You Are Here: Home » చిన్నారి » కథలు » ఇదీ భారతం

ఇదీ భారతం

cartఊరు ఊరతంతా ఆయనగారికి డొల్లగా న్పిస్తోంది. దగాపడి దిగాలు చెందినట్లుంది. గ్రామకంఠం పీకనులిమి ప్రక్కకువిసిరేసి నట్లునిపిస్తోంది. పొరపొచ్చాల మాయలో కుళ్ళూ కుతంత్రాల సందిగ్దాన ఊరు నిర్వీర్య మయి నట్లుంది. తాతాలుతో బాటు ఆయన వర్గానికయితే మరీనూ… వాళ్ళదృష్టిలో ఊరుపోకడంతా ఛిద్ర మై పోతు న్నట్లు. ఆధిపత్యాలు, అధిక్షేపణలు ప్రజ్వరిల్లుతున్నట్లు అవినీతి రాజ్యమేలుతున్నట్లు ఇంకా ఇంకా ఎన్నోరుగ్మతలు! అవడానికి చిడిబోతు గ్రామమే అయినా, ఆశ్రీతపక్షపాతాలు, వర్గవైషమ్యాలు, సాధారణ జీవితాలను చిన్నా చిన్నాభిన్నం చేస్తున్నట్లునిపిస్తోంది.

చెప్పాలంటే వాళ్ళ ధోరణివాళ్ళది. రాజ్యాధికారానికి చేరువ కాలేకపోతూన్న ప్రతి తస్మదీయుణ్ణి పట్టిపీడించగల్గిన జాడ్యం అక్కడ తాతాలుని ఆవహించి ఉంది. అతనితో బాటు ఆ వర్గ అనుచరుల్ని సయితం పట్టిపిండి చేస్తోంది. ఇక ఉన్నది ఉన్న లేని వాటిని గూడ ఉన్నట్లుగా చూపించి ప్రజల నాడీ మండలపు గతిని తప్పించి తన వైపు తిప్పుకొనేలా చేయడంతో ప్రతి పంచాయితీ ఎలక్షన్లోనూ భంగపడి మిగలక తప్పడం లేదు తాతాలుకి. ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి. ప్రతిసారీ చిడిబోతు గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్‌ పదవికి తాతాలు పోటీ పడుతూనే ఉన్నాడు మస్తానయ్యకు ఓడించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నాడు. చివరికి తనుపరాజిత ప్రెసిడెంటుగా మిగులుతూనే ఉన్నాడు. ఎవరికీ ఎజెండా అక్కరలేకపోయినా, ఎవరి ఎజెండా వారిదయినా తాతాలు జెండాతో ప్రజల్లోకి వెళ్ళి చతికిలపడుతూనే ఉన్నాడు. గెలవని ప్రెసిడెంట్‌ తాతాలు ప్రజాసానుభూతిని మూట గట్టుకుంటూన్నాడే గాని దానిని తర్వాత ఎలక్షన్లలో ఓట్ల రూపంలోకి మరల్చుకోలేక పోతున్నాడు.

చెప్పాలంటే కారణం కులం… కులబలం…
మస్తానయ్యా ఇరవై సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా చిడిబోతు గ్రామపంచాయితీకి ప్రెసిడెంట్‌గా ఉంటూ చక్రం తిప్పుతున్నాడంటే కేవలం ఆయనగారికున్న రాజకీయ చతురత, ఆర్థిక అంశబలం, అధిష్టానం ఆశీస్సులు ఒక్కటే అనుకుంటే పొరబాటే. అన్నీ ఉన్న ఎందరినో గతంలో మట్టికరిపించగలిగాడు. ప్రత్యర్థి ఎంత గట్టివాడయినా బ్యాలెట్‌ బాక్స్‌ దగ్గర కెళ్ళే సరికి ప్రజలు ఓటు ముద్రను మటుకు మస్తానయ్యా గుర్తు ఒంటెమీద పడేలా చేయగలిగే వాడు. దాంతో ఒంటె గుర్తు మస్తానయ్యా అఖండ విజయంతో ప్రెసిడెంట్‌ సీట్లో ఎగిరికూర్చునేవాడు.

తాతాలు కూడ గ్రామ రాజకీయాల్ని బాగా ఒంట పట్టించుకున్నాడు గానీ ఈ కూలాల గోదాములో ఎందుకో వెనుకపడుతూనే ఉన్నాడు. దాంతో ఎప్పుడూ ‘మాజీ అన్నమసిని ఒంటికి పూసుకోకతప్పడం లేదు.
‘సిరంజీవి రాజకీయాల బాట పట్టాడంట! నాయాల్ది ఆయనగారి కులపోళ్ళు ఆయనంటే’ అంకాలు అన్నమాటలు బాగా ఆలోచింప గలిగేవిగా ఉన్నాయి మస్తానయ్యా. ‘నిజమేనంటావా అంకాలా! సిరంజీవి వస్తే రాజకీయ సిత్రమే మారిపోద్దంటన్నారు పేపరోళ్ళయితే మరీను! అతగాడు ఎక్కడో సిన్మాల్లో ఎగిరిగంతులేస్తూ కోట్లకు కోట్లు ఎనకేసుకుం టుంటే అసలు రాజకీయం ఆయనకెందుకం ట. ‘సిరంజీవా! మజాకా..రాను మొర్రో అన్న ఎంటనున్నాళ్ళు ఊరుకుంటున్నారా బలవంతా న సేతులు పట్టుకు తోసి పడేస్తారు’.

మస్తానయ్యకు అంకాలు కబుర్లు ఎప్పుడూ రుచిగానే అన్పిస్తాయి. అతగాడి మాట గారి తనం అటువంటిది. పేపర్‌ న్యూస్‌కి కాసింత ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి మరీ సెపుతాడు. టీవీ స్క్రోలింగ్‌కి కాస్త మాటల మసాలాల్ని దట్టించి బొమ్మ చూపిస్తుంటాడు. ‘అది కాదులే అంకాలా! ఎక్కడో హైదరాబాదులో సిరంజీవి ఎదోసేత్తాంటే మనకేంటంట చెప్పు. మన సిడిబోతు మంది…. మన సింతాలమ్మ గుడి నుండి… మన హంస లక్ష్మి బ్రాండీ షాపు నుండి… మనకుర్ర కాలవ గట్టు నుండి… మన రచ్చబండ నుండి… మన పంచాయితీ మనది…’ ‘మన ప్రెసిడెంట్‌ మస్తానయ్యా మనోడు. ఇలా తుప్పు డైలాగులు సెపుతూకూర్చోండి. ప్రెసిడెంట్‌ పదవికి లెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోతాది! అంకాలు ఊరి పది సెప్పడు ఆడిమాటల్లో కొంత వ్యంగ్యం ఉంటుంది. కొంత విమర్శ ఉంటుంది. అసలు సిసలైన ఆలోచన ఉంటుంది. నిఖార్సయిన నిజం ఉంటుంది.

అందుకే మాస్తానయ్య అతగాణ్ణి అంతగా పట్టించుకోనేది. నిజం చెప్పాలంటే గత నాలుగు టరములు చిడిబోతు పంచాయితీకి ప్రెసెడెంట్‌ అవడంలో లక్షలకు కట్టల పంపిణీ ఉన్నది. కేసులకు కేసుల సీపు లిక్కరు పందేరం ఉన్నది. ఇంకా కావాల్సినోడికి కావాల్సినంత అన్నట్లు ఏర్పాట్లన్నీ ఉన్నాయి.
అన్నీ సేత్తోన్నానే ఉన్నాడు. అయితే ఎగస్పార్టీ వోడు కూడ సేసి పడేత్తన్నాడు. నోటుకు నోటు అడ్డేసి పడేత్తన్నాడు. ఇంకేంటి గెలుపోడికి ఓడినోడికి తేడా.

సరిగ్గా అక్కడే… అక్కడే ఉన్నాది అంకాలు గాగి బుర్ర ప్రత్యర్థి వర్గంలో వాళ్ళ ఎలా లాక్కోవాలో బాగా తెల్సు. సరిగ్గా ఆ ఫార్ములా మీదే ఇన్నాళ్ళూ మస్తానయ్యా గెలుపొందుతూ వచ్చాడు. ఇంకా సెప్పాలంటే ఆ ఊరి పంచాయితీకి మస్తానయ్య గెలుస్తున్నాడు. ఆయన చేష్టలు గెలుస్తున్నాయి. ఇంకా డీప్‌గా పోవాలంటే అతగాడి కులం గెలుస్తున్నాది… కుల బలం వర్ధిల్లుతున్నది.
అవన్నీ తలపండి కాకలు తీరిన మస్తానయ్యకు బాగా ఎరుకే. అందుకే ఇన్నాళ్ళు ఏది ఎటుపోయినా ఎన్నికలు వచ్చాయంటే తనకుల రాజకీయాలు నడిపిస్తూ… తన కుల వర్గాన్ని ఐక్యంగా నిలుపుకుంటూ… నిలుస్తున్నాడు… తద్వారా నిలబడుతున్నాడు.

అంకాలు చెవిలో జోరీగలాగ పోరుతున్నాడు. మొదట్లో పెద్దగా ఆలోచించలేదు. ఎక్కడో పదో సిన్నావోడు కొత్తగా పెట్టిన పార్టీని తనకు తగిలిస్తాడేంటన్న అంశం పెద్దగా బుర్రకెక్కించుకోలేదు ఇన్నాళ్ళూ.
‘ఇదిగో మస్తానయ్యా! సిరంజీవిని చూసి కుర్రకారు రెచ్చిపోతున్నారు. ఆ జండాను భుజాన్నేసుకొని ఎగిరేగిరి పడతన్నారు సూడు రేపు ఎలక్షన్లలో నీ మీద ఆతారకుగాణ్ణి నుంచో పెట్టకబోతే ఒట్టు’. మస్తానయ్యకు వెన్నులో ఒణుకు బయలుదేరింది. పడక్కుర్చీలో కూలబడ్డ లంక పొగాకు సుట్టను అంటించి అదే పనిగా దమ్ములాగుతున్నాడు.

‘సరిగ్గా సెప్పి చావేహే!’
‘అవునయ్యా తారకంగాడు దుబాయి నుండి దిగాడు దుబాయి డబ్బు సంచులు మొత్తం దించి పడేసినాడు. నువ్వేమో సేపల పరువులకు యాలంలు యిస్తివి. మొత్తం ఆడేపాడేస్తివి. నెమ్మదిగా కౌలు భూముల్ని కూడ రొయ్యల పంటకి ఇచ్చేస్తిరి.
ఇక సూస్కో నాయాల్ది! తారకం రేపు పంచాయితీ ప్రెసిడెంట్‌ని పాడిపడేస్తాడు. వేడి రక్తం పెద్దయ్యా ఊరంతా ఊపు మీద ఉన్నది. ఊర్లో కుర్ర కారంతా ఆడినీ, ఆడి జండానీ రొయ్యల ట్రాక్టరు మీద ఎత్తుకు మరీ తిరిగేత్తన్నారు.
కళ్ళు బయర్లు కమ్మినట్లున్నాది మస్తానయ్యాకి వేరే కులపోడయినా తారకాన్ని ఊర్లో ఎదగనిచ్చాడుతను…
దుబాయి నుండి దిగిన అతగాడి గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెల్దు… అతగాడు ఆడికన్న తల్లి.. తారకానికి అంతసీనుందని అన్పించడం లేదు. సీనేమిటి పెద్దయ్యా! ఊళ్ళో ఆళ్ళ కులం బలం తక్కువేంగాదు. సెప్పాలంటే ఆడు గెల్చాడంటే ఆడి గొప్ప కొంత…
ఆకులపోళ్ళు సత్తాదురి కొంత… మరిసిపోతున్నావ్‌! ఆడు నిలబడినాడంటే రేపు తాతాలు కూడ సేయి కలిపేయొచ్చు.

‘……’
‘ఆ రెండు కులాలు కల్సిపోయినాయంటే నువ్వూ…. నీలకం పొగాడు సుట్టా… అం కాలు మాటలేకాదు. ఊరిలో వస్తూన్న పెనుమార్పుల్ని తానుకూడ గ్రహిస్తూనే ఉన్నాడు.
రాబోయే ఉప్పెన ఉపద్రవాల్ని అంకాలు తెరమీద చూపిస్తున్నాడంతే! కొత్తదనం కోరుకునే కుర్రకారు. మార్పు రావాలని ఆశించే అభ్యుదయ వాదులు, తమకులానికి సయితం అవకాశం కావాలనుకునే తారకం వర్గపోళ్ళు…
మస్తానయ్యకు ఎలాగైనా దించి పడేయ్యాలన్న చిరకాల ప్రత్యర్థి తాతాలు మనుషులు…
అన్నీ వలయంగా మారిమస్తానయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

అంకాలు అన్నట్లు అన్నీ మీద కొచ్చి పడ్తున్నాయి. తారకం ఊర్లోని కొత్త వర్గం ప్రోత్సహంతో పంచాయితీ ఎలక్షన్లో నిలబడుతున్నాడన్న విషయం గుప్పు మంది. ‘సూడు కూనమ్మ’ నువ్వు నాకు సెల్లెలు లాంటి దానివి. ఇం త కాలం నీ గడప తొక్కి ఎరుగను. ఇప్పుడు ఓ అన్నగా పలకరించి పోదామని నీ ఇంటి కొచ్చేసినాను. తారకం గాడిది ఉడుకురక్తం.
సెప్పాలంటే అసలు మీ ఊరు పేరు ఎడ్రస్సూ మాకు తెల్సు. ఏదో కుర్రాడు దుబాయి జాబు వదిలి వాలిపోనాడని సేరదీశాం. ఆనాడు మీ తల్లీ కొడుకుల్ని సూత్తే ముచ్చటేసినాది. ఆడికి నాన్న లేడన్న జాలి కొంత నాకు. నిజం సెప్తున్నా! ఈ చిడిబోతు సేపల సెరువుల మీద ఒట్టు. ఏదో కమ్మగా రొయ్యల సాగు చేసుకోక ఇదంతా ఎందుకంట సెప్పు.!

‘……’
‘ఆణ్ణి తగ్గమను మరో పాతిక ఎకరాలు కౌలుకి ఇప్పింసేత్తా!
‘…..’
‘ఆ తాతాలు గాడు మీ పోడిని ఎక్కేత్తన్నాడు. ఆ దొంగ నాయాళ్ళని నమ్మొద్దు ఆడికి బాగా కుల గజ్జి ఎక్కువయి నాది ఊరిలో నిప్పులు పోస్తున్నాడు.
‘……’
‘సొంత సెల్లివికాకపోయినా అన్నగారిగా సెప్తున్నాను. తారకం గాణ్ణి నా గొడుగు కిందకి
వచ్చేయమను. ఆడే చిడిబోతుకి వైస్‌ ప్రెసిడెంట్‌… కూనమ్మకు మస్తానయ్య రాజకీ యం కొంత అర్థమవుతోంది. కొంత అర్థం కాకుండాను ఉంది. తన కొడుకు సంగతి ఆమెకు బాగా తెలుసు.
అతగాడి నిర్ణయాలకి తాను ఎప్పుడూ ఎదు రు సెప్పి ఎరుగడు. బ్రతుకులో తాను. పడ్డకష్టాలు… దుబాయిలో ఉద్యోగం … కొంత సంపాదన… కొన్నాళ్ళ తరువాత ఇక్కడకొచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం… కష్టపడి అందరి చేత మంచి అన్పించుకోవడం…
చెప్పాలంటే తారకం చిడిబోతు గ్రామంలో మంచి పేరే సంపాందించుకున్నాడు. ఇక పదవికి పోటీ చేయడమనేది తన చేతుల్లో ఎముందట!
ప్రజలు కావాలనుకుంటున్నప్పుడు తాను కాదనడమేంది! అదే విషయం మస్తానయ్యకు తెల్చి చెప్పేసింది.

మస్తానయ్యకు మంట గానే ఉంది. ఆ కుల పోళ్ళందరూ నిన్నటిదాకి తనమోచేతి దగ్గర నీళ్ళుత్రాగినోళ్ళే. ఇప్పుడు ఆ తారకంగాడి సు ట్టూ తిరగడం తట్టుకోలేకపోతున్నాడు. పైగా శత్రువుకు ఉన్న శత్రువు లందరూ మిత్రులన్నట్లు తాతాలు కూడ అతగాడితో సేతుల కల్ప డం కలవరానికి గురి చేస్తోంది. ఓట్లు సరిచూసుకున్నాడు అవును వర్గ ప్రాదిపదికన చూస్తే ఆ రెండు సామాజిక గ్రూపులూ కల్సిపోయి నాయంటే తానుసరి. ఇంతకాలం చిడిబోడు గ్రామంలో జెండా ఎగరేసిన తన కులం సరి.
అసలు ఈ అంకాలు గాడు తక్కువేం గాడు. ఆడికి ముందు సూపులు ఎనక సూపు కూడు ఎక్కువే!
పదిమంది కుర్రకారుని ఎంటేసుకొని తిరుగుతున్న తారకాన్ని కూడ కదిపి చూశాడు.
‘నాదేముంది అంకులూ! కుర్రోళ్ళందరూ కావాలనుకుంటున్నారు. ఆడ తల్లులుయితే కొత్త నీరును చూడాలంటున్నారు. వాళ్ళందరిలో, నేను ఒకణ్ణి తప్ప!

‘అంటే నాదేదో సిరంజీవి పార్టీ అనుకుంటున్నావన్న మాట!’
ప్రతి చోటా మార్పుకోసం ముందుకు కదలుతూంటే అక్కడ ఆయన చిరంజీవి కావచ్చు..!
ఇక్కడ నేను సిరంజీవి అవ్వోచ్చు…!!
మనుషుల్లో ఎంత మార్పు తారకాన్ని చూస్తే ఏమీ మారేటట్లు అన్పించడం లేదు. తనకు వ్యతిరేకంగా అన్ని శక్తులూ కల్సిపోవడం… తన మీద కత్తులు నూరుతుండ డం… ఇన్నే ళ్ళ రాజకీయ జీవితంలో మస్తానయ్యకి మిం గుడు పడని అంశంగా మిగిలిపోతోంది.

అంకాలు తీసుకొచ్చిన కబురు ఊరంతటినీ అయెమయంలో పడేస్తోంది. ఎవరికి నమ్మశక్యంగా లేదు. చిడిబోతు గ్రామమే కాదు. ప్రక్క పల్లెటూర్లలో కూడ ఏ నోట్లో చూసిన తారకంగాడి విషయమే. ఇదంతా మస్తానయ్య తాతాలుని చాల ఇరకాటంలో పడేస్తోంది. ఎవరు ఎన్ని ఇరకాటాల్లో పడినా నిజాలెప్పు డూ వాస్తవికతలను ప్రతిబింబిస్తూనే ఉంటా యి. తారకం పుట్టి పెరిగిన ఊరిలోని తెల్సిన వ్యక్తుల ద్వారా అంకాలు కొంత విషయం లాక్కొచ్చేశాడు. అది ఈ ఎన్నికలు సమయం లో ఊరునంతటినీ కదిలించిపడేస్తోంది. తార కం చిన్నతనంలోనే తండ్రి మరణించాడట.
కూనమ్మడి కులాంతర వివాహమట!! ఇంకా లోతులోకి వెళ్ళితే కూనమ్మ భర్త మస్తానయ్య వర్గానికి చెందిన మనిషట!!

భర్త మరణం తర్వాత కొడుకుని అన్నీ తానయిపెంచి పెద్ద జేసిండట. దుబాయిలో ఉద్యో గం చేస్తూ చాలా కాలం అక్కడే కాలం వెళ్ళబుచ్చిన తర్వాత సొంత ఊరులో పరిస్థితులు అనుకూలించక వ్యాపారాల నిమిత్తం చిడిబోతు వచ్చేసి ఇక్కడే స్థిర పడ్డారట!
ఇంతకాలం ఈ విషయం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఎప్పుడూ కల్గలేదు తెల్సుకోవాల్సిన అవసరం ఊరికీరాలేదు. ఇప్పుడు అంకాలు తెచ్చిన వార్త నిప్పులోని ఉప్పులా పనిజేస్తోంది. చిటచిటలాడుతూ పంచాయతీ రాజకీయాన్నీ చట్టుముట్టి పడేస్తోంది.

‘వేరేవాడని తెల్సినా ఇంతకాలం వాడికి మద్ద తు ప్రకటించాం! ఈ తారక తండ్రి కులం మ స్తానయ్యాదే అని నిర్ణయమైపోయిం తర్వాత ఇకమేమేమిటి ఇచ్చేది… చేతులో చిప్ప.
అంతవరకు తాను పోటీ నుండి వైదొలరి మస్తానయ్యను ఎదురు దెబ్బతీయాలన్న ఉద్దేశ్యంతో తారకానికి మద్దతు ప్రకటించిన తాతాలు తిరిగి నావినేషన్‌ చేయడానికే నిర్ణయించుకున్నాడు.
మా వాడు… మా దుబాయి తారకం…
మార్పు కోసం యువశక్తి అంటూ వెంటేసుకుతిరిగిన కుర్రకారంతా వర్గ ప్రలోభంలో పడి ఒక్కొక్కరూ ప్రక్కకు జారుకుంటున్నారు.

మస్తానయ్యకు అంతా అదోలా ఉంది. అంకా లు సలహా ఇక్కడా పనిచేయదేమో అన్పిస్తోంది.
‘అవును… తను తన స్వార్థం… పదవీ రాజకీయ… ఎన్నో ఏళ్ళుగా తానేనన్న అధిపత్యధోరణి… కుర్చీని పట్టుకొని వేళ్ళాడిన వైనం… అన్నీ పునరాచనలోకి నెట్టేస్తున్నాయి.
వీటినన్నింటినీ ప్రక్కన పెక్కి ఆలోచిస్తే ఇంతకాలం వేరే వాడనుకున్న తారకం ఇప్పుడు త న సొంత వర్గానికి చెందిన వ్యక్తి. తన సామాజిక వర్గామన్న ఎకైక సాకుతో ప్రత్యర్థి మద్దతు ఉపసంహరించినపుడు..మార్పు మార్పు అం టూ అరిచి గీపెట్టిన వాళ్ళంతా కేవలం ‘కులం’ కారణంగా సీమను మార్చి పడేసినప్పుడు…

ఆలోచిస్తే అన్నీ అంతటా ఓ మానసిక రుగ్మతాంశ, దుర్నీతి అంకంగా సహజాతి సహజంగా అల్లుకుపోతోంది.
అవును. తన రాజకీయం తనకుంది.
ప్రత్యర్థికి అంతుచిక్కని రాజకీయ చిత్రం
తనకుంది.
తానుగా పదవిని అనుభవించినాలేకపోయినా తనకులానికి చెందిన వ్యక్తి ఆపదవిలో కొనసాగడం అనివార్యం… తన అభిలాష కూడాను.
అదే తన వర్గం వారికి సార్వజనీక మవుతుంది.
అందుకే…
తారకాన్ని అత్యంత భారీమెజార్టీతో
గెలిపించుకోవడం కోసం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడానికి సమాయత్తమవుతున్నాడు మస్తానయ్య.

– వడలి రాధాకృష్ణ
సెల్‌: 99853 36444

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top