You Are Here: Home » ఇతర » ఆర్ధిక రంగంలో ఆశాదీపాలు

ఆర్ధిక రంగంలో ఆశాదీపాలు

ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఒకప్పటి మాట అదే అరుునా కుటుంబ భారాన్ని పంచుకోవలసిన ఈరోజుల్లో నిజంగానే ఆడవారు ఇంటికి దీపాల్లా ప్రకాశిస్తున్నారు. ఎంచుకున్న రంగాల్లో ప్రతిభావంతులుగా రాణిస్తున్నారు. గృహ వ్యాపారాలు మెుదలుకుని అంతర్జాతీయ సంస్థల దాకా వ్యవహారాల్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే బ్యాంకింగ్‌ రంగంలో కూడా ఎందరో మహిళలు అత్యున్నత స్థానాలకి ఎదిగారు. సిఇఓలుగా ఒక ప్రత్యేక స్థారుులో గుర్తింపు తెచ్చుకున్నారు.


bank3బ్యాంకింగ్‌ రంగంలో కూడా జాతీయ బ్యాంకులే కాకుండా ప్రయివేటు, ఫైనాన్స్‌ కంపెనీలు కూడా మహిళా ఉద్యోగినులకు పెద్ద పీట వేస్తున్నాయి. దిగువ తరగతి ఉద్యోగుల నుంచి ఆఫీసర్లు, మేనేజర్లు, మేనేజింగ్‌ డైరెక్లర్లు, సిఇఓల స్థాయి వరకూ మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. 1950 నాటినుండే మహానగరాల్లో బ్యాంకింగ్‌ రంగంలో స్వదేశ, విదేశ, ఆర్ధిక సంస్థల్లో మహిళలకు ఉద్యోగావకాశాలు మొదలయ్యి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 1960 మధ్యకాలం నుండి మరింత పెరుగుతూ 1970 నుండి 1980 నాటికల్లా మహిళా ఉద్యోగావకాశాలు అనూహ్యంగా, గణనీయంగా పెరిగాయి.అయితే ఈ విధంగా పెరుగుతున్నా చాలామంది మహిళలు నేటికీ గుమాస్తా (క్లరికల్‌) స్థాయి ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారు.

ఈ విషయంలో మార్పు చాలా తక్కువగా ఉంటూ వచ్చింది. అయితే 1975 నుండే ప్రత్యక్ష నియామకం ద్వారా, పదోన్నతుల ద్వారా మహిళా ఆఫీసర్లు చాలా తక్కువగా నియమింపబడుతూ వచ్చారు.ఎలక్ట్రానిక్‌ డేటా ప్రాసెసింగ్‌ కార్యకలాపాలు అభివృద్దిచెందినప్పటికీ మహిళల సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంది. 1991 నాటి బ్యాంకు గణాంకాల ప్రకారం ఇడిపి సిబ్బంది ఒక బ్యాంకుకు 5 శాతం మాత్రమే ఉండగా ఇతర బ్యాంకుల్లో 12 శాతం ఉంది. అలాగే జీవిత భీమా రంగంలో 7 శాతం మాత్రమే ఉన్నారు. ప్రోగ్రామర్స్‌గా మహిళలు నియమించబడటం లేదు.
మొత్తం మీద ఏ విధంగా చూసినా బ్యాంకు ఆఫీసర్ల స్థానాల్లో ఉన్న మహిళల శాతం చాలా తక్కువ. అదే విధంగా క్లరికల్‌ ఉద్యోగాల్లో కూడా ఇది పెద్ద శాతంగా పరిగణించే విధంగా లేదని చెప్పవచ్చు.

మహిళా ఉద్యోగాల ఆంతర్యం
bank1కొన్ని దశాబ్ధాల కిందట అన్ని రంగాల్లోనూ పురుషుల ఆధిక్యతే ఎక్కువగా ఉండేది. అందులోనూ ఆర్ధిక సంస్థల్లో కేవలం మగవారే నిర్వహించగలరు అనే భావన కూడా ప్రబలంగా ఉండేది. కానీ, విద్యావంతులైన మహిళలు కొందరు నెమ్మదిగా ఈ బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించడం మొదలైన తర్వాత వారి శక్తి సామర్ధ్యాల్ని, వ్యవహార దక్షతని గుర్తించిన కొన్ని బ్యాంకులు మరిన్ని ఉద్యోగాలు మహిళలకు కల్పించడం మొదలుపెట్టాయి. అందుకు మరో కారణం, వీరు నిజాయితీగా పనిచేయడం, ఇతర వ్యాపకాలు లేకుండా అప్పగించిన పనికి పూర్తి న్యాయం చేయగలగడం, యూనియన్‌ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోకపోవడం, వినియోగదారులను ఆకట్టుకునే నేర్పు కలిగివుండటం, పై అధికారులతో, సీనియర్లతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం, ఇతర విషయాల్లో తలదూర్చకుండా ఉండటం వంటి అనేక అంశాల్లో మహిళలు తమ నైపుణ్యాన్ని చూపించడంతో బ్యాంకులు వీరి శక్తియుక్తుల్ని గుర్తించి వీరిని ప్రోత్సహించడం మొదలు పెట్టాయి. అయినా కీలక స్థానాల్లో అతితక్కువ మంది మహిళలు మాత్రమే సిఇఓ వంటి పదవుల్లో నియమితులయ్యారు. కానీ వారు కూడా అంతర్జాతీయ గుర్తింపుని సాధించడం మరో విశేషం. రానున్న కాలంలో మహిళా ఉద్యోగులకే ఎక్కువ పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో ఆర్ధిక సంస్థలు ముందుకు వస్తున్నాయి.

ఎదురవుతున్న సవాళ్లు
bank8కేవలం బ్యాంకింగ్‌ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ పనిచేసే ప్రదేశంలో అధికారుల వేదింపులు, ఎక్కువ గంటలు పనిచేయించడం, లైంగిక వేదింపులు ఇలా అనేక సమస్యలు ఎదుర్కొనక తప్పడం లేదు. 1991లో కమలా శ్రీనివాసన్‌ అందించిన రిపోర్ట్‌ ప్రకారం 50 శాతం వరకూ మహిళల మీద అధిక పని భారాన్ని పెంచడం, తొటి ఉద్యోగులు, మేనేజర్లు, కొందరు ప్రముఖ ఖాతాదారుల లైంగిక వేదింపులకు గురిచేయడం వంటి చర్యల మీద పిర్యాదులు వచ్చాయని తేలింది. అదీకాక సంస్థ ఏర్పాటు చేసే ట్రైనింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మహిళా ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. చివరికి వీరికి ప్రమోషన్లుగానీ, ట్రాన్సఫర్‌లు గానీ కావాలన్నా కొన్ని సమస్యల్ని ఎదుర్కొనక తప్పటం లేదు అంటూ వాపోతున్నారు. ఇటువంటి కారణాల వల్ల మహిళా ఉద్యోగులు పెద్ద పదవుల్లోకి వచ్చి, బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరిస్తున్నట్టు కమలా శ్రీనివాసన్‌ తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి దురాగతాలు లేకుండా వారికి తగిన రక్షణ, సెక్యూరిటీ కల్పిస్తే చిన్నా భిన్నంగా ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్థని కూడా అతి తక్కువ వ్యవధిలోనే ఒక తాటికి తేగల సత్తా మహిళలకు ఉందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

చాలామంది మహిళలు నేటికీ గుమాస్తా (క్లరికల్‌) స్థాయి ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో మార్పు చాలా తక్కువగా ఉంటూ వచ్చింది. అయితే 1975 నుండే ప్రత్యక్ష నియామకం ద్వారా, పదోన్నతుల ద్వారా మహిళా ఆఫీసర్లు చాలా తక్కువగా నియమింపబడుతూ వచ్చారు. ఎలక్ట్రానిక్‌ డేటా ప్రాసెసింగ్‌ కార్యకలాపాలు అభివృద్దిచెందినప్పటికీ మహిళల సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top