోగం మోపి అతనికి కారాగార శిక్ష విధించారు. అతి తొందరలోనే జగదీశ్వరవర్మ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుని అతనిని కూడా కారాగారానికి పంపే ఆలోచనలో ఢిల్లీ సుల్తానులు ఉన్నారు.’ అని అక్కడదాకా చెప్పి ‘పోయిన జన్మలో తీరని కోర్కెలు ఈ జన్మలో ఇలా తీరాయని వాళ్లు సంతోషించాలా? లేక కష్టపడి జనం నెత్తిన చేతులు పెట్టి కూడబెట్టిన సొమ్మును ఇలా ఢిల్లీ పాదుషాలు స్వాధీనం చేసుకున్నారని విచారించాలా?

ఎందుకిలా జరిగింది? ఇందుకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నిన్ను బ్రేకులు సరిగా లేని హెలికాప్టర్‌లో వేసి గాలిలో తిప్పుతా’ అనగానే విక్రమార్కుడు చిరునవ్వు నవ్వుతూ ‘చూడు భేతాళా కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకుని తింటే ఎవ్వరూ నీ జోలికి ఛస్తే రారు. ఎదుటివాడు నాశనం అవ్వాలి… నాకు నేను పైకి ఎదగాలి అనుకునేవాళ్ల రాతలు ఇలానే ఏడుస్తాయి. కాబట్టి చెరపకురా చెడేవు అనే సామెతను గుర్తుంచుకుని కష్టపడి మనకాళ్ల మీద మనం బతకాలి… ఇక నాకు టైం లేదు దయచేసి నన్నొగ్గేయ్‌…’ అనగానే భేతాళుడు పొగ ఎఫెక్ట్‌ ఇచ్చి మాయమయ్యాడు.

– నండూరి రవిశంకర్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top